పఠనీయం

పైకి కనిపించని లోపలి వర్ణమే ‘ఎనిమిదో రంగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిదో రంగు- కవితా సంపుటి, - అనిల్ డ్యాని,
వెల: రూ.100/- ప్రతులకు: సాహితి మిత్రులు, 28-10-16, అరండల్‌పేట, కార్ల్‌మార్క్స్ రోడ్, విజయవాడ,
ఫోన్:0866-2433359
============================================================
కవిత్వంలో పరచుకున్న రంగులన్నీ దోసిలిపట్టి మనసులోకి వొంపితే జారే అక్షర ప్రపంచమే ఈ ‘ఎనిమిదో రంగు’ కవితా సంపుటి. దీని కవి అనిల్ డ్యాని. 37 కవితల శీర్షికలతో ఆసాంతం కవిత్వమయం చేసే పరుసవేది విద్యను ఆకళింపు చేసుకున్న ఒడుపు ఇతని సొంతం. వీటిలో రెండు అనువాద కవితలున్నాయి. దేనిని కదిపినా.. ఒక ప్రత్యేకమైన గొంతు రసమయ ధ్వనితో మనల్ని పలకరిస్తుంది. ప్రతీకల తడితో సారవంతం చేస్తుంది. బొట్టు బొట్టుగా రాలే వాక్య స్పర్శ చదివిన ప్రతిసారీ కదిలిస్తుంది. ఈ లక్షణాన్ని, ముఖ్య భూమికగా చేసుకుని.. నడిచే కాలంతో పరిగెత్తి పారిపోతుంటాడు కవి. ‘‘నింగి నగ్న దేహంపై ఏడురంగులు / నల్ల ద్రాక్ష పందిరంతటి కుటీరం లోపల / గదినిండా మాయా వెలుతురు / దేహాలనిండా పరచుకున్న ఎనిమిదో రంగు ప్రేమ’’ అని అంటున్నపుడు.. దుఃఖాగ్రహంతో వెల్లువెత్తిన కపట స్పర్శను ప్రేమ పేరుతో లాఘవంగా ఒడిసి పట్టుకుంటాడు అనిల్ డ్యాని. మనసులోపల సుడులు తిరుగుతున్న ఏడురంగుల నకిలీ పార్శ్వాలను యాస మాండలికంలో తూర్పారబడతాడు. మోసానికి దేహాల మధ్య తొంగిచూసే అసలు వర్ణ రహస్యాన్ని అనే్వషించి నిజానిజాల్ని సానపెట్టే పనిలో మునిగితేలుతాడు. ఇందులో దాగిన అంతర్లీన భౌతిక సత్యం అంటరానితనం వెనుక దాగిన అక్షర సత్యాల్ని వెతికి తవ్వి తీస్తుంది.
‘‘చూరు కింద చినుకులకి /రాత్రంతా చీకటి తడుస్తూనే ఉంది / వెలుతురు పెంచుకున్న దీపం దగ్గర / నేల చలి కాచుకుంటుంది’’ అంటాడు ‘వానరాత్రి’ అనే కవితలో.. గాఢత తీవ్రస్థాయికి చేరినపుడు అనుభవించే మానసిక సంఘర్షణ వాన కురిసిన రాత్రి రూపంలో, చీకటికీ - నేలకీ మధ్య చప్పుడు చేస్తూ.. చలి కాచుకునే ఉంటుంది.
‘గాయపడ్డవాడా’ శీర్షికలో ఒక చోట.. ‘‘ఎంత మాయదీ గడిచిపోయిన కాలం / నల్లరేగడి మట్టి పంటని / ఆకాశపు చినుకుని / చెట్ల చివర్ల మంచుని / ఎదురుచూసిన దోసిలికి కాకుండా చేసింది’’ అంటూ నిందను కాలంమీదకి తోసినపుడు.. గతంకంటే వర్తమానమే ఎక్కువ మోసం చేసిందనే ఆలోచన.. మనసుని పురుగులా దొలుస్తుంది. ఇది పైకి కనిపించని దోపిడీతనాన్ని ఆరాతీస్తుంది. దగాతనాన్ని నిలదీస్తుంది.
