సబ్ ఫీచర్

ఇదోరకం మీడియా స్వామ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రంలో ‘మీడియా స్వా మ్యం’ చూస్తే భలే ముచ్చటేస్తుంది. ‘వికీలీక్సు’కు పెద్దన్నలే ఇక్కడున్నారు. పెన్నుపెట్టి రాయడం రాకపోయినా, ఇక్కడ ప్రతి ఒక్కరూ గిరీశాలే. సమాజంలో మార్పు కోసమే తమ చానెళ్లు పుట్టాయంటూ చెప్పిందే చెప్పే ‘నిరంతర వార్తా స్రవంతు’లు, తమంత ‘దమ్మున్న మొనగాళ్లు’ తెలుగునేలపై ఇంకొకరు లేరని చెప్పే మీడియా మారాజులు రాష్ట్ర పాలకులు, పాలితులను ఉద్ధరించే పనిలో ఉన్నారు. 10 కోట్ల రూపాయలుంటే చాలు చానెల్ పెట్టి పాలకుల నెత్తిన స్వారీ చేయాలనుకునే ‘రాయని భాస్కరులు’ ఇప్పుడు తెలుగు రా ష్ట్రాల్లో జిల్లాకొకరు!
ఇటీవల ప్రధాని మోదీకి వైసీపీ సారథి జగన్ రాసిన లేఖ లీకైపోవడం, దానిపై వైసీపీ గళధారులు ఫీలైపోయి, లీకైన ఆ లేఖను ఇష్టారీతిన మార్చుకుని ప్రచురించిన సదరు మీడియా సంస్థను బహిష్కరించడం చూచువారలకు చూడముచ్చట! ఎప్పుడో పాచిపోయిన లేఖను పట్టుకుని అదే తాజా సరుకుంటూ అమ్మేసుకున్న ఆ మీడియా సంస్థ తెలివి మామూలు రోజుల్లో అయితే అదిరిపోయేది. కానీ ప్రత్యామ్నాయ మీడియా వచ్చాక అది తుస్సుమంది.
చీమలు కూడా దూరలేని ప్రధాని కార్యాలయంలో ఇచ్చిన లేఖ బయటకుపొక్కిందంటే, కేంద్రమంత్రులు కూడా గడగడలాడిపోయే మోదీ నిఘాను కూడా వెక్కిరిస్తూ గూఢచారి 116ని మించి, ఏజెంట్ నెంబర్ వన్ పాత్ర పోషించిన తెలుగు మీడియా సంస్థ మొనగాడయితే.. సదరు సంస్థకు లీకు లేఖను పువ్వుల్లో పెట్టి ఇచ్చిన వాళ్లు ఇంకా మొనగాళ్లు! ఆ మొనగాళ్లు తెలుగు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులా? కమలదళంలోని ‘తెలుగు’ కోవర్టులా? లేక జగన్ చెప్పినట్లు స్వామిభక్తి పరాయణ అధికారులా? అన్నది తర్వాత తేలుతుంది. తీర్పు తేలే వరకూ వైఫల్యం మాత్రం ప్రధాని కార్యాలయానిదే! సరే.. ఏదో ముచ్చటపడి పాచిపోయిన పాత లేఖకు కొత్తరంగు-రుచి జోడించి, వారిద్దరి మధ్య జరిగిన రహస్య భేటీలో విఠలాచార్య సినిమాలో మాదిరిగా కంటికి కనిపించని అదృశ్యశక్తిగా మారి, అదే గదిలో ఉండి అంతా విన్నట్లు సదరు మీడియా సంస్థ వార్త వండిందనే అనుకుందాం. మోదీ కాళ్లపై జగన్ మోకరిల్లిన అద్భుతాన్ని సదరు సంస్థ తన త్రినేత్రంతో చూసిందే అనుకుందాం. తనను కాపాడాలంటూ జగన్‌బాబు మోదీని శరణువేడి, మోదీజీ కోరకుండానే రాష్టప్రతి అభ్యర్థికి మద్దతు ‘ఆఫర్ బొనాంజా’ను ప్రకటించారే అనుకుందాం. ముందు కొత్త తేదీ లేఖ అని, తర్వాత జగన్ వర్గం ఎదురుదాడితో తత్తరబిత్తరయిన ఆ సంస్థ.. తేదీ ఎప్పుడన్నది కాదు కంటెంటు కరెక్టా? కాదా? అని మడమతిప్పి, మళ్లీ జగన్ మీదనే బురద చల్లిందనే అనుకుందాం. అంతమాత్రాన సదరు మీడియా సంస్థను ‘మా పార్టీ ఆఫీసు మెట్లు ఎక్కవద్ద’ని నిషేధించడమేనా? అలా ఎవరంటే వాళ్లు నిషేధించుకుంటూ పోతే ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకులు, వారి పార్టీలకు ప్రతిరోజూ దిశానిర్దేశం చేసే ‘జాతి’పితలు ఏమవ్వాలి? ఇద్దరు తెలుగు సీఎంలనూ చెరోజేబులో పెట్టుకున్న ‘రాజగురువుల’నే అవమానించడం ధర్మమా? అలా వెలివేస్తే సదరు జాతిపితలపైనే ఆధారపడి జీవించే ముఖ్యమంత్రులు, వారి వారసులకు కర్తవ్యబోధ చేసి, వారి ద్వారా బోలెడంత సంపాదించుకునే పైరవీకారులు, వారి సలహాలు లేకపోతే పొద్దుపోని మంత్రులు, ఎమ్మెల్యే లు, ‘సొంతజాతి’ జనులు ఏం కావాలి? ‘దమ్మున్న మీడి యా’ను వెలివేసేంత ధైర్యం చేసినందుకు జగన్ వర్గీయులది గుండెనా? చెరువా?!
