డైలీ సీరియల్

పూలకుండీలు -4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓకే మీరిక స్టేషన్‌కెళ్లిపోండి. రైటర్ కనకరాజుని మాత్రం నేనొచ్చిందాకా స్టేషన్లోనే వుండమని చెప్పండి’’ అంటూ ఆదేశం ఇచ్చిన ఎస్సై లిఫ్ట్‌కున్న ఇనుప జాలీని మూసివేశాడు.
‘‘ఇక లోపల వీడు ఎంత జోపుకుంటాడో’’ సుద్దనేలలో ఊటనీళ్ల మాదిరిగా తమ కడుపుల్లో ఎస్సైమీద ఉక్రోశం ఎగతన్నుకొస్తున్నా డిసిప్లీన్‌కి కట్టుబడి ‘అలాగే సార్!’ అంటూ ఉస్సూరుమని శ్వాస విడుస్తూ మెల్లగా హాస్పిటల్ వెనుక రోడ్డులో వున్న తమ బండ్ల దగ్గరికి చేరుకున్నారు కానిస్టేబుళ్ళు.
ఎస్సై లోపలికీ
కానిస్టేబుళ్ళు బయటికీ వెళ్లిపోగానే గల్లీ లీడర్లు నలుగురూ ఎల్లయ్యవాళ్ళ చుట్టూ మూగి ‘‘ఆ ఎస్సైగాడు వచ్చేలోపల మీకతేందో? అసలేం జరిగిందో ఒక్కసారి పూస గుచ్చినట్టు మాకు తెలియజెయ్యండి. ఆ తరువాత యవ్వారం ఎట్లా చెయ్యాల్నో మీకెట్లా న్యాయం జెయ్యాల్నో గట్టిగా ఆలోచిస్తం భాయ్!’’ అంటూ గుచ్చి గుచ్చి అడిగారు.
ఆ నలుగురు లీడర్లనూ ఒక్కసారి పరికించి చూసిన ఎల్లయ్య ‘‘ఇక మంచే జరగనియ్యి, చెడే జరగనియ్యి కడుపులున్న బాద బైటికి చెప్పుకుంటెనన్నా కొంత బారం దిగుద్ది’’ అనుకుని కుర్చీలో సర్దుకుని కూర్చుని తీరుబడిగా చెప్పడం మొదలుపెట్టాడు.

2
ఎల్లయ్యకు నలభై, నలభై ఐదేండ్లుండొచ్చు. మనిషి నల్లగా బక్కపల్చగా కొంచెం ఎత్తుగా ఉంటాడు. జుట్టు చిక్కగా సగానికి సగం నెరిసిపోయి వుంది. లోపలికి పీక్కుపోయిన దవడలను కప్పివేస్తూ పెరిగివున్న గడ్డం, చిన్న చిన్న కళ్ళు, పెద్దనోరు, వంటిమీద అడ్డచారల టీషర్టు, బూడిద రంగు పాత జీన్ ప్యాంట్ వేసుకుని వున్నాడు. కాళ్ళకు పాతబడి అరిగిపోయిన చౌకబారు స్లిప్పర్లు తొడుక్కున్నాడు. మొత్తంమీద అతణ్ణి చూస్తుంటే మోయలేని భారాన్ని అతి కష్టంమీద మోస్తున్న కంచరగాడిదలా అన్పిస్తుంటాడు.
ఎల్లయ్య పాల్వంచలోని రాష్ట్ర ప్రభుత్వరంగ పరిశ్రమ ఎ.పి.స్టీల్స్‌లో కంపెనీ క్యాజువల్ అటెండర్‌గా పనిచేసేవాడు.
ఇక రేపో మాపో కొడుకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని ఎల్లయ్య తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూడసాగారు.
అటువంటి సమయంలో-
భద్రాచలం తాతగుడి సెంటర్లో సైకిల్‌షాప్ నడిపే ఎల్లయ్య తల్లి తరఫు బంధువు జగ్గయ్య ‘పిల్లగాడికి ఇయ్యాలగాకుంటే ఇంక నాలుగురోజులకైనా పర్మెంటైతది. ఆ జాబు గనక పర్మెంటైందంటే, రెక్కలొచ్చిన పిట్ట చేతికి దొరకదన్నట్టు పిల్లగాడు మన చేతికి దొరకడు. పర్మెంట్‌గాకముందే మనం తొందరపడాల’’ అంటూ భార్య జానకమ్మతో ఆలోచన చేశాడు.
‘‘అనుకున్న తరువాత ఆగడం ఎందుకు?’’ అనుకున్న జగ్గయ్య ఓ మంచి రోజున ఎల్లయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో మాటా ముచ్చట మాట్లాడాడు.
పిల్లగానికి పదివేల రూపాయల కట్నం, డ్యూటికి పొయ్యొచ్చేటందుకు ఒక సైకిల్, అరతులం వుంగరం ఇద్దరాడపిల్లలకు చెరో వెయ్యి నూట పదార్లు ఆడబిడ్డ కట్నం ఇచ్చేటట్లు అతికష్టంమీద ఎల్లయ్య తల్లిదండ్రులను ఒప్పించాడు.
ఆ విధంగా అనుకున్నట్టు జగ్గయ్య వాళ్ళ పెద్దబిడ్డ శాంతమ్మకు ఎల్లయ్యకు భద్రాచలం రాములవారి గుళ్ళో పెళ్లి జరిగిపోయింది.
అయితే, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అల్లుని విషయంలో జగ్గయ్య వాళ్ళు ఒకటి తలిస్తే ప్రభుత్వం మరొకటి తలిచింది.
అదెలా!? అంటే
ప్రభుత్వం చేపట్టిన నూతన ఆర్థిక విధానాల దెబ్బకు ఎల్లయ్య పనిచేస్తున్న ఏ.పి.స్టీల్ కంపెనీ గోల్డెన్ షేక్ హ్యండ్ పథకం కింద దేశంలోనే మొట్టమొదటి కంపెనీగా మూసివేతకు గురైయ్యింది.
కంపెనీ మూతపడడంతో అందులో పనిచేసే వందలాదిమంది ప్రత్యక్ష, పరోక్ష కార్మికుల వీధులపాలైపోయారు.
కంపెనీ మూతపడేనాటికి ఎల్లయ్యకు ఇంకా పర్మనెంట్ కాకపోవడంతో అతనికి కంపెనీ నష్టపరిహారం కూడా కట్టివ్వలేదు.
‘‘పిల్లగాడికి కొద్దిరోజుల్లో ఉద్యోగం పర్మనెంట్ అవుద్ది, బిడ్డ మనకు ఎదురుచూడకుండా బతుకుద్ది’’ అనుకుని అప్పు సప్పు చేసి పెళ్ళి చేసిన జగ్గయ్య దంపతుల ఆశలమీద ప్రభుత్వం ఆ విధంగా పేడనీళ్ళు గుమ్మరించింది.
దాంతో...
నిరుద్యోగిగా వీధిన పడిన ఎల్లయ్య పొట్టకూటికోసం జెర్రిపోతులాడించినట్టు ఎన్నో రకాల పనులు చేసినా ఏ పనిలోనూ సరిగ్గా కుదురుకోలేకపోయాడు.
ఆఖరికి పాల్వంచ శాస్ర్తీ రోడ్డులోని ఎలుకల మందు ప్యాకెట్లు, సినిమా క్యాలెండర్లు అమ్ముతూ సంసారపు బండిని అతి కష్టంమీద లాక్కురాసాగాడు.
ఆ వ్యాపారం మూలంగా తను సంపాదించి మూట గట్టింది ఏమీ లేకపోయినా ‘చిలకా ఎల్లయ్య’ కాస్తా ఎలుకల మందు ఎల్లయ్య అన్న పేరు మాత్రం సంపాదించుకున్నాడు.
ఎల్లయ్యకు సంపాదనకైతే లోటుందిగాని సంతానానికి మాత్రం లోటు కలుగలేదు.
పెండ్లైన వెంటనే ఏడాదికొకరు చొప్పున ఇద్దరు మగ, ఇద్దరు ఆడ మొత్తం నలుగురు పిల్లలు కలిగారు.
ఆ పిల్లలకు తోడు ఎల్లయ్య తల్లిదండ్రులు వయసుడిగిపోయి ముసలివాళ్ళైపోవడంతో కూలి నాలికి పోలేక ఇంటిపట్టునే్న వుండసాగారు.
దాంతో ఎల్లయ్య ఒక్కడి సంపాదన ఏ మూలకూ చాలకపోవడంతో శాంతమ్మ కూడా పనికి పోసాగింది. భార్యాభర్తలిద్దరి సంపాదన మీద ఆరు జీవాలు ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి దాపురించింది.
పైగా ముసలి వాళ్ళిద్దరికీ కవలపిల్లల్లా షుగర్, బీపీలు పట్టుకున్నాయి.
దాంతో..

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు