పెరటి చెట్టు

ఉభయకవిమిత్ర ప్రసాదలబ్ధి సరస్వతీ పాత్రుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్కృతంలో అష్టాదశ (అంటే 18) పురాణాలనూ కృష్ణద్వైపాయనుడనే వేదవ్యాసుడే రాశాడట. ఆ వ్యాసుడే సకల పురాణాల సారంగా సృజించిన పంచమ వేదం భారతాన్ని ఆరింట అయిదువంతులు అనువదించిన మహాకవి తిక్కన. ఆయన శిష్యుల్లో ప్రముఖులు ఇద్దరు. కేతన గురించి మనం ఇంతకు ముందు అనుకున్నాం. తిక్కన శిష్యుల్లో అద్వితీయుడయిన మారన గురించి ఇప్పుడు తలచుకుందాం. మారన తండ్రి పేరు, గురువు పేరు ఒక్కటే - తిక్కన! కవిబ్రహ్మ శిష్యరికం చేసిన మారనకి ఓ పురాణాన్ని అనువదించాలని అనిపించడంలో వింతేముంది. అయితే, అంతవరకూ ఎవ్వరూ ఏ పురాణాన్నీ యథాతథంగా అనువదించక పోవడం కారణంగా, మారనకంత వైశిష్ట్యం దక్కింది. తెలుగులో తొలి పౌరాణిక కావ్యంగా ‘మార్కండేయ పురాణం’ రాసిన - అంటే, అనువదించిన, కవిగా మారన స్థానం సాహిత్య చరిత్రలో పదిలం. అంతకుమించి, ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ ‘స్వారోచిష మనుసంభవం’ (అంటే పెద్దన గారి మనుచరిత్రే!) ‘బహుళాశ్వ చరిత్ర’ ‘రుక్మాంగద చరిత్ర’ తదితర కావ్యాలకు మూల కథలనూ, వౌలిక భావనలనూ అందించిన కవిగా ఆయన మరో మెట్టు పైనే ఉంటాడు!
మారన ఎప్పుడు ఎక్కడ పుట్టి పెరిగి రాణించాడో గ్రహించడానికి సహకరించే సమాచారం ‘మార్కండేయ పురాణం’లోనే ఉంది. మారన కావ్యాన్ని అడిగి, అంకితం పుచ్చుకున్న గన్నయ నాయకుడు ప్రతాపరుద్రుడి దగ్గిర కటకపాలుడిగా ఉండేవాడని మారన రాశాడు. ఈ ప్రతాపరుద్రుడు (రెండో రుద్రదేవుడు) రాణి రుద్రమదేవి వారసుడిగా క్రీ.శ.1289 నుంచి 1323 వరకూ కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించాడని చరిత్ర చెప్తోంది. అంచేత, గన్నయ - మ ఆరన కూడా పధ్నాలుగో శతాబ్ది మొదట్లో జీవించి వుంటారు. కాగా, కృతిభర్తది ఓరుగల్లు కావడం చేత మారన కూడా కాకతీయ సామ్రాజ్యానే్న ఆశ్రయించుకుని బతికి వుంటాడని ఊహించడం కష్టమేం కాదు. ఆయన స్వస్థలం ఏకశిలా నగరమే అయివుండొచ్చని కొందరి నమ్మకం. అయితే, ‘మార్కండేయ పురాణం’లో గోదావరి గురించి ఘనమయిన ప్రస్తావన ఉండటాన్నిబట్టి, మారన గోదావరి ఒడిలో పుట్టి పెరిగిన వాడయి ఉంటాడని ఆరుద్ర అంచనా. దాని అర్థం, ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో పుట్టి వుంటాడని చెప్పడం కదా. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ప్రవహించే ప్రాంతంలో ఎక్కువ భాగం తెలంగాణాలోనే ఉందని మనలో చాలామందికి తెలుసు.
ఎక్కడో తెలంగాణలో, గోదారి ఒడ్డున, పుట్టి పెరిగిన మారన తనను తాను ‘శ్రీమదుభయ కవిమిత్ర ప్రసాదలబ్ధ సరస్వతీ పాత్రు’ణ్ణని చెప్పుకోవడంలో ఔచిత్యమేమిటి మరి? మారన నేరుగా నెల్లూరు వెళ్లి తిక్కన దగ్గిర శిష్యరికం చేసి వుంటే, ఆయన శిష్య ప్రశిష్యులందరి మాదిరే ఆ విషయం ఘనంగానే చెప్పుకుని ఉండేవాడు. తాను తిక్కనకి ప్రత్యక్ష శిష్యుణ్ణని మార్కండేయ పురాణంలో పదేపదే చెప్పిన మారన తన పౌరాణిక కావ్యంలోని రెండున్నర వేల పద్యాల్లో ఈ వివరం సయితం ఎక్కడోచోట చొప్పించి వుండేవాడు. కానీ, అలాంటిదెక్కడా కనిపించకపోవడాన్ని బట్టి అలా జరిగి ఉండకపోవచ్చుననిపిస్తోంది. అయితే, తిక్కన దగ్గిర మారన సాహిత్య శిల్ప రహస్యాలను తెలుసుకునేటందుకు మరో అవకాశం లేకపోలేదు. మనుమసిద్ధి పదభ్రష్టుడయి, దేశాలు పట్టిపోయిన తరుణంలో తిక్కన, గణపతి దేవుణ్ణి కలిసి ఆయన సహకారం అభ్యర్థించిన సంగతి చరిత్రకెక్కినదే. అప్పట్లో తిక్కన కొంతకాలం ఓరుగల్లులో మకాం చేశారంటారు. ఆ సందర్భంగా తిక్కనను ఓరుగల్లు కవి పండితులు గుంపుగుంపులుగా వచ్చి కలిశారని కూడా చెప్తారు. అలా తిక్కనను ఆశ్రయించి, ఆయనకు శిష్యరికం చేసిన వాళ్లలో మారనా ఒకడయి వుండాలి.
కవులందరికీ, తమ కవితల కొత్తందనం నింపాలనే ఉంటుంది. విషయం పాతదే అయినా, కనీసం, చెప్పే పద్ధతయినా కొత్తగా ఉండాలని కవులందరూ కోరుకుంటారు. అయితే, మారనది విచిత్రమయిన మనస్తత్వంలా ఉంది. విషయమూ, కథనమూ రెండూ కొత్తగానే ఉండాలని కోరుకున్నాడు. అంకితం పుచ్చుకోవాలనుకున్న అధికారీ అదే కోరుకున్నాడు. కానీ, అతగాడి ‘అపూర్వ కావ్యరచనా కుతూహలం’ అతిపూర్వ కావ్యరచనకు దారితీసి, కడు విడ్డూరంగా పరిణమించింది. వేదవ్యాసుడు చెప్పిన అష్టాదశ పురాణాల్లో ఏడో స్థానంలో వున్న మార్కండేయ పురాణాన్ని మారన ఎంచుకున్నాడు. పైగా, పురాణాలను తొలిసారి తెలుగు చేస్తున్న అనువాదకుడిగా మారన తన రచనను సాధ్యమయినంత వరకూ మూల విధేయంగానే రాశాడు. ఫలితంగా, తెలుగు మార్కండేయ పురాణానికి స్వతంత్ర వ్యక్తిత్వం లేకుండా పోయింది. ఈ విషయంలో కవిబ్రహ్మ నుంచి మారన మంచి పాఠం నేర్చుకోలేదేమో అనిపిస్తుంది.
అనువాదం ఎవరికీ పట్టని కృషి. ఆరుగాలం ఒళ్లొంచి పనిచేసే రైతన్నల గోడు ఎవరికీ పట్టనట్లే, ఒక్క మాట కోసం బుర్ర బద్దలు కొట్టుకునే అనువాదకుడి శ్రమ గురించి కూడా ఎవరికీ లెక్కలేదు. బయటి వాళ్లకు లేకపోతే పోయె.. సాటి కవులకూ, అనువాదకులకూ (సంప్రదాయ సాహిత్యం వరకూ ఈ రెండింటికీ పెద్ద తేడాలేకుండా చేశారు మనవాళ్లు!) సైతం అనువాదకులంటే ఖాతరీ లేకుండా పోయింది. ‘ఎచ్చట శ్రోత్రియుడును ధన -మిచ్చునతడు నీరు గలుగు నేరును వెజ్జున్ - మచ్చికయును లేకుండును - అచ్చట వసియింప పలవద’ని మార్కండేయ పురాణంలో మారన ఓ సుభాషితాన్ని అనువదించాడు. దాన్ని వాటంగా- ఛందస్సు కూడా మార్చకుండా - కాస్త మాటలు మార్చి తన శతకంలో చేర్చేసుకున్నాడు ఓ సుమతి! ఇక ఆంధ్ర కవితా పితామహుడు మారన పద్యాలను ఎత్తేసి, బోలెడంత కీర్తి మూటకట్టేసుకున్నాడే తప్ప అతగాడి పేరయిన ఎత్తలేదు. ఈ పితామహుడి ఎత్తిపోతల పథకంలో మంచన పద్యాలు కూడా ఎలా కొట్టుకుపోయాయో ఇంతకు ముందు మనం చూశాం.
మారన తొలి పురాణ కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేసిన కాలం, కాకతీయుల చరిత్రలో దందహ్యమాన దశాబ్దం. దిల్లీ సుల్తాను ఓరుగల్లు మీదికి ఒకదాని వెంట మరొకటిగా మూడు దండయాత్రలు చేసి చివరికి కాకతీయ సామ్రాజ్యానే్న రాజకీయ పటంలోంచి తుడిచిపెట్టిన సమయమది. తెలుగుల జీవితాలు అతలాకుతలమవుతూండిన చారిత్రిక ఘట్టమది. అలాంటి పాడుకాలంలో, మారన లాంటి వాళ్ల పురాణ శ్రవణం వినే ఓపిక ఎవరికుంటుంది? ఇక, ‘మార్కండేయ పురాణం’ కృతిభర్త గన్నయ్య తర్వాతి రోజుల్లో మతం మార్చుకుని మాలిక్ మక్‌బూల్‌గా మారిన సంగతి చరిత్రకెక్కిన విషయమే! 1323లోనే ఉలుగ్ ఖాన్ ప్రతాపరుద్రుడితో పాటే గన్నయ్యను కూడా దిల్లీకి బందీగా తీసుకుపోయాడు. మార్గమధ్యంలోనే, ప్రతాపరుద్రుడు నర్మదలో ములిగి ఆత్మహత్య చేసుకున్న తర్వాత, గన్నయ్య మతం మార్చుకుని దిల్లీ సుల్తానుల పంచనే స్థిరపడిపోయాడు. 1351 - 88 మధ్యకాలంలో ఫిరోజ్ షా తుగ్లక్ సర్కార్‌లో మంత్రి (వజీర్)గా పని చేశాడు. మధ్య వైష్ణవులకి ఊర్ధ్వ పుండ్రాలెక్కువ అన్నట్లుగా మతం మార్చుకున్న మలిక్ మఖ్‌బూల్ పూర్తి పేరు చాంతాడంత ఉంది- మస్నదీ ఆలీ ఉలుగ్ ఖుత్లుగ్ అజమీ హుమయూన్ ఖాభీ జహాఁ మఖ్‌బూల్. మారన పేరు మాత్రం ఎప్పట్లాగే మూడక్షరాలే మిగిలింది. పేరును మించింది ప్రతిష్ఠ. దానికీ కొదవా లేదనుకోండి!

-మందలపర్తి కిషోర్ 81796 91822