పఠనీయం

బోధనా వృత్తిపరులకు ఉపయుక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగునాట శ్రీమదాంధ్ర మహాభారత, భాగవత, రామాయణ గ్రంథాలపై అనేక నామకోశాలు, నిఘంటువులు వెలువడ్డాయి. అంతేగాక ఇతర గ్రంథాలను, ఉపనిషత్తులను, అష్టాదశ పురాణాలను పరిశీలించి వాటిలోగల అనేక నామాలను సంకలనం చేసి వివిధ నామావళులతో కూడా గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. గతంలో
1.‘పురాణనామ చంద్రిక’ అని శ్రీ యెనమండ్ర వెంకటరామయ్యగారి పేర 1879 సం.లో ప్రచురింపబడింది.
2.‘పూర్వగాథాలహరి’ అని శ్రీ వేమూరి శ్రీనివాసరావు గారి పేర (వెంకట్రామా అండ్ కో వారి ప్రచురణ) 1952లో వెలువడింది.
3.‘పురాణనామ సంగ్రహము’ అని కీ.శే.సాధు లక్ష్మీ నరసింహశర్మ గారి పేర 1982లో ప్రచురింపబడింది.
4.ఆంధ్ర మహాభారత నిఘంటువు’ అని కీ.శే.అబ్బరాజు సూర్యనారాయణ గారి పేర 1987 లో తెలుగు విశ్వవిద్యాలయం వారు రెండు భాగాలు ప్రచురించారు. ఇవి అ నుండి ఔ వరకు ఒక భాగము, ‘క’ ఒక భాగము. తదుపరి భాగాలు అలభ్యము. ఈ నిఘంటువు భారతానికే పరిమితము.
5.‘పురాతన నామకోశము’ అను పేర డా.బూదరాజు రాధాకృష్ణగారు ఈ గ్రంథాన్ని 1996లో ప్రచురించారు.
6.‘శ్రీమదాంధ్ర మహాభారత నామ సర్వస్వము’ అను పేర పుత్తా పుల్లారెడ్డిగారు 2010లో ఒక గ్రంథాన్ని ప్రచురించారు.
పై వాటిలో భారత నామకోశాలు మాత్రం భారతానికి మాత్రమే పరిమితమయ్యాయి. 2017 సంవత్సరంలో ‘నామకోశము’ (కవిత్రయ మహాభారతము) అను పేర మరొక నామకోశం వెలువడింది.
పై ఉదహరించిన వాటిలో పురాణనామ చంద్రిక, పూర్వగాథాలహరి, పురాణనామ సంగ్రహంలో సంకలనం చేసిన నామాలు పరిమితముగానున్నవి. అయితే వీటిలో ఒక్క భారతభాగవత రామాయణ గ్రంథాలలోని పేర్లనే గాక ఇతర పురాణాలలోని, దేవీభాగవతం మొదలైన గ్రంథాలలోని నామాలను కూడా సంకలనం చేశారు. నామాల చివర అవి ఏ గ్రంథంలోనివో వివరించారు.
బూదరాజు రాధాకృష్ణగారు ప్రచురించిన పురాతన నామకోశములోని నామాలు అసంఖ్యాకములు. వీరు అష్టాదశ పురాణాలు, దేవీ భాగవత, ఉపనిషత్తుల, వేదాల, భారత భాగవత రామాయణ గ్రంథాల నుండి (తెలుగు - సంస్కృత గ్రంథాలు) నామాలను సంగ్రహించి రాశారు. వీరు పీఠికలో చూపిన గ్రంథాల సంఖ్య తొంబది వరకు ఉన్నాయి. అయితే నామాల వివరాలు సంక్షిప్తంగా పేర్కొనబడ్డాయి. నామం చివర అది ఏ గ్రంథం నుండి సేకరించబడిందో వివరణ నిచ్చారు.
భారత భాగవత రామాయణ నామకోశాలలో కూడా అవి ఏయే పర్వాల, స్కంధాల, కాండాలలోనివో ఉదహరించారు.
ఆర్.వెంకటేశ్వరరావు గారు ‘పూర్వగాథా కల్పతరువు’ అను పేర ఒక నామకోశాన్ని 2005 సంవత్సరంలో ప్రచురించారు. తదుపరి దీనిని పి.రాజేశ్వరరావుగారు ‘పురాణనామ నిఘంటువు’ అని పేరు మార్చి 2018లో ప్రచురించారు. ఈ నిఘంటువును వీరు విభజించి ‘అ నుండి హ’ వరకు పదాలుగాను, తక్కినవి సంస్కారాలు, న్యాయాలు, సంఖ్యల మీద తెలిపే పదాల అర్థాలు, యక్ష ప్రశ్నలు, చతుష్టి కళలు, పుత్రులు అని చూపారు.
ఆర్వియార్ గారి నిఘంటువులో సంకలనం చేసిన నామాలు ఏయే గ్రంథాల నుండి సేకరించబడినవో నామాంతరంలో ఉదహరించారు. భారత భాగవత రామాయణ గ్రంథాల నుండి, ఇతర గ్రంథాల నుండేగాక జైనబౌద్ధ మత గ్రంథాలను, ఉపనిషత్తులను, అష్టాదశ పురాణాలను కూడా పరిశీలించినట్లుగా కనబడుచున్నది.
ఈ గ్రంథం ప్రతి తెలుగు విద్యార్థికేగాక పౌరాణిక గ్రంథాలపై ఆసక్తి గలవారికి, బోధనా వృత్తిపరులకు ఉపయోగపడగలదని అనడంలో సందేహం లేదు.

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం