పఠనీయం

కదిలించే కవితల సమాహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూకానికి కన్నీళ్లు
-మద్దాళి రఘురామ్
వెల: రూ.100.. పేజీలు: 80
ప్రతులకు: నవోదయ్
బుక్‌హౌస్
040-24652387

గత నాలుగు దశాబ్దాలుగా కినె్నర సంస్థ ద్వారా బహుముఖీన సేవలందిస్తున్న మద్దాళి రఘురామ్‌గారు చాన్నాళ్ళ తర్వాత తన మరో కవితా సంపుటిని వెలువరించారు. ‘తూకానికి కన్నీళ్లు’ పేరుతో ఆయన ప్రకటించిన గ్రంథంలో కవితలు చాలావరకు హృదయాలను కదిలించేలా వున్నాయి! తమ సంస్థ ద్వారా శతాధిక గ్రంథాలను ప్రచురించిన రఘురామ్‌గారు ఇప్పుడు తన సొంత సృజనతో వెలువరిస్తున్న ఈ కవితా సంపుటిలో.. మసకబారుతున్న మానవ సంబంధాలకు మెరుగులు అద్దే ప్రయత్నం చేశారు.. మానవత్వాన్ని ప్రతిబింబించడానికి ప్రతీకగా వాడే కన్నీళ్లను తన గ్రంథానికి నామకరణం చేసి.. తన సృజనాత్మక ప్రతిభను ఆర్ద్రంగా ప్రదర్శించడం ప్రశంసనీయం!
నడకే నా జీవితమంటూ.. ‘ఆగని నా నడక’ కవితను తీర్చిదిద్దారు. తన పాదాలను ‘నాట్యాన్ని నిలబెట్టే దృశ్యవేదాలు.. శృతిలయలను కాపాడే నాదాలు.. జీవన కావ్యాన్ని నడిపించే పద్య పాదాలు..’ అంటూ రాసిన పంక్తులు అందరినీ ఇచ్చే ఆకట్టుకుంటాయి!
ధ్యానమే నా హృదయ వాద్యం.. నడకే నా నైవేద్యం అంటూ ఈ కవితకు చక్కని ముగింపు నిచ్చారు. ‘తూకానికి కన్నీళ్లు’ కవితలో కవి ప్రయోగించిన పదబంధాలు.. మానవత్వ పరిమళాలను గుబాళింపచేసేలా వున్నాయి. అచ్చుకు నోచుకోని.. అక్షర సుమాలను.. నిరాదరణకు గురైన వైనాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించారు. పాశ్చాత్యుల పరివర్తన సిద్ధాంతాన్ని.. అనుసంధించి.. తెలుగు వాక్యాన్ని విశే్లషించి.. కొత్త ఒరవడికి ఆలోచనల ద్వారాలు తెరిచిన మహనీయునిగా చేకూరి రామారావును అభివర్ణిస్తూ కవి అక్షరాంజలి ఘటించారు. ‘జ్ఞాపకాలే మిగిలాయి’ కవిత అందరినీ కదిలించేలా ఉంది.. బియాస్ నదిలో ప్రాణాలు కోల్పోయిన ఇరువది నాలుగు మంది తెలుగు విద్యార్థినీ విద్యార్థులను తలుచుకుంటూ రాసిన ఈ కవిత అందరినీ కంటతడి పెట్టిస్తుంది! ప్రమోదాలను ప్రమాదం చేసి.. విషాదానికి గురిచేసిన సంఘటనను ఏకరువు పెట్టారు. ప్రవహించే నది నీళ్లల్లో పసివాళ్ల కన్నీళ్లు కలిసి పోయాయంటూ కవి తన ఆవేదనను వ్యక్తపరిచారు.
తెలుగుతనానికి అసలైన అర్థాన్ని ధ్వనించే ‘పట్టుచీర’పై కవిత రాశారు.
పట్టుచీరలు.. ద్వారబంధానికి మామిడి తోరణాలు.. ఇంట గడపకి పసుపు పూతలు!.. అంటూ ఈ కవితను ఎత్తుకున్న తీరు బాగుంద! పేగుమాడుతున్నా.. పడుగూ పేకల్ని మగ్గం కదిలిస్తూనే ఉంటుందని రాసిన పంక్తులు నేతన్నల వ్యథలకు అద్దం పట్టేలా ఉన్నాయి!
వ్యంగ్య వచోవైభవ విలాసానికి ఆయనో అతి పెద్ద సంతకమంటూ పానుగంటి లక్ష్మీ నర్సింహారావు గారిని కొనియాడుతూ.. సరస్వతికి ఆయనే కంఠాభరణమని ఓ కవితలో చక్కగా ఆవిష్కరించారు.
‘హరికథల తిలకుడు’ ఆదిభట్ల నారాయణదాసును ప్రస్తుతిస్తూ రాసిన కవితలో.. సంప్రదాయ కళ హరికథకు తెలుగునాట తలకట్టు.. నారాయణభట్టు అంటూ ఆదిభట్లను ఉన్నతంగా చిత్రించారు.
కవులను, కళాకారులను, గాయకులను, పండితులను, రాజకీయ, సామాజిక సేవకులను మోసే పల్లకీల బోరుూలుగా.. ‘కార్యకర్తల’ను వర్ణిస్తూ.. ‘మా భుజాలకు బరువు తెలియదు.. కానీ గుండెల్లో బాధ తీరదు’ అంటూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు.. ఈవెంట్ నిర్వాహకులను వెంటాడే సమస్యలను ఈ కవితలో చక్కగా దృశ్యమానం చేశారు. ప్రముఖ కథా రచయిత పాలగుమ్మి పద్మరాజును కథకు రారాజుగా.. బుచ్చిబాబును కథల నింగిలో చందమామగా చూపుతూ కవి రాసిన కవితలు బాగున్నాయి. సినారెను.. ‘సాహితీ వటవృక్షం’ కవితలో ఉన్నతంగా ఆవిష్కరించారు.. ఆయనను కవిత్వాన్ని నరనరాన జీర్ణించుకున్న మహా వటవృక్షంగా పాఠకుల ముందు నిలిపారు. ‘నాన్నా! నాకు మరణం లేదు’ కవితలోని ప్రతి పంక్తి పాఠకులను కదిలించేలా ఉంది.
చిలకమర్తి నరసింహం, ఆర్.విద్యాసాగర్‌రావు గర్లాపై కవితలు రాసి పాఠకులను మెప్పించ యత్నించారు. నీటి యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ.. నీరును జాతీయ సంపదగా పేర్కొంటూ ఓ కవితను ఇందులో పొందుపరిచారు. తెలుగు భాష పట్ల ఉపేక్ష వద్దంటూ.. మన భాష పట్ల ఇకనైనా అపేక్షను ప్రకటిద్దామంటూ ‘మాతృభాష’పై ఓ కవితను రాశారు.
ఇలా సీదాసాదాగా మద్దాళి రఘురామ్ గారు ఈ కవితా సంపుటిని వెలువరించినప్పటికీ.. ఆయన యొక్క సామాజిక చింతనను.. కళలు, కళాకారులు, సాహిత్యం, సాహితీకారుల పట్ల ఆయనకున్న గౌరవాభిమానాలను అభినందించి తీరుతాం.. సృజనాత్మకత ప్రతిభను సొంతం చేసుకున్న ఆయన కలం నుండి మున్ముందు మరింత గాఢమైన కవిత్వం జాలువారాలని కోరుకుందాం. కళలకు పల్లకీ మోసే బోరుూలమంటూ సవినయంగా ప్రకటించుకునే ఆయన ఉత్తమ వ్యక్తిత్వాన్ని, కార్యకర్తగా ఆయన వ్యవస్థాప్రియత్వాన్ని అభినందిద్దాం.

--దాస్యం సేనాధిపతి