పఠనీయం

‘నడిచే దారిలో’నే ఆధునిక కవిత్వ చలన జ్వలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిచే దారిలో
కవితా సంపుటి
రచన- సురేంద్ర దేవ్ చెల్లి,
వెల:రూ.100/-
కాపీలకు: సురేంద్రదేవ్ చెల్లి,
యానాం-533464
మరియు అన్ని పుస్తక కేంద్రాలలో.
ఫోన్:9849878751
*
మనం నడిచే దారిలో కొత్త చూపును నేలపై పరిచే కవులు కొంతమందే ఉంటారు. దీనిలో ఆధునిక సాంకేతిక భాష కవిత్వ భాషగా రూపాంతరం చెంది, రెక్కలు తెగిన జటాయువు పక్షిలా పలు సందేహాల మధ్య పడి కొట్టుమిట్టాడుతుంటుంది. ఈ స్వేచ్ఛా విహారం వ్యక్తిగతానిది కాదు. సామూహిక చైతన్య తపనలోనిది. దీనిని అక్షరాలతో గురిచూసి కొడితే, ‘నడిచే దారిలో’ కవిత్వ సంపుటిగా వెలుగు చూసింది. ఈ కవి పేరు సురేంద్ర దేవ్ చెల్లి. అనేక ఉక్కపోతల మధ్యలోంచి నిటారుగా నిలబడి 60 శీర్షికలతో కాలాన్ని శీర్షాసనం వేయిస్తుంది. ఇతని గుండె తడి లోతు వేగాన్ని ఆవేశంతో ఒడిసిపట్టుకుంటే, మూడో ప్రపంచ యుద్ధానికి అక్షర చిరునామాగా నిలుస్తుంది. వేష, భాషల అడుగుల చప్పుడు భావానికందని వేగంతో దూసుకుపోతాయి. కవిత్వ రూపురేఖలే చిరుగులు తొడిగిన సమాజ తీరుతెన్నుల్ని డొల్లతనంలోంచి నిలబెట్టి ప్రశ్నిస్తాయి.
‘కంజెనిటల్ అనోమలీ’ కవితలో గూడుకట్టిన భావధార గాఢతని నిశ్శబ్దంతో ముక్కలు చేసి, జీవితాల్ని తల్లకిందులుగా వేళ్ళాడదీస్తుంది. ‘ఊపిరితిత్తుల రూపం / చేతిలో త్రాసులాంటిది/ శ్వాసక్రియను కాలే సిగరెట్ బీడి / ముక్కలతో లెక్కిస్తుంది’ అని చెప్పడంలో అంతర్లీనంగా పరుచుకున్న ఉద్విగ్నతను ముందుచూపులో హెచ్చరించి, కొని తెచ్చుకునే రోగాన్ని భవిష్యత్తు చిత్రపటంగా కళ్ళమందు ఆవిష్కరిస్తుంది. ముగింపు వాక్యాలకు వచ్చేసరికి ‘పాతికేళ్ళునిండేసరికి / పాడె మాత్రమే కలలో / లీడ్ రోల్ తీసుకుంటుంది’ అంటాడు కవి సురేంద్రదేవ్. ఈ మాటల్లో ఎంత నిజం దాగుందో, అంతే విషాద దృశ్యం భారంగా బాధతోతొంగిచూస్తుంది.
‘తండా మిస్సింగ్’ కవితలో కవితాభివ్యక్తి ఇలా వుంటుంది. ‘‘కలలకు ప్రపంచ పటంతో పనేముంది / అది తీసుకెళ్ళేవైపుకే ఎవడి ప్రయాణమైనా / చిమ్మ చీకటిలో వెలుగు దివిటీ వెతకడం / ఓ సాహస ప్రక్రియ’’ అంటున్నపుడు ఆ కవిత్వ ధ్వనే వేరు. ఆశావాద దృక్పథంతో కార్య సాధకుడి ముందడుగు చప్పుడు వినిపిస్తుంది. లక్ష్యానికి ఆవల గిరిగీసుకున్న చక్రభ్రమణంలోంచి ఓ కొత్త ప్రయాణానికి దారిచూపుతుందిది. ‘పొగాకు బేళ్ళు’ శీర్షికలో కవి అంతరంగం ఇలా ఊగిసలాడుతుంది. ‘గుండెలపై భారమంతా దిగిపోయిన / బూరుగు చెట్టు దాని కొమ్మలకున్న / పత్తికాయలను పగిల్చి / దూదిపింజెల స్వేచ్ఛకు పచ్చజెండా ఊపింది’’ అంటాడు కవి. బందీలుగా చిక్కుకున్న, కట్టిపడేసినతనాన్ని బంధనాలతో తెంచి, స్వేచ్ఛా ప్రపంచంలోకి ఆహ్వానం పలకడం వెనుక నిజమైన స్వాంతనను స్వాతంత్య్రం రూపంలో పొందడానికి పడిన మానసిక ఆవేదన ఇందులో కనిపిస్తుంది. మానసికత్వానికి సంకెళ్ళు తెంచే ఆధునిక దృశ్య ప్రక్రియను బూరుగుచెట్టులోని పగిలిన పత్తికాయల రూపంలో కవి అనే్వషిస్తాడు.
‘యానాం సంత’ కవితలో పేర్కొన్నట్టు ‘గోదావరీ ఒడ్డున / గోధూళి కమ్మిన / వటవృక్ష నీడలో / ఆకాశదేశం అగ్నిపువ్వుల / తివాచీలా ఉంది’ అంటాడు సురేంద్ర దేవ్. ఈ పోలికలోని లోపటి స్వభావాన్ని మండే పువ్వుల రూపంలోని సింధూర వర్ణ్ఛాయల్ని ఆకాశదేశంలోని తివాచీగా పరుస్తాడు. కవిత్వం ఒక ఆల్కెమి అన్న తిలక్ పలుకులు ఇక్కడ నిజమవుతాయి.
‘సహజత్వ ప్లానిటోరియం’లో చెప్పినట్లు - ‘బుల్లెట్లలో గన్ పౌడర్ బదులుగా / విత్తనాలను నింపాలి / అవైనా బీడుపడిన / హృదయాంతరాల్లోకి చొచ్చుకెళ్ళి/ ఆశను చిగురింపజేస్తాయి’ అనడం వెనుక గొప్ప ఆశావాదం గోచరిస్తుంది. మనిషి నడిచినంతమేరా బతుకు పచ్చదనం చిగుర్తింది. సహజమైన భావ వ్యక్తీకరణలోని సామూహిక చైతన్య స్వభావాన్ని ప్రతీకాత్మకంగా ఇది చాటి చెబుతుంది. ఇలా పలు కోణాలు బహుముఖ పార్శ్వాలుగా సురేంద్ర దేవ్ కవిత్వంలో అదృశ్యంగా విచ్చుకుంటాయి. ఈ సంఘర్షణలో తొంగిచూసిన దళిత దగ్ధవేదనలు మూగరోదనలుగా పొడసూపుతాయి. వీటితోపాటు రక్తపు చలనంతో చురుక్కుమనిపించే కవితా పాదాలు సంపుటి పొడుగునా దర్శనమిస్తాయి. వీటిలో ‘ఆకాశంలో మబ్బులపై / నల్ల మిరియాలను ఎండబెట్టినట్లుంది’, ‘మడుగు మనస్సులో ఒంటరితనం’, ‘్ధ్వని మూగబోయిన / చోటుకోసం నా వెతుకులాట’, ‘నా బరువెక్కిన గుండె భారాన్ని / తుడిచేసిన సముద్రపు అల’, ‘వైతరణిలో రోదనలా/ మా జీవితం చుట్టూ వివక్షే’, ‘నాలో మొలకెత్తిన / రేపటి ఆశల చిగురును’, ‘రాలిన పువ్వుల ఒడిలో కూర్చుని’, ‘గుండె గూటిని జ్ఞాపకాల్లో తడతాయి’, ‘జోలపాట ఎరగని జీవితాలు’, ‘శ్వాసల చలిమంటలను రగిలిస్తుంది’, ‘రైతు సొరబుర్రలోంచి / నా దోసిట్లో పోసిన దాహార్తి సంజీవని’, ‘కడలి చేతులుల చాపి గుండెలను హత్తుకుంది’, ‘సింహాల బొమ్మ ఇల్లు / కోనసీమ పెంకుటింటి మట్టికోట’, ‘అనంతానంత చిల్లుల్లోంచి / ప్రవహించే / గత ఊపిరి నది’, ‘తేటతనపు అనే్వషణలో / దట్టమైన అటవీ అందం’, ‘ఆకాశం వైపు దోసెట్లో నీటిని విసిరాను / హరివిల్లుని నింపుకుని / ఒక్క నీటి బిందువైనా నన్ను తాకనే లేదు’ వంటి వాక్యాలు అలసిసొలసిన ఎడారి జీవితాల్లో రాల్చిన పన్నీటి జల్లులా కొత్త ఉత్సాహాన్నిస్తాయి. కవితా శీర్షికల్లో ‘కాలం ఆగిన క్షణం’, ‘పెదాల పలకరింపు’, ‘ఈల సంభాషణ’, ‘వెనె్నముక లేని అల’, ‘కానీ వాటిలోనే’ మున్నగునవి వైవిధ్య శిల్పానికి కొత్తరూపునిస్తాయి. లక్ష్మీ నరసయ్య, సీతారాం, శిఖామణి, ప్రసాదమూర్తిల ముందుమాటలు సహజ స్వరాన్ని నింపి మంచి ఊపునిస్తాయి. భావ వ్యక్తీకరణలో కవి కవితాభివ్యక్తి సొంత ముద్రవేస్తాయి. యాంత్రికంగా కొట్టుకుపోతున్న ఈ కవితావరణంలో ‘నడిచే దారిలో’ కవిత్వ సంపుటి సరికొత్త బీజాక్షరాలకి ఊపిరిపోస్తుంది. మంచి కవిత్వాన్ని ఆధునిక స్వరంతో అందించిన యువకవి సురేంద్రదేవ్ చెల్లికి అభినందనలతో సాహితీలోకంలోకి ఆహ్వానం పలుకుతున్నాను.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910