పఠనీయం

నాడే కనిపించిన స్ర్తివాద భావనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందగిరి ఇందిరాదేవి కథలు
డాచీదెళ్ళ సీతాలక్ష్మి మరియు పరిమి వెంకట సత్యమూర్తి వెల:రూ.50/-,
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమీ, సైఫాబాద్, హైదరాబాద్-47
=======================================================
నందగిరి ఇందిరాదేవి (1919-2007)గారు తెలంగాణ తొలితరం రచయిత్రి. దక్కన్ రేడియోలో తొలి తెలుగు మహిళా ప్రసంగికురాలు. ఇరవైయ్యేళ్ళ ప్రాయం నుండే కథలు, ప్రసంగాలు, వ్యాసాలు విరివిగా రాశారు. ఆర్య సమాజ వివాహాన్ని ఆనాడే ప్రోత్సహించిన వైతాళికురాలు. 1940 నుంచే ఆమె కథలు గృహలక్ష్మి, చిత్రగుప్త, ప్రజామిత్ర లాంటివి ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి. మానవ సంబంధాలు, భావోద్వేగాలు, అతి ప్రతిభావంతంగా ఆనాడే చిత్రీకరించారు అయినా, ఎందుకో తెలియదు కాని మరుగున పడ్డారు. వీరి తండ్రి వడ్లకొండ నరసింహారావు మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల (హైదరాబాద్) సహ వ్యవస్థాపక సభ్యుడు. ప్రభుత్వోద్యోగి. భర్త పేరొందిన లాయరు. సంపన్న కుటుంబ వ్యవస్థలోంచి వచ్చినా, ఇందిరాదేవిగారు మధ్యతరగతి జీవితాన్ని ఇష్టపడినట్లుగా అవుపిస్తుంది.
తెలంగాణా ప్రభుత్వం ఏర్పడినాక (2014) తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ఇలాంటి మరుగునపడ్డ మాణిక్యాలను వెలికితీయటం ఎంతో శ్లాఘనీయం. వీరి రేడియో ప్రసంగాలు 1995లో ‘మసక మాటున మంచి ముత్యాలు’గా వెలువడిందిట. వీరు వందకుపైగా కధలు రాసాశారుట. ఈ కథల్లోంచి 13 కథలను ఏరి అకాడమీవారు ‘నందగిరి ఇందిరాదేవి కథలు’ శీర్షికతో ప్రస్తుత సంకలనాన్ని ప్రచురించారు.
స్ర్తి పురుష సంబంధాల్లోని వైవిధ్యాలు, సామాజిక సమస్యలు, మనస్తత్వ చిత్రణ, స్ర్తి సంబంధిత సమస్యలు, సాంఘిక దురాచారాలు వీరి కధల్లో కనబడుతాయి.
సంకలనంలోని మొదటి కధ ‘పందెం’. మనిషి సంఘజీవి అని ఒంటరిగా బ్రతకలేడని, అధవా బ్రతకాల్సివచ్చినా, సంచితమైన జ్ఞానం వ్యర్థమవుతుందని, చివరకు ఆ మనిషే గల్లంతు అవుతాడని చెపుతుంది.
వీరి రెండో కధ ‘పాపం’. ఒక వ్యక్తి తప్పు చేస్తే అపరాధ భావం వెన్నంటుతుందని, గుమ్మడి కాయలదొంగ అనగానే భుజాలు తడుముకుంటాడని, ఆ మనిషి మనోభావనలు వివరించే కొసమెరుపు కధ. ఈ కధలోని శిల్పం, కథనం, అభివ్యక్తి-నేటి కథలకు ఏ మాత్రమూ తీసిపోకుండా ఉండటం రచయిత్రి కథా కథన కౌశల్యాన్ని అభినందించకుండా ఉండలేము.
‘చిట్టిపెళ్ళి’లో నాటి మగపెళ్లి వారి పెత్తనం, స్నేహితుల సంబంధం అయినా సరే, ఆధిక్యత చూపుకోవాలన్న ఆడ మనస్తత్వం, బాల్య వివాహం ఆచారం, అప్పుడప్పుడే వెలుగు చూస్తోన్న ‘ఆర్య సమాజ’ పెళ్ళిళ్ళు రచయిత్రి అవగాహనని విస్తృతిని చెబుతుంది.
‘అన్నీ అబద్ధాలే’ ఆనాటి చదువుకున్న జనం చలం రచనల్ని ఎలా రిసీవ్ చేసేవారో చెబుతుంది. ‘గంగన్న’ కధ ట్రాజెడీలు కూడా రచయిత్రి బాగా రాయగలరు అని చెబుతుంది.
‘వీరయ్యగారి ఫొటో’, విషమ సంఘటన నవ్వు పాళ్లు మేళవించిన కథలు.
కధలన్నిండా ఇంగ్లీషు పదాలు (వానిటీ, చీప్ టేస్ట్, ఎవాయిడ్, ఎగ్జాట్లీ మొదలైనవి) ఆనాటి పడికట్టు పదాలు చెడ్డీ కుడితి (అండర్ గార్మెంట్), జిబ జిబ ముసురు(52), ఉద్రేకి అవటం (57), పెరది అవటం (పరాయిది అవటం), సోరగానే (వయసుగానే) సైసు (గుర్రం) బండి నడిపే నౌకరు, కాఫీ విత్తనాల్ని పండించి పొడి చేయటం; సామెతలు-కప్ప ఎంతో కాలు అంతే చాపాలి, ఏరి కోరి చేసుకుంటే ఎరుకల వాడయినట్లు, నూతిలో బడ్డ వానిమీద నూరు రాళ్ళు కనిపిస్తాయి. ఆనాటి వ్యవహార భాష విధాయకం తెలియజేస్తాయి.
నాటి తెలంగాణ సాహిత్య అస్తిత్వంకు ప్రతీకలు అనబడే కధలు ఇవి. ఇలాంటి మరుగున పడ్డ తెలంగాణ మాణిక్యాలలను పరిచయం చేస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ వారు అభినందనీయులు.

-కూర చిదంబరం 8639338675