మెయన్ ఫీచర్

బాబు-బిజెపి చెలిమి చెల్లినట్లేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలేనన్నది బిజెపి వౌనం ద్వారా మరోసారి రుజుయింది. గత రెండేళ్ల నుంచి ఢిల్లీలోని తన ‘అద్భుత మిత్రుల’ద్వారా నవ్యాంధ్రలో బిజెపిని మరుగుజ్జును చేసిన చంద్రబాబు, ఇప్పుడు చివరకు అదే పార్టీని నడిరోడ్డున ముద్దాయిగా నిలబెట్టి హోదా అంశంలో పైచేయి సాధించారు. తాజాగా బాబు అండ్ కో చేస్తున్న ప్రకటనలు, జారీ చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే బాబు- బిజెపి చెలిమికి కాలం చెల్లినట్లేననిపిస్తోంది. నిజానికి బాబుగారి మీడియా నయా రాజగురువు చాలాకాలం నుంచీ కమలంతో కటీఫ్ చెప్పాలని ఉపదేశిస్తూనే ఉన్నారు. ఇంతకాలానికి ఆ ఉపదేశం పనిచేస్తున్నట్లుంది.
గత ఎన్నికల ఫలితాలపై బాబు చాలా అంచనాలే వేశారు. తన పార్టీ ఆధరవు లేనిదే ఎన్డీఏకు తెరవులేదనుకున్నారు. కానీ అసలు ఎవరి భుజం పట్టుకోకుండానే, మోదీ సర్కారు ఏర్పాటుకావడం బాబును నిరాశపరిచిందన్నది నిజం. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసమో, పార్టీ ప్రయోజనాల కోసమో తెదేపా కేంద్రంలో చేరింది. చేరినా మునుపటి అమాయక చక్రవర్తి వాజపేయి మాదిరిగా గుజరాత్ మోదీ తెదేపాను నెత్తినెక్కించుకోలేదు. రాష్ట్రానికి చేతికి ఎముకలేకుండా నిధులు ఇచ్చిందీలేదు. కారణం యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు.
కేంద్రం ఏ నిధులిచ్చినా దాని ఖర్చుకు లెక్క చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రాలది. అవి ఇస్తేనే మిగిలిన నిధులిస్తుంటుంది. కానీ, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు పక్కదారి పడుతున్నాయని మోదీ సర్కా రు గ్రహించింది. పోలవరంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని అథారిటీ చైర్మన్ కేంద్రానికి నివేదికలిచ్చారు. ఫలితంగా పోలవరం నిధుల విడుదల మందగించింది. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల ఖర్చు కూడా డిటో. వాటిని సీఎం పర్యటనల కోసం కలెక్టర్లు ఖర్చు చేశారని తేలిం ది. ఈవిధంగా తాను ఇస్తున్న నిధులు సద్వినియోగం కావడం లేదని తేల్చిన మోదీ సర్కారు ఆచితూచి నిధులిస్తోంది. ఇది కూడా బాబు కోపానికి మరో కారణం.
ఈలోగా ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశపెట్టిన కెవిపి కాంగ్రెస్‌కు సంజీవని తెచ్చే ప్రయత్నాలు చేశారు. దానివల్ల పార్టీ బతుకుతుందా లేదా అన్నది పక్కకుపెడితే, కాస్త ఊపిరయితే పీల్చుకోగలిగింది. కెవిపి జనాకర్షణ నేత కాదు. అలాగని మంచి వక్త కూడా కాదు. రెండుపేజీల ప్రసంగపాఠాన్ని చదవడానికే గుటకలు మిం గుతూ, నీళ్లు నములుతూ చాలా కష్టపడ్డారు. ఆయనదంతా ఎప్పుడూ తెరవెనుక మంత్రాంగమే. గత ఏడాది వరకూ హోదా సెంటిమెంటు అంతా మీడియాలోనే కనిపించింది. జగన్ దీక్ష కూడా మూడురోజులకే పరిమితమయింది. ఇక దానితో హోదాను అంతా మర్చిపోయారు. మళ్లీ గత రెండు నెలల నుంచి హోదా అన్ని పార్టీలకూ జీవనాధారమయిపోయింది. అది బాబుకు బ్రహ్మాస్తమ్రయింది.
బిజెపిని ఇరుకుపెట్టేందుకు బాబు హోదాను అస్త్రంగా సంధించారు. ఎన్నికల ముందు విభజన నెపాన్ని కాంగ్రెస్‌పై నెట్టేసిన బాబు, ఇప్పుడు ఆ బాణాన్ని బిజెపిపై ఎక్కుపెట్టారు. ‘బిజెపి ఏం చేసింది అని అడుగుతున్నా’ అని నేరుగానే యుద్ధం మొదలెట్టారు. ‘ఇంతవరకూ వౌనంగా ఉన్నా. రాష్ట్రం కోసం అడుక్కున్నా కనికరించడం లేదు. మా సహనానికీ హద్దుంది. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామ’ని బాబు సహా, ఎంపీల వ్యాఖ్యలు పరిశీలిస్తే, బాబు-బిజెపి చెలిమికి కాలం చెల్లినట్లేననిపిస్తోంది. ఎంపిలు రాజీనామా వరకూ వెళ్లారు. కాంగ్రెస్ కంటే బిజెపినే ఏపికి నష్టం చేస్తోందని విమర్శిస్తున్నారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో బిజెపిని ముద్దాయిగా నిలబెట్టడంలో బాబు విజయం సాధించారు. రాష్ట్రంలో ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి లేకుండా చేయగలిగారు. ఓ వైపు కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే అన్నీ సాధిస్తామని చెబుతున్నారు. మళ్లీ ఆయనే బిజెపి జవాబు చెప్పాలని నిలదీస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలే హోదా ఇచ్చే వరకూ బిజెపి నేతలు రాష్ట్రంలో తిరగవద్దని, ఆ పార్టీ నేతలను అడ్డుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. ఆ గళాలే కాంగ్రెస్-బిజెపి కుట్ర చేస్తున్నాయని నిందిస్తున్నాయి. అంటే.. బిజెపికి రాష్ట్రంలో ఎంత పెద్ద నేత సారధ్యం వహించినా, హోదా అంశంలో ఆ పార్టీని బోనులో నిలబెట్టడం ద్వారా, కాంగ్రెస్ మాదిరిగానే సమాధి చేయాలన్న వ్యూహం స్పష్టమవుతూనే ఉంది. అప్పుడు ఒక దెబ్బకు రెండు పిట్టల చందంగా రాష్ట్రంలో బిజెపిని మరింత మరగుజ్జుగా చేయాలన్నది రాజకీయ ఎత్తుగడ.
అసలు బాబు ఆగ్రహానికి మరో కారణం కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల సంఖ్యపై గంపెడాశలు పెట్టుకున్న బాబు ఆశలను, మోదీ నెరవేర్చడం లేదట. ఆ ఆశతోనే ఆయన వైకాపా ఎమ్మెల్యేలను డజన్ల సంఖ్యలో పార్టీలో చేర్చుకుంటున్నారు. అది సాధ్యం కాదని తెలిస్తే ఇక ఇటు కనే్నసేవారుండరు. ఆ కోపం కూడా బాబులో ఉందన్న విశే్లషణ జరుగుతోంది. సరిగ్గా హోదా అంశం అందుబాటులోకి రావడం బాబుకు అనుకూలించింది. తాజాగా రాజ్యసభలో హోదాపై చర్చ సీరియస్‌గా చర్చ జరుగుతుంటే, తెదేపా ఎంపి సీఎం రమేష్ నియోజకవర్గ పునర్విభజనను కూడా పట్టించుకోవడం లేదని నోరుజారారు. అదీ లోగుట్టు.
ఈ పరిణామాలన్నీ బిజెపితో చెలిమి చెరిపేసేవేనని స్పష్టమవుతూనే ఉంది. కాకపోతే బాబు ఇప్పటికిప్పుడు తొందరపడకపోవచ్చు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. తను తొందరపడితే బిజెపికి జగన్ రూపంలో కొత్త మిత్రుడు దొరుకుతాడు. పవన్ కల్యాణ్‌నూ తెరమీదకు తీసుకురావచ్చు. కొత్త రాష్ట్రానికి నిధులివ్వడంలో మరింత జాప్యం జరగవచ్చు. అదే జరిగితే తన ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకే అప్పటివరకూ బిజెపితో నామమాత్ర సంబంధాలు కొనసాగిస్తారు. ఆలోగా రాష్ట్రానికి బిజెపి ఏమీ చేయడం లేదన్న సంకేతాలు పంపిస్తూనే ఉంటారు. ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్రానికి బిజెపి ఏమీ చేయడం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఆ పార్టీతో పెట్టుకున్న పొత్తుకు తెరదించుతున్నామని విడాకులిచ్చేయవచ్చు. 2004 ఎన్నికల తర్వాత కూడా బాబు ఇదే వ్యూహం అనుసరించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని, ఇంకెప్పుడూ బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ప్రకటించారు. మళ్లీ తర్వాత 2014లో పొత్తు పెట్టుకున్నారు. అది వేరే విష యం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కమ్యూనిస్టు బావలతో జట్టుకట్టినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. సీతారాం ఏచూరి బ్రహ్మాండంగా మాట్లాడారని బాబు పొగిడారు. కమ్యూనిస్టులకు అప్పుడు తెదేపా బూర్జువా పార్టీగా కూడా కనిపించదు. ఎవరి అవసరం వారిది మరి!
అసలు విభజన వ్యవహారంలో ఎవరూ పరిశుద్ధులు కాదు. తలా ఓ చేయి వేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన పుణ్యాత్ములే. పెద్దమ్మ సోనియా, చిన్నమ్మ సుష్మాజీ సంయుక్త ఆధ్వర్యాన పెద్ద రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలకు, సీపీఎం మినహా అన్ని పార్టీలూ తలో ఓ గొడ్డలి అందించాయి. వైకాపానేమో అసలు ఏ చట్టం ప్రకారం విభజించవచ్చో ఉచిత సలహా కూడా ఇచ్చింది. రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో దమ్ముంటే విభజన తీర్మానం పెట్టండి. మద్దతునిస్తామని సవాళ్లు విసిరిన తెదేపా, ఆ తర్వాత సభలోనూ అదే సవాలును కొనసాగించింది. చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా విభజన లేఖను అందించింది. మహానాడులో తీర్మానం చేసింది.
తన లేఖ ఇవ్వకపోతే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెరవు ఉండేది కాదని బాబు తెలంగాణలో ప్రచారం చేశారు. ఏపిలో విభజనకు కాంగ్రెస్సే కారణమని ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్-బిజెపి కలసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయన్న కొత్త గళం అందుకున్నారు. అయితే ఇప్పటి బాబు అండ్ కో ఆవేశం చూసి, తెదేపా కేంద్రం నుంచి బయటకొచ్చేస్తుందని ఎవరైనా భావిస్తే తప్పులో కాలేసినట్లే లెక్క. కేంద్రంలో అవసరాలు తీరేవరకూ బయటకురావడం కష్టం. చంద్రబాబుది చాణక్య రాజకీయం. అది అర్ధం చేసుకోలేకపోవడమే బిజెపి తప్పిదం.
అన్ని పార్టీలు కలసి తనను నిందిస్తూ బోనెక్కించినా, కనీసం ఖండించలేని దిక్కుమాలిన పరిస్థితి బిజెపిది. బాబు నుంచి గాలి వరకూ శరపరంపరగా నిందాపర్వం కొనసాగిస్తున్నా, ఎదురుదాడి కూడా చేయలేని అశక్తతకు జాలికలగ మానదు. బిజెపి నేతలను అడ్డుకోమని గాలి ముద్దుకృష్ణమ ఇచ్చిన పిలుపు ఒక్కటి చాలు. రాష్ట్రంలో బిజెపి దుస్థితి చెప్పేందుకు! తన పార్టీపై ముప్పేట దాడి జరుగుతుంటే, ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటున్న నాయకత్వ ప్రతిభను అభినందించాల్సిందే. క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులున్నా ఎవరికీ నోరూ వాయా లేదు. ఇన్ని శుభశకునాలుండగా రాష్ట్రంలో బాబు బిజెపికి భయపడాల్సిన పనేమిటి? రాజకీయాల్లో ఆత్మహత్యేలే ఉంటాయంటే ఇదేనేమో?!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144