పఠనీయం

రాయలసీమ భావ ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రావతి కథలు
-ఉప్పరపాటి
వెంకటేశులు
వెల: రూ.90
సోల్ డిస్ట్రిబ్యూటర్స్:
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-1

ఒక ప్రదేశపు భౌగోళిక స్వభావం, నైసర్గిక స్థితిగతులు కథలపై తమ ప్రభావాన్ని చూపుతాయా? అవును చూపుతాయి. ‘టులిప్’ పూలు నెదర్లాండ్ (యూరోపు)లోనే కనపడతాయి. ఆపిల్ పళ్లు షిమ్లా, కాశ్మీరంలోనే కనపడతాయి. నీటి కష్టాలు రాయలసీమలోనే కనపడతాయి. గలగల పారే పంట కాలువలు, పచ్చని చేలు గోదావరీ తీర ప్రాంతంలోనే కనపడతాయి. అణచివేత, బానిస పాలన తెలంగాణాలోనే చూడగలుగుతాము.
ఒక కవి, కథకుడు కూడా, తాను పీల్చే గాలి, పుట్టిన నేల మీదే కవితలల్లుతాడు. కథలు రాస్తాడు. కథకుడు ఉప్పలపాటి వెంకటేశులు అంతే.. అందుకే ఆయన కథల్లో ‘నీటిచుక్క’ కోసం రాయలసీమ రైతులు పడే కష్టాలు కనిపిస్తాయి. కరువు మంటలకు మసై, బూడిదైన గ్రామాలు కనిపిస్తాయి. తన చుట్టు చోటు చేసుకున్న సంఘటనలకు చలించిపోయి కథలు రాస్తాడు. కనుక నిజాయితీగా ఉంటాయి. అందుకే అవి పాఠకుల మనసులకు హత్తుకుపోతాయి.
‘చిత్రావతి’ కథల సంకలనంలో 13 కథలున్నాయి. ‘నీటికల’ ‘తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే’ మరియు ‘చిత్రావతి’ కథలు రాయలసీమ నీటిఎద్దడిని వివరిస్తాయి. ‘రెడ్ స్మగ్లర్’ ‘అదుగో పులి’ రచయిత అటవీ అధికారిగా ఎదుర్కొన్న అనుభవాల్లోంచి పుట్టిన కథలు. ఉద్యోగిగా తన అనుభవాలను వివరించిన కథలు - ‘రైలు వెళ్లిపోయింది’ ‘నీటికల’ ‘నిర్ణయం’ ఫ్యాక్షనిజం, నక్సలిజం వివరించే కథలు ‘దుర్గ’ మరియు ‘చిరస్మరణీయులు’. విశ్వజనీత కలిగిన కథ ‘అమ్మా.. అమ్మా.. అమ్మా’ ఈ కథ తల్లీ కొడుకుల మధ్య పరస్పరం కనబర్చే ప్రేమను చెబుతుంది. పక్షులు, చెట్ల మీది ప్రేమను వివరించే కథ ‘గూటి పక్షులు’. తన పిల్లలు గూడు వీడిన పక్షుల్లా తన దగ్గర లేకపోయినా, కళ్యాణ దుర్గంలో తాను పదమూడేళ్ల క్రిందట నాటిన మొక్కలు చెట్లయి, ముఖ్యంగా ఊడలు దిగిన మర్రిమానూ, దానిమీద కాపురముంటున్న వందలాది పక్షుల్ని చూసి పరవశించే ఆ రీటయిర్డ్ ఉద్యోగిని చూసి మనమూ పరవశిస్తాము ‘గూటి పక్షులు’లో.
కవి, రచయిత ఎందరికో ఆదర్శం. తమ రచనల ద్వారా సమాజంలోని కుళ్లును, కుతంత్రాలను ఎండగట్టేది వారే. చిత్తశుద్ధి, నిజాయితీ, సేవాభావం లేకపోతే ఎంత పేరున్న రచయితయినా, అతన్ని నేను గౌరవించను (వ్యక్తిత్వాలు -కథ) అనటం రచయిత చిత్తశుద్ధికి నిదర్శనం.
పాలితుల కన్నీళ్లకు ‘అబ’గా దోసిలి చాచే పాలకులున్నంత వరకు సగటు మనిషి సంగతి ఇంతే..నన్న భావం ధ్వనింపచేస్తూ, ‘వైతాళికులు తమ తొలి అడుగులు ఎప్పుడూ ఒంటరిగానే వేయాలి. ఉద్యమాల్లో బలి అయ్యేది ఎప్పుడూ సగటు మనిషే’నని చెప్పటం బావుంది. ప్రాయపు ఆడపిల్లలు బతుకుదెరువు కోసం దగ్గర్లోని పట్టణాలకి పోయి రాత్రంతా చీకటి గదుల్లో గడిపి తెల్లారి గప్‌చిప్‌గా ఇల్లు చేరుకోవటం, వాళ్లు తెచ్చే పాతికా పరకతో ఇల్లు గడవటం, మగవాళ్లెవరైనా దండిస్తే ‘నువ్వు చెయ్యలేని పని అది చేస్తుంది కద! ఇంత అంబలైనా దక్కుతున్నది. ఏం చేయలేకపోయినా, రోషానికి మాత్రం తక్కువేం లేదు’ అన్న, ఇంటి ఆడవాళ్ల గద్దింపులు - ఆకలి మనిషిని ఎంతకు దిగజారుస్తుందో చెబుతుంది.
బండి నారాయణస్వామి తన ముందు మాటలో చెప్పినట్లు రాయలసీమ భావ ప్రవాహంలో సమాంతరంగా ప్రయాణిస్తున్న ఈ కథకుడు ఎంతైనా అభినందనీయుడు.

-కూర చిదంబరం 8639338675