ఈ నిషేధాలు ఎన్నాళ్లు నిలకడగా ఉంటాయో చరిత్ర చెప్పలేదా?! తనపై సొంత రాష్ట్రంలో పాలకులు విధించిన నిషేధాన్ని ‘కుల’వేల్పుల సాయంతో ఎత్తివేయించుకు ని, ఎవరైతే నిషేధ కత్తి దూ శారో అదే చేతులతో స్వాగతించుకునేలా చేసుకుని, ఏ కంగా ‘రాజగురువు’ అవతారం ఎత్తిన వారిముందు జగన్ పార్టీ నిషేధం ఎన్నాళ్లుకొనసాగుతుంది? రెండు తెలుగురాష్ట్ర పాలకులకు రాజకీయ వైరం ఉన్నా, ఇద్దరితోనూ చెట్టపట్టాలేసుకుని రెండుచోట్లా పనులు చక్కదిద్దుకునే పనిమంతులకు ఈ నిషేధాలు తొలగించుకోవడం పెద్ద లెక్కా?
భారతంలో ఆదిపర్వం, విరాటపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం మాదిరిగా తెలుగుమీడియాలో బహిష్కరణ పర్వం కొత్తేమీ కాదు కదా? జగన్‌ను భుజానికెత్తుకునే సొంత మీడియా- తెలుగుదేశం పార్టీని మోసే ఆ ‘రెండు పత్రికల’ను మొదట్లో నిషేధించింది. రెండింటిపైనా ‘పచ్చ’ముద్ర వేసింది. ప్రకటనలు నిలిపివేసింది. తొలితరం రాజగురువుతో ఆలింగనపర్వం ముగిసి, వారిద్దరి టన్నులకు టన్నుల న్యూస్‌ప్రింటు యుద్ధానికి తెల్లజెండా చూపిన తర్వాత ఆ పత్రికపై నిషేధాన్ని ఎత్తేసింది. ఇప్పుడు తాజాగా రెండోతరం రాజగురువు మీడియా సంస్థను వెలివేసింది. అలాంటి జగన్ పార్టీ మీడియా స్వామ్యం గురించి మాట్లాడం వింతలో వింత! అంతకంటే ముందు జగన్ మీడియా సంస్థను తెలుగుదేశం పార్టీ నిషేధించి, తర్వాత సర్కారు కచేరీ వార్తలకు పరిమితం చేసి, ఇప్పటికీ పార్టీ గడప ఎక్కకుండా ఆ నిషేధం కొనసాగిస్తోంది. అన్ని పార్టీలకూ మీడియా దుకాణాలున్నాయి. వాటిలో జర్నలిస్టు విప్లవకారులూ ఉన్నారు. ఈ విప్లవకారుల తీరు ఒక్కోసారి బహు ముచ్చటేస్తుంటుంది. గతంలో జగన్ మీడియాపై టిడిపి బహిష్కరణ వేటు వేసినప్పుడు, అందులో పనిచేసే జర్నలిస్టు విప్లవకారులు పత్రికాస్వామ్యం ప్రమాదంలో ప డిందని చాంతాడంత వ్యా సాలు రాసి, కనిపించిన వారికల్లా వినతిపత్రాలిచ్చారు. ప్రెస్‌కౌన్సిల్ గడప తొక్కారు. మరి ఇప్పుడు వారు తరిస్తున్న ‘మీడియా పార్టీ’నే, మరొక మీడియాను వెలివేస్తే ఆ బాపతు ‘సంఘ’సేవకుల గొంతు వినిపిస్తే ఒట్టు. అదోరకం మీడియాస్వామ్యం మరి!
మళ్లీ మోదీకి రాశారని చెబుతున్న లేఖలోకి వస్తే.. ఆ లేఖ పాతదా? కొత్తదా? అన్నది పక్కకుపెడితే లీకు వీరులెవరన్నది బ్రహ్మరహస్యంగానే ఉండిపోతుందా? లేక మోదీ గారి ఇంటెలిజెన్సీ అలా అఘోరించిందని సరిపెట్టుకోవాలా? ఢిల్లీ దర్బారు చుట్టూ కమ్మేసిన తెలుగు ‘జాతి’ జనుల ప్రతిభ ముందు మోదీ తెలివి తెల్లారిందనుకోవాల్సిందేనా? ఇలాగైతే ఇక దేశ రహస్యాల గతేమిటి? ఇంత రచ్చ జరుగుతున్నా కేంద్రంలోని కమల ‘తెలుగు’వెలుగులు ఎందుకు మాట్లాడటం లేదు? మోదీ-జగన్ భేటీని అంతర్జాతీయ సమస్యగా మార్చేసిన వేళ, ఈ తెలుగు తేజోమూర్తులు నోరెత్తకుండా తెల్లముఖం ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆ లేఖ అప్పటిది కాదని ఎందుకు చెప్పలేకపోతున్నారు?
ఈ ‘వెలి’వేతల వ్యవహారం పుణ్యమాని తెలుగు రాష్ట్రాల్లో మీడియా సంస్థలు ఏ పార్టీ వైపున్నాయన్నది మరోసారి తేలిపోయింది. జగన్ మీడియా సంస్థలు వా ర్తలు చదివితే చెడిపోతారని భావి తెలుగు యువనేత లోకేష్ సెలవిచ్చారు. జగన్ పేపరు చదవద్దని, చానెల్ చూడవద్దని పిలుపునిచ్చారు. తాజాగా జగన్ మీడియా బహిష్కరణ పర్వం సందర్భంలో- తెలుగుదేశం దీపాన్ని వెలిగిస్తున్న మీడియాజ్యోతి వార్తలు చదవద్దు, చానెల్ చూడవద్దని పిలుపునిచ్చింది. అసలు ఆ మీడియాను పార్టీ సమావేశాలకే పిలవద్దని ఆదేశించింది. నిజంగా ఇవన్నీ అమలయ్యేవేనా? రోజూ తనపై ఏమి వ్యతిరేక వార్తలు రాశారో చూడకపోతే చంద్రబాబు అండ్ కోకు నిద్రపట్టదు. కాబట్టి ఇష్టం లేకున్నా జగన్ మీడియాను వీక్షించాల్సిందే. ‘చినబాబు’ చెప్పినట్లు జగన్ మీడియా చూసి చెడిపోవద్దనుకుం టే, అదే మీడియాలో వచ్చే కథనాలకు కంగారుపడి ప్రెస్‌మీట్లు పె ట్టడం ఎందుకు? అదే మీడియాకు లక్షల రూపాయల సర్కారీ ప్రకటనలు ఇవ్వడం మానేశారా? భూసేకరణ ప్రకటనల్లో సింహభాగం ఎం దుకు కేటాయిస్తున్నట్లు? తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ కాలేజీ కార్యక్రమానికి వచ్చిన బాబును ఆహ్వానిస్తూ అరపేజీ ప్రకటనలిచ్చిన టిడిపి నేత, జగన్ మీడియాకూ అదే అరపేజీ ప్రకటనలివ్వడాన్ని ఆపగలిగారా? జిల్లా స్థాయిలో తాము వెలివేసిన జగన్ మీడియాకు తమ్ముళ్లు ప్రకటనలివ్వడం మానేశారా? జగన్ మీడియాను చూసి పైస్థాయి వాళ్లు భయపడుతున్నందుకే కింది స్థాయిలో ఉన్న తమ్ముళ్లూ వారిని అనుసరిస్తున్నారని అర్థం చేసుకోకపోవడం అమాయకత్వమే కదా?!
‘తెలుగుదేశ ఆశాజ్యోతి’ అని ముద్ర వేసి వెలివేసినంత మాత్రాన, తన పార్టీ శ్రేణులు ఆ మీడియాను చూడకుంటా ఉంటాయా? దానికి ప్రకటనలు ఇవ్వకుండా ఆపగలుగుతారా? వైఎస్ బతికున్నప్పుడే ఆ పత్రికను చూడకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు జగన్ కూడా ఆ పత్రిక ఏమి రాసిందో చూడకుండా ఉండగలరా? కాబట్టి ఇవేమీ ఆచరణ సాధ్యమేనా? లోకజ్ఞానం ఉన్న జగన్‌కు బొత్తిగా మీడియాజ్ఞానం లేనట్లుంది. జగన్ తన ప్రత్యర్థి మీడియాను వెలివేసి తనకు తెలియకుండానే గొప్ప మేలు చేశారు. జగన్ పార్టీ నిషేధిస్తే, దాని ‘నష్టపరిహారం’ సాకుతో మరికొన్ని పనులు చక్కదిద్దుకునే దివ్యమైన అవకాశం ఇచ్చిన జగన్ అమాయకత్వాన్ని చూసి నవ్వాలా? ఏడవాలా?

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144