పఠనీయం

ముత్యాల వంటి మాటల మూట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాల ‘సంచి’(తం!)
డా రామడుగు వెంకటేశ్వర శర్మ
పేజీలు:111, వెల:రూ.60/-, ప్రతులకు: శ్రీమతి ఆర్.నాగమణి, W/o డా రామడుగు వెంకటేశ్వర శర్మ, ప్లాట్ నెం.201,
2వ అంతస్తు, ఆర్.వి.టవర్స్, 3/17 బ్రాడీపేట, గుంటూరు-522002
==============================================

‘‘అక్షరాలకు మంగళస్నానాలు చేయించి.. పదాలకు పట్టు పరికిణీలు తొడిగి.. భావాలకు కస్తూరి తిలకాలు దిద్ది.. భావుకత్వ సామ్రాజ్యంలో... హంస తూలికా తల్పాలపై.. అరమోడ్పు కన్నులతో ఒకప్పుడు అలవోకగా శయనించిన.. అనంత సౌందర్యహేల.. నా తెలుగు’’ అంటూ డా రామడుగు వెంకటేశ్వర శర్మ గారు ‘అక్షరాల ‘సంచి’(తం!)’’ అనే పేరుతో.. పద్య-వచన కవితల సంపుటిని వెలువరించారు. అవీ.. ఇవీ.. అన్నీ.. అన్న చందం వోలే.. ప్రాచీనతను.. ఆధునికతతో సమ్మిళితంచేసి.. మాటలు కావు ముత్యాల మూట అన్నట్లు శర్మగారు తమ భావాలకు అక్షరాకృతినిచ్చారు. ఈ ‘అక్షరాల సంచి’లో కవి పద్య రచనను.. వచన కవిత్వాన్ని పొందుపరిచి పాఠకుల మెప్పించ యత్నించారు. అక్షరాల గోదావరి ఉరకలేసి ప్రవహిస్తే.. బ్రతుకు పొలములో మరి మరి జ్ఞాన రాజనాలసిరి; అంటూ.. అక్షరగోదావరిని ప్రవహింపజేశారు. అచ్చు హల్లులు కలిసినయపుడె గాదె /వర్ణము విభాసిలునుపో! అంటూ ‘వసుదైక కుటుంబం’ శీర్షికతో రాసిన పద్య రచనలో కవి తమ భావాలను మనతో పంచుకున్న తీరు బాగుంది. రమ్య రామ రాజ్యమును కోరని నరుండు; నవతమీరంగ శ్రీరామనవమినాడు.. ఉత్సవముల పొల్గొనకుండ నరుడు, ఎవ్వడైనను కలడటే? ఇలను.. కలను? అని ప్రశ్నించాడు.
‘కర్ఫ్యూ వేసవి’ శీర్షికతో చేసిన రచనలో.. గస్తీ జవాను ప్రశస్తినొంద.. తనరు నిర్జన మార్గ పత్తన సమూహమందు లేని కర్ఫ్యూ రూపు సంతరించ.. జగతి ప్రజలకెల్ల పగ చ పగలు చెలగె-జ్వాల వొల్కెడి వేసవి వేళలందు అంటూ వేసవిని అభివర్ణించారు
కవి శర్మగారు సిగరెట్టుపై ఆటవెలది పద్యం రాసి మెప్పించారు. ఆషాఢ ప్రభ, శ్రావణపూర్ణిమ, శ్రావణలక్ష్మి, వాన శీర్షికలతో ఇందులో పొందుపరిచిన పద్య రచనలో కవి యొక్క లోక పరిశీలనను ప్రశంసించి తీరుతాం..
గీతి కాదది భరత విభూతిగాని, గీతికాదది ‘బంకింగు’ కీర్తిగాని అంటూ ‘వందేమాతరం’పై తమ భావాలను ప్రకటించిన తీరు బాగుంది.
గ్రాంథిక పండిత ఛాందస హృదయాల.. దడ పుట్ట జేసిన పిడుగు గిడుగు అంటూ గిడుగును కీర్తించారు.స్వామి వివేకానందన, శ్రీరామకృష్ణ పరమహంసను విడివిడిగా రాసిన పద్యాల్లో వారిని ఉన్నతంగా చిత్రించారు. ‘స్ర్తి భారతం’ శీర్షికలో రాసిన పద్యంలో వనిత యొక్క ఓర్పు నేర్పులను కూర్చి తీరు బాగుంది. ఇలా పద్య విభాగంలో కవి తమ సృజనను చాటుకున్నారు. ఇక.. వచన కవితా విభాగంలోని కవితల్ని పరిశీలిస్తే.. కవి యొక్క సామాజిక దృక్పథం ఇట్టే బోధపడగలదు.
‘కాలం కప్పిన తెరలు’ శీర్షికతో రాసిన కవితలో కళ్లను అందంగా, విభిన్న కోణాల్లో ఆవిష్కరించారు. ‘అక్షర స్వరాలు’ శీర్షికతో రాసిన కవితలో.. అక్షరాలే.. అజ్ఞాన తమస్సు చీల్చు రవి కరాలు అని తేల్చి చెప్పారు.
‘చెట్టు’ కవితలో.. నిజమైన కవి చెట్టు లాంటివాడని వ్యాఖ్యానించారు. ప్రకృతిలో చెట్టులేని ప్రపంచాన్ని ఊహించగలమా అని ప్రశ్నించాడు.
కవిత్వానికి కాదేదీ అనర్హం అని శ్రీశ్రీ గారన్నట్లు..కవి శర్మగారు‘మైకు’పై కవిత రాసి మెప్పించారు. వలసలమీద, చావులు -రేవులు మీద రాసిన కవితలు కవి యొక్క సృజనాత్మకతకు అద్దం పట్టేలాఉన్నాయి. గుడి, రాగిచెంబు, స్ర్తి, మూడు ముక్కలాట, బాటరి, ప్రకృతి, మేళం వంటి శీర్షికలతో మినీ కవితలు రాసి ఈ గ్రంథంలో పొందుపరిచారు.
ఇలా ఈ గ్రంథంలో పద్యం.. వచన కవిత్వంతో నింపారు.
కవి యొక్క ఉత్తమ వ్యక్తిత్వానికి నిదర్శనంలా కవిత్వ రచన కొనసాగింది. అయితే ఏదో ఒక ప్రకియలో సమగ్రంగా తమ రచనలకు చోటు కల్పిస్తూ గ్రంథం వెలువరిస్తే బాగుండేది..

-దాస్యం సేనాధిపతి 9440525544