పఠనీయం

భక్తి మాత్రమే కాదు దేశభక్తి కూడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప నారాయణదాసు సంకీర్తనలు
కూర్పరి: స.వెం.రమేశ్
సేకరణ: ఐతం దివాకర్, ఓట్ర పురుషోత్తం
వెల:100/- రూపాయలు, 172 పుటలు
తొండనాడు తెలుగు రచయితల సంఘం ప్రచురణ
ప్రతులకు: ఓట్ర పురుషోత్తం
096626217868

పండితులు పట్టించుకోకపోయినా, పల్లె జనుల గుండెల్లో నిలచిన వాగ్గేయకారుడు కడప నారాయణదాసు. పుట్టింది తాడిపత్రిలో, పెరిగింది కడపలో, కురుడుకొనింది ఇప్పటి తమిళనాడులోని చోళంగిపురంలో. ఏ కాలంవారో తెలియదు, ఏ కులంవాడో తెలియదు. తమిళనాడు, కర్నాటక, బంగ్లాదేశ్, మారిషస్, మలేసియా వంటి ఎన్నోచోట్ల జనం నాలుకలపైన ఈయన పాటలు బతికుండాయి. తొలిసారిగా అచ్చు రూపు దాల్చి మీ ముందుకు వచ్చినాయి- అని ఈ పుస్తకం చివరి అట్ట చెబుతోంది. గణపతి ప్రార్థన (3), శారదాదేవి ప్రార్థన (1), గురువందనం (4), అమ్మవారి ప్రార్థన (6), ఆంజనేయుల ప్రార్థన (2), ఇతర దేవతల ప్రార్థన (4), పండరి భజన (88), దేశభక్తి (2), హిందీ పండరి భజన (5), మంగళం (2), మకుటం లేనివి (7), ఇతరులు వ్రాసినవి (12), నాలుగు పద్యాలు- ఇలా సాగుతుంది ఈ పుస్తకం. సేకరించిన ఓట్ర పురుషోత్తం, ఐతం దివాకర్‌గార్లు తొండనాడు తెలుగు రచయితల సంఘం గురించి, ఈ పాటలు ఎలా సేకరించిందీ వివరిస్తే; కూర్పరి స.వెం.రమేష్ ఈ పాటల మాట పేరున నారాయణదాసు పాటల గురించి, ఈ సంపుటి గురించి రాశారు.
ప్రధాన స్రవంతి తెలుగువాళ్ళు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమనే భావన రెండు దశాబ్దాలుగా పరిశీలనకూ, పరిశోధనకు గురవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మించిన సంఖ్యలో తెలుగువారు ఇతర రాష్ట్రాలలో వ్యాపించి ఉన్నారనీ; వారి వద్దనున్న కళారూపాలూ, సంస్కృతీ సంపదా విశేషమైనవనీ క్రమంగా బోధపడుతోంది. 2010 నుంచి ఇప్పటి తమిళనాడు నుంచి 22 తెలుగు పుస్తకాలు ఈ త్రోవలో జరిగిన కృషికి దర్పణాలు. వేలూరు, సిరివనె్నమాల (తిరువణ్ణామలై), తిరువళ్ళూరు, కాంచీపురం, విల్లుపురం, కడబారు అనే ఆరు జిల్లాలు తొండనాడు క్రిందికి వస్తాయి. విస్తారంగా తెలుగువారుండే ఈ ప్రాంతంలో కోలటాలు, కొక్కిలికట్టె ఆటలు, పండరి భజనలు, వెంకటాద్రి భజనలు- ఇలా చాలా కళారూపాలు తెలుగులో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి సేకరణ చేసిన పురుషోత్తం, దివాకర్ మాత్రమే ఈ తెలుగు పరిశ్రమ చేస్తున్నారు. రాయవేలూరు ప్రాంతానికి చెందిన ఎగువమిట్టాళం, అరిగవారిపల్లె నుంచి సేకరించిన పాటలు ఇవి. ఈ తెలుగు పాటలను తమిళ లిపిలో రాసుకుని ఎంతోకాలంగా పాడుతున్నారు. తక్కువ అక్షరాలు ఉండే తమిళ లిపిలోకి వెళ్లిన తెలుగును మళ్లీ వెనక్కి తీయడం కష్టం. తక్కు, తగ్గు, దక్కు, దగ్గు- అనే నాలుగు తెలుగు పదాలను ఒకేలా రాయాలి తమిళంలో. అందువల్ల నూరుపైచిలుకు పాటలను తెలుగు లిపిలో రాయడానికి ఎనిమిది నెలల పాటు వీరు శ్రమపడ్డారు.
ఈ పాటలను సేకరించిన ఓట్ర పురుషోత్తం, ఐతం దివాకర్ నాకు మద్రాసు ఆకాశవాణిలో పనిచేసినపుడు పరిచయం. పాటలను కూర్చిన స.వెం.రమేశ్ పడిన తంటాలు అన్నీ కాకపోయినా కొన్ని నాకు స్వయంగా తెలుసు. బంగ్లాదేశ్ వెళ్లినపుడు, మారిషస్ వెళ్లినపుడు- స.వెం.రమేశ్ తిరుగు ప్రయాణంలో నాతో కలిశారు. కొన్ని రోజులు నారాయణ దాసు జపం చేశాడు. చివరికి ఈ సంపుటిని తెలుగుకు అందించారు. తాడిపత్రిలో పుట్టినవాడు, కడపలో పెరిగినవాడు- ఇలా ప్రాంతాలు అధిగమించి, దేశాలలో వ్యాపించి తెలుగులోని దార్శినిత్వాన్ని మిగతా సమాజానికి అందించారు నారాయణదాసు. వీరి కీర్తనలలో పండరినాథుని భజనలే కాదు, ఇతర ప్రాంతాల దేవతలపై కూడా ఉన్నాయి. భక్తి మాత్రమే కాదు దేశభక్తికి సంబంధించి ఉన్నాయి. కీర్తనలే కాదు, పద్యాలూ ఉన్నాయి. తెలుగులోనే కాదు హిందీలోనూ ఉన్నాయి. ఇలా మన దేశంలోనూ ఇతర దేశాలలోనూ- అడుగు పొరలలో ఎంత తెలుగు ఉందో, ఎంతమంది తెలుగులు ఉన్నారో, ఎంత తెలుగు జానపద విజ్ఞానం కళలుగా నిగూఢంగా ఉందో? ఈ దిశగా మరింత మంది దృష్టిపెడితే బావుంటుంది. ఆ రకమైన కృషి జరుగుతోందని కూడా తెలుస్తోంది.. సంతోషం!

-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ 9440732392