పఠనీయం

బతుకు దృశ్యాల్ని బొమ్మకట్టించిన ‘మట్టిరంగు బొమ్మలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లె పదాల గుండె చప్పుళ్ళతో అక్షరం మొలకెత్తి, ప్రాంతీయ యాసతో గుభాళించినపుడు ఆ కవిత్వ స్పర్శే వేరు. తారసపడిన ప్రతి సందర్భాన్నీ అనుభవ లోతులతో ఒడిసి పట్టుకుంటుంది. అలా రాటుదేలిన అక్షరశ్వాసే ఈ ‘మట్టిరంగు బొమ్మలు’ కవితా సంపుటి. దీని కవి ఉత్తరాంధ్ర పోరాట బతుకు ముఖచిత్రం సిరికి స్వామినాయుడు. డెబ్భై కవితలతో ఊపిరి పోసుకున్న ఈ మాండలిక ప్రాంతీయ అస్తిత్వ ఆర్తి జనజీవాలను పోషించడంలో తనదైన ప్రత్యేక ముద్రను వేసుకుంది. గతంలో ‘మంటి దివ్య’తో సుపరిచితమైన ఈ అక్షరకారుడికి వచనప్రాయమైన కవిత్వనిర్మాణ శైలి సహజంగానే ఒంటపట్టింది. స్థానిక సమస్యలను లోతైన చూపుతో పరిశీలించి, సరళ భాషలో వ్యక్తీకరించడంలో అందెవేసినచెయ్యి ఇతనిది. దీనికి కేంద్రంగా మట్టిరంగు జన జీవన ఘోషనే ప్రతిబింబించడం మొదలుపెట్టాడు.
‘‘పచ్చని యింటిలోకి/ గుడ్లగూబలు దూరినట్టు / నాగరితా ముగేసుకొని / మాది కాని తనదేమో మాగూడల్లోకి చొరబడినప్పటినుండే/ మా ఆదివాసీ బతుకులు మరింత అల్లకల్లోలమైపోయాయి’’ అంటాడు ‘దుర్ల’ అనే కవితలో. ‘సమూహం’ అర్థం వచ్చే ఈ భావజాల తిరుగుబాటు కవిత్వంలో.. తుడుంకొట్టి, సన్నాయి ఊపి, థింసాలాడే.. ఆకుపచ్చని ఆదివాసీ బతుకుల్లో, నవనాగరికతా ముసుగులో విధ్వంసం తొంగిచూసి, దురాక్రమణ జరిపే పెత్తందారులపై.. ఒక సుదీర్ఘ యుద్ధ నిరసనను ప్రకటిస్తాడు కవి స్వామినాయుడు. ‘ఆది నుండీ అడవి ఒక యుద్ధ క్షేత్రం’ అని నొక్కి చెప్పడంలో ఒక జీవన విషాద వాస్తవికత నిలువెత్తు దోపిడీగా తొంగిచూస్తుంది.
‘‘జాలరి వాడ మీద నీలిజెండా’’ అన్న కవితలో వర్తమాన సంక్షోభిత కల్లోల బతుకుల్ని చాలా ఆవేశపూరితంగా చిత్రిస్తాడు కవి.
‘‘మీరు కొల్లగొట్టిన సముద్రం ఒట్టిపోయి/ మా కళ్లలోంచి కురుస్తోంది/ కనిపించని హోరు కెరటాల అలజడై/ మా గుండెల్లో ధ్వనిస్తోంది/ సముద్రం మా సామూహిక స్వప్నం
సముద్రం మా జాలరివాడమీద ఎగిరే నీలి జెండా’’ అని అంటున్నపుడు.. మత్స్యకారుల జీవితాల్లో తొంగిచూస్తున్న అభద్రతాభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘‘పంట పొలాల మీద/ ఏ మిడతల దండు దాడి జేసిందో/ తన పచ్చని బతుకును/ యే పెట్టుబడి కొల్లగొట్టిందో/ అతని ముఖంమీద చీకటి రెక్క విప్పింది’’ అంటాడు ‘బందీ’ కవితలో ఒకచోట. పెట్టుబడిదారీ సమాజం వేళ్ళూనికొని జడలు విప్పినంత కాలమూ రాజకీయ వ్యవస్థలో మార్పు రానంతవరకూ.. నేల చూపులు చూస్తున్న రైతన్న నాగేటి కర్ర ఎప్పటికీ విషాదగీతానే్న ఆలపిస్తుంది. ‘‘యుద్ధం సోకని నేల కోసం’’ శీర్షికలో ఒక చోట ఇలా అంటాడు-
‘‘కన్నీళ్లు కళ్లాపి చల్లి/ తూరుపు ముగ్గు బుట్టలోంచి/ కాసింత వెలుగు పిండితో ముగ్గేసి/ పూలదీపాలు వెలిగించి/ యుద్ధం సోకని నేలకోసం/ కళ్లను కాగడాలను జేసి కాలం ఎదురుచూస్తోంది’’ అని చెబుతున్నపుడు ఎడతెగని దుఃఖమే గుండెలోతుల్లోంచి పొంగుకొస్తుంది. నేల నలుచెరుగులా గుత్త్ధాపత్యం నీడలు నిఘా నేత్రాలతో సంకెళ్లు వేసి, నిషేధాజ్ఞలను పరుస్తుంటే.. అస్తిత్వం ఉనికికే ముప్పు వాటిల్లి భవిష్యత్తును భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ దృశ్యానే్న ఆర్ద్రపూరితంగా చెబుతాడు కవి.
‘రుతువుల కొమ్మలమీద /రాగాలు పాడే మట్టిగువ్వలు’ అన్నపుడూ.. ‘‘ప్రాణాలు రెండూ ఫలమాడే నాగుల్లా /ఒకే దేహమై ముచ్చట్లాడుకుంటాయి’’ అని పలికినపుడూ..‘‘నేల కొమ్మకు మెతుకు పూయదు కానీ’’ చెప్పినపుడూ.. ‘‘రైతులేని రాజధాని / మీకు భూతల స్వర్గమేమో గానీ /మాకు మాత్రం భూతాల స్వర్గమే’’ అంటూ నిర్వచించినపుడు కానీ.. స్వరం ఒకటే. ఆలోచనలు వేర్వేరు. ‘‘శతృ శిబిరాల్లా యుద్ధ మేఘాలు’’, ‘‘వాళ్ళ కళ్ళలోయల్లోంచి /వాగు పొంగుతూనే ఉంది’’, ‘‘ఒక ఎడబాటు / ఎడారి మీద ఒంటరితనాన్ని మోస్తూ’’, ‘‘బతుకు తీరం పొడుగునా / మనం కలిసి నడిచిన /జ్ఞాపకాల పాదముద్రలు’, కవిలో దాగిన పల్లె వాసనల పవరింపులు బాధలుగా గాధలుగా కళ్ళముందు మెదులుతుంటాయి. శీర్షికల్లో నల్లకలువల నెత్తుటిదారుల్లో, అడవుల్ని అరుణపతాకాలు జేసీ, నేల ఒక అద్దె గర్భం, వెదుర పొదల యుద్ధ రహస్యం, దేహం ఓ కల్లోలిత ప్రాంతమై, నిత్యగాయాల నెలవంక, కూలిపిట్టల కన్నీటి పాట, గోడకు ఆవల సముద్రం వైవిధ్యపూరితమైనవి. ‘మట్టిరంగుల బొమ్మలు’ని బొమ్మ కట్టించిన కవి సిరికి స్వామినాయుడు కృషి ఎప్పటికీ అభినందనీయమే.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910