పఠనీయం

విభిన్న భావాల సమాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎడారి చెలమ’
రచన: డా.చెన్నకేశవ
వెల: రూ.120/- పుటలు: 119,
ప్రతులకు: డోర్ నెం:54-18-37/1ఏ ప్లాట్ నెం: 10, రేడియోకాలనీ, మొదటి వీధి, విజయవాడ- 520 008
Cell Number : 9866045086

-----------------------------------------------------------------------------------------------------------------

కవి డా.చెన్నకేశవగారి కలంనుండి జాలువారిన భావాలతో ‘ఎడారి చెలమ’ కవితా సంపుటి వెలువడింది. కవి యొక్క సామాజిక దృక్పథానికి అద్దం పడుతూ విభిన్న భావాల సమాహారంగా రూపుదిద్దుకుంది.
ఇందలి కవితలు ‘అక్షర దీపాల’ను తలపిస్తాయి! ‘ప్రభాత గీతం’తో వాస్తవాల చేమంతుల హేమంతో మురిపిస్తాయి’. వడదెబ్బకు గురైన వేడి గుండెల ఉచ్ఛ్వాస నిశ్వాసాలేవో తెలుసుకున్నావా ఓ వీచే మారుతమా?’ అంటూ ప్రశ్నల గీతంతో పరామర్శిస్తాయి!
ఇంకా ఇందలి కవితల్లోని పంక్తులు...
ఆక్రందనలు ఆకాసాన తారకలైనాయట అంటూ ‘ఆగమ గీతాన్ని’’ ఆలపిస్తాయి! కడలి అలల కౌగిట్లో కథలు చెప్పుకున్న ఊసులను ‘‘మాయలేని గీతం’’లో వినిపిస్తాయి. కడలి పొంగినా, కన్నీరొలికినా/ కడుపు చల్లని కదలనీయని లక్ష్మిని ‘మూడిళ్ల గీతం’తో పరిచయం చేస్తాయి! చనిపోయిన కొడుకు గూర్చి విన్నప్పుడు/ ముసలి తల్లి గుండె వేదనను వినగలవా? అన్న పంక్తులు ‘‘శోక గీతం’’అందరి హృదయాలను కదిలిస్తాయి.
కవి అభ్యుదయ భావాలతోపాటు ఆర్ద్రమైన ఆలోచనలకు అక్షరాకృతినిచ్చారు.. భిన్నత్వంలో ఏకత్వం అంటూ ‘్భరతీయత’ను చాటి చెప్పారు. ఈ నేల నరనరాల్లో విరబూసిన అనుభూతి స్వర్గం/ కల్పనాతీత హిమశిఖరోన్నత విశ్వైక్యతా మంత్రం/ వేదాంత పురాణాల పవిత్ర గంగల మునిగి తేలిన పుణ్యం అంటూ భారతీయతను ఎలుగెత్తిచాటారు.
‘్భరతీయ కుటుంబం’ వసుదైక కుటుంబంగా అభివర్ణించారు. ఇక్కడ ప్రతి ఇల్లూ, ‘రామకథే’ చూపుతుంది/ ఈ భారతం ‘విశ్వాశ్రమం’ అవుతుందని స్వాభిమానాన్ని ప్రకటించారు.
నేనొక భయంకర విష సర్పాన్ని/ కుత్సిత మానవాళిని కాటేస్తానని ‘‘విశ్వరూపం’’ కవితలో నినదించారు. మంచిని తుంచి వంచనతో పరుగిడుతోంది లోకం/ అవతరించు మరోసారి అవతరించు అంటూ ‘బాపూజీకి వినతిపత్రం’ సమర్పించారు.తూర్పు పడమరల్లో పుట్టుతూ గిట్టుతూ/ సాగే నిరంతర ప్రయాణం ‘‘జీవితం’’అంటూ కవి తమ తాత్త్వికను ప్రదర్శించారు.
‘మద్యంతో కయ్యం’ శీర్షిక ఎత్తుగడ బాగుంది. ఓ మద్యమా! నీతో కయ్యంగాక వియ్యమా? అంటూ ప్రశ్నించారు.
‘ఎడారి చెలమ’ శీర్షికతో రాసిన కవిత ఆలోచనాత్మకంగా ఉంది. ‘ఒంటరితనంలో కిటికీ తెరిస్తే చాలు... కళ్ళముందు కదలాడేటి నేటి మానవ రూపాలు...అంటూ ‘‘తెరిచిన కిటికీ’’ కవితలో ప్రారంభ పంక్తులను చక్కగా పొందుపరిచారు.
‘‘తీరంచేరని మనిషి’’ కవిత ఆసక్తికరంగా మలచబడింది.. అస్తిత్వానికీ... ఆనందానికీ ప్రతీకగా ధ్వనించిన నాదాన్ని అక్షరాల్లో బంధించిన తీరు బాగుంది.. పదవికోసం, పెదవికోసం, భృతికోసం... పరుగులు తీసే మనసును చక్కగా ఆవిష్కరించారు.
‘ఈనాటి మానవత్వం’ కవితలో..
‘ఈ మానవత్వం’ సువిశాల ఉప్పుసముద్రమనీ... సాంఘిక విలువలు దాని ఒడ్డుపై బంజరుభూములని వ్యాఖ్యానించారు.
‘చిగురించే కోరిక’ కవితలో ఆమనిలో మావి చిగురులా.. కోకిల కంఠంలో కమ్మని రాగంలా చిగురించాలని ఉందని చెప్పడం బాగుంది.
మేఘం మెరుపులూ, జడివానలూ ఉంటేనేం... ఇంద్రధనసు లాంటి భవితనందిస్తే బాల్యం బంగారమే అంటూ ‘బజారున పడ్డ బాల్యం’ కవితకు చక్కని ముగింపునిచ్చారు.
గాయం చేయని, మాయలు పులమని/ విశ్వమానవతా పరిమళాలు వెదజల్లడమే అణుదీపాల్లాంటి అక్షరాల ఆశయమని ‘అక్షరాలు- అణుదీపాలు’ కవితను రాశారు..
‘‘నవమానవతా రూపం’’ కవితలో హృదయ వేదనతో ఆలపించే కోకిల స్వరంతో.. నవజీవన నిర్మాణ సంగీతాన్ని వినిపించారు.
‘‘చతుర్వేదం’’ కవితను నాలుగు పంక్తుల్లో రాసి చక్కగా జీవన సత్యాలను ఆవిష్కరించారు. ప్రేమ గుండె రగిలితే ప్రణయం/ కవిత గుండె పగిలితే ప్రళయం/ లేని కడుపు కాలితే ఆరాటం/ లేమి ఓర్పు తూలితే పోరాటం అంటూ కవి తమ కవితా పటిమను చాటుకున్నారు.
‘నా కలం’ కవితలో కవి తన కవితా తత్వాన్ని చాటిన తీరు బాగుంది.
ఇలా ఇందులోని కవితలన్నీ విభిన్నభావాల సమాహారంగా కొలువుదీరాయి...
‘‘అక్షరదీపం’’, ‘‘ప్రశ్నల గీతం’’ ‘‘తీరం చేరని మనిషి’’ కవితలు గ్రంథంలో పునరావృత్తం కాకుండాచూస్తే బాగుండేది... ఈ మూడు కవితలు రెండుసార్లు దర్శనమిస్తాయి! గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రాసిన కవితకు ‘‘సాహితీ సభ’’అని పేరుపెట్టడంలో కవి యొక్క ఔచిత్యం బోధపడదు. వస్తు ఎంపికలో చూపిన చొరవ ప్రశంసనీయమైనప్పటికీ... అభివ్యక్తిలో ఇంకా పరిణతి సాధించాల్సి ఉందని పాఠకులు ఇట్టే పసిగడతారు. సమాజంలోని సమకాలీన సమస్యల మీద ఆయనకున్న అవగాహనను అభినందించి తీరుతారు! మానవీయ విలువల కోసం ఆయన పడే ఆరాటాన్ని.. ఆయన కవిత్వంలో చూడగలం.. భారతీయత పట్ల ఆయనకు ఉన్న మక్కువ ప్రశంసనీయం.. అభ్యుదయ మార్గాన నడిపించే ఆయన భావాలను మెచ్చుకుంటాం.. అందరు చదువదగిన గ్రంథమిది!

-దాస్యం సేనాధిపతి 9440525544