‘‘అతను మిగిల్చిన పాటని / పగలంతా చెట్ల దేహాలపై / విశ్రమిస్తున్న పక్షులు పాడుకుంటాయి / రాత్రుళ్ళు మిణుగురులు / వంటికి పూసుకుని ఎగురుతాయి / అడవి చితుకుల నిప్పుల మీద / పాటై మోగేందుకు / డప్పులా చలి కాచుకుంటుంది’’ అంటాడు కవి ‘అతని పాట’ కవితలో. ఈ ఎత్తుగడలో నిప్పుకీ - తప్పుకీ వున్న అవినాభావ సంబంధాన్ని పాట రూపంలో ప్రతిబింబిస్తాడు డ్యాని. పాట శ్రమ జీవుల చైతన్యానికి ప్రతీక. అడవి చివుళ్ళ మంటల కదలికలకు ఈ అడుగుల చప్పుడు ఒక కుండ గుర్తు. దీనినే అక్షరబద్ధం చేస్తాడు కవి.
‘ఆమెతనం’లో ఆత్మభ్రమణం చేస్తూ సాగిపోతున్నపుడు తలెత్తిన సందేహం ఒక కఠిన సత్యాన్ని ప్రకటిస్తుంది.
‘‘్భభ్రమణ చప్పుడు గాజుల శబ్దమైన చోట / ఆమె ఇసుక రేణువులో దాగిన సముద్రం / అణచబడిన చోట మొలకెత్తే మరో వసంతం’’ అని భావ ప్రకటన చేసినపుడు.. తిరుగుబాటుతనం స్ర్తి రూపంలో సజీవత్వం దాల్చి, పోరాట కేంద్రానికి మూలబిందువుగా పెద్దపీట వేస్తాడు కవి. మనిషి ఆశలోని సజీవత్వాన్ని తట్టి లేపడానికి ఇదొక మచ్చుతునక. అణచివేతలో దాగివున్న ఉక్కపోతకి వర్తమాన నిలువుటద్దం. ‘‘సారెపై పచ్చి మట్టి గిర్రున / తిరుగుతున్నంతసేపూ / రైల్లో బిచ్చగాడి గొంతులో మొలిచిన పాట / రికార్డులా చెవిలో మ్రోగుతూనే ఉంది’’ అంటూ అసలు ‘నిజరూప దర్శనం’ చేయిస్తాడు డ్యాని. ఈ తిరగడం మూలాన మస్తిష్కంలోని అరల పొరల్లోని సంకుచిత బీభత్సాన్ని చాలా ఉద్వేగభరితంగా అక్షరీకరిస్తాడు.
ఇంకొన్ని చోట్ల కవిత్వాన్ని ముక్కలుగా పరుస్తూ వొంతులేసుకుంటూ వెళ్లిపోతుంటే.. ఆ శబ్ద హోరు వేరు.. ‘నిశ్శబ్దాన్ని ముక్కలు చేసి సర్రున దూసుకెళ్తుంది గాలి’, ‘వస్త్రాల పొరల మధ్య వెలుతురు లేని చీకటి’, ‘బిందువు చివర రక్తం జీరతో మెరిసే సంధ్య’, ‘కాలం పాదరసంపై జారుతున్న క్షణాల సాక్షిగా’ వంటి కవితాత్మక వాక్యాల స్పర్శ అక్కడక్కడా పాఠకుల్ని గిలిగింతలు పెడతాయి. ‘‘ఎక్కడో తూటా పేలిన శబ్దాన్ని / నీ ఇంటిలో వింటుంది చట్టం’, ‘‘ఒకే మంచంపై / రెండు ఏకాంతాల గుండె చప్పుళ్ళు / రెండు మనసుల మధ్య శత్రు దేశాలంత వౌనం’, ‘ఆకాశం మీదికి వెలుగొచ్చేసరికి / వీరుడి తుపాకీ మొనని ముద్దాడుతూ సీతాకోక చిలుక’, ‘గాయపడ్డ సూరీడు / నెత్తురు కక్కుకుంటూ రాలిపోయాడు’, ‘పుట్టుక రహస్యం తెలీనప్పుడు /దేహం ఒక్కసారే మరణించదు / రోజూ శరీరం గాయమవ్వాలి’ అని అంటాడు అనిల్ డ్యాని. శీర్షికల్లో.. ఒంటిరెక్క పక్షులు, వెలుతురు విరుగుతున్నశబ్దం, గాజు దేహాలు కొంచెం వైవిధ్యానికి చోటిస్తాయి.
ఇలా విభిన్నమైన ఇతివృత్త వస్తువులతో, సజీవమైన భాషతో, సహజమైన వ్యక్తీకరణతో ఈ కవిత్వం సాగిపోతుంది. ఇలా ఆధునిక కవిత్వాన్ని కొత్త చూపులో లోకానికి పరిచయం చేస్తున్న అనిల్ డ్యాని కృషిని మనసారా అభినందిస్తూ.. పాఠక ప్రపంచానికి చేరువ చేద్దాం.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910