పెరటి చెట్టు

చరిత్రాత్మక అంతరాత్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెర్మన్ భాషలో ‘జెయ్ట్ గెయ్‌స్ట్’ అనే మాట ఒకటుంది. చరిత్ర యొక్క, లేదా కాలం యొక్క ఆత్మ అని ఆ మాటకి - స్థూలంగా - అర్థం. పద్దెనిమిది పందొమ్మిది శతాబ్దాల్లో ఫ్రెంచ్ - జెర్మన్ - ఇంగ్లిష్ తత్వవేత్తలు వోల్టేయ్,్ర హెగెల్, స్పెన్సర్‌లు ‘చరిత్రాత్మ’ అనే ఈ మాట కనిపెట్టి, ప్రయోగించే నాటికి మల్లంపల్లి సోమశేఖర శర్మ పుట్టలేదు. కానీ, ‘చరిత్రాత్మ’ అంటే అర్థమేమిటో తెలుగు వాళ్లకి తెలియజెయ్యటానికే ఆయన ఏడు దశాబ్దాలకి పైగా మన మధ్యలో చరించాడనిపిస్తుంది. కవి, నాటకకర్త, నవలాకారుడు, కథకుడు, సాహిత్య సంపాదకుడు, చరిత్ర రచయితగా మారితే సమాజానికి జరిగే మేలు ఎంత ప్రభావశీలంగా ఉంటుందో మల్లంపల్లి చేసి, చూపించారు. అంతకుమించి, ఆయన అధ్యాపకుడిగా కూడా వ్యవహరిస్తే జాతి భవిష్యత్తు మరెంత ఉజ్వలంగా ఉండగలదో శర్మ నిరూపించారు. తెలుగులో 36 వ్యాసాలు - తొమ్మిది పుస్తకాలు, ఇంగ్లిష్‌లో 27 వ్యాసాలు - రెండు పుస్తకాలు రాసిన మల్లంపల్లి సంచార విజ్ఞాన సర్వస్వం అనిపించుకున్నారు. వకుళాభరణం మేస్టారు చెప్పినట్లుగా, శాసనాలకు సంబంధించిన అనేక వివాదాల విషయంలో శర్మగారి మాటని తుది తీర్పుగా ఔదలదాల్చడం కద్దు. అవీ ఆయనకి దక్కిన గౌరవాదరాలు! మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి లక్షణాలన్నింటికీ వర్తించేలా ఒక్కమాట చెప్పాలంటే, ఆయన్ని జాతీయ చారిత్రికులనే అనాలి. అయితే ఆయన జాతీయవాదం ‘జడలు విచ్చిన సుడులు రెచ్చిన’ సాంస్కృతిక జాతీయతా వాదం కాదు. అది నిర్ధారణాంధత్వంలోంచి పుట్టింది కాదు. నరేంద్ర దభోల్కర్ - గోవింద్ పన్సారే - గౌరీ లంకేశ్ లాంటి వాళ్లను నడిరోడ్డు మీద కాల్చిపారేయడం చూడకుండానే ఆయన వెళ్లిపోయారు! ఆయన ఆరాధించిన మన సంస్కర్తల్ని మెకాలే తొత్తులని సూత్రీకరించే పిదపకాలం దాపురించేనాటికి ఆయన దాటిపోయారు - అదృష్టవంతులు!
మనుషులు కాలశిశువులు! మట్టిముద్దల్లాంటి మానవుల్ని దేశకాల పరిస్థితులే మలుస్తాయి. (ఈ నిర్వచనాన్ని యాంత్రికంగా అనువర్తింప చేసుకుని తమ మనసుల్లో మెదిలే, కదిలే వికారాలన్నింటికీ కాలపురుషుణ్ణే బాధ్యుణ్ణి చెయ్యాలనుకునే గిరీశాలకి ఓ దండం!) మల్లంపల్లి సోమశేఖర శర్మ కూడా తన కాలపు చారిత్రికత ప్రభావానికి లోనయినవారే. పందొమ్మిదో శతాబ్ది చివరి దశకంలో పుట్టి, నెహ్రూ మరణించడానికి ఏడాదిన్నర ముందు కన్నుమూసిన మల్లంపల్లి మన దేశ చరిత్రలోని ముఖ్యమయిన ఘట్టాలన్నింటికీ ప్రత్యక్ష సాక్షి. కందుకూరి - గురజాడ - గిడుగు భూస్వామ్య భావజాలంపై తిరుగుబాటు చేస్తూ ఉండిన కాలంలో సోమశేఖర శర్మగారు రెండు పదుల లేత వయసులో వుండి వుండాలి. గోదావరి జిల్లాలో పుట్టి పెరిగినందువల్ల ఈ సంస్కర్త త్రయం ప్రభావంతో పాటుగా చిలకమర్తి లాంటి జాతీయ భావాలు బలంగా వుండిన సంస్కర్తల ప్రభావం కూడా పుష్కలంగా పడి వుండాలి. అందులోనూ, శర్మగారు చిలకమర్తి అసిధారావ్రతంలా నిర్వహించిన ‘దేశమాత’ పత్రికలో పనిచెయ్యడంతోనే తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అక్కడుండగా, మల్లంపల్లి వారు కుడిచేతా - ఎడంచేతా కథలూ కవితలూ రూపకాలూ రచించారు. చిలకమర్తి ప్రభావమంటే మజాకా? అయితే, ‘దేశమాత’లో పనిచేసే రోజుల్లోనే శర్మగారు చరిత్రను - ముఖ్యంగా తెలుగుల చరిత్రని - లోతుగా అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. చిలుకూరి వీరభద్రరావు ప్రోత్సాహంపై ఆయన ఈ అధ్యయనం మొదలుపెట్టారంటారు. అందుకే, మారుతున్న కాలమే మట్టిమనుషుల్ని మలుస్తుందనేది. క్రమంగా ఆంధ్రుల చరిత్ర శర్మగారి సొంత నియోజకవర్గంగా మారిపోయింది. ఆ కారణం చేతనే విశ్వనాథ సత్యనారాయణ తన ‘ఆంధ్ర ప్రశస్తి’ అన్న మల్లంపల్లికి అంకితమిచ్చారు. (‘జయంతి’ పత్రిక ఆవిష్కరణ సందర్భంగా ఈ కృతి సమర్పణ సంరంభాన్ని తన ‘సాగుతున్న యాత్ర’లో ఆచంట జానకిరాం నాటకీయంగా నమోదు చేశారు. మోదుగుల రవికృష్ణ 2011లో ప్రచురించిన ‘చారిత్రక వ్యాస మంజరి’లో ఈ వ్యాసాన్ని అనుబంధంగా చేర్చడం మంచి ఆలోచన!) 1923 నాటి ‘శారద’ పత్రికలో అచ్చయిన శర్మగారి కవితను తిరుమల రామచంద్ర ఉటంకించారు. మల్లంపల్లి స్మారక సంచికలో ‘మూడు అపూర్వ రత్నాలు’ పేరిట రామచంద్ర రాసిన వ్యాసంలో కవిగా మల్లంపల్లి ప్రతిభను గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. (‘చారిత్రక వ్యాస మంజరి’లో ఈ వ్యాసాన్ని కూడా అనుబంధంగా చేర్చారు.) బౌద్ధంలో ‘త్రిరత్నాలు’ గురించి అందరికీ తెలుసు. బుద్ధం, ధర్మం, సంఘం మూడింటినీ కలిపి త్రిరత్నాలంటారు. శర్మగారికి బౌద్ధం పట్ల ఉండిన గౌరవాదరాలను దృష్టిలో పెట్టుకుని రామచంద్ర మల్లంపల్లి వారి మూడు రచనల్ని త్రిరత్నాలుగా అభివర్ణించారు. ‘ద హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్స్’, ‘్ఫర్‌గాటెన్ ఛాప్టర్ ఆఫ్ ఆంధ్రా హిస్టరీ’, ‘యాన్ అర్లీ అర్ధనారీశ్వర ఇమేజ్ ఫ్రమ్ మొగల్రాజపురం’ అనే మూడు రచనల్ని రామచంద్రగారు ‘త్రిరత్నాలు’గా పేర్కొన్నారు. శర్మగారి మీద అంత అభిమానం ఉన్నందువల్లనే ‘మన లిపి పుట్టుపూర్వోత్తరాలు’ లాంటి పరిశోధనాత్మక రచనని ఆయనకి అంకితమిచ్చారు తిరుమల రామచంద్ర.
‘విజ్ఞాన సర్వస్వం’ కోసం పని చెయ్యడమనేది శర్మగారి జీవితంలో మూడు దశల్లో జరిగింది. మొదటి దశ 1915-17 మధ్యకాలంలో. ‘దేశమాత’ పత్రికలో పనిచేసే రోజుల్లోనే, కొమర్రాజు లక్ష్మణరావుతో కలిసి, మల్లంపల్లి ‘విజ్ఞాన సర్వస్వం’ కోసం పని మొదలుపెట్టారు. ఆనాటికే, మల్లంపల్లి పేరున్న రచయిత. అప్పటికే ఆయన కవితలూ కథానికలూ, రూపకాలూ, నవలలతోపాటు చరిత్ర వ్యాసాలు కూడా రాసివున్నారు. విజ్ఞాన సర్వస్వం మూడో భాగం పని పూర్తయి, నాలుగో భాగం పని మొదలుకాకముందే - 1923లో - లక్ష్మణరావుగారు కన్నుమూశారు. దాంతో, 30-40 సంచికలుగా తేవాలనుకున్న విజ్ఞాన సర్వస్వం మూడు భాగాలతోనే మూలన పడింది. రెండో దశ మరో పదిహేను ఇరవయ్యేళ్ల అనంతరం మొదలయింది. 1932లో విజ్ఞాన సర్వస్వం పునర్ముద్రణ మొదలయినప్పటికీ, మరో ఆరేళ్లకి కాశీనాథుని నాగేశ్వరరావు కన్నుమూసిన నేపథ్యంలో తిరిగి ఈ పథకం అసంపూర్తిగానే మూలనపడింది. దాంతో, శర్మగారు ‘్భరతి’ పత్రిక సంపాదక వర్గంలో చేరి పని చెయ్యవలసి వచ్చింది. అప్పట్లో, గన్నవరపు సుబ్బరామయ్య, కొంపెల్ల జనార్దనరావు కూడా ‘్భరతి’లో చేసేవారు. మూడో దశ 1940-46 మధ్యలో విస్తరించింది. తెలుగు భాషా సమితి ‘విజ్ఞాన సర్వస్వం’ మూడో సంపుటాన్ని ఆంధ్రుల సాహిత్యం - సంస్కృతి - చరిత్రలకి అంకితం చేసింది. ఈ సంపుటానికి సంపాదకత్వం వహించవలసిన భారం శర్మగారు సంతోషంగా స్వీకరించారు. ఆ తర్వాత తిరిగి ఆయన విశాఖపట్నానికి మకాం మార్చి చరిత్ర పరిశోధనలో మునిగితేలారు. ఎందరో ఆయన సారథ్యంలో పరిశోధన కృషి సాగించారు. తెలుగు లిపి సంస్కరణ సమితి అధ్యక్షుడిగా కూడా శర్మగారు కృషి చేశారు.
మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యక్తిత్వంలో మరో విశిష్టమయిన కోణం అధ్యాపన. ‘డిగ్రి లేని శర్మ కగ్రపీఠి’ ఇచ్చినందుకు - నిజానికి, తనకు ఇవ్వనందుకు - అబ్బూరి మేస్టారు మనసు కష్టపెట్టుకున్నప్పటికీ, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి లోకం మాత్రం కట్టమంచి వారికి రుణపడిపోయింది. తెలుగువారి చరిత్ర మీద జరిగిన పరిశోధనలో ఏపాటిదయినా వౌలికత కనిపిస్తే అది మల్లంపల్లి సోమశేఖర శర్మ పుణ్యమే. దానికి మూలం శర్మగారి మేధో పరిణామంలోనే వుందనిపిస్తోంది. మొదటిది - ఆయన కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ చిలక పలుకులు నేర్చుకుని చరిత్ర పరిశోధకులయినవారు కాదు. తన శిష్యులను పలుకు చిలుకలుగానూ మార్చే ప్రయత్నం సహజంగానే చేసి వుండరు. రెండోది - శర్మగారు ముందు కవి. కవి ఎంత నిరంకుశుడయినప్పటికీ, చారిత్రిక ఇతివృత్తం తీసుకున్నప్పుడు ఎవరి పప్పూ వుడకదు! తార్కికతకూ, తాత్వికతకూ తలవొగ్గక తప్పదు. ఎంతటివాడయినా, విశ్వనాథ సత్యనారాయణ అంతటివాడయినా ‘వేయిపడగలు’ నవల యథేచ్ఛగా రాసుకుపోగలిగారా? తల్‌స్తోయ్ (టాల్‌స్టాయ్) ‘వార్ అండ్ పీస్’ తన మనసుకి నచ్చినట్లు రాసుకుపోయి వుంటే ఆయన్ని లెనిన్ అంతటివాడు ‘మాస్టర్ రియలిస్ట్’ అని ఎందుకంటాడు? చారిత్రిక తర్కం అర్థమయిన రచయిత రాసే రాతలు మనల్ని ఒప్పించేలాగా, మెప్పించేలాగా కచ్చితంగా ఉంటాయి. మల్లంపల్లి వారి రచనలే అందుకు సాక్ష్యం. మూడోదీ, ముఖ్యమయినదీ - శర్మగారు ప్రధానంగా శాసనాల ఆధారంగా చరిత్ర పరిశోధన చేసిన పండితులు. శిలాక్షరాలు మనల్ని మెప్పించేందుకు మారిపోవు కదా! అంచేత, పరిశోధకుల కాళ్లూ చేతులూ కట్టేసయినా వాస్తవాలను బోధిస్తాయి శిలాశాసనాలు. ‘చరిత్ర అంటే...’ అనే వ్యాసంలో ఇదే విషయం ఇలా వివరించారాయన: ‘ఒక్కొక్క మార్పు కంటికి కనబడేప్పటికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. వందలూ వేలూ సంవత్సరాలవుతుంది. ఒకప్పుడు కడప ప్రాంతము సముద్రముగా ఉండేదంటే మనకిప్పుడు నమ్మిక లేకపోవచ్చు; కాని కడప రాళ్లు ఒక్కొక్కటి వేయినోళ్లూ వేయి నాలుకలూ చేసుకొని అవును నిజమే అని అరిచి చెప్పుతూ ఉంటవి’. ఎవరన్నారు చరిత్రకి నోరులేదని? నిజమేమిటంటే, అలా అనేవాళ్లకే చెవుల్లేవు!

--మందలపర్తి కిషోర్ 81796 91822