డైలీ సీరియల్

పూలకుండీలు - 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారడివిలో మంద నుండి తప్పిపోయిన గొర్రెపిల్ల మాదిరిగా తన చుట్టూ పరుగులు తీస్తూ వెళుతున్న జనాన్ని బెదురు చూపులతో పరికించి చూసుకుంటూ ‘‘గుడి ఎక్కడుందో’’ అనుకుంటూ మెల్లగా అడుగులు వెయ్యసాగింది శాంతమ్మ.
ఆ ఫ్లాట్‌ఫాంమీద ఆ జనం మధ్య కొద్ది దూరమే నడిచినా ఎంతో దూరం నడిచినట్టు అన్పించి గుడి ఎక్కడా కన్పించకపోవడంతో తనకు ఎదురుగా వస్తున్న ఓ యువతి వంక చూస్తూ ‘‘అమ్మా! ఇక్కడాన్నో గుడుందంట యాడ?’’ అంటూ అడిగింది శాంతమ్మ.
ఆ అమ్మాయి ఒక్క క్షణం శాంతమ్మను కిందికి మీదికి పరికించి చూసి ‘‘ఇంకా కొంచెం ముందుకెళ్లు’’ అంటూ చెబుతుండగానే ఆవిడ చేతిలో ఫోన్ రింగవ్వడంతో సరాసరి ముందుకెళ్లిపోయింది.
‘‘సరేలే’’ అనుకున్న శాంతమ్మ ఎదురొస్తున్న జనాన్ని తప్పించుకుంటూ ముందుకు నడిచింది.
మరో ఐదారు నిమిషాల తరువాత గుడి తన దృష్టిలోకి రావడంతో ‘హమ్మయ్య’ అనుకుంటూ గుడి దగ్గరికి చేరుకుంది.
అన్నట్టే గుడి మొదటి మెట్టుమీద తెల్ల బట్టలు తొడుక్కుని, ఎర్రటోపీ పెట్టుకుని, పేపర్ చదువుతున్న ఓ వ్యక్తి కన్పించాడు శాంతమ్మకు.
‘‘అతనేనా కాదా?’’ అన్న సందిగ్ధంతో వెనుకా ముందులాడుతుండగా నేరుగా ఆమె దగ్గరికే నడిచి వచ్చిన ఆ తెల్లబట్టల ఎర్రపోటీ అతను ‘‘మీరు శాంతమ్మగారేనా?’’ అంటూ పలకరించాడు.
అతణ్ణి ఆపాదమస్తకం పరికించి చూసుకుంటూ ‘ఔను’ అంటూ బదులిచ్చింది శాంతమ్మ.
అతను బూడిద రంగు తెలుపుతో, ఎత్తుగా, బక్కపల్చగా, నల్లగా రంగు వేసుకున్నా పల్చటి జుత్తుతో, వెడల్పాటి నుదురుతో, కొనదేరిన ముక్కుతో, పేడి మూతితో జంతు కళేబరాలను పీక్కుతినే దూడబాతులా వున్నాడు.
‘‘అమ్మో! ఇతనేంటిట్లున్నాడు?’’ మనసులో అనుకుంది శాంతమ్మ.
సరిగ్గా అదే సమయంలో ఐదున్నర అడుగుల ఎత్తుతో, చామనచాయ దేహంతో, సిగ వేసుకున్న నున్నటి, నల్లటి జుట్టుతో, గుండ్రటి ముఖంతో, తెలివిని సూచించే చిన్న చిన్న కళ్ళతో, పెసరుకాయ లాంటి ముక్కుతో, తెల్లజిల్లేడు మొగ్గల్లాంటి చిన్న చిన్న దంతాలతో, కొంచెం పొడవైన మెడతో, వంటిమీద నెమలిపింఛం రంగు చీరా, రవికలతో ఉన్న శాంతమ్మను గుచ్చి గుచ్చి చూసిన వెంకటరెడ్డి ‘‘అబ్బో! అప్పుడే తీగనుండి తెంపిన పప్పు దోసకాయలా బలే నవనవలాడుతుందే!’’ అనుకున్నాడు వెంకటరెడ్డి.
అతని చూపులు ఇబ్బందిగా అన్పిస్తున్నా ఓర్చుకుంటూ ‘‘ఎంకట్రెడ్డంటే మీరేనా?’’ అంటూ నెమ్మదిగా అడిగింది శాంతమ్మ.
‘‘ఔనే్ననే’’ అదోలా నవ్వుతూ బదులిచ్చాడతను.
‘‘ఆస్పత్రెక్కడ?’’ అతని వాలకం నచ్చకపోవడంతో ముక్తసరిగా అడిగింది శాంతమ్మ.
సరిగ్గా అదే సమయంలో శాంతమ్మ చేతిలో ఫోన్ రింగయ్యింది.
‘‘ఎవరా! అనుకుంటూ ఫోనెత్తింది శాంతమ్మ.
పాల్వంచ నుండి లైన్లోకొచ్చిన ఎంఆర్‌పి లింగయ్య ‘‘వెంకటరెడ్డి వచ్చి కలిశాడా?’’ అంటూ పలకరించాడు.
‘‘ఆ.. ఆ.. ఇప్పుడే కలిశాడు. ఇగో నా పక్కనే వున్నాడు మాట్లాడన్నా!’’ అంటూ తన చేతిలోని సెల్‌ఫోన్ని వెంకటరెడ్డికిచ్చింది శాంతమ్మ.
శాంతమ్మ చేతిని కావాలని తాకుతూ ఫోన్ అందుకున్న వెంకటరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ గుడి వెనక్కి వెళ్లి చాలాసేపు ఏమిటో మాట్లాడివచ్చి మళ్ళా ఇందాకటిలాగే చేతులు తాకుతూ పోనిచ్చాడు.
‘‘ఒంటరి ఆడదాన్ని.. అందునా పేదనాన్ని చూస్తే రేపు చచ్చే ముసలిముండాకొడుక్కి కూడా వల్లిట్ల తిమ్మిరెక్కుద్దేమో!?’’ అనుకుంటూ ఫోన్ అందుకుంది శాంతమ్మ.
‘‘ఇక పోదామా?’’ శాంతమ్మ వంక చూస్తూ అన్నాడు వెంకటరెడ్డి.
‘‘సరే, పోదాం పదా’’ అన్నట్టు అప్పటిదాకా కింద వుంచిన తన సంచిని వంగి తీసుకుంది శాంతమ్మ.
ఇంతలో మళ్లీ ఫోన్ మోగింది.
‘‘ఎవరబ్బా!’’ అనుకుంటూ ఫోనెత్తిన శాంతమ్మకు తండ్రి గొంతు విన్పించగానే ఒక్కసారిగా పిల్లలు గుర్తుకురావడంతో తన గుండె సంద్రంలో దుఃఖపు తుపాన్ సుడులు తిరుగుతూ హోరున గొంతు తీరం దాటబోతుండగా ‘‘‘ఇప్పుడు తన ఏడుపు వాళ్ళు విన్నారంటే నాకేమైందోనని పరేశానౌతారేమో’’ అనుకుని గొంతులోని దుఃఖాన్ని కళ్ళ కనుమలగుండా నిశ్శబ్దంగా తీరం మళ్లించింది.
ఇంతలో ఫ్లాట్‌ఫాంమీదకు ఏదో ట్రైనొచ్చి ఆగడంతో అక్కడంతా రణగొణధ్వనులు చుట్టుముట్టాయి. దాంతో ‘‘నేను తరువాత మాట్లాడతానులే’’ అంటూ ఫోన్ కట్ చేసిన శాంతమ్మ వెంకటరెడ్డి వెనుకనే రేతిఫైల్ గేట్ గుండా బయటికి వెళ్లి సిటి బస్టాండ్‌లో అడుగుపెట్టింది.
అన్ని బస్సులను, అంతమంది జనాన్ని, ఆ ట్రాఫిక్‌నూ మొదటిసారిగా చూసిన శాంతమ్మకు అంతా గందరగోళంగానూ తను ఏదో కొత్తలోకంలోకి వచ్చినట్టుగానూ అన్పించడంతో పోరపాటున అడవిదాటి వచ్చిన లేడికూనలా కంగారు కంగారుగా వెంకటరెడ్డిని అనుసరించింది.
ఆమెను మెల్లగా రోడ్డు దాటించి ఆవతలి పక్కనున్న ఓ హోటల్లోకి తీసుకుపోయాడు వెంకటరెడ్డి.
10
హోటల్లో టిఫిన్ చేసి, టీ తాగి సిటీ బస్సు పట్టుకొని మరో గంటా గంటన్నర తరువాత వెంకటరెడ్డి, శాంతమ్మలు బేగంపేట చౌరస్తాలో వున్న అజంతా హాస్పిటల్‌కి చేరుకున్నారు.
సెంట్రల్లీ ఎసి విజిటర్స్ హాల్లోకి అడుగుపెట్టగానే ఏమరిపాటున శీతలగిడ్డింగిలోకి జొరబడిన ఎలుక పిల్ల మాదిరిగా లోలోపల వణికిపోతూ ఓ విధమైన అభద్రతాభావనకు లోనైన శాంతమ్మ కళ్ళు విప్పార్చి ఆ హాలునంతా పరికించి చూడసాగింది.
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు