పఠనీయం

దుఃఖం నదిలో ఈదే చేపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీళ్ళల్లోని చేప (పొయిట్రీ)
రచన: బాల సుధాకర్ వౌళి, ఎస్‌బిఐ దగ్గర, బోయ స్ట్రీట్, నెల్లిమర్ల, విజయ నగరం-535217. వెల:రూ.120/-,
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, అనేకా. ఫోన్:9676493680, 9505646046.
--------------------------------------------------------------------------------------------------------------
కన్నతల్లిని, జన్మభూమిని వర్ణించడానికి కవులకు కూడా శక్తి చాలదు. ఊరంటే కొన్ని కట్టడాల సమూహం కాదు. ఊళ్ళో పుట్టిన ప్రతివారికీ అక్కడి మట్టితో, అక్కడి నీటితో, అక్కడి గాలితో విడదీయలేని అనుబంధం వుంటుంది. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఊరొదిలి వెళ్లడానికి మనిషి ఇష్టపడడు. గత్యంతరం లేని పరిస్థితిలో ఊరిని వదిలిపెట్టినా ఆ దుఃఖం ఆజన్మాంతం మానవుణ్ణి వదిలిపెట్టదు. మానని గాయం గుండెల్లో సలపరిస్తూనే వుంటుంది.
అలాంటి వలస జీవుల వ్యధలకు చిత్రిక పట్టిన కవితా సంపుటి ‘నీళ్లలోని చేప’. స్వాతంత్య్రం వచ్చి ఎనే్నళ్లైనా సమాజంలో ధనిక బీద తారతమ్యాలు తగ్గపోవడం, ప్రపంచీకరణ ప్రభావం, ఎండిపోతున్న నదులు, ఎన్‌కౌంటర్ల పేరిట హత్యలు, ప్రజాస్వామ్యం ముసుగులో కాషాయం క్రీనీడలు, చిన్నారి పిల్లలపై అత్యాచారాలు, అన్నదాతలపై అఘాయిత్యాలు, నానాటికీ మానవత్వం కోల్పోతున్న మనిషి ఇవన్నీ కవి మనసును కలవరపరచాయి.
తనలో రగులుతున్న అసంతృప్త లావాగ్నిని అక్షర రూపంలో ఆవిష్కరించిన బాలసుధాకర వౌళి కవిత్వ ప్రేమికులకు అపరిచితుడేమీ కాదు. అంతకుముందే ప్రచురించిన ‘ఎగరాల్సిన సమయం’, ‘ఆకు కదలని చోట’ కవితా సంపుటాలతో పాఠక హృదయాలలో చిరస్థానం సంపాదించినవాడే. ఇప్పుడు ‘నీళ్లలోని చేప’తో మన ముందుకు వచ్చాడు.
అతడికి తన లక్ష్యమేమిటో తెలుసు. దానికి సూటిగా గురిపెట్టడమూ తెలుసు. ఊరొదిలి వచ్చిన దుఃఖం తన గుండెను పట్టి పల్లారుస్తుంటే ‘ఒక వానాకాలం కథ’లో ‘ఊరు దాటొచ్చారా /చీకటి వుంది ఆకలి వుంది వర్షమూ వుంది / నిశ్శబ్దం గొంతు వానలో కూరిపోతుంది’ అని ఆ దుఃఖ తీవ్రతను అక్షరీకరిస్తాడు. కురుస్తున్న వాన నుంచి ఇంట్లో వాళ్లని కాపాడలేని పూరి గుడిసె, ఆ పాకలో వలస వచ్చిన కుటుంబం. పిల్లల ఆకలిని తీర్చడానికి, తన ఆకలిని తీర్చుకోలేని అమ్మ. మొత్తం విషాదాన్నంతా చూరునుంచి కురిసే వర్షంలా పాఠకుల గుండెల్లో కురిపిస్తాడు. ఇపుడు అనేక కారణాలవలన గలగలా ప్రవహించే జీవనదులు నీళ్లింకిన మృతనదులుగా మారిపోతున్నాయి. అలాంటి వాటిలో చంపావతి నది ఒకటి. ‘చంపావతి నుంచి’లో ‘మృతశరీరంలా వుంది నది / చంపావతిలో నీళ్లేవి / పంట పొలాల్లో పున్నమేది / వలసెళ్లిపోతున్న వూళ్లల్లో మనుషులేరి’ అని నిగ్గదీస్తున్నాడు కవి.
ఏలిన వారికి వ్యతిరేకంగా గొంతెత్తినా, రాసినా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. ఒక్కొక్క సందర్భంలో దేశద్రోహచర్యలకు పాల్పడుతున్నారని అమాయకులను చెరసాలలో పట్టి బంధిస్తుంది. ‘నజీబ్ తల్లి’లో ‘ఆచూకీ లేని కుమారుడు / ఏ చెరలో ఉన్నాడో/ బతికున్నాడో లేదో’ అని బాధపడుతుంది తల్లి.
‘నిర్భయ’ చట్టం వచ్చినా మూడేళ్ల పసిమొగ్గులనుంచి ముడుతలు పడిన ముదివగ్గులపైనా అత్యాచారాలు నిర్భయంగా జరిగిపోతూనే వున్నాయి. ఇటీవలి ఆసిఫా వృత్తింతంమీద రాయని కవి లేడు. కానీ ‘ఇప్పుడు’లో ఆ సంఘటనకు చలించిపోయిన కవి ‘పువ్వులాంటి / ఎనిమిదేళ్ల పిల్లని / చిదిమిన చేతుల్లో / ఎక్కడ / నా చెయ్యుందేమోనని భయం’ అని అంటూ ‘నాకు చేతులున్నందుకు తొలిసారిగా సిగ్గుపడుతున్నాను’ అని చిదిమేసిన పురుషులలో తానూ ఒకడైనందుకు బాధపడతాడు.
నోట్ల రద్దు చేసినపుడు ధనవంతులు బాగానే ఉన్నారు కానీ నిరుపేదలు చాలామంది సమయానికి డబ్బులు దొరక్క మరణించారు. దీనిపై స్పందిస్తూ ‘ఏం మారలేదు’లో ‘శీతల గదులలో / తెల్లని దూది పరుపుపై /బోరవిరుస్తూ రూపాయి / చెమటల ఉక్కపోతల్లో నడిరోడ్డుపై /బోర్లాపడుతూ రూపాయి /ఒకటి దేహానిది /రెండు దేశానిది’ అని వాస్తవ స్థితిని బొమ్మకట్టిస్తాడు కవి.
వౌళి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తరగతి గది అన్నా, విద్యార్థులన్నా పంచప్రాణాలు. పిల్లలు రాసిన కవితలతో ‘స్వప్నసాధకులు’ ప్రచురించాడు. పిల్లల గురించి ‘పిల్లలు’ అనే కవితలో ‘పిల్లల్లో /ఒక లౌకిక దేశం / ఒక అలౌకిక స్వప్నం /మళ్లీ మళ్లీ పుడుతూ వుంటుంది’ అని పిల్లలు ఒక లౌకిక దేశాన్ని నిర్మిస్తారని, ఒక అలౌకిక స్వప్నాన్ని నిజం చేస్తారని అంటాడు.
ఈ సంపుటిలో ‘తూత్తుకుడి’, ‘నేను లేని తరగతి గది’, ‘శివారెడ్డి’, ‘అనగనగా ఒక ఆవు’, ‘మాయావృక్షం’, ‘పొలంయాత్ర’, ‘నాన్నొచ్చే సందర్భం’ కవితలు ప్రభావశీలమైన కవితలు. ముఖపత్ర కవిత ‘నీళ్లలోని చేప’లో చేపల వేటగాడు.. ‘గాయలతో చేపలు /విలవిలలాడుతుంటే / కనువిందు చేసుకున్నాడు / మరణించిన చేపలపై / మాయాప్రకటన చేస్తున్నాడు / ఎప్పుడైనా /ఎక్కడైనా /ఏటికి ఎదురీదడమే చేపలకు తెలుసు’ అని అన్యాయాలను ఎదిరించే వారిని గూర్చి చెప్తాడు.వౌళికి కవిత్వ నిర్మాణ రహస్యం తెలుసు. ఎలా మొదలుపెట్టాలో ఎక్కడ పూర్తిచేయాలో తెలుసు. పిల్లలు, కవిత్వం రెండు కళ్ళైన వౌళికి కవిత్వం కాలక్షేపం కోసం కాదు. ప్రపంచ కవుల కవితలను అధ్యయనం చేసి ఈ కవి మరింత వస్తు వైవిధ్యంతో, పదునెక్కిన సరళమైన భాషతో ఎన్నో సంపుటాలు రచించాలి.

-మందరపు హైమావతి