పఠనీయం

సందర్భ పదబంధాలు - భాషా సుగంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాణ పదబంధాలు
రచన:బమ్మిడి జగదీశ్వరరావు,
పుటలు:184, వెల:రూ.70/-,
ప్రచురణ, ప్రతులకు: ‘మంచి పుస్తకం’, 12-13-439, వీధి నెం.1, తార్నాక, సికింద్రాబాద్-500 017

==============================================================

‘అల్పాక్షరం - అనల్పార్థం’ అనేది ఒక సంభాషణా చాతుర్య నిర్వహణ సూత్రం. తిక్కన ప్రయోగించిన ‘రక్కెసతాల్మి’, ‘చిచ్చూడింగట్టినయట్లు’ మొదలైన పలుకులు ఇలాంటి చతురతకు మనోహరమైన మచ్చులు. పది వాక్యాల భావాన్ని ఐదు పదాలలో అతి చాకచక్యంగా చెప్పటం ఒక అందమైన అభివ్యక్తి సామర్థ్యం. ఆ అభివ్యక్తి శక్తికి ముఖ్య ‘పరికరాలు’ సామెతలు, నానుడులు, లోకోక్తులు- చివరకు ఒక కాకువు కూడా కొన్ని సందర్భాలలో. ఈ రకమైన వాక్చతురతలు శతాబ్దాల తరబడిగా తరతరాలుగా అనుశ్రుతంగా వస్తున్న కొన్ని పురాణ వృత్తాంతాథారిత పదబంధాలుగా మన పెద్దల మాటలలో తళుక్కుమంటుంటాయి.
‘అంగద రాయబారం’, ‘అరచేతిలో వైకుంఠం’, ‘రావణకాష్ఠం’, ‘లక్ష్మణరేఖ’ వంటి 130కిపైగా పదబంధాల పుట్టుక, భూమికల గురించి బమ్మిడి జగదీశ్వరరావుగారు సరళ, సుందరశైలిలో ఒక వివరణ గ్రంథాన్ని కూర్చారు. పుస్తకంపేరు ‘పురాణ పదబంధాలు’.
ఇందులోని వివరణలు సగటు విద్యా స్థాయి, కొంత భాషా జిజ్ఞాస గల వ్యక్తికి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేస్తాయి.
‘అంగద రాయబారం’ అనే పదబంధానికి ఉన్న మూలపద రూపం రాజ్యభారం అంటూ దానికి చేసిన విశే్లషణ బాగుంది. ‘‘రాయబారానికి వెళ్లిన అంగదుడు రాయబారం మాత్రమే చేసి ఆగిపోలేదు. మా బలమేమిటో మచ్చుకు చూపించి, భవిష్యత్తేమిటో లీలగా దర్శింపజేసి వచ్చాడు. అదీ కథ!’’ అంటూను, అంగదుడు చేసిన స్వీయ బల, యుక్తుల ప్రదర్శన, రావణుడికి చేసిన శృంగ భంగమూను సూక్ష్మంలో మోక్షంగా కడు రమ్యంగా చెప్పాడు రచయిత.
ఎవరినైనా అందాల రాముడితో పోల్చి చెప్పటంలో ఆ పోల్చబడిన వ్యక్తిలో రాముని శారీరక సౌందర్యమే కాకుండా రాముని వ్యక్తిత్వం కూడా ఉండాలి అన్నారు బమ్మిడివారు. ఇందులో గంభీరమైన ఒక హెచ్చరిక ధ్వనించటం మనోజ్ఞం.
‘అన్నమో రామచంద్రా!’ వివరణలో పదబంధ భావాన్ని విశదీకరించటమే కాకుండా ‘అన్నమో రామచంద్రా’ అని అలమటించే దుస్థితి ఎవరికీ వద్దు (రాకూడదు) అంటూ ముగించటం ఉదాత్తంగా ఉంది. లోకశ్రేయోర్థా కాంక్షాపూర్వక ప్రార్థనగా. ‘తథాస్తు దేవతలు’ చాలా బాగుంది, స్ఫూర్తిదాయకంగా వుంది. మనిషికి ఎప్పుడు మంచి ఆలోచనలు, మంచి కోరికలే ఎందుకు ఉండాలో తార్కికంగా ఒప్పించారు. ‘తథాస్తు దేవతలు’ ఉన్నారు అంటూ భయపెట్టేది భయం లేకుండా ఉండటానికే అన్న వాక్యం గంభీరార్థవంతంగాను, చమత్కారంగాను ఉన్నది. ‘దుర్యోధన స్నేహం’ చక్కని సందేశాత్మక వివరణతో ముగిసింది. ‘్ధర్మరాజు నీతి’ పదబంధ వివరణలో ధర్మజుని ధీరోదాత్తత గురించి సూక్ష్మంలో మోక్షంగానే కాకుండా సునిశితంగాను చెప్పారు. ‘వజ్రాయుధం’ వృత్తాంతం రసవత్తరంగా సాగింది. ‘ఋషులూ, తపస్వులు, మునులు అన్ని సహజ గుణాలనూ అదుపులో పెట్టుకోవటానికి ప్రతీకగాను, నిరంతర స్మృతి హెచ్చరికగాను తలమీది వెంట్రుకలను ముడిపెట్టుకుంటారు. అది దేనికి లొంగని ‘మనోముడి’ అంటూ తల ముడి ఎందుకు అనే ధర్మసందేహానికిచ్చిన పరిష్కార సమాధానం సముచితంగా ఉంది. అయితే ‘మనోముడి’ అంటూ వికృత సమాసం చేయకుండా ‘మనోజూటము’ అంటే భాషా పరంగా హుందాగా ఉండేది. ‘మది ముడి’ అన్నా తెలుగు జిలుగు జిగేలుమంటుంది. లంఖిణీ వృత్తాంతము, విష్ణు శర్మ విరచిత పంచతంత్రానికి ఆంధ్రీకరణం ఎవరెవరు చేశారు మొదలైన కేవల పండితైక వైద్యాలైన పలు విషయాలు తెలుస్తాయి ఈ పుస్తకంలో అక్కడక్కడ సామాన్య పాఠకుడికి సైతం.ఈ గ్రంథంలో ప్రతి పురాణ పదబంధాన్ని గురించి చివరలో ఒక్కడ (వాక్యపు) ముక్కలో చెప్పిన తీరు అభినందనీయం.
18వ పుటలో ‘్భరతంలో నీలుడు అతిరథుడుగా చెబుతారు’ అని అన్నాడు రచయిత. కానీ ఉద్యోగ పర్వం చతుర్థాశ్వాసంలో భీష్ముని పలుకులలో ‘మాహిష్మతీ పతియైన నీలుండర్థరథుండు’ అని ఉన్నది. 25, 26వ పుటలు రెంటిలోనూ అన్నిచోట్లా ‘అశ్వత్థామ హతః కుంజరహః’ అని ఉంది. అది అచ్చుతప్పు కావచ్చు. ‘కుంజరః’ అనేది ఒప్పు. చివరలో ‘హ’ కారకము ఉండదు. 28వ పుటలో ‘రావణుడిని ఎదుర్కోవటం రాముడికి కష్టమవుతున్న తరుణంలో రాముడి బొడ్డు దగ్గర అమృత కలశం ఉందని చెప్పాడు విభీషణుడు. ఆ విధంగా రావణుడి ప్రాణాలు రాముడి చేతిలో పెట్టాడు అని రాశారు జగదీశ్వరరావు. కానీ వాల్మీకి రామాయణంలో అలా లేదు. సారథియైన మాతలి రామునకు బ్రహ్మాస్త్రాన్ని స్ఫురింపజేయటంతో రాముడు ఆ దివ్యాస్త్రాన్ని (ఐంద్రాస్త్రం అని మరో పేరు దీనికే) స్మరించి, దానినుపయోగించి రావణ సంహారం చేశాడు అని మాత్రమే ఉన్నది. అధర్మ మార్గంలో నాభికి గురిపెట్టాడు అని వాల్మీకి అనలేదు.
57వ పుటలో ‘గౌరీ కల్యాణం జరిగింది అంటే పని మొదలుపెట్టారు అనే అర్థంలో వాడుతుంటారు’ అన్నాడు రచయిత. కానీ అధిక సంఖ్యాకుల వాడకంలో ‘అంకురార్పణ అయ్యింది’ అనేదే ఎక్కువ.ఏతావతా చెప్పొచ్చేదేమంటే, ఈ గ్రంథస్థ విశదీకరణలు వివిధ పదబంధాల సందర్భ రమ్య భాషా సుగంధాలు.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290