పఠనీయం

వాస్తవిక వాద కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదహారణాల బాల్యం (కథానికలు)
-సింహప్రసాద్
వెల: రూ.100
ప్రతులకు: శ్రీశ్రీ ప్రచురణలు
401 మయూరి ఎస్టేట్స్ కె.పి.హెచ్.బి. కాలనీ హైదరాబాద్-85

** ** ****************

సమకాలీన సాహితీస్రష్టలలో సింహప్రసాద్ ముందు వరుసలో ఉంటారు. 300 పైగా కథలు, 60కి పైగా నవలలు రాశారు. వీరు రాసిన హిందూ వివాహం, జీవన విధానం మరియు జీవన విశిష్టతలను తెలిపే ‘వివాహ వేదం’ ఈ విషయంపై ‘విజ్ఞాన సర్వస్వం’గా పేర్కొనవచ్చును. నేటి సమాజపు నడతను ‘హైలైట్’ చేస్తూ, ఆ నడతలోని లోటుపాట్లు, సంఘర్షణలు, పరిణామాలు, పరిష్కారాలు వీరి రచనల్లో కనగలుగుతాము. ‘కథానికా భీష్ముడు’, ఈ మధ్యనే దివంగతుడైన మునిపల్లె రాజుగారిచే ‘పరిణతి తాత్త్విక వికాసం, జీవిత పరమార్థ దర్శనం వాస్తవిక వాదం కనిపిస్తూ అలరించే రచనలు’ అని ప్రశంసలందుకున్న ఈ రచయిత పనె్నండవ కథాసంకలనం ‘పదహారణాల బాల్యం’. ఇందులో పందొమ్మిది కథలు, మరియు ఇండియన్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ వార్షికోత్సవ సందర్భంగా రాసిన ‘సెకండ్ ఇన్నింగ్స్’ అనే సుదీర్ఘ వ్యాసం ఉన్నాయి. ఇవన్నీ పలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడి పాఠకుల మెప్పునందుకున్నవి కావటం గమనార్హం.
ఎంతటి పేరు ప్రతిష్ట, సంపద ఉన్నా, నేటికాలం స్ర్తిని అబలగానే చూస్తున్నదనీ, ప్రతిఘటించితే తప్ప ప్రయోజనం ఉండదని ‘ఉప్పెన’ కథ చెబుతుంది.
‘తన మీద కొండంత ధయిర్యంతో, నమ్మకంతో తన కడుపున పడిందీ బిడ్డ. వీడిని ఎలాగైనా భూమీద పడెయ్యాల’ అన్న దృఢ నిశ్చయంతో, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను ఈది అవతల గట్టున ఉన్న ఆసుపత్రికి చేరింది ఎల్లవ్వ. తన ధైర్యమే తనకు శ్రీరామరక్ష కాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంకల్పం గట్టిదయితే, సాధించలేనిది ఏదీ లేదని ‘బొడ్డుతాడు’ కథ చెబుతుంది.
వాస్తవికత, కాల్పనికత - ఈ రెంటినీ జోడించి రాసిన కథ ‘గీటురాళ్లు’. పిన్న వయసులోనే శాన్వి ఛార్టెర్డ్ ఎకౌంటెన్సీ మరియు బీ.కాం. పాసవుతుంది. ‘వికాస తరంగిణి’ అనే సంస్థ ఆమెనూ, ఆమె తండ్రినీ అభినందించడానికి సభ ఏర్పాటు చేస్తారు. ముఖ్య అతిథిగా వచ్చిన సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ గారు సభ నుద్దేశిస్తూ ‘లక్ష్య సాధనలో మూడు ‘గీటురాళ్లు’ ఉంటాయని, వాటికి నిలబడగలగటమే నిజమైన విజయం’ అంటారు. ఆ ఉద్బోధనకు ప్రేరితురాలై, మూడు గీటురాళ్ల పరీక్షకు నిలుస్తుంది శాన్వి. నేటి విద్యార్థులకు గొప్ప సందేశం ఇచ్చే ‘గీటురాళ్లు’.
