పఠనీయం

మూడు తరాల కాలానికి నిలిచిన కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతోపదేశం కధలు- రచన: డి.కామేశ్వరి, వెల:రూ.150/-, ప్రతులకు: నవోదయ, నవచేతన విశాలాంధ్ర మరియు తెలుగు బుక్ హౌస్, హైదరాబాద్.
*
నిన్నటి తరం రచయిత్రులలో శ్రీమతి డి (దూర్వాసుల)కామేశ్వరి గారు ఒకరు. కాలపు వెల్లువలో కొట్టుకునిపోకుండా, కాలానికి అనుగుణంగా, తనను తాను మలుచుకుంటూ, 83 ఏళ్ళ వయసులో కూడా, ఇంకను ప్రజ్ఞాపూరితమైన కథలను రాస్తున్నారు.
‘గీతోపదేశం’ అనే ఈ కథల సంచికలో 17 కథలున్నాయి. వీటిలో కొన్ని అర్ధ శతాబ్దపు పాతవి కాగా, మరికొన్ని ఇటీవలే రాసినవి ఉన్నాయి. బి.ఏ పాసయ్యి, ఆనాటి బెల్‌బాటం పేంట్లు ధరించి, తండ్రి తేబోయే ఆరడుగుల ఆరపాదదళాయతాక్షుడి సంబంధం గురించి కలలుకంటూ కాలం వెళ్ళబుచ్చే రుక్మిణులున్నారు ఈ కధల్లో (ఇది జీవితం!). నిన్న మొన్న వచ్చిన సెల్‌ఫోనులు (ఆదిశక్తి) కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఓల్డ్ ఏజ్ హోంలు ఉన్నాయి (విలువలు మారాయి). ఆనాడే స్ర్తికి ఆర్థిక స్వాతంత్య్రం అమూల్యం అని చెప్పటం (ఇదీ జీవితం), నేడు మన ప్రధానమంత్రి మోదీగారు ప్రబోధించే స్వచ్ఛ్భారత్ ఆవశ్యకతను 25 ఏళ్ళ క్రిందటే ఈ రచయిత్రి కలలు కనటం (ఈ దేశమే గతి బాగుపడునోయ్) గమనించిన పాఠకుడు అబ్బురపడకుండా ఉండలేడు.
కధల్లో కనిపించే పాత్రలు, జీవితాలు-చాలామటుకు మధ్య తరగతి మనుషులవే అయివుంటాయి. సీతమ్మ లాంటి (తానొకటి తలచిన...) నుంచి మనసు గలవారే అయి ఉంటారు. ఇంతేకాదు- ‘విలువలు మారాయి’ కధలో కనిపించే రాజేశ్వరమ్మ లాంటివారు అయి ఉంటారు. భార్యాభర్తలు ఉద్యోగం చేస్తే తప్ప గడవని ప్రస్తుత సమాజంలో అగ్గిపెట్టెల్లాంటి ఇరుకు ఫ్లాట్ల జీవితం అయ్యాక రాజేశ్వరమ్మగారి లాంటి సీనియర్ సిటిజన్‌లకు ‘హాయిగా విశాలంగా శుభ్రమైన గాలి వెలుతురు, అన్ని సదుపాయాలుండే’ వృద్ధాశ్రమాలే మెరుగు (విలువలు మారాయి) అని చెప్పించటం రచయిత్రి సమకాలీన దృక్పథానికి అద్దంపడుతుంది. కాలానికి ఎదురీదకుండా, కాలం పాటు నడవమని ఉద్బోధించే రచయిత్రి కామేశ్వరిగారు ఎంతో అభినందనీయులు.
నేటి పాఠకుడికి, ఆనాటి జీవితం తాత్త్వికత, ఆలోచనా సరళిని, ఈనాటి ఉరుకుల పరుగుల జీవితాలతో పోల్చి చూపుతూ, పాఠకుడినే కంపేర్ చేసుకొమ్మనటం- ఇంకా మారని పోలీసు వ్యవస్థ, రాజకీయాలపై (దుష్టరక్షణ) తన నిరసనను ప్రకటించటంవల్ల రచయిత్రికి మానవ జాతిమీదున్న ప్రేమ, అసహాయులపట్ల సానుభూతి ద్యోతకమవుతుంది. స్ర్తి కేంద్రకంగా రాయబడ్డ కథల వెనుక రచయిత్రికిగల సామాజిక బాధ్యతను పాఠకుడికి తెలియజేస్తాయి. వందే ఏళ్ళు గడిచినా, స్ర్తి ఎంత ఎదిగినా పురుషుడితో సమానం కాలేదని- ఇందుకు కారణం ‘స్ర్తి పురుష శరీర నిర్మాణాలు, శారీరక ధర్మాలు వేరువేరు కావటంవల్ల’ అంటూ, ‘అరిటాకు ముల్లు సామెత ఎప్పటికీమారదు’ అని కంక్లూడ్ చేస్తూ ‘గీతోపదేశం వింటే బాగుపడేవారే కాని చెడిపోయేవారుండరు’ (గీతోపదేశం) అనటం బావుంది.
సుమారు అరవయియేళ్ళ తన రచనా కాలంలోని కధల్లోంచి ఏర్చి కూర్చిన కథలు. ఒకరకంగా చెప్పాలంటే కామేశ్వరిగారి మొత్తం రచనల సారాంశం ఇది.
‘ప్రవాహం వెంట సాగిపోవాలి’ - చేసే పనిలో నిజాయితీ వుంటే ఎవరేమన్నా పట్టించుకోనక్కరలేదు, ‘ఆడపిల్లలకి తల్లి ఉన్నన్ని రోజులే పుట్టిల్లు’, ‘వివాహబంధం లేని ఆడదాన్ని ఏ మగాడూ శాశ్వతంగా భరించడు’, ‘ఆడది కోరుకునేది ఇంట్లో చోటు కాదు గుండెల్లో స్థానం’ లాంటి వాక్యాలు నేటి తరానికి కొంచెం కొరుకుడు పడకున్నా, కాచివడపోసిన కాలానికి తట్టుకుని నిలిచిన సత్యాలు. 30ఏళ్ళకు ‘ఒకే తరం’గా లెక్కిస్తారు. మూడు తరాలకు ప్రాతినిధ్య కథలివి.

-కూర చిదంబరం 8639338675