పఠనీయం

స్వయంకృషికి అందిన ఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా మాటలు’
ప్రతులకు
సెల్ నెం.9885020205
*
అక్కిరాజు వారిది పండిత వంశం. శ్రీ సుందరరామకృష్ణగారు వంశానుగతంగా వచ్చిన విద్వత్తుతోపాటు స్వయంకృషితో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగారు. ఇదంతా ధన్యజీవులైన వీరి తల్లిదండ్రులు రామయ్య పంతులుగారు, అన్నపూర్ణమ్మగారి చేతి చలవే మరియు ఆరాధ్యదైవం శ్రీ రాజరాజేశ్వరీమాత ఆశీస్సులు అని నేను భావిస్తున్నాను.
అక్కిరాజు సుందర రామకృష్ణ నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో అందరికన్నా ముందు ఉంటారు. అదే వీరి గొప్పతనం, ప్రత్యేకత విలక్షణ సుగుణం. ఇప్పటివరకు వీరు దాదాపు 35 గ్రంథాలు రచించి ప్రచురించారు. వాటిలో పద్య, గద్య రచనలు ఉన్నాయి. రచయితే కాదు నటులు, గాయకులు, విమర్శకులు కూడా.
30 అంశములతో కూడిన వ్యాస సంపుటిని ‘నా మాటలు’ అనే గ్రంథముగా ఏప్రిల్ 2019లో ప్రచురించి విడుదల చేశారు. వీరికి గత 50 సంవత్సరములనుంచి సాహిత్య, నాటక రంగాలలోని ఎంతో ఉన్నతమైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వృత్తిరీత్యా కాలేజీలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నా, నాటక రంగాన్ని సాహిత్య రంగాన్ని సవ్యసాచిగా ఏలారు. నర్సారావుపేట నుంచి న్యూజెర్సీ, కాలిఫోర్నియా దాకా వీరి గళం, కలం వినపడుతూ, కనపడుతూనే ఉన్నాయి. మొఖానికి రంగు వేయని రోజు, కాగితంపై సరస్వతికి అక్షరార్చన చెయ్యని రోజు బహు తక్కువ.
నటన రంగంలోను సాహిత్య రంగంలోను వీరి శైలి ప్రత్యేకం. ఒకేసారి వివిధ రకాలుగా ఆలోచిస్తూ పలు అంశాలను స్పృశిస్తూ ఎవ్వరూ కని విని ఎరుగని సందర్భాలను, జరిగిన విషయాలను క్రోడీకరిస్తూ ఒక క్రమ పద్ధతిలో పొందుపరచడం వీరికే చెల్లింది. ఇది ఒక వినూత్న ప్రక్రియ అని నా భావన. రచ్చబండ ముచ్చట్లనుంచి దేశ అంతర్జాతీయ రాజకీయాల వరకూ సాహిత్యం నుంచి ఆధ్యాత్మికతవరకూ, వీధి భాగవతాలు, తోలుబొమ్మల ఆటలనుంచి సినిమా రంగాల వరకూ భక్తినుంచి రక్తి వరకు అంతెందుకు ఆఖరికి ముక్తివరకు ఇలా ఏదీ వదలకుండా ఒక ఎన్‌సైక్లోపీడియా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు.
అమ్మతోడుతో మొదలుపెట్టి శ్రీ వేంకట పార్వతీశ కవుల కావ్య పరిశీలనతో వశ్యముఖితో ముఖాముఖి అయి గుంటూరు జిల్లానుంచి వరంగల్‌లోని అత్తగారి ఊరు ఇనుగుర్తి వరకు కల సాహితీ గంధాన్ని పాఠకులకు చూపించారు. కవితాశరధి దాశరధి, బోయి భీమన్న, ద్విశతి, అధిక్షేప త్రిశతి కోనేటి రాయుడికి, రంగరంగ అంటూ సమాజంలోని కుళ్ళు, కుచ్చితాన్ని మొహమాటం లేకుండా కడిగిపారవేశారు. అగస్త్య లింగ ద్విశతకం, శనేశ్వర శతకం, నృహరీ పంచశతి, కృత్తివాస శతకం, మరీశతకం లాంటి గ్రంథాలు రచించటానికి మూలకారణాలను సోదాహరణంగా వివరించారు.
శ్రీసుందర రామకృష్ణగారికి సినీరంగ ప్రముఖులతో గొప్ప అనుబంధము ఉన్నది. అది వారి ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడకపోయినా అనుభవాలు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎన్టీ రామారావుగారి గురించి శతకం వ్రాసినా, శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రంలో రామారావు గారితో కలిసి నటించి మెప్పు పొందినా వీరికి మిగిలింది అధరాల మీద అప్పచ్చులు మాత్రమే.
ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌గారి ఔదార్యాన్ని గురించి చెబుతూ అందరినీ ఒకే గాట కట్టివేయకూడదు అని చెప్పారు. ఎస్.వరలక్ష్మి గారి ఆఖరి దశలో పడ్డ కష్టాలు, సావిత్రి గారి గురించి ఎన్నో కొత్త విషయాలు స్వానుభవంతో తెలియపరిచారు. దేశ విదేశాలలో భువనవిజయ ప్రదర్శనలు దాదాపు 700 వరకు శ్రీ దివాకర్ల వెంకటవధాని, శ్రీ ముదిగొండ శివప్రసాద్‌గార్ల సహకారంతో ప్రదర్శించాను అని సగర్వంగా చెప్పుకొన్నారు.
నాటక రాగములో వీరి అభిమాన పాత్రలు శ్రీకృష్ణుడు, బిల్వమంగళుడు. దాదాపు 40 సంవత్సరాలనుంచి విశ్రాంతి లేకుండా ఈ రెండు పాత్రలు ధరిస్తూ ప్రేక్షకుల మెప్పును పొందుతున్నారు. ప్రముఖ నటి శ్రీమతి జమునగారు ఏరికోరి తమ ప్రక్కన కృష్ణుని వేషంతో నటింపజేయడం వీరి నటనకు నికషోఫలం
వీరి కవిత్వంలో శ్రీనాథుని అక్షరసత్యాలు. నటనలో తెనాలి రామకృష్ణుని హాస్యం, అధిక్షేప కవిత్వంలో గోగులపాటి కూర్మనాథ కవిగారి కలం వేడి కనిపిస్తాయి. వీరే చెప్పుకున్నట్లుగా అక్కడ కూడా ఆత్మస్తుతి, పరనింద కనిపించినా వీరి నిజాయితీ, నిర్భీతి ముందు ఆ లక్షణాలు దిగదిడుపే. తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యానం చెప్పి ధన్యులయ్యారు. ఏన్నోరంగాలలో అత్యుత్తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నా తగినంత గుర్తింపు వీరికి రాకపోవడం బహుశా శాపగ్రస్తులైన గంధర్వులేమో అనిపిస్తుంది.
వీరి నైతిక తృష్ణకు నిజాయితీకి నిదర్శనంగా సంగీతంపై మక్కువతో కుమారులకి బిళహరి, సారంగి రాగాల పేర్లు, సాహిత్యంమీద ప్రేమతో మనుమనికి సామిల్లుడు అనే మహాకవి పేరు పెట్టడం వారి నిబద్ధతకు పరాకాష్ట. ఈ పుస్తకాన్ని చదివిన పాఠకుడికి సుందర రామకృష్ణగారి అనుభవాలు, అనుభూతులు జీవితకాలం వెంటాడుతూనే ఉంటాయి అనడంలో సందేహం ఎంత మాత్రం లేదు.

-జన్నాభట్ల నరసింహప్రసాద్