డైలీ సీరియల్

పూలకుండీలు - 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోనట్టుగా నటిస్తూ ‘‘ఆ ఏం లేదు, హైదరాబాద్‌లో అతనికి తెలిసిన డాక్టరెవరో వున్నాడంట. వాళ్ళ ఇంట్లో ఆ రేడు నెల్లపాటు సంటిపిల్లను పట్టుకోటానికిపోతే తిండి, బట్టా పెట్టి నెలకు ఐదు వేలు ఇస్తారంట. నువ్ పోతావా? అని వారం పది రోజుల్నించి నన్నడుగుతుండు. సరే పోతనన్నా. అందుకే అడ్వాన్స్ కింద ఈ పదివేలు ఇచ్చిపోతుండు’’ తన ప్రయత్నం లేకుండానే సందర్భానికి తగ్గట్టు తనలోనుండి సమాధానం పుట్టుకురావడం తనకే ఆశ్చర్యం కలిగిస్తుంటే అత్తమామలతో చెప్పుకొచ్చింది శాంతమ్మ నిబ్బరాన్ని కూడదీసుకుంటూ.
కోడలి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో అయోమయంలో పడిపోయిన ముసలోళ్లిద్దరూ ‘‘మరి పిల్లలు?!’’ అన్నారు.
ఆ మాటలకు నొచ్చుకున్నట్టుగా కొంచెం ముఖం మాడ్చుకుని ‘‘్భద్రాచలం మా అమ్మగారింటికాడ దించిపోతా’’ అప్పటికప్పుడు తన మనసులో రూపుదిద్దుకుంటున్న ఆలోచనలను కార్యరూపంలోకి తెస్తూ ఏ మాత్రం తడబాటు లేని స్వరాన అత్తమామలకు సమాధానం చెప్పుకొచ్చింది శాంతమ్మ.
కోడలి మాటలు వింటూనే ‘‘మరి మమ్ముల్నేంజేసిపోతావు’’ అంతలోకే ఓటికుండకు చిల్లిపడ్డట్టుగా కళ్ళ వెంట బొటబొట నీళ్ళు కారిపోతుంటే కోడలికి మరింతగా దగ్గరగా జరుగుతూ అడిగారు ముసలోలిద్దరూ.
‘‘ఆర్‌ఎంపి లింగయ్య అడ్వాన్స్ కింద ఇచ్చిన పదివేలల్లో రెండు వేలు మీకిచ్చిపోతా, అయ్యి పెట్టుకొని కంట్రోల్ బియ్యం తెచ్చుకుని మారాజుల్లెక్క తినుకుంట గుడిసెలో వుండండి. ఇంకా మీకు అవవసరమైతే నేను పొయ్యేకాడ ఆ డాక్టర్ వాల్లనడికి మీకిబ్బంది కలక్కుండా నెలకన్ని పైసలు పంపిస్తలే’’ అంటూ అత్తమామలను నెమ్మదిగా ఊరడించింది శాంతమ్మ.
శారీరకంగానూ, మానసికంగానూ బలహీనులైపోయిన ఆ వృద్ధులు కోడలి మాటలు నమ్మశక్యంగా లేకున్నా, విశ్వసించక తప్పని పరిస్థితిలో ఆమె వంక వౌనంగా చూస్తూ.. ‘‘మరి ఈ ముచ్చటంతా వానికి తెలిస్తే ఏమంటడో ఆలోచించినవా?’’ జీవంలేని చూపులతో కోడలి వంక చూస్తూ అడిగారు ముసలివాళ్ళిద్దరూ...
‘‘ఏందనేది? ఈ సంసారమంతా నా నెత్తినేసి పొయ్యి మూడు నెల్లు కావస్తుంది. ఇప్పటిదాకా కనీసం ఒక్క ఫోన్ గూడా చెయ్యలేదు. ఎట్లెల్లుద్దనుకుంటుండు? పిల్లల్ని బతికించుకోటానికి ఇంక నేనేదో తెగబడి ఒక దారి జూసుకుంటే సంతోషించాల్సింది పోయి మీది నుండి అనుమానంగా గుచ్చి గుచ్చి అడుగుగతున్నారేంది?’’ ఏ పని ఎప్పుడు చెయ్యాలో తనకు బాగా తెలుసునన్నట్టు కొంచెం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది శాంతమ్మ.
కోడలి మాటలకంటే ఆవిడ మాట్లాడిన తీరు తమ మనసులకు బ్రహ్మజెముడు ముళ్ళల్లా గుచ్చుకుంటుంటే ఏమీ చేయలేని నిస్సహాయతతో రెక్కలుడిగిపోయిన ఆ ముదివగ్గులిద్దరూ ఇంకా అంతకంటే ఎక్కువగా మాట్లాడితే ఏం ముంచుకొస్తుందోనన్న భయంతో ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ వౌనంగా నిల్చుండిపోయారు.

9
అనుకున్న ప్రకారం ఆ సాయంత్రమే పిల్లలను తీసుకొని భద్రాచలం తల్లిగారింటికి చేరుకుంది శాంతమ్మ.
అనుకోకుండా పిల్లలను తీసుకుని వచ్చిన బిడ్డను చూడగానే ఆమె తల్లిదండ్రులు సంతోషంతో అప్పటికప్పుడు గూటికి చేరిన కోళ్ళల్లో ఓ కోడిపెట్టను పట్టి మెడ తప్పించారు.
అన్నాలు తిని పిల్లలు నిద్రపోయిన తరువాత తల్లి ముగ్గురూ తీరిగ్గా కూర్చుని మాటా మంతీ మాట్లాడుకుంటున్నపుడు ‘‘నేనో మాట చెబుతాగాని మీరేం కోపం తెచ్చుకోవద్దు’’ అంటూ తల్లిదండ్రుల ముందు తను వచ్చిన పనికి మెల్లగా నాందీ ప్రస్తావన చేసింది శాంతమ్మ.
సహజంగా ఏ పండక్కో తప్ప ఎప్పుడు రమ్మని పిలిచినా రాని కూతురు పిలవకుండానే పిల్లలతో వచ్చినందుకు ఆనందంగా వున్నా ఓ పక్కన మనసులో ఏదో సందేహం పీకుతుంటే కూతురు వచ్చిందన్న సంతోషంలో దాన్ని తొక్కిపట్టిన తల్లిదండ్రులకు కూతురు మాటలతో అప్రయత్నంగానే గుండెల్లో చిన్న చిన్నగా మొదలైన ప్రకంపనలు అంతకంతకూ పెరిగిపోతుంటే ‘‘ఏంటో చెప్పు’’ అన్నట్టు చూశారు.
ధైర్యం కోసమా అన్నట్టు చెంబెడు నీళ్ళు తాగిన శాంతమ్మ ఆర్‌ఎంపి లింగయ్యకూ తనకూ మధ్య జరిగిన ఒప్పందాన్ని మొదటినుండి చివరిదాకా అక్షరం పొల్లుపోకుండా వివరించింది.
కూతురు చెప్పేదంతా ఊపిరి ఉగ్గబట్టి విన్న శాంతమ్మ తల్లిదండ్రుల్లో మొదటగా తేరుకున్న తండ్రి జగ్గయ్య వెంటనే స్పందిస్తూ ‘‘ఏది ఏమైనా నువ్వు చేసింది మాత్రం నూటికి నూరుపాళ్లు తప్పు బిడ్డా! ఎనకా ముందు చూసుకోకుండా డాబా ఇల్లు మీద మోజుతో అయ్యాల నీ పెనిమిటి, అత్తమామలు కూడా వద్దని ఎంత మొత్తుకుంటున్నా ఇనిపిచ్చుకోకుండా సక్కగావుంటున్న గుడిశె పీకించి చెట్ల పాలు జేసినావ్. అయినా పాపం!
వాళ్ళు ఇదేందని ఏనాడూ నిన్నొక్కమాట అన్నోలుగాదు. నువ్వు చేసిన అప్పులు తీర్చటానికే గదా అల్లుడు అంత దూరం బొయ్యింది? అటువంటి మనిషికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పనికి తలపడ్డావంటే నేనే నమ్మలేకపోతున్నా. అతనికి తెలవకుండ అటువంటి పని చేస్తే తరవాత పచ్చని సంసారంలో చిచ్చురేగుద్ది. ఎందుకొచ్చిన గొడవ, సప్పుడు చెయ్యకుండా ఆ ఆర్‌ఎంపి లింగయ్య ఇచ్చిన డబ్బులు తిరిగి అతని కిచ్చెయ్యి. ఇన్నాళ్లనుంచి ఎట్ల బతుకుతున్నరో ఇక ముందు కూడా అట్లనే నలుగుర్లో గౌరవంగా బతకండ్రి!’’ అంటూ కూతురు నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాడు.
వెంటనే కలుగజేసుకున్న శాంతమ్మ తల్లి కమలమ్మ మాత్రం కూతురు నిర్ణయాన్ని పూర్తిగా వెనకేసుకొచ్చింది.
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు