పెరటి చెట్టు

సంగీత సాహిత్య సమలంకృతుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత సాహిత్యాలను సరస్వతీదేవి స్తన్యంతో పోల్చాడట కవిగారు. వాటిల్లో ఒకటి ఆపాతమధురమయితే, వేరేది ఆలోచనామృతంగా ఉంటుందన్నాడట మహాకవి. కానుకోగల జ్ఞానికి రెండూ ఆపాతమధురాలే! అలాంటి సంగీత సాహిత్య సమలంకృతుడయిన జ్ఞాని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. పందొమ్మిదో శతాబ్ది చిట్టచివరి దశకంలో కన్ను తెరిచిన మరో బహుముఖ ప్రతిభావంతుడు రాళ్లపల్లి. తెలుగు, సంస్కృతం, కన్నడం, ప్రాకృత భాషల్లో పండితుడయిన శర్మగారికి మరికొన్ని భాషలు కూడా తెలుసు. ఈ నాలుగు భాషల్లో రాయడం - చదవడమే కాకుండా కర్ణాటక ‘సంగీత కళానిధి’ కూడా అయిన రాళ్లపల్లి మూడు వందలకు పైగా తాళ్లపాక అన్నమాచార్య కృతులను పరిష్కరించి అయిదు సంపుటాలు వెలువరించారు. పాతికేళ్ల పరువంలో, యువకవులందరూ రసరాజమయిన శృంగారానికి పట్టం కట్టే తరుణంలో, అనంతకృష్ణ శర్మగారు మీరాబాయి చరిత్రను భక్తిరస ప్లావితంగా రాయడంలోనే ఉంది ఆయన వైశిష్ట్యం. అంతకు రెండేళ్లకి ముందే ఆయన ‘తారాదేవి’ అనే ఖండకావ్యాన్ని ‘సరస్వతి’ పత్రికలో ప్రచురింపచేశారు. తెలుగులో వచ్చిన తొలితరం ఖండ కావ్యాల్లో ఇదొకటని సాహిత్య చరిత్ర చెప్తోంది. (గురజాడ, కట్టమంచి అప్పటికే పేరున్న కవులుగా గుర్తింపు పొందారు. అయితే, ‘ఆది ఆధునిక కవి’గా కొందరెంచిన రాయప్రోలు సుబ్బారావు ‘తృణ కంకణం’ అప్పటికింకా రాయలేదని గమనించ ప్రార్థన!) హాలుడి గాథా సప్తశతిలోని శృంగార భావాల సారాన్ని చక్కని తెలుగు ఛందస్సుల్లోకి, తేలిక మాటల్లో అనువదించగలగడమే ఓ అద్భుతమనుకుంటే పదమూడో శతాబ్దిలో జాయప సేనాని రాసిన ‘నృత్త రత్నావళి’ని పరిష్కరించి, తెలిగించడం మరో అద్భుతం. శర్మగారి గాన మాధుర్యం ఆస్వాదించాలనుకునే రసలుబ్ధులు ఈ లింకులో ప్రయత్నించవచ్చు.
http://sites.google.com/ site/ rallapallisharma/ Home/ audio-tracks -of- rallapalli -anantha- krishna -Sharma)
రాళ్లసీమ రాయలసీమ మీద కురిసిన అమృతవర్షిణి రాళ్లపల్లి. ఉంఛవృత్తి చేసుకు బతకడం ఇష్టంలేక పదమూడో యేట ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయినందువల్లనే మనకో మహాపండితుడూ, కళాకారుడూ, పరిశోధకుడూ, అనువాదకుడూ దొరికాడు. ఇప్పట్లాగా ఆ రోజుల్లో విద్యకి వాణిజ్య ప్రాతిపదిక లేకపోవడం వల్లనే అది సాధ్యమయింది. రాయలసీమ మీదే కురిసిన మరో అమృతవర్షిణి పుట్టపర్తి నారాయణాచార్యులు. అనంతపురం జిల్లాలోనే పుట్టినా, ఈ ఇద్దరూ తెలుగు వాళ్లందరికీ ఉమ్మడి సొత్తుగా మారిపోయారు. వీళ్లు ఇద్దరికీ సంబంధించిన ముచ్చట ఒకటి తర్వాత మనవి చేసుకుంటాను. నిజానికి అమ్మా అప్పల దగ్గిరే - బాల్యంలోనే - అనంతకృష్ణ శర్మ సంగీత సాధన మొదలుపెట్టారు. మైసూరులో ఉండిన రోజుల్లోనే పధ్నాలుగో శతాబ్ది చివర్లో మైసూరు మహాసామ్రాజ్య స్థాపన వెనక కీలకపాత్ర పోషించిన పరకాల మఠంలోనే ఆశ్రయం పొందారు శర్మగారు. మఠం, మైసూరు రాజమందిరం పక్కపక్కనే ఉంటాయి. పరకాల మఠాధిపతి దగ్గిరే ప్రత్యక్ష శిష్యరికం చెయ్యడం వల్లనే, తన కళకి తాత్వికత తావి అబ్బిందనేవారు శర్మగారు. దానిమాటెలా ఉన్నా చిక్కా రామచంద్రరావు, బిడారం కిష్టప్ప, కరిగిరి రావుల శిష్యరికం శర్మగారి సంగీత పరిజ్ఞానాన్ని పరిణతిగా ప్రోది చేసింది. గాత్రంతోపాటుగా, వాయులీనం, వేణుగానాల్లో కూడా ఆయన దిట్ట. మైసూరు మహారాజా కళాశాలకి కట్టమంచి రామలింగారెడ్డి ప్రిన్సిపల్‌గా ఉండిన రోజుల్లోనే అక్కడ కొలువు చెయ్యడం వల్ల రాళ్లపల్లి మేధోవిహాయసం కొత్త అంచులకి విస్తరించిందనడంలో మాత్రం సందేహం లేదు. మరో సహజ మేధావి అబ్బూరి సాహచర్యం కూడా రాళ్లపల్లి మేధోపరిణామం వేగం పుంజుకోవడానికి కచ్చితంగా సహకరించి ఉంటుంది. మైసూరులో ఉండిన రోజుల్లోనే, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ ‘చాముండాంబ అష్టోత్తర కృతుల’కి సంబంధించిన సంగీత విశేషాంశాల గురించి రాళ్లపల్లిని పదేపదే సంప్రతించేవారు. అప్పటికి శర్మగారి వయసు అంతా పోగేసి పద్దెనిమిదేళ్లే.
తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు ఇప్పుడు ఇంటింటా మోగుతున్నాయి. ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్నమయ్య కీర్తనలు వందల సంవత్సరాలు తిరుమల దేవాలయ భాండాగారంలో అజ్ఞాతంగా ఉండిపోయాయి. వేటూరి ప్రభాకరశాస్ర్తీ గారి నాయకత్వంలో నిపుణుల బృందం వాటిని వెలికితీసి ప్రజల పరం చేసేంతవరకూ అవి సామాన్యులకు దూరంగానే నిలిచిపోయాయి. 1949లో, అన్నమయ్య ప్రాజెక్టు బాధ్యత, వేటూరి వారి నుంచి రాళ్లపల్లి వారి చేతిలోకి వచ్చింది. ఒంటిచేతి మీద అన్నమయ్య సంకీర్తనలు 300 పరిష్కరించి, అయిదు సంపుటాలు వెలువరించారు రాళ్లపల్లి. అవెంత విలువయినవో, దాదాపు అంతే ప్రామాణికమయినవి శర్మగారి ‘వేమన’ ఉపన్యాసాలు. బ్రౌన్ తర్వాత వేమన మీద అంత కృషి చేసిన పరిశోధకులు మరొకరు లేరు. వాళ్లిద్దరితోపాటు చెప్పుకోదగిన మరో పేరు బంగోరెది.
ఒక చిన్న విషయాంతరం - బైజు బావ్‌రా సినిమాలోని ‘మన్ తర్‌పత్ హరి దర్శన్‌కో ఆజ్...’ పాట విశిష్టత గురించి చాలామంది చెప్తారు. ఆ పాట రాసిన షకీల్ బదాయూనీ - స్వరపరిచిన నౌషదలీ - పాడిన మహమ్మద్ రఫీ ముగ్గురూ ముస్లింలే. పాటేమో హరి దర్శనం కోసం తపించే మనసును గురించినది. అటువంటిదే, మన తెలుగులోనూ జరిగింది. రాళ్లపల్లికన్నా పుట్టపర్తి ఇరవయ్యేళ్లు చిన్న. అయితే, భేషజం ఎరుగని పండిత భిషక్కు కావడంవల్లనే రాళ్లపల్లి, పుట్టపర్తి రాసిన ‘శివతాండవ’ గానానికి స్వరాలు సమకూర్చి పాడారు. ఈ పాటకో ప్రత్యేకత ఉంది. ఈ శివతాండవ కీర్తనం రాసిన కవి వైష్ణవుడు; పాడిన గాయకుడూ వైష్ణవుడే. ఇద్దరూ బంధుమిత్రులే. తిక్కన మొదలుకుని సంస్కారులయిన కళాకారులు హరిహరుల మధ్య అభేదానే్న చూస్తూ వచ్చారు. ఆ కోవకే చెందినవారు రాళ్లపల్లయినా, పుట్టపర్తయినా, నడమంత్రపు ప్రవాచకులకే భేదాలూ భేదాభిప్రాయాలూను. అసలు పుట్టపర్తిని పూర్తిగా ఆస్తికులనడానికి కూడా వీల్లేదు. ఆయన అజ్ఞేయవాదానే్న అనుష్ఠానం చేశారనిపిస్తుంది. (రాళ్లపల్లి పాడిన ‘ఆడెనమ్మా హరుడు’ పాటని ఈ లింక్‌లో వినొచ్చు: https:// yourlisten.com/ metnandan/ adenamma) అనంతకృష్ణ శర్మగారు కాళిదాసు రఘువంశాన్నీ, భానుడి స్వప్నవాసవదత్తాన్నీ అనువదించారు కానీ అచ్చుకాలేదని గద్దె స్వరూప్ బ్లాగ్‌లో చూసిన గుర్తు. ఆయన ‘శమీపూజ’, ‘పెనుగొండ పాట’ అయినా అచ్చయ్యాయో లేదో వివరం తెలియడం లేదు. రాళ్లపల్లి రచనల సర్వస్వం రావలసిన అవసరం ఉందని పాఠకులయితే అనుకుంటున్నారు - మరి ప్రచురణ కర్తలో?

-మందలపర్తి కిషోర్ 81796 91822