డబ్బూ, దస్కం, మంచి ఉద్యోగం, అమెరికా అవకాశం ఉన్న సంబంధం అది. తల్లీ, తండ్రీ, మేనమామ - అందరూ ‘్ఫస్ట్‌క్లాస్ సంబంధం’ అంటూ సర్టిఫై చేస్తారు. అయినా, సులోచన ఆ సంబంధాన్ని తిరస్కరిస్తుంది. కారణం - సులోచన ఆ సంబంధంతో తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కనుక. ఎంతటి ‘మంచి సంబంధం’ అయినా తన అస్తిత్వం కోల్పోతూ బ్రతకకూడదని చెబుతుంది ఈ కథ. మార్కెటింగ్ ‘మాయాజాలం’ ఈనాడు ప్రపంచమంతా ఆవహించిందని, ఎనిమిదేళ్ల పాపను కూడా, ఈ మార్కెటింగ్ మాయాజాలం క్రమ్మేసిందని ‘మాయాజాలం’ కథ వివరిస్తుంది. ‘వైఫ్ కన్నా వైఫీ ముఖ్యం’ అనుకునే ఈ రోజుల్లో పచ్చని ప్రపంచం, వాతావరణం, పరిశుభ్రమైన గాలి ఉన్న పల్లెటూరి సంపన్న సంబంధంతో కోడలు వినూష, భర్తతోను మామగారితోనూ విభేదించి మరుగుదొడ్డి కట్టిస్తుంది. ప్రస్తుత పి.ఎం. మోదీగారి ప్రబోధం వినూషతో ‘సత్యభామ సాహసం’ చేయిస్తుంది ‘ఆత్మగౌరవం’ కథలో. పల్లెటూరి సమాజానికి తన కథ ద్వారా గొప్ప సందేశమిస్తాడు రచయిత.
ఇంటి గడప దాటకుండా తన రోజువారీ కార్యక్రమంలో, రోజూ మూడు మైళ్లు నడుస్తుందట ‘ఒక సాధారణ గృహిణి’! సుమ ఒక సాధారణ గృహిణి. అందరినీ సంతోషపెట్టాలన్న తపనతో అందరి పనులూ, తన నెత్తిన వేసుకునే స్వభావం ఆమెది. హైదరాబాదు మహానగరంలో అగ్గిపెట్టె లాంటి టూ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లోకి పెద్దబ్బాయి, కోడలు, ఇద్దరు పిల్లలు, అమ్మాయి, అల్లుడు, ముగ్గురు పిల్లలు, కడుపుతో ఉన్న చిన్నకోడలు వెరసి పనె్నండు మంది ఉంటారు. వీరందరినీ చూసుకోలేక, వారి గొంతెమ్మ కోర్కెలు కాదనలేక నలిగిపోతూ చివరకు ‘నెర్వస్ బ్రేక్‌డౌన్’కు గురవుతుంది. పిల్లలు ‘అయ్యో పాపం’ అనరు సరికదా - ‘చాదస్తం జాస్తి. అన్నీ తనే చెయ్యాలనుకుంటుంది’ అంటూ ఆక్షేపిస్తారు. ‘నిలువుదోపిడి’ కథలోని ఈ సుమను చదివాక పాఠకుడు బోలెడంత సానుభూతి కురిపిస్తాడు సుమ పట్ల. యధాతథంగా కథ ముగించకుండా పరిష్కారం చూపిస్తే మరింత బావుండేదేమో!
ఎన్నుకున్న సబ్జెక్ట్స్, వివరించే తీరు, రెండూ బావున్న ఈ కథలు, సీనియర్ సిటిజన్స్‌కు పనికివచ్చే ‘సెకండ్ ఇన్నింగ్స్!’ వ్యాసము చెలంకూరి నరసింహ ప్రసాద్ (సింహప్రసాద్) గారి కథారచన పటిమ పాఠకులను ముగ్ధులను చేస్తుంది.

-కూర చిదంబరం 8639338675