పెరటి చెట్టు

‘నీ యశం బారభ మానతారకర హార విలాసము!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్య చరిత్రలో ప్రహేళికలకూ, ప్రవహ్లికలకూ కొదవలేదు. మన వాళ్లకు తారీఖులు దస్తావేజులు చరిత్ర సారం కావని బాగా తెలుసు. కానీ, అవి లేకుండా చరిత్ర సారం పిండడం సాధ్యం కాదనే స్పృహ లేకపోవడం పెద్ద విషాదం. మల్లియ రేచన, ననె్నచోడుడు, వేములవాడ భీమకవి తదితరులకు సంబంధించిన కవికాలాదులు వందల సంవత్సరాలుగా చర్చనీయాంశాలుగా కొనసాగుతూనే ఉన్నాయంటే అందుకు మనవాళ్ల చారిత్రిక నిస్పృహే కారణం. కారణమేమయినప్పటికీ, వేములవాడ భీమకవి రచనలు ఏవీ మనదాకా రానేలేదు. అద్భుత ప్రజ్ఞావంతుడూ, అపారమయిన ఆత్మవిశ్వాసానికి మారుపేరు అనదగిన కవిసార్వభౌముడు శ్రీనాతుడు, ‘వచియింతు వేములవాడ భీముని భంగి నుద్దండలీల నొక్కొక్క మాటు’ అంటూ తొలి దండం భీమనకే అర్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాతే, ఆయన ఆదికవి నన్నయ్య పేరెత్తడం గమనార్హం. శ్రీనాథుడంతటివాడు, తాను మరొకరి మాదిరిగా (కవిత) చెప్తానని అన్నాడంటే, ఆ ‘మరొకరు’ ఎవరో మహానునావుడే అయ్యుండాలి కదా! పైగా, భీమన చెప్పిన చాటువులకు అనుకరణల్లాంటి చాటువులు కూడా చెప్పాడంటే, ఆయన ప్రభావం ఈయనపై ఎంత ప్రగాఢంగా పడిందో తేలిగ్గానే గ్రహించవచ్చు. అంతటి ప్రభావశీలి గురించిన కనీస సమాచారం కూడా మిగుల్చుకోలేక పోవడం కన్నా దౌర్భాగ్యం మన జాతికి వేరొకటి వుండగలదా?
అసలు, వేములవాడ భీమకవిది ఏ ఊరు? తూర్పుగోదావరి జిల్లాలోని దక్షారామం (ద్రాక్షారం) సమీపంలోని గ్రామమా? లేక, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమా? ఆయన ఏ శతాబ్దంలో పుట్టి, పెరిగి, కవిత్వం చెప్పాడు? నన్నయ్యకీ భీమనకీ మధ్య ఉందని చెప్పే ‘వైరం’ చారిత్రికమేనా? కేవల కల్పనా కథేనా? భీమన ఉనికి, మనికి వగయిరాల గురించిన శాసనస్తమయిన ఆధారాలేమయినా ఉన్నాయా? - ఇలా అన్నీ ప్రశ్నలే! అన్నీ సందేహాలే! కావలి వెంకట రామస్వామి, మానవల్లి రామకృష్ణ కవి, జయంతి రామయ్య, శేషాద్రి రమణ కవులు భీమకవిది పాత కరీంనగర్ జిల్లాలోని వేములవాడేనని తేల్చి చెప్పినా అనేక మంది పరిశోధకులు ఈ అంశాన్ని చర్చకు లాక్కురాగలుగుతున్నారు. ఈ ప్రకటనను బలపరిచే భౌతిక ఆధారాలేవీ లేకపోవడమే ఇందుకు అవకాశం ఇస్తోంది. శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారి లెక్క ప్రకారం, భీమన క్రీ.శ.1076-1147 మధ్యకాలంలో జీవించాడు. నేలటూరి వెంకటరమణయ్య గారి లెక్క ప్రకారం, మైలమ భీముడి కాలం క్రీ.శ.1121. వేములవాడ భీమన ఈ మైలమ భీమనకు సమకాలికుడే. నిడుదవోలు వెంకటరావు - చాగంటి శేషయ్య గార్ల లెక్క ప్రకారం భీమకవి క్రీ.శ.1150-70 సంవత్సరాల నాటివాడు. వీరేశలింగం గారి లెక్క ప్రకారం భీమకవి క్రీ.శ.1340-50 సంవత్సరాల నాటివాడు. ఇలా, కవుల చరిత్రలు రాసిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పుకొచ్చారు. ఆయా అంచనాలన్నీ నిజం కావాలంటే - ఆరుద్ర చెప్పినట్లు - భీమకవి రెండు మూడు వందల సంవత్సరాలు బతికి ఉండాలి! పైన చెప్పుకున్న వాటిలో నేలటూరి వారి లెక్కకు మాత్రమే శాసనస్తమయిన ఆధారాలున్నందువల్ల దాన్ని ఆమోదించవచ్చును. ఆ లెక్కన భీమన నన్నయ్యకీ, తిక్కనకీ మధ్య కాలానికి చెందినవాడని తేలుతోంది.
మన సాహిత్య చరిత్రకారులను నిందించాలనే దుగ్ధ, దురుద్దేశం నాకు లేవు. కానీ, భీమకవి గురించిన కనీస వాస్తవాలను నమోదు చేసే విషయంలో క్షమార్హం కానంత నిర్లిప్తత వహించిన ఈ పెద్దలు ఆయన గురించిన పుకార్లను మాత్రం వేనోళ్ల వ్యాపింప చేశారన్న బాధ పుష్కలంగా ఉంది. కవిత్వం చెప్పడంలో భీమన ప్రజ్ఞ, ఉపజ్ఞల గురించి మన వాళ్లు గొప్పగానే చెప్పారుగానీ, ఆ విషయంలో గొప్ప పొదుపు పాటించారు. కానీ, ఆయన్ని శాపానుగ్రహ సమర్థుడిగానూ, అప్పాలను కప్పలుగానూ - అన్నాన్ని సున్నంగానూ మార్చేయగల వాక్శుద్ధి కలిగిన వరప్రసాదిగానూ, ఆయన పద్యం విని మల్లెసాలలోని రాట చిగుళ్లెత్తి వెల్లివిరిసినట్లుగానూ విధవిధాలుగా వర్ణించి చెప్పారు. అవన్నీ చదివితే, వేములవాడ భీమకవి మహాకవి అనే అభిప్రాయం కలగదు - ఆయనో మాయల మరాఠీ అని మాత్రమే అనిపిస్తుంది. ఓ మహాకవికి మనమిచ్చే గౌరవమిదా? భీమకవి ‘హిప్నాటిస్ట్’ అయి ఉండొచ్చునని కొందరు భావించారు. అయితే అయ్యుండొచ్చు కానీ, ఆయన సాహిత్య మూర్తిమత్వం మాత్రం తక్కువ ఘనమయినదా? మనకేది ఎక్కువ ప్రస్తుతమో అది మాట్లాడుకోవాలిక్కడ.
కానీ, కాకునూరి అప్పకవితో సహా లాక్షణికులుకూడా భీమకవి గురించిన కాల్పనిక ప్రచారానికి తెగబడ్డారు. ఆదికవి నన్నయ్యే భీమకవి రచనల్ని నాశనం చేశాడనీ, దానికి ప్రతిగా నన్నయ్య రాసిన ‘ఆంధ్రశబ్ద చింతామణి’ని భీమకవి నాశనం చేయించాడనీ పుకార్లు పుట్టించారు. భీమన ‘రాఘవ పాండవీయం’ లాంటి ద్వ్యర్థి కావ్యాలు రాశాడనడమే కానీ అదెక్కడా నిరూపితం కాలేదు. భీమన గురించి వినడమే కానీ ఆయన రాసిందేదీ చూడలేదని చెప్పిన పింగళి సూరన రాసిన ‘రాఘవ పాండవీయం’ అనే ద్వ్యర్థి కావ్యం మాత్రం ఇప్పటికీ దొరుకుతోంది (ఆసక్తి ఉన్నవాళ్లు ఈ లింకులో దాన్ని చూడొచ్చు కూడా. దఆఆఔఒ:// ఘూష్దజ్పళ.్య/ఒఆళ్ఘౄ/ ఘ్ద్ఘ్పఘఔ్ఘశజ్ఘ్పూజక్ఘ00అఔజశఒ్దళూ ఔ్ఘ్ళ/శ8/్యౄజూళ/1ఖఔ) మల్లియ రేఛన రాసిన ‘కవిజనాశ్రయం’ లక్షణ గ్రంథాన్ని భీమకవి ఖాతాలో జమ చేయడంతో ఈ మహానుభావులు శాంతించలేదు. పనీపాటూ లేనివాళ్లెవరో దాన్నిండా ప్రక్షిప్తాలు కూరిపెట్టారని ఆరోపించారు. మొత్తం మీద, అనుపమానమయిన ప్రతిభ కలిగిన భీమకవి జీవిత కథను ఓ తృతీయ శ్రేణి తెలుగు సినిమా స్థాయికి దిగజార్చారు. అయితే, మహాకవి చెప్పినట్లుగా దాచేస్తే దాగదు సత్యం! వేములవాడ భీమకవి చాటువులు- అన్నీ కలిపితే పాతిక ముప్పై దాటవేమో! - చూస్తే చాలు, ఆయన కవితాత్మ ఎంత ధగద్ధగాయమయిన కాంతులతో వెలిగిందో అర్థమయిపోతుంది. ముఖ్యంగా, మైలమ భీమన పోయినప్పుడు భీమకవి సమర్పించిన నివాళి చూస్తే, ఈ సంప్రదాయికుడు ఎంత ఆధునికుడో తెలిసి వస్తుంది. మైలమ భీమనకు నివాళిగా భీమకవి చెప్పిన పద్యాల్లోంచి ఈ పద్యాన్ని తీసుకుని శ్రీశ్రీ తన ‘ఖడ్గసృష్టి’ కావ్యానికి మకుటంగా పెట్టుకున్నారు.
‘గరళపు ముద్ద లోహ మవగాఢమహాశని కోట్లు సమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి, యురగాధిపు కోరలు పట్టుకార్లు ది
క్కరటి శిరంబు దాయ, లయకాలుడు కమ్మరి, వైరి వీర సం
హరణగుంభిరాముడగు మైలమ భీమన ఖడ్గసృష్టికిన్’
ఈ నివాళి పద్యాలు పధ్నాల్గింటినీ ఆరుద్ర తన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ తొలి సంపుటంలో చేర్చి పుట్టెడు పుణ్యం మూట కట్టుకున్నారు. సందర్భం ఎంతో విషాద గంభీరమయినదయినప్పటికీ, భీమన ఈ పద్యాలు కూర్చిన తీరులో ఆసాంతం కవితాకళ జాలువారింది. భీమన చెప్పిన ప్రతి ఒక్క చాటువునూ వందలసార్లు ఉటంకించినా, తనివి తీరదు! అలాంటి మహాకవి రచనల్ని కాపాడుకోగలిగే వుంటే...?
(‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ సంపుటాల్ని పెంచి రాసినప్పుడు ఆరుద్ర తన పాత అభిప్రాయాలు కొన్ని మార్చుకున్నారు. అప్‌డేషన్ మంచి అలవాటే, కాదనను. భీమకవి చెప్పాడని గతంలో తాను ఉటంకించిన పద్యాలన్నీ ఆయన రాసినవే కాకపోవచ్చని ఆరుద్ర సంశయం వ్యక్తం చేశారు. ఆ మాటకొస్తే అది కూడా ఓ ఇన్‌ఫరెనే్స! కానీ, అవి ఒకే కవి ఏకధారగా చెప్పిన పద్యాలేననీ - అది కూడా వేములవాడ భీమకవి, మైలమ భీమన గురించి చెప్పిన నివాళి పద్యాలేనని నాకెందుకో గట్టి నమ్మకం. నిజం నిలకడ మీదయినా తేలుతుందనేది నా మరో నమ్మకం!!)

-మందలపర్తి కిషోర్ 81796 91822