పఠనీయం

‘బొమ్మల కథ’లో కమ్మని ‘గంధాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇందూరు కవిరా
కొరవి గోపరాజు’
సాహిత్య విశే్లషణ
-ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పుటలు: 185.. వెల: 150
ప్రతులకు: నవోదయ
బుక్‌హౌస్
అధ్యయనం ఒక శ్రద్ధ. అధ్యయనం చేసిన దానిలోని అంతరాంతరాల సారాన్ని సవ్యాఖ్యాన సుందరంగా చెప్పటం ఒక కళ. అలాంటి కళాత్మక రచన ఒకటి ఇటీవల ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారు వెలువరించారు. దాని పేరే ‘ఇందూరు కవిరాజు కొరవి గోపరాజు - సాహిత్య విశే్లషణ’
‘సర్వజ్ఞుడు కాని వాడు సత్కవి యగునే?’ అనే భావంతో కావ్యాలను విజ్ఞాన సర్వస్వాలుగా, సమకాలీన సాంఘిక, ఆచార, స్థితిగతుల రికార్డుగా తయారుచేసే ఒక మంచి ప్రజోపయోగ పద్ధతిని పాటించిన కవులలో ప్రముఖుడు కొరవి గోపరాజు. అతని కావ్యం సింహాసన ద్వాత్రింశిక.
భోజరాజు తనకు ముందు కొన్ని శతాబ్దాల కిందట భూనిక్షిప్తం చేయబడి ఉన్న విక్రమాదిత్య సింహాసనాన్ని తవ్వి, తెప్పించి, దానిని ఎక్కబోగా ముప్పై రెండు బొమ్మలు అడ్డగిస్తూ విక్రమాదిత్యుని సాహస దానాది ఉదాత్త గుణాలను గూర్చిన కథలు భోజునికి చెప్పటం ఈ కావ్యంలోని కథావస్తువు.
వివిధ కథలను కేవలం కేటలాగులా ఏకరువు పెట్టకుండా సందర్భోచితంగా, విసుగు కలిగించని విధంగా చెప్పటంలోనే గోపరాజు గొప్పదనం ఇమిడి ఉంది.
భూమయ్యగారి ఆచార్య పదవీపర ఉపన్యాస వృత్తి నైపుణ్యం ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా, సరళతా మనోహరంగా తీర్చిదిద్దటంలో ప్రస్ఫుటంగా ప్రతిబింబించింది.
రచయిత తన గ్రంథ విశే్లషణను అవతారిక, సింహాసనం చెప్పిన కథలు (స్థూలంగా), ప్రజాజీవనం, వర్ణనలు, పద్యరచనా సౌందర్యం - మొదలైన పది శీర్షికల కింద విభజించి వివరించటం బాగుంది.
129వ పుటలో ‘తొలి తొలి లేత వెనె్నల నార మ్రింగుచు..’ అనే పద్యభావ సౌందర్యాన్ని అనుమాండ్ల వారు తేటతెల్లము చేస్తూ వెనె్నల యొక్క వివిధ వర్థమాన దశలైన లేత వెనె్నల, ముదురు వెనె్నల, పండు వెనె్నల, నారసాగిన వెనె్నలలను చకోర పక్షి ఎలా ఎలా అనుభవించిందో చక్కగా వివరించారు.
‘లేతది కాబట్టి మ్రింగింది. ముదురు వెనె్నల కాబట్టి నమిలింది. పండు వెనె్నల కాబట్టి దౌడతో ముక్కలుగా చేసి తిన్నది. నారసాగిన వెనె్నల కాడలను కాళ్లతో త్రొక్కిపట్టి ముక్కుతో తెంపి బొక్కింది. ఇలా అన్ని రకాల వెనె్నలలను చకోర పక్షులు అంతగా తిని పరవశించాయి. ప్రతి చకోర పక్షి వెనె్నల ప్రవాహంతో సాగిపోకుండా అడ్డంగా ఈది ఒడ్డున కూర్చుంది. చకోరాలన్నీ తమ బలగాన్ని కూడుకొని వెనె్నల్లో మునిగి తేలుతూ ఆనందించాయి.
