పఠనీయం

గతం వర్తమానానికి ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారుకల
రచన డా.సి.్భవానిదేవి
040-27636172
*
పూర్వం మహారాజులు ఎందరెందరో రాజ్యపాలన చేశారు. గర్వోన్నతిని పొందారు. కాని వారెవరు సంపదను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగలలేదు. శిబి ప్రముఖులు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా. లోకంలో సత్కీర్తి ఒక్కటే నిలిచి వెలుగుతుందన్న పరమ సత్యాన్ని చాటి చెప్పే సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల కీర్తి చంద్రికలను అక్షరబద్ధం చేసిన చారిత్రక నవల ‘బంగారుకల’. డాక్టర్ చిల్లర భవానీదేవి నవల.
చారిత్రక నవల రెండు విరుద్ధ భావాల సమ్మేళనం. చరిత్రలో వాస్తవ సంఘటనలను యథాతథంగా, క్రమానుగతంగా వివరించటం ప్రధానం. నవలలో కాల్పనికత ప్రధానం. చరిత్ర లక్ష్యం సత్య ప్రతిపాదనం. సాహిత్య ధ్యేయం కూడా సత్యప్రతిపాదనమే. చరిత్రకారుడు ప్రతిపాదించే సత్యం దేశ కాల బద్ధమైనది. దాన్ని విశ్వసించటానికి శాసనాది ఆధారాలు అవసరం. చరిత్ర ప్రధానంగా విశిష్ట వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. సాహిత్యంలో వ్యక్తులకు కాక వారి స్వభావాలకు, ప్రవర్తనకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. దేశ కాలబద్ధమైన వ్యక్తి చరిత్రను ఆధారం చేసుకొని కళాదృష్టితో, శిల్ప చమత్కారంతో శాశ్వత ధర్మాన్ని, సనాతనమైన సత్యాన్ని నిరూపించగలిగినది చారిత్రక రచన. ఒక కాల్పనికత, చరిత్ర సత్యం పరస్పరం సమ్మిళితమై అద్భుతమైన సాహిత్య స్థాయిని పొందుతుంది. అది చారిత్రక నవల.
సాంఘిక నవలలో కంటే చారిత్రక నవలలో బిగి అయిన కథ ఉంటుంది. ఉత్కంఠ ఉంటుంది. నిత్య జీవితంలో చూసే వ్యక్తులకంటె ఉదాత్తమైన వ్యక్తుల చరిత్ర ఉంటుంది. దీనివలన పాఠకుడికి ఒక ప్రేరణ అందుతుంది. జాతి చరిత్రలోని అమృతమయమైన, ఆదర్శవంతమైన, ఉత్తేజకరమైన గాధలు నవలలో వస్తువులయినప్పుడు ఇదిగో! నువ్వు తలచుకుంటే ఇంత గొప్పవాడివి కావచ్చు. ఇది నీ జాతి చరిత్ర అనే ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
ఈ నవలలో అభిషేక్, అమృత కల్పిత పాత్రలు. వారిద్దరూ విశ్వవిద్యాలయంలో కలిసి చదుకున్నారు. ప్రేమించి పెళ్లిచేసుకొని హంపి నగరాన్ని చూడటానికి వెళ్తారు. దీనితో నవల ప్రారంభమవుతుంది. తిమ్మరుసు మంత్రికి నమ్మినబంటుగా, గూఢచారులుగా జీవించి రాజ్యక్షేమం కోసం ప్రాణాలు అర్పించిన చంద్రప్ప, మంజరి ఇపుడు అభిషేక్, అమృతగా పునర్జన్మ ధరిస్తారు. ఇద్దరు విజయనగర సామ్రాజ్య వైభవలోన్నతికి కారకులై ప్రభువుల ఆదరణ చూరగొన్న కళాకారులుగా, నాటి స్వర్ణయుగ అనుభవాలను మననం చేసుకుంటారు. పూర్వజన్మ సృతులతో నిండిన కథలు, రచనలు పాఠకునిలో పఠనాసక్తిని కలిగిస్తాయి. గత చరిత్ర తెలుసుకొని వర్తమానాన్ని తీర్చిదిద్దుకొని భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించాలనే సార్థకమైన సందేశంతో నవల ముగించి సాహిత్య ప్రయోజనాన్ని పటిష్టంగా సాధించారు రచయిత్రి.

- డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి