పఠనీయం

తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాతవాహనుల నుండి
కాకతీయుల వరకు తెలంగాణ
(చరిత్ర, సంస్కృతి,
భాష, సాహిత్యం)
సంపా: ఆచార్య జి.అరుణకుమారి
డా.మల్లెగోడు గంగాప్రసాద్
తెలంగాణ సాహిత్య అకాడెమీ
పే.259. వెల: రూ.110

పురావస్తు ఆధారాలు, వాఙ్మయ ఆధారాలతో తెలంగాణ చరిత్ర - సంస్కృతులను అధ్యయనం చేసే ప్రయత్నంలో ‘సాతవాహనుల నుండి కాకతీయుల దాకా’ అనే జాతీయ సదస్సును ఏర్పాటు చేయగా, అందులో సమర్పింపబడిన పత్రాలతో ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో సాతవాహనుల వంశానుక్రమణికను పరిపాలన కాలావధులను తెలుసుకోవడానికి కరదీపికలుగా సంభావింపబడుతున్న పౌరాణిక కథనాలలో ఏకరూపత లేకపోవడం వల్ల సాతవాహన పరిపాలకులు, వారి కుటుంబ సభ్యులు జారీ చేసిన శాసనాలలో తగినంత సమాచారం లభించక పోవడం వల్ల వీరి చరిత్రను పునర్ లిఖించడానికి నాణేలు, ఇతర పురావస్తు ఆధారాలు ప్రధాన ఆకరాలుగా ఉపయోగపడుతున్నాయని అవధానం ఉమామహేశ్వర శాస్ర్తీ తెలియజేస్తున్నారు. సాతవాహనులకు పూర్వం స్థానిక రాజవంశాలు, జనపదాలు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందినట్లు, లిపిలేని నాణేలు తదితర పురావస్తు ఆధారాలవల్ల తెలుస్తుందని కేశవగారి అభిప్రాయం. తెలంగాణ చరిత్ర సాతవాహనులకన్నా చాలాకాలం ముందే, చారిత్రక యుగ ప్రారంభంలో అస్మక జనపద రాజులతో ప్రారంభమైంది. తర్వాత నందులు, వౌర్యులు, కోటిలింగాల స్థానిక రాజులు తెలంగాణను పాలించారు. దక్కన్‌లో వౌర్యుల అనంతరం సాతవాహనులు అధికారంలోకి వచ్చారు. సాతవాహన సామ్రాజ్యానికి ముందున్న ఆంధ్రుల చరిత్ర అస్పష్టంగా ఉందని డి.రాజారెడ్డి వివరించారు. సాతవాహనులకు సామంతులుగా ఉన్న ఇక్ష్వాకులు, శాలంకాయనులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు తర్వాత కాలంలో స్వాతంత్య్రం ప్రకటించుకుని రాజ్యాలు స్థాపించుకోవడం, వారి వైభవాన్ని ఈమని శివనాగిరెడ్డి, భిన్నూరి మనోహరి తెలియజేస్తున్నారు. తమిళ సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆచార్య ఎన్.జయప్రకాష్‌గారు తమిళ సంగ సాహిత్యంలో ‘సాతవాహనుల, కాకతీయుల ప్రస్తావన’ ఎక్కడెక్కడ ఉందో వివరించారు. కాకతీయ శాసనాల ఆధారంగా ఆనాటి సామాజిక చరిత్రను సమ్మెట నాగ మల్లేశ్వరరావు వివరించగా, 12వ శతాబ్దం నాటి బూదపుర శాసనాల ఆధారంగా తెలంగాణ చరిత్ర - సంస్కృతి గురించి ఆచార్య జి.అరుణకుమారి తెలియజేశారు. ఆచార్య మస శ్రీనాథ్‌గారి ‘మధ్యయుగ కర్ణాటకలో కాకతీయ సామ్రాజ్య విస్తృతి: ప్రభావ ప్రదానాలు’ ఆసక్తికరంగా రూపొందింది. సాతవాహనుల నుండి కాకతీయుల వరకు గల తెలంగాణ చరిత్ర - సంస్కృతిని రామోజు హరగోపాల్, ఆనాటి సంస్కృతిలో నృత్యకళ - నృత్తరత్నావళిల ప్రస్తావనలను, ప్రాశస్త్యాన్ని కె.సువర్చలాదేవి తెలియజేశారు. ‘తెలంగాణలో శైవ మతం’పై డా.వెంకటరామయ్య, ‘శుద్ధ భక్తి మార్గం - పాల్కురికి అనుభవసారం’ గురించి డా.వి.త్రివేణి రాసిన వ్యాసాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
‘తెలంగాణలో సంస్కృత సాహిత్య వికాసం’పై ముదిగంటి సుజాతారెడ్డి, ‘వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథసూరి’ని ప్రశంసిస్తూ ఆచార్య రేమిల్ల వేంకట రామకృష్ణశాస్ర్తీ రాసిన వ్యాసాలు ఇందులో వున్నాయి. ‘తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణం’ అని డా.సంగనభట్ల నరసయ్య నిర్థారించగా, ‘తెలంగాణలో తెలుగు లిపి, పదజాల వికాసం’ గురించి డా.వై.రెడ్డి శ్యామల తెలియజేయగా ‘తెలుగులో ఛందో వికాస దశ’లను నడుపల్లి శ్రీరామరాజు వివరించారు. ‘ప్రాచీన తెలంగాణ లాక్షణికులు’పై దార్ల వెంకటేశ్వరరావు ‘కుల పురాణాలు - తెలంగాణ సంస్కృతి’పై ఏలె లక్ష్మణ్, ‘తెలంగాణ శతక సాహిత్యం’ గురించి దేవారెడ్డి విజయలక్ష్మి, ‘తెలుగు చారిత్రక నవలల్లో కాకతీయుల చిత్రణ - వాస్తవికత’లపై ఎ.వి.వి.కె. చైతన్య, ‘తెంలగాణ తొలి చారిత్రిక వచన రచన - ప్రతాపరుద్ర చరితము’ అంటూ దొడ్ల సత్యనారాయణ, ‘ప్రాచీన రాతప్రతుల్లో తెలుగు లిపి, విశే్లషణ’ చేసిన డా.పాలెపు సుబ్బారావు వ్యాసాలు సమాచారాత్మకంగా ఉన్నాయి. చివరగా వాడ్రేవు చినవీరభద్రుడు ‘తెలంగాణ మొదటి నుంచి ప్రజలు నిర్మించుకున్న ప్రాంతం. తెలంగాణ చరిత్ర కూడా ప్రజలు నిర్మించుకున్న చరిత్రనే. ప్రజా క్షేమానికీ, సంక్షేమానికీ అవరోధంగా మారిన ఏ పాలకశక్తి కూడా తెలంగాణ ప్రజల ముందు నిలబడలేదనేదే తెలంగాణ చరిత్ర నుంచి మనం నేర్చుకున్న పాఠం’ అని ముగించడం బాగుంది.

-కె.పి.అశోక్‌కుమార్