పఠనీయం

‘వృద్ధోపనిషత్’ ఒక మహత్తర కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వృద్ధోపనిషత్’
రచన: ఆచార్య ఎన్. గోపి
========================================
‘రవి గాంచనిచోటు కవిగాంచును’ అన్నమాట అక్షరసత్యం. కవి ఊహాశక్తికి ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. భూమీ, ఆకాశం, శశిబింబం, నక్షత్రం, చెట్టూగట్టూ, తటాకం, సముద్రం, పొలం, హలం- అన్నీ కవితా వస్తువులే. క్షణంలో తనలో రేగే ఊహలకు రెక్కలు తొడిగి, అక్షరాలు పొదిగి అందమైన కవితగా తీర్చిదిద్దే అక్షర శిల్పి కవి. శ్రీశ్రీగారన్నట్టు వారికి అగ్గిపుల్లా, కుక్కపిల్లా-అన్నీ కవితా వస్తువులే. ఆచార్య గోపీగారు అతి సామాన్యమైన విషయాన్ని అనన్య భావసంపదతో చెక్కి చక్కని సందేశాన్నీ, సంతోషాన్నీ అందించగల కవి ద్రష్ట! ఒక కవిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా ఆచార్య గోపీగారు సుప్రసిద్ధులు. బహుగ్రంథకర్త. బహుభాషలలోకి తన కవితా సుమాలను, దాదాపు పాతికకుపైగా అనేక జాతీయ భాషలలోకీ, అంతర్జాతీయ భాషలలోకి అనువాదాలను పొందిన ఏకైక కవి అంటే అతిశయోక్తి కాదేమో! వీరు సృష్టించిన ‘నానీలు’ ఎంతగానో ప్రశంసింపబడి, ఎందరో కవుల కలాలను పదునుపెట్టించాయి.
వందల సంఖ్యలో వెలువడ్డ నానీల గ్రంథాలకు, ‘నానీల నాన్న’ అన్న బిరుదాంకితుడు. నేను సయితం ఆ నానీల కుటుంబంలో ఒక సభ్యురాలిని. కేవలం 26 అక్షరాలతో చిన్నచిన్న నాలుగు పంక్తులతో, జనరంజకంగా, ఆణిముత్యాల్లా, పాఠకులను కట్టిపడేసే ప్రక్రియ అది.
ఇటీవలే వారి కలం నుండి వెలువడిన మరో గ్రంథం, అమూల్యమైన సందేశంతో జీవితానికి కావలసిన దివ్యౌషధం ‘వృద్ధోపనిషత్’ కావ్యం- ఇది నిజంగా మరో ఉపనిషత్తే. వృద్ధులపాలిటి మానసిక బలాన్ని చేకూర్చటానికే అనిపిస్తుంది. వృద్ధాప్యం అనగానే చాలామందిలో నిరాశా, నిస్పృహ చోటుచేసుకుంటాయి. ఏదో నిస్తేజంగా బతుకు వెళ్లదీస్తుంటారు. ముఖ్యంగా వయసుతోపాటు సహజంగా శరీరంలో కలిగే కొన్ని మార్పులను చూసి కృంగిపోతుంటారు. వృద్ధుల శారీరక శౌథిల్యం, తరాల అంతరం, నిరాదరణ, ఒంటరితనం, నాస్టాల్జియా, మతిమరుపు, మృత్యుభయం వంటి కీలక సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుని, పులుల్లా బతికిన వారుకూడా, పిల్లి పిల్లల్లా అయిపోతారు.
జీవన పరిణతి, ప్రేమతత్వం, సంతృప్తి వంటి వెలుగులను గ్రహించరు. నిజంగా కొద్దిపాటి చైతన్యంతో వీటిని అధిగమించవచ్చు అంటారు కవి. వృద్ధులు అన్న మాటని, ముసలివారు అనీ కాక, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నవారు అనుకుంటే బాగుంటుంది కదా అంటారు గోపీగారు. వారి పరిణత ప్రజ్ఞ, ప్రతిభా పాటవం కలగలిపి, జీవితం నిరర్థకమని నిందించుకుంటూ కూర్చోకుండా, వృద్ధుడంటే జ్ఞానవృద్ధికితోడ్పడుతూ మార్గదర్శం చేసేవాడని గ్రహిస్తే, జీవితం అద్భుతంగా అనిపిస్తుంది. బతుకు చెట్టు కొత్త చిగుళ్ళు తొడుక్కుంటుంది. దీన్లో వృద్ధుల భావాలు, ప్రవర్తనా, న్యూనతాభావం, నిరాశ వంటి భావాలను చక్కగా హృద్యంగా మలిచారు, గోపీగారు వారి నలభై యొక్క కవితల్లో.
వృద్ధాప్యం యొక్క చింతను చిత్రిస్తూనే యువతరం వృద్ధులను కొంతైనా అర్థం చేసుకోవాలని ఆకాంక్షిస్తారు. ఏదో ఒకనాడు ఈ దశ వారికీ సంభవిస్తుంది కదా అన్న ఆలోచన కలిగివుంటే బాగుంటుంది అంటారు. చివరగా ‘్ఫలశ్రుతి’ కవిత ఒక చక్కని ఆధ్యాత్మిక చింతన. మొత్తం జీవనయానాన్ని ఆవిష్కరించే కవిత! అన్ని విధాలా ఈ గ్రంథం ప్రతి ఒక్కరినీ ఆనందపరుస్తుంది. పాఠకుల చిత్తంలో ఒక మూల గూడుకట్టుకుని నిలిచిపోతుంది. ఈ గ్రంథ రచయిత గోపీగారికి నా అభినందనలు.

- శారదా అశోకవర్థన్