పెరటి చెట్టు

గాయాలే గేయాలయతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిశిరాతిరి చెట్టుమీద-
కాలమెరుగని కొమ్మమీద
చీకటి చాయలో, చిక్కని జూలుతో,
ఓ నల్ల చిరుత కాచుక్కూచుని వుంది!
తళతళమెరిసే రెండు బంగరు కన్నులు
అడవినంతటినీ పహరా కాస్తున్నాయి...
దాని పద్యాలు చిట్టిచిట్టి కాయితం పడవలు-
చందనమూ, తేనెపట్టులోనూ మైనమూ కలగలిపి చేసిన
పరిమళ భరితమయిన కొవ్వొత్తున్నాయి వాటిల్లో...’ - అంటూ సాగుతుంది ఓ బ్లాక్ పాంథర్ కవిత. గుర్రం జాషువాని దగ్గిరగా చూసి, ఆయన గబ్బిలం - ఫిరదౌసి - కాందిశీకుడు - ముసాఫరులు లాంటి పద్యాలు చదివి, ఈ కవిత చెప్పినట్లు లేదూ? పోరాట పటిమా, సౌందర్యాత్మకమయిన రసజ్ఞతా సమపాళ్లలో రంగరించిన జాషువా కవిత క్షుణ్ణంగా చదివిన వారెవరో కలవరించినట్లు లేవూ ఈ పంక్తులు?? 1955-68 మధ్యకాలంలో, అమెరికాలోని నల్లజాతి ప్రజల మీద రాజ్యం దాడులని వ్యతిరేకిస్తూ, పౌర - మానవ హక్కుల సాధన లక్ష్యంగా వెలువడిన కవిత్వాన్ని ‘బ్లాక్ ప్యాంథర్ కవిత’ అంటారు. దాదాపు అర్ధ దశాబ్ది కాలంగా, ఆ ధోరణిలో వచ్చిన లక్షలాది కవితల్లో ఇదొకటి. ఆ ధోరణి మొదలయ్యే నాటికి జాషువా ప్రధానమయిన కృతులన్నీ రాసేసి వున్నారు. రేపు ప్రపంచంలో జరగబోయే విషయాన్ని ఇవాళే చెప్పగల దార్శనికుడే మహాకవి కాగలడు. జాషువా ఆ కోవకే చెందిన మహాకవి! పోతే, ప్రపంచంలో ఏ మూలయినా, పౌర - మానవ హక్కులపై రాజ్యం చేసే దాడి - దానికి ప్రజల ప్రతిఘటన దాదాపు ఒకేలా ఉంటాయి. అది అమెరికా అయినా - ఆఫ్రికా అయినా - వియత్నాం అయినా - వినుకొండ అయినా, రూపంలో వైవిధ్యం ఉంటే వుండొచ్చు కానీ, సారంలో తేడా వుండదు!
గుంటూరు జిల్లాలోని రాతిగొట్టు సీమ పలనాడు. ఆ పల్నాటికి గుండెకాయ వినుకొండ. అత్యంత ప్రాచీనమయిన చరిత్రకి వాంగ్మూల మిస్తున్నట్లుగా అక్కడక్కడ కనిపించే రక్కసి గుళ్లూ - క్రీస్తుకు పూర్వం నాటి శాసనాల బండలూ - అడుగడుగునా, పొరలు పొరలుగా, పరుచుకుపోయిన నాపరాళ్ల దొంతరలు - కొండంత అండగా వుండే కోటప్పకొండ - గాలిలో కలిసిపోయి వినవచ్చే శ్రీనాథుడి చాటుధార - ఇవి వినుకొండకి పెట్టని ఆభరణాలు! అలాంటి వినుకొండ చల్లని ఒడిలో పందొమ్మిదో శతాబ్ది చివర్లో గొంతువిప్పిన ‘కోకిల’ జాషువా. అనుపమానమయిన పదాల నేతలో చెయ్యితిరిగిన ‘గిజిగాడు’ ఈ కవి. ‘కూటికి పేదవాళ్లమయినా కులానికి పేదలం కాదు!’ అనే డయలాగ్ కొన్ని వందల సినిమాల్లో వినివుంటాం మనం. కానీ, మన కవిగారు కూటికీ, కులానికీ కూడా పేదవాడే! అందుకే, ఎంత కళ చేతిలో వున్నప్పటికీ, పొట్టచేత పట్టుకుని ‘గబ్బిలం’లా కృష్ణాగోదావరీ తీరాల మధ్య కొట్టుకులాడవలసి వచ్చింది. ఉభయ భాషా ప్రవీణుడని అనిపించుకున్నప్పటికీ, బతకలేని బడిపంతులు కావడానికే తలకిందులుగా తపస్సు చెయ్యవలసి వచ్చింది. కానీ, శంబుకుడు తపస్సు చెయ్యడం కూడా నేరమయిపోయిన గడ్డమీద మన కవికి అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. ‘గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత ననె్నవ్విధి దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే?’ అని నిలదీయగల దమ్మున్నవాడు కావడం చేతనే, వాటన్నిటినీ తట్టుకుని, తరించాడు కవి జాషువా!
కవికాలాదుల గురించి ఏం మాట్లాడుకోవాలో మనకింకా సరిగ్గా బోధపడలేదు. అందుకే ఓ పరిశీలకుడు జాషువా తండ్రి దళితుడు కాడనే విషయం నొక్కి చెప్తే, అతని తల్లి క్రైస్తవురాలనే చారిత్రిక సత్యం చాటింపు వేస్తాడు మరో పరిశోధకుడు. ‘విశ్వనరుడ నేను’ అన్న కవి వాక్కు మాత్రం ఎవరి చెవులకీ ఎక్కకపోవడం విడ్డూరం. ‘ఏ కులమని నను వివరమడిగితే ఏమని చెప్పుదు లోకులకు? లోకులకూ, పలు గాకులకూ..’ అని దూదేకుల సిద్దయ్య బాధపడ్డాడని చిన్నప్పుడు చదువుకున్నాం. జాషువాకి అంతకన్నా ఘనమయిన సత్కారం జరిగి వుండదు. అలా జరగనందువల్లనే కదా, ‘నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకున క్రుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప సిగ్గగున్’ అని కవి కుమిలిపోవలసి వచ్చింది! విషయమేమిటంటే, జాషువా కులమేమిటో నిర్ణయించేది ఆయనా కాదు - ‘సాటి’ కవులూ కాదు - జాషువా కవిత్వాన్ని ఎవరునెత్తికెత్తుకున్నారో వాళ్లకే ఆ కవి సొంతం! నిజానికి తెలుగునాట రసజ్ఞులయిన పాఠకులందరూ జాషువా కవిత్వాన్ని అక్కున చేర్చుకున్నవారే. బహుశా తిరుపతి వెంకట కవుల తర్వాత, లక్షలాదిమంది శ్రోతల్ని ఆకట్టుకున్నవి ‘హరిశ్చంద్ర’ నాటకంలో చేర్చుకున్న స్మశానం పద్యాలేనేమో! అయినప్పటికీ, జాషువాను తమ సాంస్కృతిక రాయబారిగానూ, అస్తిత్వ ప్రతీకగానూ గుర్తించి గౌరవించుకున్న వాళ్లు దళితులు. అంచేత, జాషువా వాళ్లకే సొంతం;
మొదటి ప్రపంచ యుద్ధం అంతమయిన నేపథ్యంలో, జాషువా ‘రుక్మిణీ కళ్యాణం’ నాటకం రాశారు. అందులో, గొప్ప చమత్కారం ఒకటి చేశారాయన. కథను అనుసరించి జాషువా రాసిన సంభాషణలు పైకి అదే అర్థంలో కనిపిస్తాయి. కానీ, వాటికి వ్యక్తి స్వాతంత్య్రం, సమాజ శ్రేయస్సు పరిభాషలో భాష్యం చెప్తే, అవి ఆనాడు దేశమంతటా సాగుతున్న జాతీయోద్యమ స్ఫూర్తిలో భాగమవుతాయి. (ఆచార్య యెండ్లూరి సుధాకర్ అనుకుంటా, ఆ ప్రయత్నం చేశారు. ఒక సభలో విన్న ఆయన ప్రసంగం నుంచి అరువు తెచ్చుకుంటున్న ఆలోచన ఇది - మిత్రులు సుధాకర్‌కి క్షమాపణలతో...) ఇలాంటి ప్రయోగం చాలామందే చేశారు. కానీ, తెలుగులో జాషువాకి ముందు చేసిన వాళ్లు లేరనిపిస్తుంది. ఉదాహరణకి ‘కీలుగుర్రం’ సినిమా ప్రథమార్ధమంతా స్వేచ్ఛ గురించిన వాదోపవాదాలే. బహుశా, షీ.బీ.షెల్లీ మహాకావ్యం ‘ప్రొమీథియస్ అన్‌బౌండ్’ నుంచి ఈ విప్లవాత్మక భావన మొదలయి ఉంటుంది. అందుకే, మార్క్స్ అంతటివాడు షెల్లీని ‘విప్లవాత్మక కాల్పనికుడని’ కీర్తించాడు. తన పీఎచ్డీ థీసిస్ పీఠికలో కూడా ప్రొమీథియస్ సంజాయిషీని మార్క్స్ ప్రముఖంగా ఉటంకించాడు. (ప్రొమీథియస్ గ్రీకు వీరుడు. అతని కథ ఇది: మనుషుల దుర్వర్తనకి ఆగ్రహించి, అగ్నిని చేసుకునే సామర్థ్యం వాళ్లకి లేకుండా చేస్తాడు దేవదేవుడు జియస్. దాంతో నానాపాట్లూ పడుతున్న మనుషులపై జాలిపడి వాళ్లకి నిప్పు రాజేసుకోవడం నేర్పిస్తాడు ప్రొమీథియస్. అతగాడు దేవదేవుడి కుమారుడు. తన ఆదేశానికి భంగం కలిగించినందుకు జియస్ అతగాడిపై ఆగ్రహించి ఓ చిత్రమయిన శిక్ష విధిస్తాడు. ప్రొమీథియస్ కాలేయం చర్మంపైన పెరుగుతుంది. ప్రతిరోజూ ఓ ఇనపడేగ వచ్చి దాన్ని పొడుచుకు తినేస్తూంటుంది. ఆ సమయానికి జియస్ అక్కడికొచ్చి, చేసిన తప్పు ఒప్పుకోమని ప్రొమీథియస్‌పై వత్తిడి చేస్తుంటాడు. ‘దేవదేవుడికి విధేయుడిగా పడి వుండడంకన్నా, ఈ బండరాతికి బంధితుడయి వుండడమే నా దృష్టిలో మెరుగయిం’దంటాడు ప్రొమీథియస్. అందుకే, అతగాణ్ణి ‘అమరవీరుల్లో అగ్రగణ్యుడి’గా ప్రశంసించాడు మార్క్స్)
జాషువా, కవిగా ప్రధాన స్రవంతి - హిందూ - సాంస్కృతిక ప్రపంచానికి దూరమయిన సందర్భాలు తక్కువ. ‘చిదానంద ప్రభాతం’ ‘కుశలవోపాఖ్యానం’ ‘ధ్రువ విజయం’ ‘శివాజీ ప్రబంధం’ ‘కృష్ణదేవరాయలు’ ‘్భష్ముడు’ ‘యుగంధర మంత్రి’ ‘వివేకానంద’ ‘అనసూయ’ ‘ఆంధ్రభోజుడు’ తదితర కావ్యాలు ఈ పరిధిలోకి వస్తాయి. అయితే, ‘క్రీస్తు’ ‘క్రీస్తు చరిత’ ‘బుద్ధుడు’ ‘బుద్ధ మహిమ’ ‘్ఫరదౌసి’ ‘జేబున్నీసా’ ‘ముంటాజ మహల్’ ‘ముసాఫిరులు’ తదితర హైందవేతర రచనలు రాయకపోలేదు - కానీ, జాషువా పేరు చెప్తే వెంటనే గుర్తుకొచ్చే రచనలు ‘గబ్బిలం’ ‘కోకిల’ ‘గిజిగాడు’ ‘సాలీడు’ ‘తుమ్మెద పెండ్లికొడుకు’ లాంటి రచనలకి మతప్రాతిపదిక లేకపోవడం గమనార్హం. గాంధీజీ శిష్యుడిగా ఆయన జీవితమంతా లౌకిక -సమన్వయ వాదిగానే ఉన్నారు. అయితే, పెత్తందారీ ధోరణిని సహించే స్వభావం ఆయనలో ఏ కోశానా కనిపించదు. ఆయన సమన్వయ వాదం చూస్తే, మధ్యతరగతి గృహిణుల సహనమే గుర్తుకు వస్తుంది. అసంతృప్తి లేదని కాదు - తక్షణ పరిష్కారం లేని దుస్థితిలో, దిగమింగక తప్పని పరిస్థితి. తనకాలపు ప్రసిద్ధ రచయితలు చాలామందికి వచ్చినట్లే జాషువాకి కూడా - కాస్త ఆలస్యంగానే అయినా - సాహిత్య అకాదెమీ అవార్డు, కళాప్రపూర్ణ, పద్మభూషణ పురస్కారం వచ్చాయి. కొంతకాలం శాసనమండలి సభ్యులుగా కూడా ఉన్నారు.
చివరిగా ఒక్కమాట - ఏ గాయమూ రాత్రికి రాత్రే మాయమయి, నయమయిపోదు! మాయలతోనో, మర్మాలతోనో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతోనో, అలా నయం చెయ్యగలమని నమ్మడం - నమ్మించడం సాధ్యం కావచ్చునుగానీ, అలా నిజంగా చెయ్యడం మాత్రం సాధ్యంకాదు! ఈ విషయంలో ఎవరికయినా అనుమానం మిగిలి వుంటే, గుర్రం జాషువా దగ్గిర నుంచి రోహిత్ వేముల వరకూ ఎవరినయినా సంప్రతించవచ్చు!

-మందలపర్తి కిషోర్ 81796 91822