పఠనీయం

చరిత్ర పుటలలో చీకటి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యారణ్య విజయం (చారిత్రక నవల)
-వి.వి.సుబ్రహ్మణ్యం
పుటలు: 300.. వెల: రూ.200
ప్రతులకు: సాహిత్య నికేతన్
3-4-852, కేశవ నిలయం
బర్కత్‌పురా, హైదరాబాద్-500 027

చారిత్రక నవలకు ముఖ్యాంగాలు మూడు. అవి 1.కథనశిల్ప రమ్యత 2.చారిత్రక ప్రామాణికత 3.నిర్భీతి తోడి నిక్కచ్చి (మోమోటము లేమి). ఈ మూడు ముఖ్య లక్షణాలూ ముప్పేటగా ముడివేసుకొని రూపుదిద్దుకుంటే అలాంటి నవలా రచన నాలుగు కాలాలపాటు పాఠక లోకంలో ‘పరిమళిస్తుంది’ - కాదు - ప్రజ్వలిస్తుంది. అంతేకాదు. ఒక్కొక్కప్పుడు అది సమాజంలో సంచలనం ‘రగిలిస్తుంది’. ఆత్మవిమర్శకు పురిగొల్పుతుంది; ఆత్మ విస్తృతిని అంతం చేస్తుంది. అలాంటి నవల ‘విద్యారణ్య విజయం’.
హంపీ విజయనగర సామ్రాజ్య సంస్థాపనాచార్య, మహాయోగివరేణ్య విద్యారణ్య స్వామి యొక్క మహాస్ఫూర్తి దాయక జీవిత చరిత్రను, తత్సమకాలీన కాకతీయ సామ్రాజ్య ప్రాభవ, పతనాలను, అల్లాఉద్దీన్ ఖిల్జీ అమానుష, మతమదోన్మత్త క్రూర పైశాచిక యావజ్జీవిత రీతిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ కమనీయ కథనశిల్ప సంవిధానంతో సాగిపోతుంది మొత్తం నవల.
క్రీ.శ.1304 సం.లో కాకతీయ సామ్రాజ్యం మీద అల్లాఉద్దీన్ సుల్తాన్ సైన్యాలు జూనాఖాన్, జాజ్‌ఖాన్ల సైన్యాధిపత్యంలో నిష్కారణ దండయాత్ర చేసి, ఉప్పరపల్లె యుద్ధంలో చావుతప్పి తోక ముడుచుకోవటం దగ్గర్నుంచి మొదలుపెట్టి, ఆ తరువాత మాలిక్క్ఫార్ ద్వారా ఆ ఢిల్లీ సుల్తాన్ గుజరాత్, బంగాళ, ఓఢ్ర, ఆంధ్ర, ద్రవిడ, పాండ్య రాజ్యాల మీద నిర్దాక్షిణ్యంగా దాడి వెనక దాడి చేయించి, కావించిన అసంఖ్యాక దేవాలయ విధ్వంసాలు, దోపిడీలు, దహనాలు, మానవతీ మానభంగాలు, నరమేధాలు, లూటీలు, సుంకాల ఆరళ్లు, ధీరోదాత్త యోధులను చిత్రహింస పెట్టటాలు, పరరాజుల పత్నులను బలాత్కారంగా తన రాణులనుగా చేసుకోవటాలు, ‘ఉంచుకోవటాలు’, పారించిన రక్తపు టేరులు, అల్లాఉద్దీన్ స్వలింగ సంపర్క వ్యాపకాలు, ఆ తరువాతి పాదుషాలైన తుగ్లక్ మొదలైన ప్రబుద్ధులు కూడా అల్లాఉద్దీన్‌కు జెరాక్స్ కాపీ ల్లాంటి మతాహంకార, ఉన్మాద ధోరణిలోనే చేసిన దారుణాలు - ఇలాంటివన్నీ ఒకవైపు వివరిస్తూనే మరోవైపు కాకతీయ పతనానంతరం రెడ్డిరాజులు, కమ్మ ప్రభువులు, కాయస్థులు, క్షత్రియులు సమైక్య రాగంతో విజృంభించటం, హరిహర బుక్కరాయళ్ల చేత విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్య సంస్థాపన చేయించటాలు కూడా సమాంతరంగా, ఉత్కంఠభరితంగా, పఠనాభిరుచి ప్రవర్థకంగా రాశాడు రచయిత.
ఈ రెండు భాగాల మధ్యగానే విద్యారణ్యులు, వారి సోదరులైన సాయణాదుల వారి జననం దగ్గర్నుంచి విద్యారణ్య, సాయణుల విద్యాభ్యాసం, విద్యారణ్యుల వేద, బహుశాస్త్ర విజ్ఞాన సమగ్రతా సముపార్జన, సన్యాసదీక్ష, హంపీలో భువనేశ్వరీ కరుణా ప్రసాద రూప స్వర్ణరాశుల లభ్యత మొదలైన మహత్తర స్ఫూర్తిమంత చరిత్ర ఘట్టాల వర్ణన చాలా అద్భుతంగా సాగిపోతుంది.
ఇలా క్రీ.శ14,15,16వ శతాబ్దులలోని తురుష్కుల అమానుష దండయాత్రలు, విద్యారణ్య స్వామి చరిత్ర, తెలుగు నేల - దక్షిణ భారతాల రాజకీయ పునర్వైభవం అనే మూడు అంశాలు - ఏ ఘట్టానికా ఘట్టం మార్చిమార్చి చెయి తిరిగిన చలనచిత్ర దర్శకుని చిత్రానువాదం (స్క్రీన్‌ప్లే) లాగా ఆసాంతం సాగిపోతుంది.
ఈ చారిత్రక నవలలో వీర, రౌద్ర, బీభత్స, కరుణ, శాంత రసాలు ఎక్కడికక్కడ సందర్భోచితంగా ఒప్పారాయి.
విద్యారణ్య పాత్ర చిత్రణ సుబ్రహ్మణ్యంగారి రచనా నిపుణతకు ఒక ఉదాహరణ. తన ఆశ్రమపు గుడిసెలో దొరికిన ఏడు బంగారు కాసులను బుక్కడికివ్వటం ఆ యోగి నిస్సంగత్వ నిరోహతలకు నిదర్శనం.
‘మాలిక్క్ఫార్ సైగ చేయగానే ఒక ఖాన్ హైందవ వీరుడైన శంకర దేవుడి శిరస్సును ఖడ్గంతో తెగవేశాడు. కంఠం నుంచి చివ్వున రక్తం ‘చిమ్మింది’. కింద పడ్డాక కూడా ఆ శిరస్సులో ధిక్కార ముద్ర చెరగలేదు’ అంటూ ఉన్న 122వ పుటలోని వాక్యాలలో హైందవ వీరుని ఆత్మగౌరవ, ధీరతా సమగ్రతలు ధ్వనించటం బాగుంది.
మోమోటము లేమి ఈ నవల కలిమి. చరిత్ర పుటలలో చీకటి వెలుగుల దర్శనం ఈ ‘విద్యారణ్య విజయం’.
నిన్నటి చరిత్ర రేపటికి దిక్సూచి.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం