పఠనీయం

నేటి మహిళకు దీటైన దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆడదంటే..? సబల (నవల)
-అనురాధ (సుజలగంటి)
పుటలు: 176
వెల: రూ.150
ప్రతులకు: రచయిత్రి
303, అలేఖ్య రెయిన్‌డ్రాప్స్
ప్లాట్ నెం.17-18
గౌతమీ ఎన్‌క్లేవ్,
చెరిక్ పబ్లిక్ స్కూలు పక్కన
కొండాపూర్, హైదరాబాద్-84
‘పౌరుష జ్ఞాన కీర్తులఁ బఱగెనేని
వాని సంపద ఒకపూటయైనఁ జాలు
స్వార్థ సౌఖ్యాల లబ్ధినై సాగు బ్రతుకు
కాకి మనుగడ కన్నను కాదెలొచ్చు?’ అంటూ ఏనుగు లక్ష్మణకవి అనువదిత భర్తృహరి సుభాషితాన్ని కొంచెంగా మార్చి రాసుకోవాలి- నేడు సమాజంలో మూడు డబ్ల్యూల వ్యామోహాల మంటలను తమ తమ బ్రతుకులలో రగించుకొని, పండంటి సంసారాలను పాడు చేసుకుంటున్న కొందరు ‘మగమహారాజుల’ జుగుప్సావహ శైలిని చూస్తూ మనం.
ఈ దృక్పథం (కానె్సప్ట్)తో ఇటీవల శ్రీమతి అనూరాధ (సుజలగంటి) రచించిన నవల ‘ఆడదంటే.. సబల’
నవల పేరుకు తగ్గ సమతూకంలో కథాగమనం చక్కగా, సాఫీగా సాగిపోయింది. కథానాయకుడైన మధుకర్ తన మేనమామ కూతురు మాధవిని మనువాడతాడు. మధుకర్‌కు ధన, కనక, వస్తు, వాహనాలు, సంఘంలో స్టేటస్, దాని ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు ముఖ్యం. వాటి కోసం ఎంతకైనా తెగిస్తాడు. భార్య మాధవికి చెప్పకుండా తన ఆఫీసులో పనిచేసే మధురిమ అనే యువతిని రహస్యంగా గుళ్లో ఉత్తుత్తి పెళ్లి చేసుకొంటాడు. ఆ తర్వాత మధురిమ వృత్తి నైపుణ్యం ఆధారంగా తన పరిశ్రమ, వాణిజ్య వ్యాపకాలను, ఆర్జనను ఇబ్బడిముబ్బడిగా ఇనుమడించుకుంటాడు. అయినా తృప్తిపడక మధురిమకు మత్తుమందులిస్తూ వ్యభిచారం చేయిస్తాడు. పాపాలు పటాపంచలై జైలు పాలవుతాడు. పదేళ్ల చెరసాల శిక్ష పూర్తి చేసుకొని ధర్మపత్ని అయిన మాధవి, పిల్లల దగ్గరకు చేరతాడు. మధుకర్‌ను నమ్మి మోసపోయి, మోడుగా మిగిలిపోయిన మధురిమ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పుకొని, దీనులకు, ఆర్తులకు తోడుగా నీడగా ఆదుకునే అండగా శేష జీవితాన్ని ఉదాత్త పథంలో గడుపుతుంటుంది. ఇదీ సూక్ష్మంగా కథ. ఈ కథలో విశేషాంశమేమిటంటే అగ్నిసాక్షిగా, అందరి సాక్షిగా పెళ్లాడబడి న మాధవి, మధుకర్‌తో కేవలం సహచరి గా మాత్రమే ఉంచుకోబడి, కొంతకాలం సహజీవనం సాగించిన మధురిమ - ఈ ఇద్దరూ పరస్పర సహానుభూతితో ఒక్కటై మధుకర్‌ను న్యాయస్థానంలో ఓడించి, పదేళ్ల జైలుశిక్ష గుణపాఠంతో అతనిని పశ్చాత్తప్తునిగా చేసి, ఆడదంటే బేల అబల కాదు - సబల, ఆదిశక్తి అని రుజువు చేస్తారు.
కథ చాలా సింపుల్‌గానే ఉన్నా కథనం మాత్రం చాలావరకు ఉత్కంఠభరితంగా సాగిపోతుంది. గమనంలో పఠనీయత ఉంది. సందేశాత్మకత ఉంది. ‘మృగాళ్లు’ జరిపే పాశవిక, పైశాచిక కృత్యాలకు సహాయపడే ప్రమాదకర మాదకద్రవ్యాల (డ్రగ్స్) ప్రస్తావన, వాటి విషయంలో నేటి యువతులకు చేసే హెచ్చరికలు, అలారంలు చాలా బాగా బలమైన వాణిలో వినిపించారు రచయిత్రి. 136వ పుట నుంచి 140వ పుట వరకున్ను, 157వ పుటలోను ఉన్న సంభాషణల్లో, కథనంలో కరుణరసం స్రవించింది.
నేడు కొన్నికొన్ని టీవీ ఛానల్స్‌లో వస్తున్న సీరియల్స్, వాటిలోని సంభాషణలు కౌమార (టీనేజ్) దశలో ఉన్న చాలామంది పిల్లల మనస్తత్వాలను ఎలాంటి దుష్ప్రభావాలకు, వక్రభావాలకు, అవాంఛనీయ భావనలకు లోను చేస్తున్నాయో 158, 159వ పుటలలో కనిపిస్తుంది. ‘తెలుపు ఏడు వంకలను కప్పితే నలుపు నాలుగు వంకలను చేర్చుతుంది’ వంటి గొన్ని గంభీరార్థపు సామెతలు అక్కడక్కడ తళుక్కుమన్నాయి.
అంతా బాగానే ఉంది గానీ 29వ పుట చివరలో ‘మధుకర్ వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు’ అనే వాక్యంతో సస్పెన్స్ (ఉత్కంఠ) అక్కడికక్కడే అప్పటికప్పుడే కొంచెం సడలింది. ఇలాంటివే కథాకథన శిల్పంలో దొర్లే పొరపాట్లు సాధారణంగా జాగ్రత్త పడాలి. 16వ పుటలోని ‘కవి అయితే తన కావ్య దర్శనాన్ని కనకుండా ఉండలేడు’ అనే వాక్యం సరికాదు. ‘కవి అయితే కావ్యదృష్టితో కనకుండా ఉండలేడు’ అనాలి. 69వ పుటలో ‘ఆలస్యం అమృతం విషం’ అనకూడదు. అలా రాస్తే ఆలస్యమూ, అమృతమూ - రెండూ విషమే అనే అర్థం వస్తుంది. ‘ఆలస్యాదమృతం విషం’ అనాలి. ఆలస్యం చేస్తే అమృతమైనా విషం అవుతుంది అని అర్థం.
74వ పుటలో నయన ‘దళాక్షుడు’ అనే పదానికి అర్థం లేదు. ‘నళినదళాక్షుడు’ అనాలి- పద్మపు రేకుల వంటి కన్నులు గలవాడు అనే అర్థంలో. అక్కడక్కడ కనిపించిన ‘ములిగిపోవు’ ‘మనస్థాపము’ అనేవి శబ్ద దోషాలు. మునిగిపోవు, మనస్తాపము అనాలి.
మొత్తం మీద ఈ ‘సబల’ ఒక మంచి నవల.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం