పెరటి చెట్టు

అకాల కుసుమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభయ్యోపడిలోనే నూరేళ్లు నిండిపోయాయి బసవరాజు అప్పారావుకి. భావకవిత్వం పేరుతో తెలుగులో ప్రచురమయిన ప్రణయ కవితకి ప్రతినిధి ప్రాయుడాయన. తొలితరం సినిమా పాటల రచయిత, న్యాయవాది, పత్రికీయుడు, సాహిత్య చరిత్రకారుడు కూడా అయిన బసవరాజు గురజాడ మహాకవిత్వం గురించి మొట్టమొదట నొక్కిచెప్పారు. ‘ఆంధ్ర పత్రిక’ ‘్భరతి’ లాంటి పత్రికల్లో పనిచేసి, తెలుగు పత్రికల్లో సాహిత్య పరిమళం వ్యాపించడానికి కారకులయిన కొద్దిమందిలో బసవరాజు ఒకరు. గాంధీవాదాన్ని ఎలుగెత్తి పాడిన ఈ కవే, లలిత గీతాలనే కొత్త బాణీని తెలుగు చెవికి పరిచయం చేసిన పుణ్యం కూడా సొంతం చేసుకున్నారు. బందా కనక లింగేశ్వరరావు, కాంచనమాల, సుందరమ్మ, టంగుటూరి సూర్యకుమారి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రావు బాల సరస్వతీదేవి పాడిన బసవరాజు గీతాలు సుప్రసిద్ధాలు. బసవరాజు గీతం ‘కొల్లాయి గట్టితేనేమి?’.. పాట అప్పట్లో ఊరూరా మారుమోగిపోయింది. సూరిబాబు పాడిన ఈ పాట ఇంటింటా ప్రతిధ్వనించింది. అందుకే, 1920 నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మహీధర రామమోహన రావు రాసిన ఉత్తర చారిత్రిక నవలకి ‘కొల్లాయి గట్టితేనేమి?’ అనే పేరు పెట్టారు. సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో కూడా పండితుడయిన బసవరాజు సరళసుందరమయిన, సంగీతబద్ధమయిన శైలిలో ప్రేమగీతాలు రాసి, ఆనాటి యువతరం హృదయాలను గుత్తగా దోచుకున్నారు. ప్రజాస్వామ్య సంస్కారంలో భాగంగా ప్రణయాన్ని చూడడంలో ఈ కవి గురజాడకి నిక్కమయిన వారసుడు.
బసవరాజు అప్పారావు కన్నుమూసిన మరుసటి సంవత్సరమే ఆయన తొలి కవితా సంకలనం వెలువడింది. అప్పటికే, సలక్షణమయిన లలితగీతాలకు ఒరవడినిచ్చిన కవిగా ఆయన సుప్రసిద్ధుడు. ప్రచురమయిన ఆయన పాటలు తెరకెక్కాయే గానీ, సినీ గీతాల ద్వారా బసవరాజు ప్రసిద్ధుడు కాలేదు. గురజాడ కన్నుమూసే నాటికే బసవరాజు లలిత-ప్రణయ గీతాలు రాస్తూ వుండినారు. ‘దేశమును ప్రేమించుమన్నా..’ గీతం ప్రభావం ఆయనపై అపారం. ‘కన్యక’ - ‘పూర్ణమ్మ’ - ‘లవణరాజు కల’ - ‘డామన్, పితియను’ లాంటి కథాకావ్యాల రీతిని బసవరాజు అనుసరించలేదు. ‘కాసులు’ - ‘మనిషి’ లాంటి ఖండకావ్యాల ధోరణి ఆయనను ప్రగాఢంగా ప్రభావితం చేసిందనిపిస్తుంది. ‘ఆకులందున అణగి మణగి కవిత కోకిల పలుకవలెనోయ్’ అన్న గురజాడ సూచనను బసవరాజు అక్షరాలా పాటించారు. తన కవితకి సంబంధించిన అన్ని అంశల మీదా బసవరాజుకి పూర్తి పట్టు ఉండేది. ఆయనకి శాస్ర్తియ సంగీతంలో ఉండిన అభినివేశం, భాష మీద ఉండిన పట్టు, సాహిత్య శాస్త్రంలో విద్వత్తు అతని గీతాలకి ప్రామాణికతను సంతరించిపెట్టాయి.
