పఠనీయం

రసార్ద్రతకు ఏతామెత్తిన రమణీయ కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్నకుర్చీ (కవిత్వం)
-మధునాపంతుల
సత్యనారాయణ మూర్తి
వెల: రూ.100
పుటలు: 94
ప్రతులకు: ఆంధ్రకుటీరం
పల్లిపాలెం,
వయా యానాం
533 464

కవిత్వానికి అనుభూతి ప్రధానం. జీవ చైతన్య ప్రవృత్తి ద్వారా సమాజానికి సముదాత్త కళానుభవాన్ని అందించాలనే స్పృహతో పలికే పలుకే కవిత్వం. ‘బ్రతుకు సముద్రం ఉప్పునీటి లోతుల్లో పయనిస్తాను; దొరికిన సత్యాల ముత్యాలను గీతాల గోతాల కెక్కిస్తాను’ అని కుందుర్తి ఆంజనేయులు అన్నాడంటే అది అలాంటి స్పృహాగర్భిత అనుభూతితోనే. అలాంటి అనుభూతితోనే మధునాపంతుల సత్యనారాయణ మూర్తిగారు ఇటీవల వెలువరించుకున్న కవితా సంకలనం ‘నాన్న కుర్చీ.’
ఇందులో 35 కవితలున్నాయి. అన్నీ ‘కవిత్వ వచనాలే.’
దాదాపు ప్రతి కవితలోను అభివ్యక్తి ఆకర్షణగా నిటారుగా నిలుచుంది. ‘నాలుగు అక్షరాలు చాలు/ హృదయాన్ని పిండి, కళ్లు చెమర్చటానికి’ అంటూ, ఆ తర్వాత కవిత్వం గురించి పలికిన ‘అలికిన ఇంట్లో ఒలికినా చాలు సిగ్గు లతలు/ వాకిలంతా పూయటానికి’ అనే పలుకులలోని అవివక్షిత వాచ్యధ్వని చాలు, అందులోని బహుళ అర్థ సంపత్సౌందర్యం చాలు కవియొక్క అభివ్యక్తి శిల్పాన్ని వెనె్నలలతో కొల్చుకోవటానికి. ఇంతకీ ఆ సిగ్గు లతలు ఏమిటి? ఎవరు? నట్టింట్లో నడయాడే పరికిణి - ఓణీల బాలికలా? పచ్చని సంసారపు పసుపు, ‘రాగ’ కుంకుమలతో గడప దగ్గర కనిపించే తెలుగింటి ఇల్లాలా? మరదళ్లు ఆట పట్టిస్తుంటే సిగ్గుల చిరునవ్వులతో ఇంట్లో ఎవరి కోసమో వెతికే కళ్లతో కళకళలాడిపోతున్న కొత్త అల్లుడా? ఇంత అద్భుత భావచిత్రాన్ని అందిస్తుంది ఆ చిన్న రెండు పంక్తుల జంట. ‘బీరువా నిండా బోలెడు గ్రంథాలున్నా/ చిన్నారి గీసిన బొమ్మే కదా! కవిత్వం’ అంటాడు చివరకు లోతైన భావాలు, కమ్మని ఆలోచనలు సందడి చేసే లోకాల్లోకి తోసేస్తూ.
‘సొంత సంతకం’ కవితలోని ‘ఒకరి సంతకం/ ఒకరు చేస్తున్నారు/ నీ... ఆనవాళ్ల మీద/ వాళ్లు సంతకం చేయటం.. అంటే../ నిన్ను సత్తురూపాయిని చేసి/ వాళ్లు చెలామణీ కావటమే’ అన్న నాలుగు పంక్తుల్లో గడుసువాళ్లు, బతకనేర్చిన వాళ్లు అమాయకులను ఎలా చెల్లని రూపాయలుగా చేసేస్తున్నారో, వీళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి ఎలా అందలాలెక్కుతున్నారో గౌణంగా చెప్తూ నేటి రాజకీయపు పోకడల మీద, దారితప్పిన సంఘపు ‘పెద్ద మనుషుల’ మీద వేసిన కవిత్వపు చుఱక, కడిగినా పోని, వారి మనుగడల మరక చూపించారు మధునాపంతుల వారు ఆ కవితలో.
వచ్చీరాని ముద్దుముద్దు మాటల మనుమరాలితో ‘నువ్వు... సుళువుగా పలకటం కోసమే ఈ/ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి/ ‘తాత’ అనే అక్షరాలకు కుదించుకుపోయాడు’ అన్న తన ‘పరిపూర్ణ చిత్రం’ అనే కవిత చివరి పంక్తులు ఎంత ముగ్ధ మోహన భావము, అభివ్యక్తి శిల్పాలతో అలరారాయో వివరించి చెప్పక్కరలేదు.
‘వెంకన్న తిరునాళ్లు’ కవితలో ‘తప్పిపోయిన బాల్యాన్ని/ తిరునాళ్లలో వెతుక్కుంటాను/ జేబులో చిల్లర గలగలలు/ నన్ను చక్రవర్తిని చేసిన బాల్యాన్ని వెతుక్కుంటాను’ అంటూ మొదలైన 53 పంక్తులలో పొంగారిన బాల్యానుభూతుల, పాలలాంటి అనుభవాల దొంతరలోని చిక్కిన కవిత్వం మనలోని ప్రతివారి బాల్యాన్ని తిరిగి తోడి తెచ్చి, ఒక తీయని బాధలో ముంచి, మైమరపించేంత బాగుంది. అంత సార్వజనీన అక్షర సాక్షాత్కారం ఉంది అందులో.
మనం ఉత్తరాలు దాచిపెట్టుకొనే బిళ్ల తీగ (స్పైక్) ను గురించి రాసిన ‘తీగ’ నా చిరునామా’ అనే కవిత కమనీయంగా ఉంది. ‘ఎక్కుతున్న మెట్ల లెక్కలు ఈ ఉత్తరాలు’ ‘నా ప్రశ్నలన్నింటికీ సమాధానమై/ నా సమాధానాలన్నింటికీ ప్రశ్నలై/ కొత్త పూలు పూస్తూ ఉంటుంది’ అనటం ఎంతో భావగర్భితంగా ఉంది. ఉత్తరాల కట్టను అడుగు నుంచీ ఒక్కొక్కటీ చూసి, మళ్లీ చదువుకుంటుంటే భూతకాల విశేషాల ‘ఆదిత్య -369’ చలనచిత్రం చూసి ఆనందించినంత థ్రిల్, నవరసాలు ఫీలవుతాం. ఈ సెల్‌ఫోన్ల యుగంలో ఆ ఉత్తరాలూ లేవు, ఆ బిళ్లతీగలూ లేవు, ఆ అనుభవ, అనుభూతులూ లేవు, అదంతా ‘తీయని నిన్న’. అయినా ఆ కవిత ఇచ్చే అనుభూతి ప్రతి రసజ్ఞ పాఠకుడినీ ఎప్పటికీ ఊరిస్తుంటుంది.
‘యువర్ అటెన్షన్’ అనే కవిత రసార్ద్రతకు తిరుగులేని చిరునామా.
41వ పుటలో ‘అతి సీతల’ అన్నచోట ఊష్మధ్వని సంబంధపు అచ్చుతప్పు దొర్లటంవల్ల అర్థం బిత్తరపోతుంది. 47వ పుటలో ‘బానిసత్వం’ అనకూడదు. బానిసతనం అనాలి. లేక దాస్యం అనాలి. బానిస అనేది తెలుగు పదం. ఇలాంటి పొరపాట్లు ఈ కాల రచనల్లో మామూలైపోయాయి.
ఏది ఏమైనా, ఎలాగున్నా కవితార్ద్రతానుభూతులను కనుకొలకుల ద్వారా రసస్రావం చేయించే కమ్మని ఆధునిక కవితా ఖండ కావ్యం ఇది.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం