పఠనీయం

కవిత్వాన్ని ఒడిసిపట్టే ‘నల్ల చామంతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్ల చామంతి
రచయిత - చిత్తలూరి సత్యనారాయణ, వెల:రూ.120/-, ప్రతులకు:చిత్తలూరి సత్యనారాయణ, డి.రేపాక (పోస్ట్), అడ్డ గూడూరు మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403 విజయశ్రీ రెసిడెన్సీ, మలక్‌పేట్,
హైదరాబాద్-500 036.
==================================================================
‘‘కంటి చూరుకు వేలాడుతున్న /చివరి చినుకు / నా దోసిలిలో రాలింది / అక్షరం చేశాను /్భమి యింకా తడిగానే ఉంది’’ అనే అక్షర స్పృహ ఉన్న కవికి సాధారణ వచనాన్ని కవిత్వం చేసే శక్తి లేదంటే ఎలా నమ్ముతాం. సారవంతమైన సృజనాత్మక స్పర్శ మనసునీ మట్టినీ లోలోతుల్నుంచి తడుముతుంది. ఈ వెదుకులాటలో బయటపడని ఆంతరంగిక రహస్యాలు సమస్యల మూలాలను పొదివి పట్టుకుని పరిష్కారంతో కడతేరిస్తే.. ప్రతి మలుపూ ఒక సంఘర్షణాత్మక జీవనదృశ్యమే. అలా పదునుదేరిన అడుగులోంచే కొత్త జీవితం ఆశాజనకంగా మొగ్గుతొడుగుతుంది. ఇంతకూ ఆ కవిత పేరు చెప్పనే లేదు కదూ.. ‘రెండో దీపం’ దీని శీర్షిక. ఇది ‘నల్ల చామంతి’ కవితా సంపుటిలోనిది. ఈ కవి చిత్తలూరి సత్యనారాయణ. కొనే్నళ్లుగా కవిత్వ రచనలో ఆరితేరినతనం ఇతని రచనాశైలిలో కనిపిస్తుంది. ఇది ఇతని రెండో కవితా సంపుటి. ‘మా నాయిన’ మొదటి పుస్తకం. ‘లూరీ’లు పేరుతో ‘మినీ కవితల’ను అల్లిన నేర్పు ఇప్పటికీ సొంతమైంది. వీటికి తోడు కథా రచయిత కూడా. ఇంకా చెప్పాల్సిందంతా కవిత్వంలో అక్షరీకరించాడు.
‘అనంతకోటి అక్షరాలలో /నేనూ ఒక అక్షరమవుదామని /గుండె గూటిలోంచి /ఒక పావురాన్నితోడి /దోసిలితో ఆకాశంలోకి వొంపాను’ అని అంటున్నపుడు ఒక సుతారమైన స్పర్శేదో సుతిమెత్తగా మనసుని ఆలింగం చేసుకుంటుంది.
‘దశాబ్దాల నిరీక్షణ తరువాత’ కవితలో కవి సత్యనారాయణ చెప్పినట్టుగానే- ‘‘సూర్యుడి వెలుగులో / చెరవీడిన చంద్రబింబం / ఇక లోకంతో /సంభాషణ మొదలైంది’’ అంటాడు. ఆధునిక కవిత్వ రూప నిర్మాణం విషయానికొస్తే.. కొత్త పరవళ్ళు అనేకం తారసపడుతుంటాయి. ఈ కోవకి చెందిన ఒడుపులోంచే, ధ్వని ప్రధానమైన ఈ వ్యక్తీకరణ సాధ్యపడింది.
‘‘ఎగరలేక ఎగరలేక ఎగురుతున్న / సీతాకోక చిలుక / ఇపుడు హాయిగా ప్రకృతి ఆకాశాన్ని మీటుతోంది’’ అంటారు ఇంకోచోట. సరిగ్గా ఇక్కడే మేథోపరమైన ఆలోచనా మథనం అంతర్వీక్షణతో జీవితాన్ని బొమ్మ కట్టిస్తుంది. ‘మట్టిపూల మరణం’ కవితలో ‘కాయలు వేలాడాల్సిన / చెట్లకొమ్మలకు /తలకాయలు వేలాడుతున్నాయి / కరెంటుతీగలు / కాల సర్పాలై కాటేస్తున్నాయి’ అని చెప్పడం వెనుక ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు స్థితిగతుల రూపంలో కళ్ళముందు కదలాడతాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్న దుస్థితికి, బాగోగులకి అద్దంపట్టే రచన ఇది. రాజకీయ కోణం దృష్టిలో దీనిని అవగతంచేసుకుని, అక్షరీకరించారు సత్యనారాయణ.
‘మా అమ్మ చేతులు’ కవితలో కవితాభివ్యక్తిని సాధారణ వాక్యాల్లో ధ్వనింపజేశారు చిత్తలూరి. ‘‘అందరికీ అన్నీ ఊడ్చిపెట్టి /తనకంటూ ఏమీ మిగుల్చుకోని /ఖాళీ గినె్నలు మా అమ్మ చేతులు /నేను ఉంగరం చేయించే సరికల్లా /చాకిరి చేసీ చేసీ /మా అమ్మ చేతివేళ్ళన్నీ అరిగిపోయాయి’’ అంటున్నపుడు రూపుకట్టే వేదన వర్ణనాతీమైనది. అగ్నిగుండం సుళ్ళు కట్టలు తెంచుకొని మనసులోతుల్లోంచి ధారకట్టి వరదగా ప్రవహిస్తాయి. అమ్మ త్యాగం ముందు సృష్టిలో ఏ బంధమైనా ప్రతిబింబమైపోతుంది. ఇలా ఈ కవి రాసిన 75 కవితలూ విభిన్న సామాజిక జీవన పార్శ్వాల్లోంచి ఊపిరిపోసుకున్నవే. వస్తుపరమైన శైలికి అనుగుణంగా కవితాత్మతో ఉట్టిపడే సందర్భ వాక్య నిర్మాణాలు కోకొల్లలు. వీటిలో గుండె చప్పుడు కదిలించి కరిగించి వేస్తాయి. శీర్షికలలో వైవిధ్యంతో కూడిన కొత్తదనం దర్శనమిస్తుంది. వీటిలో ‘రెప్పలు లేని కన్ను’, ‘పుస్తకాలమధ్య ఒక రాత్రి’, ‘ఖాళీ గదుల్ని చేసుకొని’, ‘కలలెగిరిపోయాక’ చెప్పుకోదగినవి. బహుబుఖ పార్శ్వాల్ని పొదివి పట్టుకోవడంలో చిత్తలూరి సత్యనారాయణది అందవేసిన చెయ్యి. పలు రకాల అంశాలను కవితా వస్తువులుగా స్వీకరించడంలో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తాడు. చిత్తలూరి చేసిన ఈ బహుముఖ కృషిని అభినందిస్తూ, రాబోయే కాలంలో మరిన్ని కవితా సంపుటులతో పాఠకుల్ని అలరిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910