పఠనీయం

తెలంగాణా సంస్కృతికి ఒక వైతాళిక కవితాగానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాం రాష్ట్ర ప్రశంస
అను తెలంగాణా రాష్ట్ర ప్రశంస
-శేషాద్రి రమణ కవులు
సంపా: ఆచార్య జయధీర్ తిరుమలరావు
పుటలు: 140
వెల: రూ.100
ప్రతులకు:
సాహితీ సర్కిల్, 401
ఘరోండా అపార్ట్‌మెంట్స్
ఓయూ మెయిన్ గేటు దగ్గర
ఒకటవ సందు,
హైదరాబాద్-500 007.

తెలుగులో తొలి జంటకవుల్ని మలయమారుత కవులంటారు. వారు నందిమల్లయ, ఘంట సింగన. వారు ప్రబోధ చంద్రోదయమనే తాత్త్విక సంస్కృత నాటకాన్ని రసవత్తర కావ్యం మలచిన మహానుభావులు.
తెలుగులో జంటకవుల పరంపర తిరుపతి వేంకటకవులు, వేంకట పార్వతీశ్వర కవులు, రామకృష్ణ కవులు, కొప్పవరపు కవులూ - ఇలా సాగింది. ఆ కవిత్వపు సాగుబడిలో ఒక ముఖ్య కవుల జంట శేషాద్రి రమణ కవులు. లక్షణబద్ధ కంకణులైనా వారు విలక్షణ కవులుగా చరిత్రలో నిలిచారు. కారణం వారి వౌలిక చరిత్ర పరిశోధన, కాలిక ప్రబోధ స్పృహ. కవులు, వ్యాఖ్యాతలు, పీఠికాకర్తలు, ఖండకావ్యకర్తలు, అవధానులు, అనేక శతకాల మూల మట్టాల, వైపు వాటాల అంశాల్ని కాంతులీనజేసినవారు.
సంకుచిత ధోరణుల్ని దూరం చేస్తూ సంస్కృతి అనేది కళాసాహిత్య చారిత్రక హృదయాల్ని కలుపుతుంది.
రాజమహేంద్రవరంలో నన్నయ్యకుగాని, రాజరాజ నరేంద్రుడికి గానీ సముచిత స్మారక చిహ్నాలూ ఏవి లేని కాలంలో తెలంగాణా సోదరులు వారి పేర్లతో హనుమకొండ, ఓరుగల్లుల్లో పొత్తపు గుడుల్ని ఏర్పరచారు. శేషాద్రి రమణ కవులు తెలంగాణా సాంస్కృతిక చైతన్య తాదాత్మ్యంతో రాసిన ఓ అఖండ ఖండ కావ్యం ‘నిజాం రాష్ట్ర ప్రశంస’. ఉత్తరాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, నిజాం రాష్ట్ర ఆంధ్రులు ఇలా అనడం వుండేది. నిజాం రాష్ట్రం అంటే తెంలగాణాయే అందుచేతనే ప్రజలకి తెలియడానికి వీలుగా ‘నిజాం రాష్ట్ర ప్రశంస’ అనే కవులు పెట్టిన పేరుకి అను తెలంగాణ రాష్ట్ర ప్రశంస అని చేర్చారు. చేర్చడానికి గల కారణాల్ని ప్రత్యేకంగా వివరించారు.
ఒక జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరించడం ఎంత గొప్పదో అలభ్య గ్రంథాల ఉద్ధరణ కూడా అటువంటిదే. పాత శిల్పాల్ని మార్చకూడదు. కొత్త అండలు చేర్చి తీరాలి. తాటిఆకుల పొత్తాల నుద్ధరించడంలో మేటి పనులు చేసిన నేటి వ్యక్తి జయధీర్ తిరుమలరావు ఈ గ్రంథ ఉద్ధరణకర్త. ఆయన ఈ పుస్తకంలో శేషాద్రి రమణ కవులపై రాసిన తెలంగాణ చరిత్రకు ఆస్థాన కవి పరిశోధకులు అని రాసినది చదివితే శేషాద్రి రమణ కవుల ఆత్మసాక్షాత్కార మవుతుంది. రాయప్రోలు, విశ్వనాథ, తుమ్మల వంటి వారెందరో ఆంధ్ర జన ప్రబోధ ఖండకావ్యాలు రాశారు. వాటిలో చారిత్రక స్పృహ ఉంటుంది. ఈ నిజాం రాష్ట్ర ప్రశంస తెలంగాణా ప్రబోధ కావ్యంలో చరిత్ర పరిశోధన, చరిత్ర లోతులూ బావుంటాయి. కొండూరు వీర రాఘవాచార్యులు వంటి గ్రంథాల్లో శిల్ప ప్రాభవాలు కవితాశిల్ప ప్రాభవాలు రెండూ మిళితమై ఉంటాయి.
’20వ దశకంలోనే - ఆనాడే తెలంగాణా శిల్ప, సాహిత్య, కళా వైభవ చిహ్నాలు జీర్ణదశలో ఉండడానికి జంట గుండెలు చలించిపోయి, సీమావధులు దాటి తెలంగాణా సాంస్కృతిక తాదాత్మ్యంతో సోదర తెలంగాణీయుల్ని మేలుకొలిపే వైతాళిక కవితాగానం - నిజాం రాష్ట్ర ఆంధ్ర ప్రశంస. పూవుల్లో తేనె ఒలికి పోతూండదు. ఆఘ్రాణిస్తే తేనె చుక్కల్ని చక్కగా అనుభవించగలం. అలా వుంటాయి ఇందలి సరవ సీస పద్యాలూ. ఇటీవల పద్య కావ్యాలు కొనుగోలు సాహిత్యంలోకి అంతగా చేరడం లేదు. 1920లోనే తొలి అచ్చుగా వచ్చిన ఈ ఖండ కావ్యం ఆ రోజుల్లో తక్కువ జనాభా వున్న కాలంలో 500 ప్రతులు రెండు నెలల్లోనే కర్చు పడ్డాయంటే గ్రంథ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
నిజాం కళాశాల చరిత్రాచార్యులు ఎస్.హనుమంతరావు 1926లో ఈ పుస్తకానికి రాసిన ఆంగ్ల పీఠిక జ్ఞాన ప్రయోజనదాయకంగా ఉంది. తెలంగాణా సోదరులారా! మీకింత చరిత్ర ఉంది, ఇంత శిల్పం వుంది, ఇంత ప్రత్యేకత ఉంది. అన్నిటినీ ఉద్ధరించుకోవాలి. ఉద్యమ ధోరణిలో మీరుండాలి అని శేషాద్రి రమణ కవుల ఉద్బోధనల, భావుకతల సమాహారం ఈ ఖండకావ్యం.
నైజాము రాష్ట్ర మాత అని అంటూ రాయడంలో తెలంగాణ తల్లి అవ్యక్తంగా వ్యక్తమవుతుంది.
ఈ శతావధానులు రాసిన ఈ ఖండ కావ్యంలో ఆంధ్ర కవులు, ఆంధ్ర వీరులు, చరిత్ర ప్రదేశములు వంటివి వున్నాయి. అనుబంధంలో బమ్మెర పోతరాజు, విస్తృత నగరము, ఓరుగల్లు కోట, తెలంగాణము, భువనగిరి దుర్గము, పరిశోధనోద్యమము, కాకతిమాత, స్థానిక చరిత్ర వంటి ఖండికలున్నాయి.
ఆంధ్ర సారస్వత సంప్రదాయాల్ని మీరు చదవాలి అని యవన సోదరుల్నీ ఈ కవులు ప్రబోధిస్తారు. ‘సాధ్యమైనంతలో సాహిత్య ధనమును స్ర్తి జనంబునకు అర్పింపవలయు’నని స్ర్తిలను పట్టించుకుంటారు.
