పెరటి చెట్టు

రస మకరందం - సౌందర నందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంటకవులు తెలుగు సాహితీ లక్ష్మికి కంటసరులు వెలుగు పంట సిరులు నడచు వెంటవెంట అడుగు జంట విధాన కవుల జంట కౌతుకముల పంట!’ అన్నారట జంధ్యాల పాపయ్య శాస్ర్తీ. జంట కవుల శిష్యులు చాలామంది జంట కవులు కావాలనుకోవడం సాధారణం. కానీ, అలా జయప్రదంగా జంట కవిత్వం చెప్పగలగడం; చెప్పి గురువుల్నీ రసికుల్నీ మెప్పించగలగడం అందరికీ సాధ్యంకాని పని. అటువంటి అసాధ్యులయిన కవియుగళం పింగళి - కాటూరి. వారితోపాటే - బహుశా ఒక్క సంవత్సరం వెనగ్గానేమో! - చెళ్లపిళ్ల వారివద్దే చదువుకున్నవారు విశ్వనాథ సత్యనారాయణ - కొడాలి ఆంజనేయులు. వారిద్దరూ కూడా - సత్యాంజనేయ కవులనే పేరిట - జంట కవిత్వం చెప్పేందుకు ప్రయత్నించిన వాళ్లేనట! విశ్వనాథ - కొడాలి ఉమ్మడిగా ‘గిరికుమార’ అనే కలం పేరుతో కూడా రాశారని ఆచార్య బిరుదురాజు రామరాజు రాసింది ఎక్కడో చదివిన జ్ఞాపకం! ఇక - పింగళి - కాటూరులిద్దరూ కలిసి చేసిన సాహిత్య సేద్యాన్ని కానీ, విడివిడిగా చేసిన కృషిని కానీ పరిశీలిస్తే ఇద్దరికిద్దరూ సరిజోదులేనని తేలుతుంది. ‘సౌందర నందం’ మొదలుకుని ‘బగ్ జార్గల్’ అనువాదం వరకూ ఏ పని చేసినా మనసు పెట్టి చెయ్యడం పింగళి - కాటూరి కవుల తత్వం అనిపిస్తుంది.
జంట కవిత్వం సాహిత్య ప్రపంచానికి కొత్తేమీ కాదు. క్రీ.శ. నాలుగో శతాబ్దానికి చెందిన సంస్కృత కవుల జంట రామిల - సౌమిల చరిత్రకి తెలిసిన తొలి జంటకవులంటారు. వాళ్లిద్దరే కాకుండా, సంస్కృతంలో మరో పది జంటల కవులుండేవారని గొల్లపూడి ప్రకాశరావు సమాచారం. సంస్కృతం లాంటి ప్రాచీన దేశాల భాషల్లోనే కాకుండా, ఇంగ్లిష్ లాంటి పాశ్చాత్య దేశాల భాషల్లోనూ కూడా జంట కవులుండేవారనే వాదం ఒకటుంది. పదహారో శతాబ్దానికి చెందిన ఇంగ్లిష్ మహాకవి విలియమ్ షేక్‌స్పియర్ - చాలామందితో కలిసి ‘జంటకవిత్వం’ చెప్పాడంటారు. జాన్ ఫ్లెచర్, థామస్ కిడ్, థామస్ నాష్, జార్జ్ పీలే, యాంథనీ మనే్డ, జార్జ్ విల్కిన్స్, థామస్ మిడిల్టన్ తదితరులతో కలిసి షేక్‌స్పియర్ ఉమ్మడిగా రచనలు చేశాడనే కథనాలు చాలాకాలంగా వినిపిస్తున్నవే. అయితే, తెలుగునాట మనం జంటకవిత్వం అనే ప్రక్రియకూ, ఈ ప్రక్రియకూ పోలిక లేదు. ఇది ఎవరికి వారే యమునా తీరే రీతిలో చేసుకుపోయే పని. నువు రెండంకాలు రాయి - నేను మూడు దృశ్యాలు రాస్తానంటూ పంపకాలు చేసుకునే పద్ధతిని జంటకవిత్వమంటే ఎలా? సాధారణంగా ఇద్దరిలో సమర్థుడూ, ప్రసిద్ధుడూ అయిన వ్యక్తి దాన్ని ఒకే కృతిగా పునః రూపొందిస్తాడు. జంటకవిత్వం అలాంటిది కాదు కదా! వర్డ్స్‌వర్త్ - కాలెరిజ్‌ల జంటకవిత్వ వ్యవసాయం - కొంతవరకూ - మన జంటకవుల కృషిని పోలి వుంటుంది.
పధ్నాలుగో శతాబ్దానికి చెందిన ‘రంగనాథ రామాయణం’ రాసిన వాళ్లలో కాచ భూపతి - విట్ఠల భూపతి అనే సోదర కవుల పేర్లు కూడా కనిపిస్తాయి. కాకతీయుల సామంతుడయిన గోన బుద్ధారెడ్డి - ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలుగా ఉన్న - కందూరు సంస్థానాన్ని ఏడు వందల సంవత్సరాల కిందట పాలించాడట. నిండు పేరోలగంలో, తండ్రి తనను రామాయణ కావ్యం రాయమని ఆదేశించగా తను దాన్ని శిరసావహించానని బుద్ధారెడ్డి స్వయంగా చెప్పాడు. ఈ ద్విపద రామాయణ కావ్యం పూర్వ భాగాన్ని అతను రాయగా, ఉత్తర రామాయణ భాగాన్ని అతని కుమారులు కాచయ్య, విఠలనాథయ్య రాశారని అందులోనే ఉంది. పూర్వ రామాయణమంతా ఒంటి చేతిమీదుగా రాసిన బుద్ధారెడ్డిని వదిలిపెట్టి, ఉత్తర రామాయణం రాసిన సోదర కవుల్ని మాత్రమే వేరు చేసి, జంటకవులుగా పరిగణించడం ఎంతవరకూ భావ్యమో సుంకిరెడ్డి లాంటి మిత్రుల నిర్ణయానికి వదిలేసి ముందుకు పోదాం. ఈ కవిత్రయం నుంచి జంటకవుల్ని వేరు చెయ్యడం వల్ల సాహిత్య చరిత్రకి ఏం ఒరిగిపడుతుందో పెద్దలే ఆలోచించాలి!
కాగా, ‘ప్రబోధ చంద్రోదయం’ తదితర కృతులు అనువాదం చేసిన నంది మల్లయ - ఘంట సింగన తెలుగు సంప్రదాయ కవిత్వంలో మొట్టమొదటి కవుల జంట అంటారు. ఈ జంట కవులు - మామ అల్లుళ్లు - పదిహేనో శతాబ్దికి చెందినవాళ్లు. వారికి నాలుగు వందల ఏళ్ల తర్వాత పుట్టిన తిరుపతి వెంకట కవులు జంట కవిత్వానికి శాశ్వత చిరునామాగా నిలిచారు. దేవులపల్లి సోదర కవులు, వేంకట రామకృష్ణులు, కొప్పరపు కవులు తిరుపతి వెంకట కవులకు సమకాలికులయిన జంటకవులే. వాళ్లందరూ కూడా కవితా కళను అద్భుతంగా ప్రదర్శించిన వాళ్లే. ఆశుకవిత, అవధానం, ఖండకావ్య రచన, ప్రబంధ రచన చేసి, అన్ని ప్రక్రియల్లోనూ రసజ్ఞుల్ని మెప్పించారు. తిరుపతి వెంకట కవులకి - ముఖ్యంగా చెళ్లపిళ్ల వేంకటశాస్ర్తీకి- శిష్యులయిన వారిలో కూడా పింగళి - కాటూరి లాంటి జంటలు ఉన్నప్పటికీ, జంట కవులనగానే ఎవరికయినా గుర్తుకు వచ్చేది మాత్రం తిరుపతి వెంకట కవులే.
పింగళి - కాటూరి కవుల స్వరానికి వుండిన విశిష్టత కారణంగానే, వాళ్లు చెళ్లపిళ్ల లాంటి సాహిత్య వటవృక్షం నీడలో సయితం తమ ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. అదే కుదురు నుంచి వచ్చి, వేయిపడగలతో విస్తరించిన ఊడలమర్రి విశ్వనాథ సత్యనారాయణ నీడ తమను ముంచేయకుండా నిలదొక్కుకోవడంలో కూడా పింగళి - కాటూరి జయప్రదమయ్యారు. ఈ ప్రయత్నంలో, పింగళి - కాటూరి చెరో మార్గం పట్టిన వివరం తర్వాత మాట్లాడుకుందాం. తెలుగు సంప్రదాయం, 1920 దశకం నాటికే, పల్లెల్లో మాత్రమే మిగిలి వుండింది. దాన్ని గమనించి, పింగళి - కాటూరి కవులు రాసిన ‘తొలకరి’ లాంటి కవితా సంపుటులు వారి కవిత్వానికి ప్రత్యేక నియోజకవర్గం ఒకదాన్ని కేటాయించి పెట్టాయి. తొలకరి కవితా సంకలనంలోని సగానికి సగం ఖండకావ్యాలు గ్రామీణ - రైత్వారీ జీవితమే ఇతివృత్తంగా కలిగి వుండడం కాకతాళీయమయి వుండదు. తమను తాము భావకవులమని ఎన్నడూ చెప్పుకోక పోయినప్పటికీ పింగళి -కాటూరి కచ్చితంగా భావకవుల కోవకి చెందినవాళ్లే! వ్యవసాయం - పశుపాలన కేంద్రకంగా రూపుదిద్దుకున్న సంస్కృతి ఎంతో గొప్పదనీ, దానికి దూరమయ్యే కొద్దీ మానవ సంబంధాలు అమానవీకృతమవుతున్నాయనీ చెప్పడం ప్రపంచం నలుమూలలా వుండిన భావకవులందరూ చేసిన పనే. పింగళి - కాటూరి కూడా ఈ ఇతివృత్తంతో రాసిన కవితలు ‘తొలకరి’లో కనిపిస్తాయి. ఆనాటి భావకవుల బృందగానంలో కలిసిపోకుండా తమ వైశిష్ట్యం నిలుపుకోగలగడం పింగళి - కాటూరి కళాత్మకంగా సాధించిన విజయం.
పింగళి - కాటూరి కవుల ఉత్తమ రచనగా లోకం మెచ్చిన కావ్యం ‘సౌందర నందం’. సుందరి - నందుల కథ ఇది. నందుడు, గౌతమబుద్ధుడికి సవతి తమ్ముడు. ‘సార్థకాఖ్య సుందరి వాని యతివ మిన్న’. తన ఇంటి ముందు నుంచి వెళ్లిన గౌతమ బుద్ధుణ్ణి తగిన రీతిలో కొలుచుకోలేక పోయిన నందుడు పరుగుపరుగున వెంటంబడి వెళ్తాడు. ‘పొరపా టపరాధము దేవర వాకిటి కరుగుదేర ప్రాసాద తలాంతరవర్తి నౌట నెఱుగన్ కరుణామయ!’ అని మన్నింపు వేడుకుంటాడు. అంతటితో ఆగక, ‘మఱద లొసగు భిక్ష గ్రహియింపవే!’ అని కూడా మనవి చేసుకుంటాడు. అతని ఇంట భిక్ష తీసుకోవడానికి బదులుగా, తమ్ముడి చేతికి భిక్షాపాత్రనిచ్చి, అతనికే ముక్తిపథాన్ని భిక్షగా వేస్తాడు గౌతముడు. అవుననలేక, కాదనడానికి నోరురాక భిక్షువుగా మారిపోతాడు నందుడు. కానీ, సుందరిని మర్చిపోలేక, ‘బోనునపడ్డ భద్రగజపోతము పోలిక రోషదుఃఖితంబైన మనంబుతో’ నవనీతకోమలి, జగదేకవిమోహనాంగి, ప్రణయరాజ్య రమా వైభవంబయిన నెచ్చెలి తల్చుకుని కుమిలిపోతుంటాడు. అతని దుస్థితి గమనించి, గౌతమబుద్ధుడు నందుడిని కూర్చోపెట్టి ‘శోభనశీలురు’ ‘్భతహిత లోల మనస్కులు’, ‘శూరతా ఖనుల’యిన భిక్షువుల కథలు ఏకరువు పెడతాడు. వారిలో ఒకడు తల్లికి ఒక్కడే కొడుకు. కోరి, పెళ్లాడిన అందమయిన భార్యనే

వదిలి వచ్చినవాడు మరొకడు. నిన్నగాక మొన్న పట్ట్భాషిక్తుడయి, సింహాసనాన్ని త్యజించిన త్యాగి ఒకడు - అందరినీ మించి, బరువును మోయగల ఏనుగులూ గుర్రాలూ లేక సరయిన సారథిలేక, ఏ క్షణంలోనయినా కూలిపోయే దుర్దశలో తన రథం వుందని అంటాడు శాక్యముని. మరోవైపు భూదేవి తనువు రక్తవర్షంలో తడుస్తోందంటాడు. అలాంటి పరిస్థితుల్లో ‘పుష్పబాణాగ మాధ్యేతృ ప్రాథమింకుడవై తిరుగజనే్న నీకిటుల్ సోదరా?’ అని తమ్ముణ్ణి నిలదీస్తాడు. తర్కకర్కశుడయిన అన్న ముందు తమ్ముడు తలవంచేస్తాడు. సుందరి నందుడి బాటే పడుతుంది. అంతటితో కథ అయిపోలేదు. మాతృహీనుడయిన ఓ బాలకుణ్ణి సుందరికీ, గతిమాలిన ఓ బాలికను నందుడికీ అప్పగించి ఓ దీనురాలు కన్నుమూస్తుంది. అలా నందుడికి సుందరీ - సుందరికి నందుడూ దక్కారంటాడు కరుణానిధి అయిన శాక్యముని. అలా ఓ విషాదగాథ సుఖాంతమవుతుంది. ఆదర్శ బోధకమయిన ఈ కథాకావ్యం పింగళి - కాటూరి కవులను కలకాలం నిలబెడుతుందనడంలో సందేహం లేదు.
క్రీస్తుకు పూర్వం తొలి శతాబ్దికి చెందిన అశ్వఘోషుడు రాసిన సంస్కృత కావ్యం ‘సౌందర నంద’ ఆధారంగా రాసిన తెలుగు కావ్యమిది. అశ్వఘోషుడే రాసిన మరో సంస్కృత కావ్యం ‘బుద్ధచరితం’ అప్పటికే సృజనాత్మకంగా అనువదించిన చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీకి ఆయన ప్రియశిష్యులు ఈ కావ్యాన్ని గురుదక్షిణగా సమర్పించడం సముచితంగా ఉంది! అదెందుకు సముచితమో చూద్దాం. నిజానికి అశ్వఘోషుడు రాసిన ‘బుద్ధ చరిత’ పధ్నాలుగో సర్గలో - గౌతమబుద్ధుడికి జ్ఞానోదయం ‘బోధి’ కావడంతో - అర్థంతరంగా ఆగిపోయిందంటారు. తర్వాతి కథను టిబెటన్, చైనీస్ అనువాదాల ద్వారా తెలుసుకునేవారట బౌద్ధులు. అయితే, బౌద్ధ భిక్షువుల జీవన విధానం గురించి విపులంగా వర్ణించిన కావ్యంగా ‘సౌందరనంద’ సుప్రసిద్ధం. క్లిష్టమయిన ఛందో చమత్కారాల ఆధారంగా సామాన్య పాఠకుణ్ణి ప్రభావితం చేయగలిగిన తొలి భారతీయ కావ్యంగా కూడా ‘సౌందరనంద’ సుప్రసిద్ధం. ఆ విధంగా అది బౌద్ధ సాహిత్యంలో ప్రత్యేక, అద్వితీయ ప్రాముఖ్యం కలిగివుంది. అయితే, 1892లో, ‘బుద్ధ చరిత’ సంపూర్ణ రూపంలో దొరికింది. దానే్న తిరుపతి వెంకటకవులు అనువదించారు. పింగళి - కాటూరి కవులు ‘సౌందర నందం’ తమ గురువుగారికి అంకితం చేయడంతో, వెంకట శాస్ర్తీ బౌద్ధవాంగ్మయంలో అత్యుత్తమ కావ్యాల్లో ఒకదాన్ని అనువదించి, మరొకదాన్ని అంకితం పుచ్చుకున్నట్టయ్యింది. అందుకే ఆ చర్య సముచితమనేది.
ఆంధ్ర విశ్వకళాపరిషత్తు అధ్యాపకుడిగా స్థిరపడిన తర్వాత, పింగళి లక్ష్మీకాంతం ప్రధానంగా కేంద్రీకరించిన రంగం సాహిత్య విమర్శ. దాదాపు అదే రోజుల్లో కాటూరి కృష్ణా పత్రిక ‘ఆస్థాన కవి’గా కొత్త జీవితం మొదలుపెట్టారు. తెలుగు సాంస్కృతిక జీవనంలో ఎనె్నన్ని మార్పులు వచ్చినప్పటికీ, పింగళి - కాటూరి తమ కొత్త పాత్రల పోషణ విషయంలో అంగుళం కూడా బెసకలేదు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు తెలుగు శాఖాధ్యక్షుడిగానూ, అటు తర్వాత శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక శాఖాధిపతిగానూ, అన్నిటికీ మించి ‘సాహిత్య శిల్ప సమీక్ష’ రచయితగానూ తెలుగు సాహిత్య విద్యార్థులకి కులగురువుగా రాణించారు పింగళి లక్ష్మీకాంతం. తనకున్న మిత్రులే తక్కువనీ, వాళ్లలో కాటూరి వెంకటేశ్వరరావు ప్రథముడనీ పింగళి లక్ష్మీకాంతం సూటిగా చెప్పనే చెప్పారు. అయితే, రేపల్లెలో గోపాలుడిలా, నిత్యం మిత్రబృందావనంలో గడిపేవాడిగా కాటూరి వెంకటేశ్వరరావు గురించి అందరూ చెప్తారు. జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతికొద్ది మంది తెలుగు కవుల్లో కాటూరి ఒకరు. బందరు జాతీయ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచెయ్యడమే కాకుండా, వైస్ ప్రిన్సిపల్ - ప్రిన్సిపల్ బాధ్యతలను కూడా నిర్వహించారు కాటూరి. ఆ విధంగా ఆయా రంగాల్లో వారి విశిష్టత అలాగే కొనసాగుతూ వచ్చింది. అయితే, జంట కవులుగా తిరుపతి వెంకట కవులు చేసిన జైత్రయాత్ర లాంటిది పింగళి - కాటూరి కవులు చెయ్యలేదని చెప్పక తప్పదు!

- మందలపర్తి కిషోర్ 81796 91822