పెరటి చెట్టు

ఆడింది ఆట - పాడింది పాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అయిదేళ్లప్పటి నుంచీ కథలు రాసి అర్ధా - పావలా సంపాదిస్తూనే ఉన్నా. అంతకు ముందు, బహుశా, రికామీగా గడిపేశాననుకుంటా!’ అన్నాడట పీజీ వుడ్‌హౌస్. ఆయనకన్నా పదిహేడేళ్లు ముందు పుట్టి, ‘హరికథ’ అనే పాత కళారూపానికి సరికొత్త సొగసులద్ది, దాన్ని స్వయం సంపూర్ణంగా తీర్చిదిద్దిన సృజనశీలి శ్రీమదజ్జాడాదిభట్ల (సూర్య) నారాయణ దాసు గారు కూడా అయిదో యేటి నుంచీ ఆడి, పాడి స్కూలు ఫీజు మందం సంపాదించుకున్నానని తన ఆత్మకథ ‘నా యెఱుక’లో చెప్పారు. పందొమ్మిదో శతాబ్దిలో, ఓ మెరుపు మెరిసిన ప్రతిభామూర్తుల్లో మరికొందరు కూడా ఇలాగే చెప్పుకోవడం గమనార్హం. వుడ్‌హౌస్ కన్నా ఎనిమిదేళ్లు చిన్నవాడయిన చార్లీ చాప్లిన్‌దీ ఇదే కథ. పసివయసు నుంచీ రంగస్థలం మీద పాడి తన పొట్ట పోసుకోవడమే కాకుండా, రోగంతో తీసుకుంటున్న తల్లికి వైద్యం కూడా చేయించానని రాసుకున్నాడు చాప్లిన్. ఇన్నాళ్లకి ఇరవయ్యొకటో శతాబ్దిలో, ఈ బాలమేధావుల రికార్డులు బద్దలుకొట్టే చిచ్చరపిడుగు ఒకడు పుట్టుకొచ్చాడు. అసొం రాష్ట్రానికి చెందిన అయన్ గగోయ్ గోహైన్ నాలుగో యేటనే తన స్మృతులు అక్షరబద్ధం చేశాడట! ‘అంత చిన్న బుడతడికి స్మృతులేమిటి? వాటిని రాయడమేమిటి? ప్రసార మాధ్యమాలు ఈ చిత్రశిశువుకు బ్రహ్మరథం పట్టడమేమిటి?’ అని ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది!
‘హరికథా పితామహ’ ఆదిభట్ల నారాయణదాసు బతుకు పుస్తకంలోని ప్రతి ఒక్క పేజీలోనూ, ఇలా ముక్కున వేలేసుకోవలసిన సంఘటన ఏదో ఒకటి కనిపిస్తుంది. విజయనగరంలోని కానుకుర్తి వారి వీథిలో వుంటూన్న రోజుల్లో దాసుగారు కుప్పుస్వామి నాయుడు చెప్పిన హరికథా కాలక్షేపం చూడ్డం ‘తటస్థించింది’. తనలోని సంగీత సాహిత్య ప్రజ్ఞకి ఆ కళారూపం చక్కగా సరిపోతుందని ఆయనకి అనిపించడంతో, అదే రోజు రాత్రికి రాత్రి ‘ధ్రువ చరిత్రము’ అనే హరికథ తాలూకు ‘చరిత్ర యంతయు నల్లినాడ’నని దాసు ‘నా యెఱుక’ మొదటి పేజీలోనే రాశారు. ధూళిపాళ కృష్ణయ్య అనే ‘కవీశ్వరుడు’ రాసిన కీర్తనములు కొన్ని - పోతనగారి పద్యాలు మరికొన్ని - ‘హితోపదేశం’లోని కథలు ఇంకొన్ని - ‘ఇంగ్లీషు నందలి కథలు కొన్నియును’ కూడా కలిపి తన తొలి హరికథ రచించానని దాసుగారు ఆత్మకథలో చెప్పుకున్నారు. (‘ప్రపంచంలోని చాలా దేశాలలో ప్రచారంలోవున్న కథా సాహిత్యానికి మూలం హితోపదేశమే. దీనిలో కథలే పంచతంత్రంలో కూడా చేర్పు, మార్పు, కూర్పులతో కనిపిస్తా’యన్నారు ‘నా యెఱుక’ సంపాదకులు మోదుగుల రవికృష్ణ. ఆయన తొందరపడి ఏదీ రాసేయరు. కానీ, ‘హితోపదేశం’ కన్నా కనీసం పదిహేను వందల సంవత్సరాల ముందే ‘పంచతంత్రం’ కథలు పుట్టాయని ఎక్కడో చదివిన గుర్తు.) హరికథ ప్రక్రియకు అంత విశిష్టత ఏర్పడ్డానికి మూలకారణం ఈ ‘కదంబ స్వభావమే’నేమో అనిపిస్తుంది. తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఆరబీ, పారశీకం తదితర ఎనిమిది భాషల్లో నిష్ణాతుడయిన దాసుగారు, కర్ణాటక - హిందుస్తానీ బాణీలు క్షుణ్ణంగా తెలిసిన వారు కూడా. ఈ వైవిధ్యం హరికథా రూపాన్ని ఇతోధికంగా సుసంపన్నం చేసి ఉంటుంది. బాల్యంలోనే పురాణ పఠనం మొదలుపెట్టిన దాసుగారికి తన శ్రోతలు ఏం వినాలనుకుంటారో బాగా తెలుసు. ఈ అంశాలన్నీ ఒక్కచోటే కూడివుండడం వల్లనే ఆదిభట్ల నారాయణదాసు గారి చేతిలో హరికథ సకల కళాసమ్మేళనంగా రూపుదిద్దుకుంది. ‘విద్యలందు గురుశిక్ష మిక్కిలి తక్కువగాని, స్వభావముగ’ తనకు చొరవ ఎక్కువనే విషయం దాసుగారే చెప్పారు. సృజనాత్మక కళారూపాన్ని సుసంపన్నం చేసిన ఏ కళాకారుణ్ణి చూసినా ఇదే కథ. శాస్తవ్రిద్యలు నేర్చుకునే వాళ్లకి గురుశిక్ష చాలా ముఖ్యం. కానీ, సృజనాత్మక కళారూపాలు నేర్చుకునేవారికి గురుబోధనకన్నా ప్రయోగశీలతలో చొరవ - ప్రయోజనం పట్ల స్పష్టత ఎక్కువ అవసరం. ఈ లక్షణమే శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణ దాసును ‘హరికథా పితామహుడు’ చేసింది!
ఆదిభట్ల వారు విజయనగరంలో ఓ వెలుగు వెలిగిన రోజుల్లో ఆ నగరం జేగీయమానంగా వర్థిల్లుతూ వుండింది. గురజాడ అప్పారావు, ద్వారం వెంకటస్వామి నాయుడు, కోడి రామమూర్తి, వజ్‌ఝల చినసీతారామస్వామి, ముడుంబై నరసింహాచార్యులు, ‘జగన్నాథ విలాసినీ సభ’ నిర్వాహకుడు బుచ్చి శాస్ర్తీ, గురుజాడ శ్రీరామమూర్తి, కొల్లూరు కామశాస్ర్తీ, పేరి కాశీనాథ శాస్ర్తీ తదితరులు ఒక్క విజయనగరంలోనే కాదు - దేశమంతటా సుప్రసిద్ధులు. మైసూరు, కాశీ తదితర ప్రాంతాల్లో నారాయణ దాసుగారు అప్పట్లోనే జెండా ఎగరేశారు. దాసుగారి నోట భైరవి రాగాలాపన విన్న విశ్వకవి రవీంద్రనాథ టాగూరు ఆయన్ను బంగాల్‌కి వచ్చేయమని ఆహ్వానించారంటారు. దాసుగారిని తమ ఆస్థానంలో ఉండిపోవలసిందిగా మైసూరు మహారాజా స్వయంగా అభ్యర్థించినా, ఆయన అంగీకరించలేదు. తనది పక్షి స్వభావమనీ, పంజరంలో తనకు సుఖముండదనీ తేల్చిచెప్పారట దాసుగారు. అంతకుమించి, సాక్షాత్తూ విజయనగరం మహారాజాయే, దాసుగారిని సంగీత కళాశాలకు ప్రధాన ఆచార్యుడిగా ఉండమని అడిగితే, అందుకు ఓ షరతు విధించారట. సంగీత కళాశాలను ఆలయంగా భావించి, తనను అర్చకుడిగా చూసే పక్షంలో తాను ఆ బాధ్యత స్వీకరిస్తానన్నారట.
రుగ్వేదంలోని మూడు వందల రుక్కులకి దాసుగారు స్వరాలు కట్టారు. రెండు చేతులతోనూ, రెండు కాళ్లతోనూ, తలతోనూ అయిదు భిన్న తాళాలు వినిపించి, ఆ తాళాలన్నింట్లోనూ పాడి వినిపించడం దాసుగారు చేసిన ఓ విశిష్ట ప్రయోగం. అది చూసి, విద్వాంసులు ఆయనకి ‘లయబ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వర’ లాంటి బిరుదులిచ్చారు. దాసుగారికి ఆంగ్ల సాహిత్యంతో కూడా ప్రగాఢమయిన పరిచయం ఉంది. షేక్స్‌స్పియర్ - కాళిదాసు రచనల మధ్య తులనాత్మక అధ్యయనం చేసి 1922లోనే ‘నవరస తరంగిణి’ అనే రచన ప్రచురించారు. షేక్‌స్పియర్ నాటకాల్లో, నవరసాలకూ ప్రాతినిధ్యం వహించే కళాఖండాలను తీసుకుని, వాటిని కాళిదాసు రచనల్లోని అలాంటి కథాభాగాలతో పోలుస్తూ, ఈ అధ్యయనం చేశారాయన. మొత్తం పదమూడు హరికథలను రాసిన నారాయణదాసు, సంస్కృతంలో మూడు హరికథలు చెప్పి వుండడం నిజంగానే విశేషం. దాసుగారి ‘రుక్మిణీ కల్యాణం’ హరికథను కోరి చెప్పించుకునే రసికులు ఇప్పటికీ వున్నారు.
ఇవన్నీ దాసుగారి గొప్పతనాన్ని వెల్లడించే విషయాలే. కానీ, కొందరికి అంతటితో తృప్తి కలిగినట్లు లేదు. వీరేశలింగం - గురజాడ - గిడుగు భూస్వామ్య భావజాలంపై చేసిన దాడిని దాసుగారు వ్యతిరేకించడాన్ని ఆయన ‘చారిత్రిక పరిమితి’గా గుర్తించాలని ‘నా యెఱుక’ సంపాదకులు తన మనవి మాటగా చెప్పుకొచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. నరసింహమూర్తి మాత్రం - అటు నుంచి టాల్‌స్టాయ్‌నీ, ఇటునుంచి శ్రీనాథుణ్ణీ లాక్కొచ్చి - వాళ్లతో దాసుగారిని పోల్చి, ఆయన వ్యసనాలని సమర్థించడానికి వెనకాడలేదు. అలాగే, దాసుగారి ‘సత్యవాక్కు’ గురించి నరసింహమూర్తి చెప్పింది వింటే వేములవాడ భీమకవి గురించిన కట్టుకథలు గుర్తుకొస్తాయి. ఇక, ‘పురాణేతిహాసాలలో కనిపించే బలశాలులందరూ దైనందిన జీవితంలో ఆయనతో కలసి మెదలడం’ గురించి నరసింహమూర్తి వినిపించిన ‘అతిమానుష - అమానుష’ కథనాలు వింటే వింతగా అనిపించకపోతే ఏమనిపిస్తుంది మరి? ఈ ఇరవయ్యొకటో శతాబ్దిలో ఇటువంటి మాహాత్మ్యాలను నమ్మే పాఠకులు ఉన్నారంటారా?

-మందలపర్తి కిషోర్ 81796 91822