పఠనీయం

తెలుగుజాతి నాడిని ప్రతిబింబించే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ పత్రికలు కథల పోటీలు నిర్వహించడం ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి వారపత్రికల ఒకప్పటి కథల పోటీలకు పెద్ద క్రేజ్ వుండేది. ఫలితాలు విడుదలై బహుమతి కథల ప్రచురణ జరిగినప్పుడు రెండవ బహుమతి పొందిన కథ మొదటి బహుమతికి అర్హమైనదిగా పాఠకులు భావించే సందర్భాలూ వుండేవి. అలాగే ఒక్కో పత్రికా బహుమతులకు కథలు నెంచుకోవడంలో - న్యాయనిర్ణేతలుగా ఎవరిని నియమించినా, సాధారణంగా ఒక ట్రెండ్‌కు ప్రాధాన్యం ఇస్తుందనీ, సెంటిమెంట్ కథలు, కన్నీరు తెప్పించేవి, అలాగే ఓ కొత్త ప్రపంచాన్ని మన హృదయంలో ఆవిష్కరించేవి బహుమతి కథలుగా భాసిస్తాయనిపించేవిగా వుండేది.
కథ తెలుగువారి జీవితానికి సంబంధించినదై వుండాలి అని సాధారణంగా కథల పోటీ నియమాల్లో కనపడే మాట! నిజంగా అలా తెలుగుజాతి నాడిని ప్రతిబింబించే ఆకట్టుకునే కథలు రాయడం సామాన్యమైన సంగతేమీ కాదు. అదిగో బహుమతి కథగా తను రాసే రచనను మలిచే ఆల్కెమీ తెలిసిన కథకుల్లో నేటి ప్రముఖ కథకుడు సింహప్రసాద్. 2009-2018 మధ్యకాలంలో తను రాసిన నూటయనభై కథల్లో ప్రతి మూడో కథకు ఆయన ఏదో ఒక బహుమతి నందుకున్నాడు. ఎంతో నైపుణ్యం వుంటే తప్ప ఎంతోమంది సాటి కథకుల కథలతో పోటీపడి బహుమతులు పొందడం సాధ్యంకాదు. అలాంటి రచనా నైపుణి, పాఠకుడికి నిజంగా ఎంతో బాగా నచ్చేలా, అతడు మెచ్చేలా రాసే దక్షత సింహప్రసాద్‌ది. మూస ఇతివృత్తాలు కాక, పాఠకులను స్పందించేసే విభినే్నతి వృత్తాల నెన్నుకుని కథలు రాయడం ద్వారా బహుమతులు పొందడం నిజంగా ప్రతిభా నిదర్శనమే.
చెలంకూరి వరాహ నరసింహప్రసాద్ అయిన కథకుడు సింహప్రసాద్ 1973లో ‘కథగా ముగియన కథ’ అని స్వాతి మాసపత్రికలో తొలి కథ రాశారు. ఆపై ఉద్యోగరీత్యా ఉత్తరప్రదేశ్ ఉనికిపట్టు కావడంతో 1986 నుంచి 1990 వరకూ ఆ కాలంలో ఏమీ రాయనే లేదు. 1992 నుంచి మళ్లీ కలం పట్టారు. ఇండియన్ బ్యాంక్‌లో ఆఫీసర్‌గా 2001లో స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం శ్రీశ్రీ అకాడెమీ - ఐఐటి ఫౌండేషన్ సెంటర్ స్థాపించి నిర్వహిస్తూ 200లో తిరిగి ఉధృతంగా రచనా వ్యాసంగంలోకి వచ్చారు. అప్పటి నుండి సుమారు 200 కథలూ, పాతిక నవలలూ రాశారు. నాలుగు నవలలకూ బహుమతులొచ్చాయి. బహుమతుల కోసమే తానెప్పుడూ కథలు రాయకపోయినా పోటీలను ఒక అవకాశంగా, సవాలుగా తీసుకుని పాల్గొంటూ పోటీ గడువు అనే టార్గెట్‌లోగా మంచి కథ రాసే ఉత్ప్రేరకాన్ని పొందుతున్నారు. తనను కదలించి, ఆలోచనలు రగిలించి స్పందింపచేసిన అంశాల నన్నింటినీ కథలుగా మలిచి మెప్పించే ప్రజ్ఞ నిజంగా సింహప్రసాద్ కలం బలమే!
63 బహుమతి కథానికలు అనే సింహప్రసాద్ ఈ కథల సంపుటిలోని ప్రతి కథా విలక్షణమైనదే. పోటీకి వచ్చిన ఇతర కథలతో సవాలు చేసి ఏదో బహుమతి గెలుచుకున్నదే. 1978 నుండి ఈ 2018 వరకూ రాసిన కథల్లో నవ్య, స్వాతి, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, జాగృతి వంటి వివిధ పత్రికలలో పలు సంస్థలు నిర్వహించిన పోటీల్లో బహుమతులందుకున్న 63 కథలు విశిష్ట సంకలనం ఇది. వస్తు వైవిధ్యం ఆయన సొంతం. సమకాలీన సమాజం పట్ల, సమస్యల పట్ల నిశిత అవగాహన, పరిశీలన ఆయన కథలను నిజంగా బహుమతి సమార్హాలుగా నిలబెడుతున్నాయి. ‘పురుషుడు’ అనే కథ సహజీవనం పేరుతో నేడు సాగుతున్న యువతీ యువకుల జీవన సంవిధానంలోనూ ఎలా పురుషాధిపత్య ధోరణీ వుందో చెబుతుంది. జీవితపు ప్రతి మలుపులోనూ సింహావలోకనం మనుషులకు అవసరమనిపిస్తారు. ‘రియాల్టీ షో’ కథ నూకరాజు పాత్ర ద్వారా ఒక విలక్షణమైన మెరుపుతో చదువరులకూ జాగ్రత్తలు చెబుతుంది. ‘గోచర’ కథ ఒక ముస్లిం తన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక ‘ఆవు’ని కొని సాకడం మతం మానవీయతకు లోబడిందేనని చాటిచెప్పే మంచి కథ. కార్పొరేట్ విద్యారంగ నేపథ్యంలోని ‘దృక్పథం’, ‘పరబ్రహ్మ’ కథలు యువతను కూడా ఆలోచింపజేస్తాయి. మోడల్, పొగమేడలు, యోథ, ఓ సీత కథ స్ర్తిలకు ఆత్మవిశ్వాసంగల స్ర్తిలుగా స్ఫూర్తిదాయకమైన కథలు.
రచనలో పఠనీయత, అలవోక అయిన రచనాశిల్పం, కథానికను అనుభూతి రమ్యం చేయడం, చక్కని సంభాషణలు, ఒక బ్రతుకు తాత్వికత కలబోసిన కమనీయ కథాసంపుటి ఇది. సమకాలీన జీవితానికి వ్యాఖ్యానాలుగా పాఠకుల్లో కదలిక తెచ్చే మంచి కథల సంపుటికి స్వాగతం.

--సుధామ