పఠనీయం

ఆసాంతం అద్భుత శైలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శప్త్భూమి
రాయలసీమ చారిత్రక నవల
-బండి నారాయణస్వామి
వెల: రూ.125.. డాలర్లలో: 10
ప్రతులకు: ఉభయ రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

‘శప్త్భూమి’ రాయలసీమలోని అనంతపురం జిల్లా ప్రాంతపు చరిత్ర నేపథ్యంలో రాసిన నవల. పద్దెనిమిదవ శతాబ్దంలోని క్రీ.శ.1775వ సంవత్సరంతో మొదలై క్రీ.శ.1788 వరకు రాయలసీమ పరిసరాల చారిత్రక వివరాలు, పాలకులు, సామంతులు, దళపతులు, పాలెగాండ్లు, ప్రజలు, వారి నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మొదలైన వివరాలు అన్నీ. గొప్ప శైలి, శిల్పంతో వివరించబడ్డాయి.
కృష్ణదేవరాయల తర్వాతి కాలంలో, విజయనగర సామ్రాజ్యం విచ్చిన్నమవుతుంది. ‘వీధికొక్క రాజు, ఊరికొక్క చక్రవర్తి’ తమతమ ప్రాబల్యాన్ని ప్రకటించుకున్న రోజులవి. హండె హనుమప్ప నాయకుడి వారసుడు సిద్ధరామప్ప నాయుడు అనంతపుర ప్రాంతాన్ని పాలిస్తున్న రోజుల్లో కురుబ (గొర్రెల కాపరి) కులానికి చెందిన బిల్లే ఎల్లప్ప తన ధైర్య సాహసాల వల్ల వాండే సంస్థానంలో ‘జెట్టి’గా నియమితుడై ఎల్లప్ప జెట్టిగా పిలువబడుతూ దళవాయి ఆదరణకు పాత్రుడవుతాడు. ఎన్నో ఉత్తాన పతనాల తరువాత, ఒకనాటి అనావృష్టి కాలాన, సంస్థానం అంతా బీడుపట్టి పోతుంది. చెరువు లెండిపోతాయి. సంస్థానం చెల్లించాల్సిన కప్పము పైకము కట్టలేకపోతుంది. బిల్లే ఎల్లప్ప వానల కోసం వీరమంటపం ఎక్కి తనకు తాను గండకత్తెర వేసుకుని శ్రీశైల మల్లికార్జునుడికి సమర్పించుకోవటానికి మొక్కుకుంటాడు. ఎవరెంత వారించినా ప్రభు భక్తి పరాయణుడైన ఎల్లప్ప జెట్టి, శరీరం నుండి ఒక్కో అంగాన్ని వేరుపరుచుకుంటూ ఒక్కో దిక్కుకు సమర్పించుకుంటూ చివరకు దీక్షా నిర్వాహకుడి చేతిలో తన తలను వేరు చేయించుకుంటాడు. ఇంతా చేసినా ఆ రాత్రి అనంతపురం ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తాయి కాని వానలు రావు. ఏ దివాణపు సంక్షేమానికి ఎల్లప్ప ఆత్మత్యాగము చేసుకుంటాడో, ఆ దివాణం గుత్తి సుబేదారు వశమయిపోతుంది. అనంతపురం శాపగ్రస్త భూమిగానే ఉండిపోతుంది. పాలకులు పట్టించుకోని ‘అనాధభూమి’గా మిగిలిపోతుంది.
చరిత్రను ఆధారం చేసుకుని నవలను సృష్టంచటం ‘అసిధారావ్రతం’. పఠనాసక్తత చెడకూడదు, పేర్కొన్న ప్రముఖ వ్యక్తుల సౌశీల్యాలకు విఘాతం కలుగకూడదు. పాత్రలను రచయిత ఇష్టం వచ్చినట్లు మలవకూడదు. ఇన్ని నియమ నిబంధనల్ని తు.చ తప్పక పాటిస్తూ నవలను ఆసాంతం గొప్ప శైలి, శిల్పంతో పోషించబడింది. ఆనాటి సామాజిక నమ్మకాలు, ఆచార వ్యవహారాలు కూలంకషంగా అధ్యయనం చేసి రూపొందించబడింది.
బిల్లే ఎల్లప్ప అత్తామామలు - బీరప్ప ఉజ్జినమ్మ భార్య ఇమ్మడమ్మ, ఇమ్మడమ్మ ప్రేమించిన కోడెనీలడు, తర్వాతి కాలంలో కోడె నీలడి జీవితం ఎల్ల చేతిలో నీలడి చావు. హండే పాలకుల రసికత (నాగసాని జీవితం) అణాకైనా సరే - ఆడపిల్లను అమ్ముకోవటం, ఆనాటి ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పార్శ్వాల ఆవిష్కరణ, దేవదాసీ వ్యవస్థ, మఠాల ఆధిపత్యం, ‘లంజె పన్ను’ లాంటి విచిత్ర పన్నుల ఔచిత్యం, అవసరం, పాలకుల నిరంకుశత్వం పాలితుల నిస్సహాయత్వం - ఒక్కటనేమిటి - పద్దెనిమిది శతాబ్దపు పలు పార్శ్వాలను, అతి ప్రతిభావంతంగా చిత్రించారు రచయిత బండి నారాయణ స్వామి.
చదువుకున్నంతసేపూ, పాఠకుడిని తనతో చేయి పట్టుకుని లాక్కుపోయి, ఆవిష్కరించిన దృశ్య శ్రవణ కావ్యంలా తీర్చిదిద్దటంలో రచయిత - వంద శాతము సఫలీకృతుడయ్యాడు.
పరాయి గడ్డ మీద ఉన్నా, మాతృభాష మీది మమకారంతో, ఆ భాష సాహిత్య సంస్కృతులను ప్రోత్సహిస్తోంది ‘తానా’ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా). నాలుగు దశాబ్దాల కాలంలో వటవృక్షమై ఎదిగి, తెలుగు కథ, నవల ప్రక్రియను ప్రోత్సహించే పుణ్యకార్యంలో భాగంగా 2017లో ఎంపిక చేయబడిన మూడు నవలలో మొదటి నవల ‘శప్త్భూమి’. మద్య విశేషాలు (పే.23), తంజావూరు కళావంతుల వర్ణన (పే.23), కళావంతురాలు జక్కుల పద్మసాని ఇంటి వర్ణన (పే.22, 23, 24), విజయనగర రాజుల స్నాన విశేషాలు (పే.27) ఆనాడు వాడబడే నెరులు (ప్రేమ. పే.18) పరస (తిరునాళ్ల పే.19) చల్లాడం (వస్త్ర) విశేషం (పే.19) గమ్మించటం (ఉసికొల్పటం . పే.21) లాంటి పద ప్రయోగాలు నారాయణ స్వామిగారి అధ్యయన శీలతను తెలుపుతాయి. ఒక గొప్ప చారిత్రక నవలను చదివామన్న భావన పాఠకులకు తప్పక కలిగించే నవల ఇది.

-కూర చిదంబరం 8639338675