పఠనీయం

పాఠకులకు కథా బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మకు బహుమతి కధలు-
రచన: సింహప్రసాద్, వెల:రూ.80/-,
కాపీలకు: శ్రీశ్రీ ప్రచురణలు 9849061668 మరియు
ప్రధాన పుస్తక కేంద్రాలు
*
బహుమతులు ఇవ్వటానికి రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి గ్రహీతను ప్రశంసిస్తూ, రెండవది గ్రహీతపై తన కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తూ.
తను కన్నవారికోసం క్రొవ్వొత్తిలా కాలిపోతూ, వెలుగిచ్చిన అమ్మకు ఏం బహుమతి ఇస్తే బావుంటుంది? తనవారు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా కలిసికట్టుగా ఉండటం కంటే గొప్ప ‘బహుమతి’ మరేదీ ఉండదు అన్న విశ్వసత్యం తెలుసుకున్న పిల్లలు అద్భుత అనుభూతికి లోనవుతే- ఆశ్చర్యం ఏమీ లేదు. ఇదే సత్యాన్ని ఒక మంచి కధగా మలిచి మన ముందుంచారు రచయిత సింహప్రసాద్‌గారు తన ‘అమ్మకు బహుమతి’ అన్న కధాసంకలనంలో.
నేటి తరం పాఠకులకు రచయిత సింహప్రసాద్ (చెలంకూరి వరహా నరసింహప్రసాద్)గారు చిరపరిచితులే! వీరింతవరకు 63 నవలలు, 13 కధా సంపుటులు, హిందూ వివాహ వ్యవస్థ, తిరుమల దివ్య క్షేత్రం లాంటి వివిధ వైవిధ్య విషయాలపై తమ ‘కలచాలనం’ గావించారు. స్పష్టత, సమగ్రత, సంక్షిప్తత వీరి రచనల ముఖ్య లక్షణం. రాసిలోనూ వాసి చూపించిన వీరి రచన్లో సింహభావం పలు పురస్కారాలు బహుమతులు, ప్రశంసలు పొందటం విశేషం. వీరి కధలమీద ఒకరు, నవలల మీద మరొకరు, బహుమతి కధల మీద ఇంకొకరు పిహెచ్‌డి నిమిత్తం పరిశోధన చేస్తున్నారు. వీరి ఇటీవలి నవలలు ‘్ధక్కారం’, ‘అభయం’ ప్రముఖుల ప్రశంసలు అందుకుని, విశ్వ విఖ్యాత ఆంగ్ల రచయిత ‘ఆర్డర్ హెయిలీ’ని తలపిస్తాయి. సుమారు 400 కధల్లో నాలుగోవంతు కధలు బహుమతులందుకున్నాయి.
‘పాఠక లోకానికి అపురూప బహుమతి’గా ప్రముఖ కధ, నవల, నాటక రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావుగారిచే కొనియాడబడ్డ ఈ సంకలనంలో 20 కధలున్నాయి. ఇవన్నీ 2018 మరియు 2019 మధ్య ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి. వేగం, మెరుపు, వైచిత్రం, నాటకీయత, జీవిత సత్యంపై ఒక కొత్త దృష్టి- కధలకు ‘పంచప్రాణాలు’ అని చెప్పుకుంటే- ఇవన్నీ సింహప్రసాద్‌గారి ఈ కధల్లో పాఠకులు చూడగలుగుతారు. స్ర్తిలు పైకి చెప్పుకోలేని, నెలనెలా ఎదురయ్యే సంకటం ‘నెలసరి’. మామూలు రోజుల్లోనే ఆడవారికి ఇదో సంకటం. ఇక తుపాన్ రోజుల్లో రక్షణ శిబిరాల్లో తలదాచుకున్న మూడొందల, ఆడా మగా, పిల్లా, పీచు, కుక్కా, కోడి లాంటి పెంపుడు జీవాలమధ్య పిల్ల వజనకు ఈ సమస్య ఎదురవుతుంది. మూడు రోజుల్నుండి తుపాను. మరో రెండు రోజులుదాకా వుంటుందని వాతావరణ సూచన. ఆకలి, కటిక చీకటి, అరకొర సహాయ చర్యలు, వనజ, దాని తల్లి, మరో నలుగురు, ఈ సంకటానికి ఎలా స్పందించారు.
చివరకు వనజ ఎలా బయటపడగలిగిందో చెబుతుందీ కధ. ‘సంకటం’ అతి సామాన్య సంఘటనను కథా వస్తువుగా తీసుకొని, ఇంకా ఇప్పటికీ, పల్లెటూళ్లలో ఈ బాధ వారిని ఎలా బాదిస్తున్నాడో తెలుపుతుంది.
గవర్నమెంటు వారు పలు సంక్షేమ పథకాల్ని ప్రకటిస్తారు. వీటితో ప్రజలకు ఎంత మేర మేలుకలుగుతుందో కాని ప్రభుతకు దాన్ని నడిపే పార్టీకి గొప్ప పేరు వస్తుంది. ఎన్నికల్లో వారికి గొప్ప ప్రయోజనకారి అవుతుంది. అయితే ఆ పథకాల అమలువల్ల సామాన్య జనానికి ఎలాంటి నష్టం కలుగుతుందో అన్న పాయింట్‌ను ‘మానవి’ అనే పదవ తరగతి చదివే అమ్మాయి, ముఖ్యమంత్రికి రాసే ఓ లేఖ ద్వారా తెలుపుతారు రచయిత. పాలక వర్గానికి ఒక గొప్ప కనువిప్పు కలగచేసే కధ ‘అభిలాష’. చిన్న చిన్న వాక్యాలు, నిర్మలత్వం, వయసుకు వస్తోన్న చిన్నపిల్లల, ఒబ్బిడితనం, వారి అమోఘమైన అవగాహనాశక్తిని వివరిస్తుంది ఈ కధ. గొప్ప సమాజ స్పృహతో, అవగాహనతో రాయబడింది.
విశేష సందర్భాల్లో దానాలు ఇస్తారు. దానంవల్ల ఇచ్చినవారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. గ్రహీతకు ఇహలోకంలో ‘ఆసరా’ దొరుకుతుంది. కాని గ్రహీతకు ఆ దానాన్ని నిభాయించుకోలేని పరిస్థితి ఎదురైతే? మింగలేని కక్కలేని ఆ పరిస్థితి వివరించి వదిలేయకుండా ‘గోదానం’ కధలో చక్కటి పరిష్కారం చూపించారు రచయిత. సాహిత్యపు విలువలే కాకుండా, సామాజిక స్పృహతో రాసిన కధలు ‘నాన్నకు థాంక్స్’, ఆకుపచ్చ సూరీడు, తన బాయ్‌ఫ్రెండ్ రిషి బలవంతంమీద తన న్యూడ్ ఫొటోలు పంపుతుంది అనఘ. ఆ తర్వాత ఆ పిల్ల ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? తండ్రి ఎలా పరిష్కరించాడు? అన్నది ‘నాన్నకు థాంక్స్’ కథాంశం. పర్యావరణ పరిరక్షణే వ్యక్తికి మరియు సమాజానికి మేలని ‘ఆకుపచ్చ సూరీడు’ చెబుతుంది.
సంకలనం నిండా గొప్ప గొప్ప వర్ణనలు- ‘లాభం నష్టం లెక్కెయ్యడానికి భూమి ఒక వస్తువుకాదు(పే.55 మనుగడ). ‘విలువల వలువలు విప్పేస్తే మనిషి- ముఖ్యంగా మగాడు రాక్షసుడిగా మారిపోతాడు’ (పే.67, నాన్నకు థాంక్స్), ఏ మాత్రం తేడా వచ్చినా అవి (రొయ్యలు) తేలి, మనల్ని ముంచేస్తాయి (పే.79 అమ్మకు బహుమతి), ‘ప్రతి ఆడపిల్లా, మెడ నిండగానే ఒడి నిండాలని ఆశపడుతుంది’ (పే.110, గర్భగుడి), ‘అడ్డంగా సంపాదించాలంటే అడ్డదార్లు తొక్కక తప్పదు’ (పే.132 జీవన యాగం), సీరియస్ పాఠకుడిని సీరియస్‌గా ఆలోచింపజేస్తాయి.
సంపుటిలోని కధలన్నీ- ‘మంచి ఆలోచన మంచి మాట’లు చెప్పేవి. మంచినీ, మానవత్వాన్ని పెంచేవి. ఆరోగ్యదాయకమైన గొప్ప విలువల్ని పంచే, పెంచే కథలు! పాఠకులకు ఇది గొప్ప ‘బహుమతి’ కథలు!!

-కూర చిదంబరం 8639338675