పఠనీయం

జీవితాన్ని కవిత్వమయం చేసిన ‘మనిషొక పద్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికో పద్యం- రచన: మెట్టా నాగేశ్వరరావు, వెల:రూ.180/-, ప్రతులకు: మెట్టా లక్ష్మీ ప్రసన్న, బాయ్యనగూడెం, ప.గో.జిల్లా మరియు విశాలాంధ్ర, ప్రజాశక్తి బుక్‌షాప్‌లలో. ఫోన్:9951085760
================================================================
శ్రమ జీవితం విలువలోంచి కళ్ళు తెరిచిన కవిత్వం చాలా సహజసిద్ధంగా ఊపిరి పోసుకుంటుంది. ఇందులోంచి పొదువుకున్న జ్ఞపకాలు బతుకు లోతుల్లోంచి ధారకట్టి వర్తమానాన్ని అక్షరబద్ధం చేస్తాయి. అలా ఒడిసిపట్టిన అనుభవాలే ‘మనిషొక పద్యం కవితా సంపుటికి దారితీశాయి. దీని కవి మెట్టా నాగేశ్వరరావు. దీనిలో 78 కవితలున్నాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క జీవన పార్శ్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ కతల వెతల బతుకు సంగర్షణల తాకిడికి కుదుపులను తనివితీరా స్పృశించి తడిమే ప్రయత్నం చేద్దాం.
‘‘మట్టిలో కళ్లు మూసుకుని / ఎంత తపస్సు చేసిందో విత్తనం / పిట్టలు వాలిన చెట్టిక్కడ /చేతులు చాచి నిలబడింది’’ అని అంటారు ‘ఊపిరి గొడుగు’ కవితలో ఒకచోట కవి. బతుకు పచ్చదనం విలువ తెలిసిన మనిషే ఈ వాక్యాలను చెప్పగలడు. పర్యావరణం జీవన సమస్యగా మారిన ఈ వేళ.. చెట్టు ఊపిరి మానవ మనుగడకు, ప్రకృతి రక్షణకీ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ‘చెమట సంతకం’ శీర్షికలో స్వేదబిందువు గుండె చప్పుడుని చాలా ఆర్ద్రంగా గాడతతో వ్యక్తీకరిస్తాడు నాగేశ్వరరావు. ‘రాళ్లను కొట్టే శబ్దాలే / ఆమె లోపలి బిడ్డకు తొలి లాలిపాటలు/ చిందించిన చెమట చుక్కల చలువే / పొయ్యిమీది ఎసరులో సగభాగం’ అంటూ శ్రమ జీవన సౌందర్యంలోని తాత్త్వికతను అమ్మరూపంలో చిత్రించే బాధ్యతను నెత్తినేసుకుంటాడు కవి.
‘నిప్పుపూలు’ కవితలో కవి ఊహ పరాకాష్ట దశకు చేరుకుంటుంది. ‘నల్లనివన్నీ తిరస్కరించే సౌందర్య పిపాసులారా / బొగ్గుల్లోనూ అందముంది / వాటిని రాజేసి చూడండి /నిప్పుపూలుగా మారి గొప్పగా కనిపిస్తాయి’ అని చెబుతాడు మెట్టా.
‘కవిత్వమంటే / పరిధులు గీసుకున్న చట్రం కాదు / దానికి హద్దు /అనంత విశ్వం’ అని కవిత్వాన్ని విశ్వమానవీయ కోణంలో అనే్వషిస్తాడు కవి. ఒక సామాజిక అంశాన్ని ప్రపంచ దృష్టితో చూడటంలో.. లోలోపట పరచుకున్న విశాల భావాలను పరిమితులు దాటిన స్వేచ్ఛతో అనుభవించడం, ప్రగతిశీల దృక్పథం కలిగిన కవిగే సాధ్యపడుతుంది. అలాంటి భావజాల దృక్పథంతోనే చివరిదాకా కొనసాగుతుంది మెట్టా కవిత్వం.
కవితాత్మక సంభాషణతో కొనసాగిన కొన్ని వాక్య ప్రయోగాలు కొన్నిచోట్ల మనల్ని అలరించి ముచ్చటగొలుపుతాయి. ఉబ్బి తబ్బిబ్బు చేస్తాయి. ఇలాంటి వాటిలో... ‘గాలితో జతగట్టి పడవ పాడే పాట / గుండెకు ఊయలగట్టి ఆడిస్తుంది..’, ‘నా చిన్న చేతులు కళ్లాపి జల్లి /వాకిట్లో నక్షత్రాల్ని గీస్తే /అమ్మ ముఖం సందమామయ్యేది’, ‘తాటాకిల్లు నిండా చిల్లులే / వానొచిచ్నపుడల్లా /పేదరికం తడిచిపోతున్నది’, ‘ఎగిరిపోయిన పిట్ట మళ్లీ వాలకపోవచ్చు / అది విదిల్చిన రెక్కల సవ్వడి /గుండెలో మోగుతుంటది’, ‘మా గేదెలు మేపే బీడు పక్కన /సన్నగ జెర్రిపోతులా పరిగట్టే కాలువ’, ‘అడవిని అంతం చేయాలనుకోకు /అది రాల్చిన విత్తనాల్లో /పెత్తనాల్ని కూల్చిన విప్లవాలెన్నో వున్నాయి’, ‘పెద్దబావి / ఊరిమధ్యలో ఏకాకితనాన్ని భరిస్తోంది /దాని నీళ్లిపుడు దానికే కన్నీళ్లయ్యాయి’, ‘సూరీడుకిరణాల చొక్కా తొడగకముందే’, ‘పారే చిన్న కాల్వలో వేగంగా సైకిల్ తొక్కితే /నీటి పిట్టకు రెక్కలు మొలిచేవి’, ‘నా కనుపాపల్లో / కాలం బొమ్మ కదులుతుంటుంది’ వంటి వాక్య నిర్మాణాలు చాలా లోతైన జీవితాల కదలికల్ని ఉట్టిపడేలా చేస్తాయి.
ఇలా బహుబుఖ పార్శ్వాలను తడమడంలో మెట్టాది అందెవేసిన చెయ్యి. అక్షరాల రీత్యా ఈ కవితా పాదాలను కొన్నిచోట్ల కుదించి ఉంటే వాక్యాలలో క్లుప్తత, స్పష్టత గోచరించి ఉండేది. ఇలా తనదైన ప్రత్యేక శైలితో పాఠకుల మనసులపై ముద్రవేసుకున్న మెట్టా నాగేశ్వరరావు కృషిని మనస్ఫూర్తిగా అభినందించి తీరవలసిందే.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910