పఠనీయం

ఆత్మ సమర్పణకు అద్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వేంకటాచల నివాస శతకము
శతకకర్త: డా.జనువాడ రామస్వామి,
పుటలు:70, వెల:రూ.30/-,
ప్రతులకు:H.No.3-178,చిలుకూరు (పోస్ట్), వయా కనకమామిడి, మొహినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా- 501 504

***** ************** ******************

దైవభక్తి అనేది భక్తుడికి ఎప్పుడూ ఒక చోదనశక్తి. రచనోత్సాహము, జన్మతః జన్యువులలో ఏదో ఒక తపన ఉన్న భక్తుడు భగవత్పరంగా ఆత్మాశ్రయ ధోరణిలో పద్యమో గద్యమో రాసి కొంత ఆత్మానుభూతి పొందకుండా ఉండడు. అలాంటి ప్రవృత్తి, వ్యావృత్తుల మూలాధారంగా అక్షర రూపం దాల్చిందే డా.జనువాడ రామస్వామి రచించిన ‘శ్రీవేంకటాచలం నివాస శతకము’.
ఇందులో 108 పద్యాలున్నాయి. అన్నీ సీసాలే. ‘కలియుగమున నీ నానమే కనకధార / శరణు శరణు శ్రీ వేంకటాచల నివాస!’ అన్న తేటగీతి పాద ద్వయం ఇందులోని ప్రతి పద్యమకుటం.
‘నీపాద సేవయే నిత్యకర్మ’ అని మొదటి పద్యంలో కవి తాను వెలిబుచ్చిన నిశ్చల నిర్మల ఉదాత్త భక్త్భివనకు వ్యాఖ్యానప్రాయంగా మొత్తం శతకం సాగిపోతుంది. నా ‘మనసు నిల్వదు స్వామి! మట్టిపెళ్ళ.. కన్న తండ్రివై కాపాడు సన్నుతాంగ’’ అనే ఆర్ద్ర, గాద్గదిక హృది వినతితో కృతి ముగుస్తుంది.
18వ పద్యంలో ‘కోరికలన్నవి కొరుకుచుండు’ అన్నవాక్యం సార్వజనీన, సార్వకాలిక గంభీర భావ గర్భితం. నిజంగానే కోరికలనేవి మనిషిని నిలువునా తొలిచేస్తుంటాయి. వాటి మూలాన మనిషి శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను జీవితంలో ఓడిపోతుంటాడు. ‘కొరుకు’ అన్నపుడు ఒక ఎలుక, శిథిలమైపోయేది మానవ జీవితం అనే సౌవర్ణ ధాన్యపు గాదె అనే భావం ధ్వనించి ఒక కమ్మని కవితావాక్యంగా ఒప్పారింది ఆ పద్య పంక్తి.
అలానే 47వ పద్యంలో ‘శిల్పియై చెక్కుము శిలను నేను’ అన్న వాక్యంలోని భావవిస్తృతి, స్ఫూర్తి బాగున్నాయి. నిరర్థకమైన ఒక రాయిని నేను. నన్ను ఒక సార్థక జీవిగాను ఒక సుందర మూర్తిగాను మార్చుము అనటంలోని సహజ సుందర ఆర్తి, ఊహారమ్యత ప్రశంసనీయాలు.
శ్రీరామ! నీ నామమెంతో రుచిరా’ అన్నాడు రామదాసు. కాదు, అది ఒక కనకధార అన్నారు జనువాడ వారు- మొదటి పద్యంలోనే మరింత భావశబలతను చేకూరుస్తూ. శతకంలోని చాలా పద్యాలలో కోరికలే సర్వ దుఃఖాలకూ మూలకారణం అన్న బౌద్ధమత సూక్త్తి ఇంకా పోతన, వేమన, ధూర్జటి, త్యాగయ్యలు అన్న కొన్ని కొన్ని జీవిత సత్యాలు సందర్భోచితంగా తలపుకు తెస్తాయి. పాఠకుల తలలూపిస్తాయి హర్షామోదాలతో.
‘గ్రుడ్డివాడ్న? (గుడ్డివాడనా?), ‘నిన్ను తలవగానే’ వంటి కొన్ని వ్యావహారిక భాషా రూపాల ప్రయోగం కనిపిస్తుంది పద్య రచనైనా, ఎవరేమనుకున్నా ఈ విషయంలో.
30వ పద్యం మొదటి పంక్తిచివరలో ‘ప్రణములు’ అంటే అర్థం పొసగలేదు. ప్రణము అంటే ప్రణామము అని కాదు అర్థం. ప్రణము అంటే పాతది, పురాతనము అని అర్థం. అక్కడ ‘ప్రణతులు’ అంటే సరిపోతుంది. 31వ పద్యం (తేటగీతి) రెండవపాదంలోను, 32వ పద్యం 4వ పాదం ద్వితీయార్థంలోను గణభంగాలు జరిగాయి. 35వ పద్యం ద్వితీయ పాదం ద్వితీయార్థంలో యతి సరిపోలేదు. ‘‘ప్రార్థింతుమో స్వామి! ప్రేమ మీర’’ అనకుండా ‘్భక్తిమీర’ అంటే సరిపోయేది పదౌచితపరంగాను కూడా. ఏది ఏమైనా ఈ శతక కవికున్న ‘త్వమేవ శరణం మమ’ అనే తాత్విక భావన, భక్తితత్త్వాలకు మాత్రం మరకలేని అద్దం ఈ శతకం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290