బసవరాజు గీతాల్లో కనబడే విలక్షణ ప్రయోగాలు కొన్ని అన్యత్ర దుర్లభం. ఉదాహరణకు ‘దేశబంధు’ చిత్తరంజన్ దాస్ 1925లో కన్నుమూసినప్పుడు బసవరాజు ‘ఊరేగింపు’ అనే పాట రాశారు. చిత్తరంజనుడన్నా, మన్మథుడన్నా దాదాపు అర్థం ఒకటే. అంచేత పాట ఎత్తుకోవడమే ‘ఊరేగు మన్మథా ఊరేగవోయ్, పెండ్లికొడుకూలాగ పల్లకీలో యెక్కి’ అంటూ ఎత్తుకోవడం అపూర్వమే కాదు, అపరం కూడానేమో! ‘వాసంతికా లతిక వనె్న తరిగున్నాది, కీర్తికాంతల్లదిగొ కీగన్ను గీటేని’ లాంటి సంక్లిష్టమయిన భావ ప్రకటనలు సామాన్య పాఠకులకీ, శ్రోతలకీ బోధపడడం కష్టమే. సీఆర్‌దాస్ లాంటి జాతీయ స్థాయి ప్రజా నాయకుడి మృతి సందర్భంగా రాసే స్మృతిగీతం ఇంత క్లిష్టంగా ఎత్తుకోవడం సామాన్యులు చెయ్యగల సాహసం కాదు! అయితే, అలా రాయడం ఆయన ధోరణి కాదు. మామూలు మాటల్లోనే, మామూలు మనుషుల జీవిత ఘటనలనే చిత్రించిన కవి బసవరాజు. బసవరాజు గీతాలు పుస్తకంలోని ‘గుత్తొంకాయ్ కూరోయ్ బావా!’ ‘చాటొద్దా నీకు మాటొద్దా?’ ‘నల్లవాడే, గొల్ల పిల్లడే’ ‘ఒంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దుకృష్ణా’ లాంటి పాటలు ప్రణయ గీతాలకి మచ్చుతునకలు. ఇక ఆయన పాడిన ‘గోపికా గీతలు’ ‘రాధికా గీతలు’ చదివి, తెనే్నటి సూరి తన ‘సాహితీ సమవాకారం’లో బసవరాజును మానసిక మానినిగా మార్చేశాడు. అయినా, భక్తి కవులందరూ ఏదో ఓ స్థాయిలో ప్రేయసులే కనక, బసవరాజు పోకడ సలక్షణమయిందే కానీ, మనోవికారమేం కాదని చెప్పొచ్చు!
బసవరాజు అప్పారావు ప్రణయ గీతాలు ముమ్మరంగా రాసే రోజుల్లో దేశం స్వరాజ్య సమరంలో తలమునకలుగా ఉండింది. ఆడా మగా పిన్నా పెద్దా అందరూ స్వాతంత్య్రం కోసం తపిస్తున్న రోజులవి. అప్పటిదాకా, జస్టిస్ పార్టీ చంకెక్కి కూర్చున్న వర్గాలు సయితం ‘జాతీయ వాదులు’గా మారిన అలాంటి రోజుల్లో, కవిగారికి ఈ ప్రేమపిచ్చి పట్టడం విడ్డూరంగా లేదా? పోనీ, బసవరాజు సామాజిక - రాజకీయ ఉద్యమాల స్పర్శ తెలియకుండా, ఏ గజదంత గోపురాల్లోనో పుట్టిపెరిగిన కవిపుంగవుడా అంటే కాదాయె! గురజాడ అడుగుజాడలే తన పాలిట గురుజాడ లనుకున్నవాడు బసవరాజు. దానికి తోడు ‘ఆంధ్ర పత్రిక’, ‘్భరతి’ లాంటి పత్రికల్లో పనిచేశాడు. చివర్లో తానే సొంతంగా ఓ పత్రిక పెట్టాలనే ప్రయత్నంలో ఉండగానే ఆయన ఆరోగ్యం విషమించింది. మరి, అలాంటి కవి అత్యధిక శాతం ప్రణయ కవితలే రాయడమేమిటి? వాస్తవానికి గురజాడ కూడా దేశమును ‘ప్రేమించుమన్నా!’ అనే అన్నారు. ప్రపంచమంతటా నిండివుండేది ప్రేమ తత్వమేనంటారు తాత్వికులు. ప్రేమ అత్యంత ప్రాథమికమయిన మనోభావమనడంలో సందేహం లేదు. అయితే, ఈ ప్రేమ తత్వం ప్రేయసీ ప్రియులకో, కుటుంబ సభ్యులకో, బంధుమిత్రులకో పరిమితమయ్యేది కాదుద. ఈ విశ్వమంతా ఒకేఒక్క పదార్థంతో తయారయిందని చెప్పాడు పదిహేడో శతాబ్దపు డచ్ తత్వవేత్త స్పినోజా. ఆయన బోధల పునాది మీదే పాశ్చాత్య పరమాత్మ తత్వం (పాన్‌థీయిజమ్) పుట్టుకువచ్చింది. అదే ఆ దేశాల్లో విశాల ప్రేమ తత్వం పుట్టి పెరగడానికి దారితీసింది. రొమాంటిసిజమ్ అనే ప్రణయ కవిత అందులోంచి పుట్టుకు వచ్చిందే. ప్రణయ గీతాల ప్రవాహం నిరంతరం స్రోతస్విని లాంటిదనీ, ప్రేమగీతాలు తమకాలపు చరిత్రను పాడతాయనీ అంటారు అమెరికన్ జాజ్ సంగీత - సాహిత్య చరిత్రకారుడు టెడ్ గోయా. అంటే, ప్రణయ గీతాలకు సామాజిక స్వభావం వుండదనేది నిజం కాదనీ, అవి కూడా చారిత్రిక స్వభావాన్ని కలిగివుంటాయనీ గోయా సిద్ధాంతం చెప్తోంది. గొప్ప ప్రణయ గీతాల్లో వినిపించేది వైయక్తిక ప్రేమ కాదనీ, అందులో వినబడేది అనియంత్రితమయిన సామాజిక స్పందన లేననీ గోయా వాదిస్తున్నారు. ఈ తాజా సిద్ధాంతాల మీద చర్చ, ప్రణయ కవిత్వం మీద పండిత లోకంలో పాతుకుపోయిన అభిప్రాయాలను ప్రశ్నిస్తోంది. చాలామంది మేధావులు ఈ చర్చలో పాల్గొంటున్న నేపథ్యంలో, ఇది త్వరలోనే మార్మిక చర్చగా మారిపోవడం ఖాయమనిపిస్తోంది. ఆలోగానే, మన బసవరాజు ఎనిమిదిన్నర దశాబ్దాల కిందట రాసిన ప్రణయ గీతాల చర్చ ముగించడం మన మానసిక ఆరోగ్యానికి మంచిదనిపిస్తోంది!
బసవరాజు అప్పారావు ప్రభావ పరిధి ఎంత విస్తృతమయిందో చెప్పడానికి ‘సౌదామిని’గారి వృత్తాంతం చెప్పుకుంటే సరిపోతుంది. ‘అకాల కుసుమం’ లాంటి బసవరాజు అకాల మరణంపాలే కావడం ఓ విషాదం. ఎంతకాలం బతికామనే దానికన్నా, ఎలా బతికామనేది ఎక్కువ ముఖ్యం. తన అర్ధాంగిని కలం పట్టుకునేలా చెయ్యడమే బసవరాజు జీవితంలో సాధించిన ఘనవిజయం. కాయితం మీది కవిత్వంకన్నా జీవితంలో కవిత్వం కచ్చితంగా గొప్పది! ఇక, ‘ఎంకి పాటలు’ రాసిన నండూరి సుబ్బారావు, చలం, కృష్ణశాస్ర్తీ, శ్రీశ్రీ తదితర మహాకవుల్ని మెప్పించినవాడు. ‘గాయక సార్వభౌమ’ పారుపల్లి రామకృష్ణయ్యగారు ‘ఎంకి పాటలు’ తాను గొప్పగా పాడడమే కాదు - తన శిష్యరత్నం మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేత కూడా పాడించారు. ఆయన, నండూరికి మేనమామ - గురువు అయిన బసవరాజు అప్పారావు పాటలకూ అదే హోదా ఇవ్వడం గమనార్హం. నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావుల పాటలకి సంబంధించిన తొలి తులనాత్మకమయిన అధ్యయనం చేసిన వాడు కృష్ణశాస్ర్తీ గారేనేమో! ‘సుబ్బారావు పాట నిభృత సుందరమయితే, అప్పారావు పాట నిసర్గ మనోహరం’ అన్నారు కృష్ణశాస్ర్తీ. నండూరి సుబ్బారావు తన పాటలన్నిటికీ రాగవరసలు కట్టి శాస్ర్తియ బాణీలో పాడి వినిపించేవారు కనకనే అవి తీర్చినట్లున్న నిభృత సుందర గీతాలని దేవులపల్లి అన్నట్లున్నారు. అప్పారావుగారి పాటలలా వుండవుగా! అవి గుండెలోతుల్లోంచి తన్నుకొచ్చే ఊటలు! అయితే, ఏమాట కామాట - నిసర్గమయినా, నిభృతమయినా సౌందర్యం సౌందర్యమే కదా! చిరంజీవి ప్రేమతత్వం బతికి వున్నంతకాలం బసవరాజు పాటలు అజరామరాలయి వర్థిల్లుతూనే ఉంటాయి. అవి, ఈ లింకులో దొరుకుతాయి.
https:// upload.wikimedia.org/ wikipedia/ commons/3/3e/ Geethamulu%2C-basavaraju -apparao-%281934%29.pdf
*

-మందలపర్తి కిషోర్ 81796 91822