పఠనీయం

నాగ్నజితి పరిణయము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్నజితి పరిణయం
ఫోన్ నెం.040-23734864
*
మహాకవి, గొప్ప సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులే కాక ఏకసంథాగ్రహి. సంపన్నుడే గాక గొప్ప దాత కూడా ఐన శ్రీదాసు శ్రీరాములు గారి మేధను వారసత్వంగా పొంది ఆరుగురు అన్నల తరువాత కుమార్తెగా, శ్రీరాములు, జానకమ్మలకు 1881లో జన్మించారు శారదాంబ. తన నాయనమ్మగారి పేరును శేషుమాంబ అని ముద్దుగా పిలుచుకొనేవారు శ్రీరాములు. ఆనాటి సంప్రదాయాల ప్రకారం శారదాంబకు ఏడు సంవత్సరాల వయసులోనే వేమూరి రామచంద్రరావుతో 1888లో వివాహం జరిగింది. శారదాంబ తన 5వ ఏటనుంచే తండ్రివద్దనే సాహిత్యాన్ని అధ్యయనం చేశారు.
శారదాంబ పెళ్లి అయిన ఆరు సంవత్సరాలకు కాపురానికి వెళ్లారు. సాహిత్య సాంగత్యం చేసిన కాలం దాదాపు ఐదు ఏళ్ళకు మించవు. తొలి చూలు ఆడ బిడ్డ, మలిచూలు మగబిడ్డకు జన్మనిచ్చి ప్రసవంలోనే అకాల మరణం పొందినది. అప్పటికి ఆమెకు పంతొమ్మిది సంవత్సరాల వయస్సు. శ్రీరాములు శ్రీదేవీ భాగవతములో వ్రాసిన ఒక సీస పద్యాన్ని బట్టి నాగ్నజిత్ పరిణయమును శారదాంబ తన 16వ ఏట వ్రాసినట్లు తెలుస్తున్నది. ఈ కృతిని చెన్నైలోని పార్థసారథి కోవెల దేవునకు అంకితమిచ్చినది. భర్తతో మద్రాసులో కాపురం చేస్తున్న కాలంలోనే శారదాంబ ఈ కావ్యాన్ని రాశారు అని భావించవచ్చు. ఈమె సంగీత సాహిత్య విదుషీమణి అయినా అత్తమామల ఆరళ్ళకు గురైనది. తాను స్ర్తిలకు ఏ స్వేచ్ఛ కావాలని మాధవ శతకంలో కోరుకున్నదో దానికే కరువైనది.నాగ్నజిత్ పరిణయము మూల భాగవతమున రేఖామాత్రముగా దశమ స్కంధములో 31వ శ్లోకము నుంచి 55వ శ్లోకము వరకు వర్ణించబడినది. ఈ కథను శారదాంబగారు 235 పద్య గద్యాలకు పెంచి మూల కథకు కొన్ని మార్పులు చేర్పులు సమకూర్చి వ్రాశారు.
ఏడు ఆబోతులను భృంగి శాపాన్ని అనుభవిస్తున్న యక్షులని కల్పించిన కథను పటిష్టపరిచారు. అసలు కథలో లేని నారదుని నాగ్నజిత్తు కొడుకును, ఇందుమతి రాయబారాన్ని సృష్టించి కావ్యాన్ని రక్తికట్టించారు. కావ్యంలో నాగ్నజిత్ అనే పేరు చెప్పకుండా కావ్యానికి నాగ్నజితి పరిణయం అని పేరు పెట్టడం బాల శారదాంబ గడుసుదనానికి ఒక నిదర్శనం.అవతారికలోని బ్రహ్మస్తుతిలో ఉత్ప్రేక్షా అలంకారాన్ని నిర్మించారు. కోసల నగరాన్ని వర్ణించే సీస పద్యంలో ‘సకలంబులగు వృక్షజాతులు గల తోటలను గొప్పలవు నరణ్యములతోడ’, ‘్ధరుణీదేవి నిజరూపధారిణి యయి యచట నివసించియున్నదో యనగ నొప్పు’- భూదేవి నిజరూపంతో అక్కడ నివశిస్తుందా అని అనిపిస్తుందట. ఎంతటి ఆహ్లాదకరమైన వర్ణన. సాధారణంగా ప్రబంధకవులు రాజకుమారులను మాననీమన్మథులని వర్ణిస్తారు. కాని శారదాంబ, భర్తలు భార్యల హృదయాలను దొంగిలించుతారు అని స్వచ్ఛమైన ప్రేమకు పాత్రులని అపురూపంగా చిత్రిస్తూ ‘ప్రేయసీ హృదయచోరులు నింక కడున్ మనోహరాకారులు’ అని వర్ణించారు. ఇక అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని ‘ఆ పురమందు గాపులు స్వయంకృషి... చెల్లెలగు దైవత గంగ యనంగ దోచెడిన్’ అనే పద్యంలో ఆరుగురు అన్నల ప్రేమానురాగాల బంధాన్ని తన అనుభూతిని ఆత్మీయంగా విపులీకరించారు. తరిగొండ వెంగమాంబ, కృష్ణాజి మొదలైన సుప్రసిద్ధ మహాకవయిత్రుల సరసన నిలువదగినవారు శారదాంబ. పదహారేళ్ళ ప్రాయంలోనే ఇంతటి గొప్ప కావ్యాన్ని వ్రాసిన ధన్యజీవి. డా. దాసు అచ్యుతరావు ఎన్‌జిఆర్‌ఐలో శాస్తవ్రేత్తగా పనిచేసి రిటైరై విశ్రాంత జీవితాన్ని సాహిత్య సేవలో గడుపుతున్న ధన్యులు. మూడు తరాల బంధుత్వంతో ముత్తాతగారి కుమార్తె అయిన శారదాంబగారి పంతొమ్మిదవ శతాబ్ది చివరి భాగంలో వ్రాసిన కావ్యాలను వెలికితీసి నేటి సాహితీ పాఠకులకు అందించడం ఎంతో గొప్ప విషయం. వీరి కృషి అసమానం. శ్రీ దాసు శ్రీరామలు స్మారక సమితి ఏర్పాటుచేసి సొంత ఖర్చుతో తన పూర్వీకుల రచనలు ముద్రిస్తూ భాషలో ప్రతిభ చూపిస్తున్న సాహిత్య విద్యార్థులకు పురస్కారాలు అందిస్తున్న వీరి కృషి శ్లాఘనీయం. నేటి సమాజానికి వీరు నిజమైన మార్గదర్శకులు.

- జొన్నాభట్ల నరసింహప్రసాద్