పఠనీయం

కథా విమర్శకు మరో చేర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కథానిక (జాతీయ సాహితీ కళారూపం)
వెల: రు.160/- పేజీలు: 376.
శ్రీవిరించి, వ్యాప్తి బుక్స్, బీసెంట్‌నగర్, చెన్నై

============================================

కథకులుగా, కథా విమర్శకులుగా శ్రీవిరించిగారు ప్రసిద్ధులు. కథా నిర్మాణంపై, కథకులపై వివిధ పత్రికలలో రాసిన లఘువ్యాసాలు, పరిచయాలు, సమీక్షలతో ఈ పుస్తకాన్ని వెలువరించారు.
ముందుగా భారతీయ భాషలలో వచ్చిన కథానిక ఆవిర్భావాన్ని తెలియజేశారు. తర్వాత కథావస్తువు-దేశీయత, మారుతున్న ప్రపంచం- మాటల కూర్పులు, కథానిక ప్రాభవం- ప్రభావం, కథావస్తువు- కలల ప్రపంచం, కథలలో అనుభూతులు, పెటాఫిక్షన్ గురించి వివరిస్తూ రాసిన వ్యాసాలున్నాయి. వీటితోపాటు తెలుగులో గొప్ప కథలు, యాభై ఏళ్ళ కిందటి తెలుగు కథ, రెండు మంచి కుటుంబ కథల గురించి క్లుప్తంగా తెలియజేశారు.
తొలినాటి తెలుగు కథల గురించి చెబుతూ అక్కిరాజు ఉమాకాన్తం, మాడపాటి హనుమంతరావు, గురజాడ, రాయసం వెంకట శివుడు లాంటి తొలి రచయితల పరిచయ వ్యాసాలు బాగున్నాయి. తొలి మూడుతరాలకు చెందిన 42 మంది కథకులు- కథన రీతులను వివరించే పరిచయ వ్యాసాలున్నాయి. ఇందులో ఉషశ్రీ, అనిసెట్టి సుబ్బారావు, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, అచంట జానకీరామ్, కొమ్మూరి పద్మావతీదేవి, వి.ఎస్.అవధాని, శ్రీనివాస శిరోమణి, క్రొవ్విడి లక్ష్మన్న, గోరాశాస్ర్తీ, ఆర్.యం.చిదంబరం లాంటి విస్తృత రచయితలపై కూడా వ్యాసాలు వుండటం విశేషం. ఇందులో కొందరు కథకులవి ఒకే కథ తీసుకోవడం, మరికొందరివి రెండు, మూడు కథలను తీసుకుని వివరించడం జరిగింది. పూర్తి కథలు తీసుకున్న రచయితలను వేళ్ళమీద లెక్కబెట్టుకోవలసిందే. వ్యాసాలు కూడా ఒక పేజి మొదలుకుని మూడు పేజిలవరకు, అతి కష్టంమీద అయిదు పేజీలవరకు రాసినవి వున్నాయి. వ్యాసంలో క్లుప్తత పాటించడం అంటే ఇదే కాబోలు. బహుశా ‘కాలమ్’ వ్యాసాలు కాబట్టి క్లుప్తంగా, మొక్కుబడిగా తయారయ్యాయని అనుమానించడానికి అవకాశముంది.
అలాగే ఎడ్వర్డ్ కిప్లింగ్, ఆఫ్రికన్ కథకుడు అమోస తుతెలా, వి.యస్.నయిపాల్, ఈజిప్టు- దక్షిణ ఆఫ్రికాలకు చెందిన ఇద్దరు కథకుల మీద రాసిన వ్యాసాలు సమాచారాత్మకంగా వుండి ఆకట్టుకుంటాయి. తెలుగు రచయితల కంటే, ఆంగ్ల రచయితల మీద రాసిన వ్యాసాలే సమగ్రంగా వుండటం ఆశ్చర్యం.
తొలి డిటెక్టివ్ రచయిత దేవరాజు వెంకట కృష్ణారావుపై రాసిన వ్యాసం అరుదైనదనే చెప్పాలి. అలాగే వి.రాజారామమోహనరావు నవలలపై రాసిన పరిచయ వ్యాసాలుకూడా ఇందులో వున్నాయి. ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగువెలుగు దంపూరు నరసయ్య గురించి, ‘‘కథాంజలి’’ పత్రిక గురించి, ఆర్టిస్టు కేశవరావు గొప్పదనాన్ని వివరించే వ్యాసాలుకూడా వున్నాయి. చివరగా ‘‘నేనెందుకు వ్రాస్తున్నాను’’అనే వ్యాసంతో పాటు డా.సంపత్‌కుమార్ రచయితను చేసిన ఇంటర్వ్యూ, తమ సన్మానానికి సభలో చేసిన లఘుప్రసంగాన్ని కూడా ఇందులో పొందుపరచారు. వీటితోపాటు వారు రాసిన పుస్తక సమీక్షలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. విమర్శావ్యాసాలయినా, సమీక్షలయినా పరిచయాలుగా తీర్చిదిద్దడం ఈ రచయిత ప్రత్యేకత. వీటివల్ల కొత్తతరం పాఠకులకు కథా సాహిత్యంమీద ఆసక్తిపెరగడానికి అవకాశముందనే వాదాన్ని త్రోసిపుచ్చలేం.

-కె.పి.అశోక్‌కుమార్