పెరటి చెట్టు

శక పురుషుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుసుకో గలిగిన వాళ్లకి సాహిత్య చరిత్ర ఓ చెరుకు గెడ లాంటిది! అయితే, అది సరుగుడు వాసంలాగా ఏకమొత్తంగా ఉండదు. కణుపులు కణుపులుగానే ఉంటుంది. ఆ కణుపులనే మనం, యుగాలూ శకాలూ అని పిల్చుకుంటాం. అలాంటి ఒక ఇక్షు ఖండమే నవ్య కవిత్వం. ఇది గురజాడ సారథ్యంలో ఆవిష్కృతమయిన ఆధునిక మహాయుగానికి సమాంతరంగా సాగింది. క్షుద్ర ప్రమాణాలకి చేరి, పాతాళపు దారులు వెతుకుతున్న శరీరగత శృంగార కవితని నిలవరించింది; నాగరిక మానవుడి సంస్కారంలో ఓ సామాన్య సత్యాన్ని - కవులకు సరికొత్తగా ప్రబోధించింది నవ్యకవిత. దేశభక్తి భావాలను ప్రోది చేసింది. సొంత భాషనూ, జాతినీ, ప్రకృతినీ, పరిసరాలనూ ప్రేమించడమెలాగో నేర్పించింది. పరాయి పాలనలో కుంగిపోతున్న జాతికి ఆత్మగౌరవం నూరిపోసింది. భావకవితకి మంత్రసానిగా పనిచేసింది. 1913లో, ‘తృణకంకణం’ అనే ఖండకావ్యంతో, మొదలయిన ఈ కవితా మార్గాన్ని విమర్శక - పండితులే నవ్య కవిత్వం అన్నారు. రాయప్రోలు సుబ్బారావు ఆ ఖండకావ్య కర్త. అప్పటికి కవికి ఇరవయ్యొక్క సంవత్సరాలే వయసు. ఆ వయసులో, యువ కవులు సాధారణంగా చదును చేసి వుండిన రస్తాలో దుమ్ము రేపుకుంటూ పోవాలి అనుకుంటారే గానీ, ఒళ్లు వంచి, సొంతదారి నిర్మించాలని అనుకోరు. అక్కడే ఉంది రాయప్రోలు వౌలికత! అందుకే, అప్పటికి గ్రాంథికవాదుల శిబిరానికి - అనగా, రెండు సంవత్సరాల కింద స్థాపితమయిన ఆంధ్ర సాహిత్య పరిషత్తుకి - మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న జయంతి రామయ్య తదితరుల చేత రాయప్రోలు సుబ్బారావు ఈ మార్గానికి ద్రష్టగా, ఓ శకపురుషుడిగా గౌరవాదరాలకి పాత్రులయ్యారు. అయితే, రాయప్రోలు శకకర్తృత్వాన్ని ప్రస్తావించిన వాళ్లలో ఇతరులూ ఉన్నారు; గురజాడ కన్నుమూసిన ఏడాది తర్వాత, కట్టమంచి రామలింగారెడ్డి ఓ యోగ్యతాపత్రం ఇస్తూ, ‘నవ్య కవితకు ఆద్యుడిగా రాయప్రోలు - దాదాపు - అర్హత సంపాదించుకున్నా’రని వ్యాఖ్యానించడం గమనార్హం.
‘అడుగులు బొబ్బలెత్త వదనాంచల మందున చింకు చెమ్మటల్ మడుగులు కట్ట..’ అంటూ మొదలయ్యే ‘తృణకంకణం’ నవ్య కవిత్వానికి నిర్వచన ప్రాయంగా నిలిచింది. మన సంప్రదాయ కవితకి భిన్నమయిన ఈ మార్గాన్ని రాయప్రోలు ఆంగ్ల కవితా సంప్రదాయం నుంచే దిగుమతి చేసుకున్నారు. పుర వర్ణన, గిరి వర్ణన, వన వర్ణన, రుతు వర్ణన, ప్రయాణ వర్ణన, ముని వర్ణన, ద్యూతాది క్రీడా వర్ణన, రణ వర్ణన, జయ వర్ణన, మద్యపాన వర్ణన, కన్యాంగాంగ వర్ణన, చంద్రోపలంభం, మన్మథ కేళి వర్ణనల్లాంటి 22 వర్ణనలను ప్రస్తావించాడు అప్పకవి. వాటన్నిటితో ప్రబంధాలను అలంకరిస్తే గానీ మన ప్రబంధ కవుల మనసులు శాంతించేవి కావు. ఈ వర్ణనల జాబితాలో సామాన్య జనం - అంటే, మీరే నేనూ అన్నమాట! - ఎలా బతుకుతున్నారో చెప్పితీరాలన్న నిబంధన, నియమం ఏదీ లేదు. శ్రీనాథాదులు కూడా చాటుధారలోనే జన జీవనాన్ని చిత్రించారు తప్ప ‘గమీకర్మీకృత నైకనీవృతుడనై..’ అంటూ దొర్లించిన తత్సమభూయిష్టమయిన పద్యాల బండరాళ్ల మీద ప్రజా జీవనాన్ని చెక్కలేదు.
ఈ ధోరణిని మెచ్చని కొత్తతరానికి, సరికొత్త స్వరం ప్రసాదించారు రాయప్రోలు. ‘తృణకంకణం’ నిజానికి, పద్యరూపంలో వున్న కథానిక. ఇతివృత్తం అతి సరళం: చిన్నప్పుడు పరస్పరం ఇష్టపడిన ఓ అమ్మాయి, అబ్బాయి దంపతులు కాలేకపోతారు. ఆమెకి పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతుంది. అతని మనసు విరిగిపోయి, చెట్లూ పుట్టలూ పట్టుకు తిరుగుతుంటాడు. ఆమె కన్నవారింటికి వచ్చి అతని దుస్థితి చూస్తుంది. వాస్తవ జీవితం పట్ల వాస్తవిక దృష్టి మాత్రమే పెంచుకోవాలని అతనికి మంచి పాఠం చెప్తుంది. స్నేహం ప్రాతిపదికగా తమ సంబంధాన్ని పునర్నిర్వచిస్తుంది. ఇలాంటి ఇతివృత్తాలతో బంగాలీ రచయిత(త్రు)లు కథానికలూ, నవలలూ అప్పటికే రాసి వున్నారు. అయితే, వాళ్లకి కథాకావ్యాల సంప్రదాయం తెలుగులో వున్నంత బలంగా లేదు. మన గురజాడ అప్పారావు, తృణకంకణం కన్నా ముందే, ‘లవణరాజు కల’ ‘కన్యక’ ‘పూర్ణమ్మ’ ‘డామను-పితియసు’ వగయిరా కథాకావ్యాలు రాసి వున్నారు. అయినప్పటికీ, ‘ఆధునిక కవిత్వమునకు తృణకంకణము ఆది గ్రంథమని అస్మదాదుల ఆశయ’మనే అన్నారు సభాపతి శివశంకరులు. గురజాడనే ‘మహాకవి’గా భావించి, ఘనమయిన నివాళి సమర్పించారు కృష్ణశాస్ర్తీ. ‘విప్రాః బహుధా వదంతి!’
నిజానికి, రాయప్రోలు ఆవిష్కరించిన నవ్యకవిత అనే కాల్పనిక - భావుక కవిత పద్దెనిమిదో శతాబ్దంలో జెర్మనీ - ఫ్రాన్స్ దేశాల్లో రూపుదిద్దుకున్న సాహిత్య ధోరణి. క్రమంగా అది ఇంగ్లండ్‌కీ పాకింది. విలియం వర్డ్స్‌వర్త్ రచనల ద్వారా ఈ భావుక కవిత మన దేశంలాంటి కొత్త ప్రాంతాల్లో అడుగుపెట్టింది. యూరప్‌లో అది కవిత్వానికే పరిమితం కాలేదు - నవల, కథానిక, చిత్రకళ, వాస్తుశిల్పం తదితర రంగాలకూ వ్యాపించింది. అక్కడ కూడా భావుక కవితకి నిర్దిష్ట నియమ నిబంధనలూ లక్షణాలనూ రూపుదిద్దుకోలేదు. ప్రకృతిని ఆరాధించడం, పరిసరాల్లోని అందాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం భావుక కవిత ముఖ్య లక్షణంగా ఉంటూ వచ్చింది. ఈ ధోరణికి వుండిన మరో ముఖ్యగుణం, స్వస్థానవేష భాషల పట్ల మమకారం; ఆత్మాభిమానం. రాయప్రోలు కవితలో ఈ లక్షణాలన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. గేయ తత్వం కూడా భావుక కవితకి ఉండాల్సిన ముఖ్య లక్షణాల్లో ఒకటని విమర్శకులు అంటారు. రాయప్రోలు వృత్తాల్లో కూడా భావుకతను ప్రగాఢంగా వ్యక్తం చెయ్యగలగడం ఆయన విశిష్టత.
రాయప్రోలు వౌలికత ప్రస్ఫుటంగా వ్యక్తమయిన రంగం దేశభక్తి కవిత్వం. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా - ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురయినా - పొగడరా నీ తల్లి భూమి భారతిని - నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అనే పాట, నోటికి రాని తెలుగువాళ్లు తక్కువ. మనవాళ్లకి అసలే ఆత్మాభిమానం ఎక్కువ. దానికి తగిన రీతిలో ఉన్న ఈ పాట అందరి మనసుల్లోనూ మారుమోగడం సహజం. ‘కలదయేని పునర్జన్మ కలుగు గాక - మధురమధురంబయిన తెనుగు మాతృభాష’గానే అనడం ద్వారా రాయప్రోలు తెలుగువారందరి ఉమ్మడి మొక్కును ప్రకటించినట్లయింది. తెలుగు ప్రజల సరాసరి చైతన్యానికీ, సామూహిక మానసికతకూ అతికినట్లు సరిపోయే మనోభావాలను వ్యక్తం చేసిన కవి రాయప్రోలు సుబ్బారావుగారు. తెలుగు పాఠకుల మనసుల్లో ఆయన స్థానం శాశ్వతం!

-మందలపర్తి కిషోర్ 81796 91822