పఠనీయం

వాక్కుల వరమాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ అరుణాచల అక్షర మణిమాల
అర్థ తాత్పర్య సహిత పద్యకృతి; తమిళ మూలం: శ్రీ భగవాన్ రమణ మహర్షి;
తెలుగుసేత: ఒక రమణ భక్తుడు, డి.వి.ఎస్.శాస్ర్తీ,
పుటలు:160, వెల:రూ.100/-,
ప్రచురణ: రమణ భక్తమండలి ట్రస్టు, బెంగుళూరు ప్రతులకు:
డా. దోనేడి నరేష్‌బాబు,
శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం, జూలేపల్లి-518674, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా
=====================================================================
‘నీ పాద కమల సేవయు / నీ పాదార్చకులతోడి నెయ్యము నితాం /తాపార భూతదయయును /తాపస మందారనాకు దయసేయగదే’ అన్న పోతన్న యొక్క భూతదయాపూర్వక భగవద్భక్తిని త్రికరణశుద్ధిగా ఆచరించి చూపిన ఆధునిక మహర్షి అరుణాచల శ్రీ రమణులు. వారు తమిళంలో రాసిన 108 ద్విపదల భక్తిరచన ‘శ్రీ అరుణాచల అక్షర మణమాల’. దీనిని ఇటీవల ఒక రమణభక్తుడు (పేరు పేర్కొనలేదు), డి.వి.ఎస్.శాస్ర్తీగారు కలసి ప్రతిపదార్థ, తాత్పర్య, వాఖ్యాన సహితంగా తెలుగులో అందించారు.
ఇంతకుముందు తమిళ మూలానికి ఆంగ్లంలో ప్రతిపదార్థం శ్రీ సాధు ఓం గారు, తాత్పర్యాదులు మైఖేల్ జేమ్స్‌గారు రాశారు. వారి రచనయే ఈ తెలుగు సేతకు ఆధారం.
భారతీయ, ఆధ్యాత్మిక, పౌరాణిక, ఖగోళాది వాఙ్మయాలలోను, గణితశాస్త్రంలోను 108 సంఖ్యకు విశిష్టస్థానము, పవిత్రతా భావమూ ఉన్నాయి. ఉదాహరణకు మనిషి తనలోని దైవత్వాన్ని గ్రహించటానికి 108 మెట్లు దాటాలి అని అన్ని ప్రాచ్య మతాలవారి సిద్ధాంతం. ఆ సంఖ్య భగవంతునికీ భక్తునికీ మధ్య అనుసంధాన కారకమని భారతీయ తాత్విక వాఙ్మయం చెప్తుంది. ఇది తెలిసే రమణులు ఈ కృతిని 108 ద్విపదలలో కూర్చారు.
పంచభూత మహాలింగాలలోని తేజో లింగం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు. శైలాకారంలో వున్న అరుణాచల భగవద్రూపాన్ని మమైకభావంతో ఆరాధిస్తూ భగవాన్ రమణ మహర్షి ఈ తన ద్విపద గ్రంథంలో ఆ దేవునితో సంభాషిస్తారు కవితా భావాత్మకంగా. అక్షరములు అంటే వాక్కులు అనే అర్థం కూడా వుంది. మణమాల అంటే వరమాల. శ్రేష్ఠమైన మాల అని భావం. ఇందులోని వాగక్షరమాలలో రమణులవారి అచంచల భక్త్భివాలు ఒక ప్రవాహంలా సాగిపోతాయి.
78వ పుటలోని ‘వెదలై వాష్‌త్తావైత్...’ అనే ద్విపదలో ‘ఓ అరుణాచలా! నీటిలో మంచువలె ప్రేమ స్వరూపుడవైన నీలో ప్రేమగా నన్ను కరగునట్లు చేయుము’ అనటంలోని భావం మనోహరం. మంచు కరగి నీటితో ఏకమైతే అది తన వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను కోల్పోతుంది. అలాగే చిత్తము ఆత్మలో లీనమైతే అహంకారం కోల్పోతుంది. సత్తు అంటే సత్యం. అంటే భగవంతుడు. అదే సత్త్వం. ‘సత్త్వం’లో ఆ‘తత్త్వం’లో జీవాత్మ కలసిపోయి ‘అద్వైతం’ అయిపోతుంది, సాధన చేస్తే. ఇంత మనోజ్ఞ ఉపమా సౌందర్యం తోడి వ్యాఖ్యానాలు కూడా ఇందులోని ప్రతి ద్విపదలోనూ కనిపిస్తాయి.
31వ పుటలోని ‘సోమ్‌బి-యాయ్‌చ్ సుమ్మా సుక్..’ అనే ద్విపదలో ‘‘ఓ అరుణాచలా! నీపాటికి నీవు- ఒక సోమరిలాగా-నీవు నీ ఆత్మానందాన్ని అనుభవిస్తూ నన్ను, నా ఆర్తిని పట్టించుకోకుండా (యోగ)నిద్రలో ఉండిపోతే ఇక నా గతి ఏమిటి?’’ అంటూ భగవంతుడిని అతి చనువుతో, ‘వ్యాజనింద’తో ప్రశ్నించిన రమణుల వాక్యంలోని గంభీర భావం కేవలం నిశిత ఆలోచనామథనం, వ్యాఖ్యానాలకే అంది ఒక కవితానుభూతిని కలిగిస్తుంది.
15వ పుటలోని ‘గిరి-యురువాగియ కిరుపైక్..’ అనే ద్విపదలో ‘కొండ రూపంలో వున్న కరుణా సముద్రమా!’ అని సంబోధిస్తారు రమణులు అరుణాచలాన్ని. ఇలా భిన్న లక్షణాలను ఒకేచోట విక్షేపించటం రావణుని శివతాండవ స్తోత్రంలోని ‘దృషద్విచిత్ర తల్ప యోర్భుజంగ వౌక్తిక ప్రజోః’ అనే శ్లోకాన్ని స్ఫురింపచేస్తుంది. కఠిన శిలామయపు కొండేమో కరగనిది. కానీ ఆ కొండ దయ అనే ఒక ద్రవనిధిట. ఇది ఒక విరోధాభాసాలంకారం.
ఇందులోని 108 ద్విపదలూ అరుణాచలా అనే సంబోధనతోనే ముగుస్తాయి. కనుక ఇది చదివితే అరుణాచలేశ్వరుని ‘అష్టోత్తర’ స్మరణ రూప అర్చన అవుతుంది-్భక్తి భావానుభూతి పరంగా.
సరళ గ్రాంథికంలోనే అనువాదం ఉన్నది. కానీ పాఠకునికి అంతగా ధారాళ పఠనగ్రాహ్యంగా లేదు. పదాలు, వాక్య నిర్మాణం-ఈ రెండూ ఇనుమంత కృతకంగా వున్నాయి. మొత్తంమీద ఈ ‘అక్షర మణమాల’ (వాక్కుల వరమాల) కూడా రమణ మహర్షులు మనకు అందించిన భక్త సాహిత్యపు మణిపూసలలో ఒకటి.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290