ఆంధ్ర భాషకై అవసరపడినచో ప్రాణముల్ విడుచు సోదరులు లభించుదనుక’ తెలంగాణ వారు పోరాడాలని ఈ ఆంధ్ర ప్రాంత కవులు చెప్పడంలో ఒక నిజాయితీ సంస్కారం కలసికట్టుగా పరిమళిస్తున్నాయి. కేవీ లక్ష్మణరావు, వీరేశలింగం, పిఠాపురం రాజా, తిరుపతి వేంకటేశ్వర కవులు వంటి వారు తెలంగాణాలో కూడా వుండేవరకూ నిదురించవలదని ప్రబోధించడంలో స్వాతిశయం కాక సదాశయమే వుందనిపిస్తుంది. పోతన వంటి కవుల నిజ నివాస పరిశోధనలు చేసి ఆ అంశాల్ని ప్రజలకి పద్యమణుల ద్వారా వెల్లడి చేస్తారు వీరీ కబ్బంలో. చరిత్రలో ప్రశ్నలు తెలుపుతారు. వారి పరిశోధనోత్తరాల్నీ ఉత్తమ పద్యాలలో నిబంధిస్తారు.
సంస్కృతి రక్షించుకోడానికి తెలంగాణాలో యువక బృందాలేర్పడాలనే వీరి తపనలో ఎంతో ఉదాత్తత నిండి ఉంది. 20వ దశకంలో వచ్చిన ఈ గ్రంథం తెలంగాణా నూతనోద్యమాలకి దారి వెలుతురు దీపంలా భాసించింది.
ఆంధ్ర కవులు అని తెలంగాణా కవుల గురించి వీరు రాసిన పద్యాలు చారిత్రక వైభవ స్మరణాలు. స్ఫూర్తి మూర్తుల చరిత్రాంశ ఉల్లేఖనాలు ఖండకావ్యంలో అధికాధికం సీసాలే. ఎత్తు గీతుల్లో నైఋతి రాష్ట్ర తెలుగు ప్రజల కర్తవ్య బోధనలు సూటిగా వుంటాయి. కాంశ్య భేరుల్ని వినిపించాలి. ప్రశాంతిగా నిర్లక్ష్యంలో బ్రతకరాదు. కీర్తిచంద్రికలు మళ్లీ రంజిల్లేలా చేయండి. ‘విస్మృతి సముద్రంలో వీరగాథల్ని అలక్ష్యం చేయకండి’ అంటారు. ధూపాటి శేషాచార్యులు, ధూపాటి వెంకట రమణాచార్యులూ వీరిద్దరూ కలిసి శేషాద్రి రమణ కవులు వీరు ఏకోదరులు. గుంటూరు జిల్లా వాడరేవు వాస్తవ్యులు వేంకట రంగాచార్యులు, లక్ష్మమ్మ దంపతులకు మూడవ నాల్గవ కుమారులుగా పుట్టిన వీరు కొప్పరపు కవుల వంటి వారి ప్రశంసలు పొందిన జంట కవులు. గ్రంథ పరిశోధన, క్షేత్ర పరిశోధన, కవిత్వ రచనలతో విఖ్యాతి గాంచారు. పిఠాపురం రాజా ఈ కవుల్ని ఆదరించారు. తెలంగాణా తదితర ప్రాంతాల్లో వీరు సేకరించిన తాళపత్రాలు, శాసనాలు, చారిత్రక సామగ్రి మరెవ్వరూ సేకరించలేదని బిరుదు రాజు రామరాజు వంటి జీవిత చరిత్రకారులే చెప్పారు. ఈ గ్రంథ అనుబంధంలో పోతరాజు, ఓరుగల్లు కోట, తెలంగాణం, కవి నిర్వేదం వంటి ఖండికల్లో వీరి పరిశోధనా పటిమ తెలుస్తోంది. కవులంటే కవిత్వ రంగానికే పరిమితం కానక్కర్లేదు. కళలు, చరిత్ర వంటి సంస్కృతీ సంబంధ సుగంధాలు కూడా వారి జీవితాల్లో పరిమళించాలని సాంస్కృతిక సామాజిక పాత్ర ఒకటి వారికీ ఉంటుందని శేషాద్రి రమణ కవుల జీవితాల రచనల నుండి విశేషంగా మనం గ్రహించాలి. అందుకీ గ్రంథం దిక్సూచి కాంతి అవుతుంది. గ్రంథోద్ధరణ కర్త జయధీర్ తిరుమలరావు అభినందనీయులు.

-సన్నిధానం నరసింహశర్మ