తల్లి పక్షి మొదట రుచి చూచి, ఆనందించి, ఆ వెనె్నలను పిల్లల నోట్లో కుక్కింది. ఇది లేత వెనె్నల విషయం. ముదురు వెనె్నలను తాను మొదట నమిలి, పిల్లల కిచ్చిందట. తల్లికి పిల్లల మీద ఎంత ప్రేమ! లేత వెనె్నల, ముదురు వెనె్నల, పండు వెనె్నల, నారవెనె్నల.. ఇదీ వరుస. వెనె్నల రాత్రి గడుస్తున్న క్రమం. ఎంతటి సహజమైన వర్ణన! మొదట తల్లి, పిల్లలు. ఆ తరువాత ఆ తల్లిపక్షి తన బలగంతో కలిసి సాగింది. తల్లీ పిల్లలు కుటుంబం. ఆ తల్లి పెరిగిన పిల్లలతో కలిసి తమ బలగంతో చేరిపోయింది. ఇది కుటుంబ సమూహమైన గ్రామం. ఇది ఒక వరుస. ఒకటి రెండు తప్ప అన్నీ తెలుగు పదాలే. అందమైన పద్య నిర్మాణం అంటూ తన మాటల్లో స్వభావోక్త్యలంకార పూర్వక భావ సౌందర్యం అంటే ఎలా ఉంటుందో చెప్పారు. ‘చకోర పక్షులను తెలుగు పదాల వెనె్నల నింగిలోనికి ఈ విధంగా (ఈ పద్యంలో) ఎగురవేశాడు గోపరాజు’ అన్న భూమయ్యగారి వ్యాఖ్య వారి యొక్క రస దృష్టితోపాటుగా వారి కవితా హృదయాన్ని, అభివ్యక్తిశక్తిని వెలారుస్తుంది.
7వ పుటలో ‘ఎల్లెడం ద్రోవన కాక కుక్కలకు గొంతులు పేర్వగ నేర్వవచ్చునే (కుక్కలకు కూల్చటం కాక పేర్చటం చేతవుతుందా?) ‘పువ్వుల దాల్చి తుంగ తలకెక్కు గతిన్ (కవిత వినగలిగే వారు ‘సరసులు’ అయితే అది మరింత శోభిస్తుంది అని భావం) మొదలైన గోపరాజు యొక్క ఆలంకారిక శైలీ సూక్తుల ఆధారంగా ‘కొరవి కవి’ యొక్క సాహిత్యాత్మను పట్టుకున్నారు ఆచార్యగారు.
గోపరాజు కూర్చిన ముప్పై రెండు కథల కావ్యం మొత్తాన్ని నిశితంగా తాను అధ్యయనం చేసి విశే్లషించిన రచయిత ‘అందలాలెక్కాలని అందరూ కోరుకుంటారు. అందుకు తగిన అర్హత తమకుందా లేదా అని ఆలోచించరు. అందలమెక్కిన వారికి అనుకోకుండా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించటానికి శక్తియుక్తులు, ధైర్యసాహసాలు కావాలి. దానగుణం ఉండాలి. అర్హతలేనివారు అందలం ఎక్కకూడదన్నది విషయం. అర్హత కలవారే అందలమెక్కాలని చెప్పటానికే ఈ కథలు’ అంటూ చెప్పిన మాటలు అనుమాండ్ల వారి అధ్యయన, అవగాహన, సందేశ ప్రదానము..’ అనే త్రయాత్మక ఆచార్య త్రిమూర్తిత్వానికి అద్దం పట్టాయి.
86వ పేజీ నుంచి 119వ పేజీ వరకు రూపక, ఉత్ప్రేక్షాది వివిధాలంకార శోభితాలైన సూర్యాస్తమయ, పుష్పాపచయ, సముద్రాది వర్ణనలను కొన్నింటిని ఎత్తి చూపారు. వర్ణనా శిల్పాన్ని ఆవిష్కరిస్తూ,
అక్కడక్కడ ‘సహస్ర శీర్షాపురుష స్సహస్రాక్ష స్సహస్రపాత్ (పురుషసూక్తం), ‘ఈశావాస్య మిదం సర్వం (వేదం)’ మొదలైన సూక్తుల ప్రస్తావన పుస్తకానికి ఒక నిండుదనాన్ని, ఒక గాంభీర్యాన్ని అలరింది.
‘గోపరాజు చేసిన మనోహర వర్ణనలు ప్రకృతి పట్ల ప్రేమను పెంచే విధంగా ఉన్నాయి. ప్రకృతితో మమైక్యం కలిగించే విధంగా ఉన్నాయి. ప్రకృతిలో లీనమైనప్పుడు మనకు వ్యక్తిత్వం ఉండదు కదా! మిగిలి ఉండేది ప్రకృతి. ప్రకృతికి నిత్య వందనం’ అంటూ 119వ పుటలో రచయిత చే(రా)సిన సందేవాత్మక ఉపసంహారం మనోహరం, మహోదాత్తమూను.
‘ఉజ్జయినీ రాజగు విక్రమాదిత్యుని మంత్రి కుమారుడైన గ్రహిలుడనే వాడు దేశాటనం చేస్తూ దక్షిణాపథంలోని ఏకశిలా నగరానికి వచ్చాడు. అప్పుడా నగరాన్ని కాకతీయులు పరిపాలిస్తున్నారు’ అని ఉంది 43వ పుటలో.
విక్రమాదిత్యుడు గుప్తరాజులలో ఒకడు. గుప్తరాజుల పరిపాలనా కాలం కోటు వెంకటాచలం, అచ్యుతుని వెంకటాచలపతిరావు మొదలైన పండితుల లెక్క ప్రకారం క్రీ.పూ.4-3 శతాబ్దాలు. పోనీ ఇప్పుడు మన విశ్వవిద్యాలయాల చరిత్ర శాఖాచార్యులు చెప్తున్న ప్రకారమైనా క్రీ.శ.4-5 శతాబ్దాలు. కాకతీయుల పరిపాలనా కాలం క్రీ.శ.10 శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్య వరకు. ఈ లెక్కన గుప్తులకు, కాకతీయులకు మధ్య కాల వ్యత్యాసం కనీస పక్షంగా అయిదు శతాబ్దాలు. ఇంత అంతర వ్యవధి ఉన్నది కదా! మఱి కాకతీయుల కాలంలో గ్రహిలుని రాక అనేది ఎలా పొసగుతుంది? గోపరాజు క్రీ.శ.16వ శతాబ్ది ప్రారంభంలోని వాడు (క్రీ.శ.1500-1530) బహుశః గోపరాజు కాలపు విద్యావంతులకు చరిత్ర కాలాంశాల పరిజ్ఞానం అంతగా లేదేమో! భూమయ్యగారు ఈ విధమైన అనుశీలన లోనికి పోదలచుకోలేదేమో!
12వ పుట మొదటి పంక్తిలో ‘అది రజతాద్రి. వెండికొండ’ అని ఉంది. ఎందుకీ పునరుక్తి? ఉపాధ్యాయులకు పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు స్పష్టత కోసం, సులభంగా అర్థం కావటం కోసం అలాగే మాట్లాడతారు. బహుశః అదే రకపు ఉపాధ్యాయ దశానుభూతిలో తేలిపోతూ అలా రాశారేమో ఆచార్య భూమయ్యగారు. అది కూడా సహజ సుందరమే ఒక విధంగా. మొత్తం మీద ఈ విశే్లషణ గ్రంథం ఒక సాహితీ సుగంధం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం