పెరటి చెట్టు

అక్షరాలా పండిత‘కవి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవయ్యొకటో శతాబ్ది పాఠకులు ఊహించుకోనయినా లేని వింత జీవులు, పండితులు. కాలక్రమంలో అనేక జీవజాతులు అంతరించిపోయినట్లే, సాహిత్య చరిత్ర క్రమంలో అంతరించిపోయిన వాళ్లు పండితులు. ఈ పరిణామానికి రెండు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మొదటిది, వైజ్ఞానిక విస్ఫోటం పుణ్యమాని, అన్ని రంగాల్లోనూ విపరీతమయిన సమాచారం రాశిపడింది. దాన్ని ఒక్క వ్యక్తి ఆసాంతం ఆపోశన పట్టడం అసాధ్యంగా మారిపోయింది. రెండోది, బహుభాషా కోవిదులూ, బహుశాస్త్ర నిపుణులూ క్రమంగా అంతరించిపోయారు. ఫలితంగా పాతకాలపు మూసల్లో పోసిన పండితులు కనిపించకుండా పోయారు. వాళ్లకి కనీసం, నాలుగయిదు భాషలు తెలిస వుండేవి. ఇళ్లల్లో ఓ పాతిక చిన్నా పెద్దా నిఘంటువులుండేవి. చాలామందికి ‘శబ్ద రత్నాకరము’ లాంటి నిఘంటువులు నోటికే వచ్చేవి. అప్పట్లో, పుస్తకాలు ఎక్కడోగానీ దొరికేవి కావు. దొరికినా, ఏ కొద్ది గంటల్లోనో వాటిని మళ్లీ తిరిగి ఇచ్చెయ్యవలసి వచ్చేది. లైబ్రరీల నుంచి తలదిండు సైజు పుస్తకాల ‘బంగీలు’ రిజిస్టర్డ్ పోస్ట్‌లో తెప్పించుకోవడం - వాటిని ఓ వారంలో తదేక దీక్షతో చదివేసి, జాగ్రత్తగా ‘తిరుగు టపా’లో పంపేయడం నలభయ్యేభై ఏళ్ల కిందటి వరకూ చూసిన దృశ్యాలే. బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ, భండార్కర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ, మోతీలాల్ బనార్సీ దాస్, గోపాల్‌దాస్ నారాయణ్ అండ్ సన్స్, ఫెర్రీస్ అండ్ కో, హిగ్గిన్ బాథమ్స్, వావిళ్ల, కొండపల్లి, అద్దేపల్లి లాంటి ప్రచురణ సంస్థలు కొత్త పుస్తకం ఏదయినా వెలువరిస్తే, తమ ‘సాంప్రదాయిక’ కొనుగోలుదార్లకి ఓ కార్డుముక్క రాసి ఆ విషయం తెలియచేసేవారు. అలాంటి ‘కార్డు ముక్కలు’ అందుకునే వాళ్లలో ఎక్కువమంది పండితులే వుండేవారు.
ఎమెస్కో సంస్థ ‘ఇంటింటి గ్రంథాలయం’ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఈ క్లాసిక్స్ కాటకం తీరిపోయింది. మధ్యతరగతి మందభాగ్యులు కూడా రామాయణ భారతాలే కాకుండా మనుచరిత్ర, వసుచరిత్రాది ప్రబంధాలను సైతం సొంతం చేసుకోగలిగే పరిస్థితి ఏర్పడింది. తెలుగు పుస్తక ప్రచురణ చరిత్రలో ఇదో మూలమలుపు. అంతకు ముందు వరకూ పుస్తకాలు పండితుల వినియోగం కోసమే ఉద్దిష్టమయి వుండేవి. ఈ పండితుల ప్రవర్తన విలక్షణంగా ఉండేది. ‘రజా లైబ్రరీ’ ‘డేవిడ్ సాసూన్ లైబ్రరీ’ ‘నేషనల్ లైబ్రరీ’ ‘సరస్వతీ మహల్ లైబ్రరీ’ ‘కానిమెరా లైబ్రరీ’, తిరువనంతపురం, హైదరాబాద్ (స్టేట్ సెంట్రల్) లైబ్రరీల పేర్లు ప్రస్తావించి, అక్కడుండే అరుదయిన పుస్తకాల గురించి ప్రస్తావించడం ఈ పండితులకి ఇష్టమయిన కాలక్షేపం. ఆయా లైబ్రరీలకి అందరికన్నా ముందు రావడం, ఆఖర్న వెళ్లడం - గ్రంథాలయాల్లో ఉన్నంతసేపూ భారతి లాంటి పత్రికలు తిరగెయ్యడం - పేజీలకి పేజీలు కాపీలు రాసుకోవడం - ఒక్కో సీజనులో ఒక్కో పుస్తకాన్నో, రచయితనో ఎత్తుకుని నెలల తరబడి ఆయన రచనల్ని వేటాడ్డం - చిట్టచివర్న, పెదవి విరిచి అసంతృప్తి ప్రకటించడం. ఇదీ ఆ పండితుల సాధారణ (?) ప్రవర్తన. సాధారణంగా, ఈ పండితులకి వేరే పనేదీ వుండేది కాదు. ఆ యుగానికి ప్రతినిధి ప్రాయుడు మానవల్లి రామకృష్ణ కవి.
1866లో, ఆనాటి చెన్నపురిలోని, నుంగంబాక్కంలో పుట్టారు రామకృష్ణయ్యగారు. పదహారో యేట, ఓ సభలో ‘మృగావతి’ అనే పద్యకావ్యంలోంచి కొన్ని పద్యాలు చదివి వినిపించిన నాటి నుంచీ, ఆయన కవిగారి అవతారం ఎత్తారని వీ.శ్రీరామ్ రాస్తున్నారు. దీనికి సంబంధించి, ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి కథనం వేరేలా వుంది. మాడభూషి వేంకటాచార్యులు, పనప్పాకం అనంతాచార్యులు, కొక్కొండ వేంకటరత్న ‘శర్మ’ తదితరులు పాల్గొన్న ఓ ‘గోష్ఠి’లో రామకృష్ణయ్య గారు ‘పాటలీపుత్రకం’ అనే కావ్యం నుంచి కొన్ని పద్యాలు చదివి వినిపించారట. రసజ్ఞులయిన సదస్యులు ఆయన పద్య కవితను మెచ్చి, ఆయనకి ‘కవి’ అనే బిరుదనామం ఇచ్చారట. ఏడున్నర దశాబ్దాలకి పైగా - తొంభయ్యో యేట కన్నుమూసే దాకా ఆయన ఆ బిరుద నామాన్ని ధరిస్తూనే వున్నారు. విషయమేమిటంటే, కవిత్వ కళలో మానవల్లి వారికి వున్న ప్రజ్ఞ నుంచే, ఆయనకి కవిగారనే బిరుదు దక్కింది. అయితే, ఆయన సాహిత్య సర్వస్వాన్ని గమనించినప్పుడు, కవిగారి కావ్యరచనా వ్యాసంగం బహుపరిమితమని తేలుతుంది. మృగావతి కావ్యం, ‘కళింగ సేన’ రూపకం (ప్రకరణం), వసంత విలాస కావ్యం, చంపకమాలిక అనే స్మృతి కావ్యం, వత్సరాజ చరిత్రం అనే నవల రాసిన కవిగారు ‘్భరతకోశ’మనే బృహన్నిఘంటువునూ, భాస రూపకాలు ఏడెనిమిదింటికి అనువాదాలనూ కూడా రచించారు. అయితే, భాస రూపకాల్లో ‘కర్ణ్భారం’ ఒక్కటే ప్రచురితం.
నిజానికి కవిగారికి పండితుడిగానే ఎక్కువ పేరు. అరడజను భాషల్లో కవిగారు పండితులంటారు. దేశభాషలు ప్రచురంగా వుండే ప్రాంతాల్లో సంస్కృత కావ్యాలని కూడా ఆయా భాషల లిపుల్లోనే రాసుకుని చదువుకునేవారు. ఒక ప్రాంతంలో దొరికిన తాళపత్రాన్ని గానీ, రాతప్రతిని గానీ మరో ప్రాంతంలో దొరికిన ప్రతితో తైపారు వేసి చూడాలంటే, ఒక్క లిపితో పరిచయం సరిపోదు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, నాగరి, తదితర లిపుల్లో పుస్తకాల రచనకి వినియోగించే జిలుగు రాతను అలవోకగా చదివే నేర్పు కవిగారి సొంతం. నేపాల్, బికనీర్, బరోడా, తిరువాన్కూర్ సంస్థానాలకీ - లాహోర్, జోధ్‌పూర్ గ్రంథాలయాలకీ విస్తృతంగా పర్యటించిన పరిశోధకుడు కవిగారు. కవిగారు దేశాటనం చేసి రాసుకువచ్చిన ప్రతులు తంజావూర్ సరస్వతీ మహల్‌లోనూ, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరా ప్రాచ్య లిఖితపత్ర భాండాగారంలోనూ ఇప్పటికీ వున్నాయి. అవన్నీ ఒక ఎత్తు - ననె్నచోడుడి ‘కుమార సంభవం’ పరిష్కరణ, శుద్ధప్రతి ప్రచురణ ఒక్కటీ ఒక యెత్తు! ‘కవిరాజ శిఖామణి, టెంకణాదిత్యుడు’ లాంటి బిరుదులు ఉన్న ననె్నచోడుడు నన్నయ్యకన్నా ముందటివాడన్నది కవిగారి అంచనా. ఈ అంచనాతో ఏకీభవించిన వాళ్లూ విభేదించిన వాళ్లూ కూడా కొమ్ములు తిరిగిన పండితులే కావడం విశేషం. అలాగే, దేవరపల్లి కృష్ణారెడ్డి లాంటి పరిశోధకులు కొందరి లెక్క ప్రకారం, ననె్నచోడుడు నన్నయ్య - తిక్కనలకి మధ్యకాలపువాడు. ఇక, కొర్లపాటి శ్రీరామమూర్తిగారి లెక్క ప్రకారం, ననె్నచోడుడు ఓ కల్పిత వ్యక్తి - ‘కుమార సంభవం’ ఓ కూటసృష్టి! ఈ వివాదాలు కాలక్రమంలో తేలవలసిందే. అంతకాలమూ, ననె్నచోడుని మాదిరిగానే కవిగారు కూడా మన పరిశోధకుల ముందు నిలువెత్తు ప్రశ్నార్థకంగా నిలబడే వుంటారు. ఆయన చెప్పింది అసత్యమని చెప్తే చాలదు - ఫలానిది సత్యమని రుజువు చేసేవరకూ చర్చ సాగుతూనే ఉంటుంది.
ప్రభుత్వ ప్రాచ్య లిఖితపత్ర భాండాగారం - అంటే, గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ అనే జీవోఎమ్మెల్ - లో వేటూరి ప్రభాకరులు, నిడదవోలు వెంకటరావు, తిరుమల రామచంద్ర తదితరులు కవిగారితో కలిసి పనిచేశారు. వేటూరి ప్రభాకర శాస్ర్తీగారూ కవిగారూ కలిసి దక్షిణ భారతమంతా కలతిరిగి, ఎనె్నన్నో అమూల్యమయిన తాళపత్ర ప్రతులనూ, రాతప్రతులనూ సేకరించిన సంగతి చరిత్రకెక్కినదే. ఇక, నిడదవోలు వెంకటరావుగారు కవిగారి పట్ల ఆరాధనతో రాసిన వాక్యాలు సుప్రసిద్ధాలు. అలాగే, ‘మూడు వాంగ్మయ శిఖరాలు’ వంటి పుస్తకాల్లో కవిగారికి ఘనమయిన నివాళి సమర్పించిన తిరుమల రామచంద్ర కవిగారి పాండిత్యం గురించిన ఉదంతాలు ఎన్నో ఉదాహరించారు. ప్రామాణిక రూపంలో ‘ఆంధ్ర కవుల చరిత్ర’ రచించిన కందుకూరి వీరేశలింగం గారు కవిగారితో కలిసి ఆ రంగంలో ఎంతో కృషి చేశారు. కానీ, వాళ్ల మైత్రి చిరకాలం నిలవలేదు. ఆ మాటకొస్తే, కవిగారితో గొడవ పడని ఆయన మిత్రులు లేరనే చెప్పాలి. కవిగారికి తన వనరులూ మూలాల గురించి పారదర్శకంగా మాట్లాడే, రాసే అలవాటు లేదు. సాధారణంగా ఈ విషయంపైనే ఆయనకి మిత్రులూ సహచరులతో గొడవలు వచ్చేవి. ఇతరుల ద్వారా ఏ విషయమూ వెల్లడి కావడం ఆయనకి ఇష్టముండేది కాదు. భాసుడి నాటకాలను బయటపెట్టిన గణపతి శాస్ర్తీతోనూ, ప్రసిద్ధ సంస్కృత విద్వాంసుడు - పరిశోధకుడు ఎస్.కే. డే తదితరులతోనూ కవిగారి విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.
మద్రాసు నుంచి, మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి - ‘ఆంతరంగిక కార్యదర్శి’ పదవి చేపట్టేందుకు - కవిగారు పయనమయి వెళ్లడం పెద్ద విడ్డూరం. అక్కడేం జరిగిందో ఏమో, కట్టుబట్టలతో కవిగారు అక్కడి నుంచి బయటపడ్డం, అంతకుమించిన విడ్డూరం. వనపర్తిలో వుండగా, ఆ సంస్థానంలోని అనేక పండిత కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు పెంచుకుని, కవిగారు ఎన్నో అరుదయిన గ్రంథాలు సేకరించి, ప్రచురించారు. రాజమండ్రిలో కవిగారి మకాం కూడా, ఎనె్నన్నో విషాదాలకీ, వియోగాలకీ దారితీసింది. చివరికి తిరుపతిలో ఆయన స్థిరపడ్డారు గానీ, అక్కడా స్థిమితపడలేదు. తొమ్మిది పదుల పండు వయసులో, తిండికి కూడా లేని దుస్థితిలో కవిగారు తిరుపతి వీథుల్లో తిరుగుతూ వుండేవారట. సాహిత్యంతో దూరపు చుట్టరికం కూడా లేని ఓ హోటల్ యజమాని దయదల్చి ఆయనకో ముద్ద పెడుతుండేవారట. దేశమంతా తిరిగి, డజన్లాదిగా అరుదయిన గ్రంథాలను పోగుచేసి, కవిగారు ఏ పరిశోధక సమాజం ఎదాన కొట్టారో, ఆ సమాజానికి ఆయన పరిస్థితి పట్టనే లేదు. ఇలాంటి నిర్లిప్తత, ఉదాశీనత తెలుగునాట తప్ప ఇతరత్రా ఊహించగలమా?

-మందలపర్తి కిషోర్ 81796 91822