పఠనీయం

నాటి సంగతులకు అక్షరరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకులు డా.పి.చిరంజీవినీ కుమారి,
ప్రచురణ: రచయితల సంఘం,
తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ.
ప్రతులకు ఫోన్ నెం.9484160230.
*
తూర్పుగోదావరి జిల్లా కళలకు కాణాచి. ఆనకట్ట నిర్మాణంవల్ల అక్కడ తిండి లోటులేదు. అందుమూలంగా అక్కడ వున్న మేధావి వర్గానికి ఉత్కృష్టమైన సాహిత్య సేద్యం చెయ్యటానికి మార్గం సుగమం అయింది. డా.పి.చిరంజీవినీ కుమారి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ‘తూర్పు గోదావరి జిల్లా సాహిత్య చరిత్ర 1880ల నుంచి 2015 వరకు’ అనే గ్రంథాన్ని ప్రచురించడం ఎంతో హర్షణీయం. దాదాపు 135 సం. సుదీర్ఘకాలంలోని కవుల, రచయితల, కళాకారుల జీవిత విశేషాలను పొందుపరచారు. 42 మంది సాహిత్యవేత్తలు వివిధ అంశాలపై కూలంకషంగా రచించిన వ్యాసాలను ప్రస్తావించారు. శాసన సాహిత్య పరిశీలనలో ద్రాక్షారామ శాసనాలు, పిఠాపురం కోమటిపేటలోని రాతి మశీదు వీధి అరుగు శాసనం, రాజమండ్రి మ్యూజియంలోని శాసనాలను ఉదాహరించారు. ప్రాచీన సాహిత్య చరిత్రలో నన్నయభట్టు, మల్లికార్జున పండిరాధ్యుడు, శ్రీనాథుడు, నిశ్శంక కొమ్మ క్రీ.శ. 1500లోని పెనుమత్సకవుల, ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సాహిత్య కృషి వివరించారు. గురజాడ అప్పారావుగారి ‘దిద్దుబాటు’ కధకు ముందు 92 కథలు వాటి యొక్క సమగ్ర నిర్థారణతో వి.వి.న.మూర్తి ‘కధానిలము’ సహకారంతో నిర్థారించారు. సంఘ సంస్కరణ సాహిత్యంలో శ్రీ కందుకూరి వీరేశలింగంగారి పాత్ర వివరించారు. వావిలాల వాసుదేవశాస్ర్తీగారు 1880లో వ్రాసిన ‘నందక రాజ్యం’ నాటకంలో బ్రాహ్మణుల్లోని నియోగ- వైదీక శాఖల మధ్య వున్న వైషమ్యాలు ఆనాటి సాంఘిక సమస్యలు వివరించారు. జాతీయోద్యమ సాహిత్యంలో శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ వారి గురించి చెబుతూ వారికి తూర్పుగోదావరి జిల్లాలో వున్న ప్రగాఢ అనుబంధం చెప్పారు. డా. వోలేటి పార్వతీశంగారి గోదావరి తూర్పు దారిలో నవ కవితాఝరి రసానంద మందాకినీ సోయగాలతో సాగింది. శతాబ్దాల వ్యవస్థమీద తిరుగుబాటు లేవదీసి కొత్త వ్యవస్థకు నాంది పలికిన ఎంతోమంది పోరాట కవుల కవిత్వాల గురించి ఆచార్య ఎస్.వి.సత్యనారాయణగారు అందించారు. అభ్యుదయ కవిత్వం దిగంబర కవిత్వం, అనుభూతి కవిత్వాల గురించి వ్రాశారు. ఎస్.రజియాబేగం, రాజమండ్రి వాసి సావిత్రిగారి స్ర్తివాద కవిత్వం వివరించారు.కథంటే కాలక్షేపం కాదు. కథంటే జీవితం, సమాజం. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతం యొక్క కధలతోనే ముడిపడి ఉంది. ఆ గాలి, ఆ నీరు, ఆ యాసలో ఎన్నో గోసలు ఉన్నాయి. నవ్వించే చెమక్కులు, హృదయాన్ని కదిలించే సన్నివేశాలు అక్కడే పురుడు పోసుకున్నాయి. కడికొండల వెంకట్రావు, వేదుల సత్యనారాయణ శాస్ర్తీ, భమిడిపాటి కామేశ్వరరావు, ముళ్లపూడి వెంకటరమణ, ఆవంత్స సోమసుందర్, యండమూరి వీరేంద్రనాధ్, వాడ్రేవు వరలక్ష్మీదేవి, వంగూరి చిట్టెన్ రాజు, ఆలూరి విజయలక్ష్మి, పోరంకి దక్షిణామూర్తి, ఎలక్రాన్ (పింగళి వెంకటరమణరావు), పోతుకూచి సాంబశివరావుగార్లు.. ఇలా ఎంతోమంది తమ కథల సాహిత్యంతో పాఠకలోకాన్ని జాగృతపరచారు. ఆధునిక పద్య కవిత్వం, బాల సాహిత్యంలో ఆరితేరిన ఘనులు ఉన్నారు.
నవలా రచన కూడా ఇక్కడే పుట్టిందంటే అతిశయోక్తి కాదు. 1872లో వచ్చిన రంగరాజు చరిత్రలో రవ్వంత రొమాన్స్ ఎక్కువ ఉంది. కనుక సాంఘిక లక్షణాలు ఉన్న రాజశేఖర చరిత్రను కందుకూరి వీరేశలింగంగారు 1875లో వ్రాశారు. శ్రీపాదవారి ‘రక్షాబంధనం’, మొక్కపాటి వారి ‘బారిష్టర్ పార్వతీశం’, ఎన్.ఆర్.నందిగారి ‘మరో మొహంజదారో’, కె.రామలక్ష్మిగారి ఈ తరం పిల్లలు, శత్రువుతో ప్రయాణం, సాధు సుబ్రహ్మణ్యశర్మగారి ‘బులకోలా’ చెప్పుకోదగ్గ నవలలు.
ఇక అవధాన చరిత్రలో కూడా ఇక్కడివారు ఇతరులకన్నా ఏమీ తీసిపోలేదు. అష్టావధానాలు, శతావధానాలు చేసిన విద్యా పండితులు చాలామంది ఉన్నారు. శ్రీమాన్ ప్రతివాద భయంకర రాఘవాచార్యులు, తిరుపతి వెంకటకవులు, ఓలేటి వెంటరామశాస్ర్తీ, వేదుల రామకృష్ణశాస్ర్తీ, సత్య దుర్గేశ్వర కవులు, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు ఉన్నారు. పశ్చిమ గోదావరిలో పుట్టినా కాకినాడ నా కన్నతల్లి అన్న డా. గరికపాటి నరసింహారావుగారిని మనమందరం ఎరుగుదుము.
కొందరు ప్రముఖ వ్యక్తుల గురించి జీవిత విశేషాలు వ్రాశారు. ఎన్నో అపురూప సంఘటనలు, సందర్భాలు అందించారు. ఎంతోమంది గొప్ప విద్వాంసులు, కళాకారులు, సరస్వతీ పుత్రులను అందించిన తూర్పుగోదావరి జిల్లా ఎంతో ధన్యురాలు. సాహిత్యలోకం వీరందరిని తలచుకొని గర్వించవలసిన సందర్భం. ఈ గ్రంథం తెలుగు సాహిత్య పరిశోధనలు చేసే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.

-జన్నాభట్ల నరసింహప్రసాద్