డైలీ సీరియల్

పూలకుండీలు - 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ వందలమంది వున్నా వాళ్ళంతా ఓ రకమైన సమాధి నిశ్శబ్దంతోనూ, ఆనందంగా అనుభవించాల్సిన బ్రతుకును చచ్చినట్టు మోయాల్సి వచ్చిందే అన్న దిగులుతోనూ వున్నట్టుగా కన్పిస్తుండడంతో శాంతమ్మనూ ఆ దిగులు ఆవహించినట్టై అలా నిలబడిపోయింది.
‘‘అక్కడే నిలబడిపోయావే? ఇటొచ్చి కూర్చో’’ గుసగుసగా అంటూ ఆమె చేయి పట్టుకొని తీసుకుపోయి ఆ హాల్లో ఓ మూలనున్న స్టీల్ కుర్చీలో కూర్చోబెట్టాడు వెంకటరెడ్డి.
ఆ కుర్చీలో జారగిలబడి కూర్చున్న శాంతమ్మ ‘‘ఇక్కడ కూర్చొమ్మని మామూలుగా చెప్పొచ్చు గదా! దానికి చెయ్యి పట్టుకొనొచ్చి కొర్చోబెట్టాలా? కావాలని కాకపోతే’’ అనుకుంటూ అలసటగా కళ్ళు మూసుకుంది.
‘‘నువ్విక్కడే కూర్చో నేనిప్పుడే వస్తా’’ అంటూ శాంతమ్మ దగ్గరనుండి నేరుగా రిసెప్షన్ కౌంటర్లోకి వెళ్లి అక్కడ తెల్లదొరసానిలా కూర్చున్న ఓ అమ్మాయితో శాంతమ్మ చూడాలన్నట్టు దూరదర్శన్ చానల్‌లో బధిరుల కోసం వార్తలు చదివే న్యూస్‌రీడర్‌లా తల, చేతులు ఆడిస్తూ ఏదేదో మాట్లాడసాగాడు వెంకటరెడ్డి.
అతనివంకే చూస్తూ కూర్చున్న శాంతమ్మ ‘‘ఇక్కడికి నేనొక్కదానే్న వచ్చి తప్పుచేశానేమో’’ తన్లో తను ఆ కాసేపట్లోనే పది పనె్నండుసార్లు అనుకుంది.
ఆ కౌంటర్లోనే పావుగంట, ఇరవై నిమిషాలపాటు అటూ, ఇటూ తచ్చాడుతూ నిల్చున్న వెంకటరెడ్డిని ఆఖరికి దగ్గరికి రమ్మంటూ సైగ చేసి పిల్చిన ఆ రిసెప్షనిస్ట్ అతనితో ఏదో చెప్పింది.
వెంటనే తలాడిస్తూ శాంతమ్మ దగ్గరికొచ్చిన వెంకటరెడ్డి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ‘పోదాం పదా’ అన్నాడు.
‘‘ఎక్కడికి?’’ అన్నట్టు అతని వంక చూసింది శాంతమ్మ.
‘‘ఎక్కడికో చెబితేనేగాని కదలవా?’’ అన్నట్టు శాంతమ్మ వైపు కోరగా చూస్తూ దారితీశాడు వెంకటరెడ్డి.
‘‘ఇగ తప్పదు’’ అనుకున్న శాంతమ్మ గొర్రె పిల్ల మాదిరిగా అతణ్ణి అనుసరించింది.
అతను నేరుగా లిఫ్ట్ దగ్గరికి నడిచి గ్రౌండ్ ఫ్లోర్ కోసం డౌన్‌స్విచ్ నొక్కి వెనుదిరిగి శాంతమ్మ వంక అదోలా చూశాడు వెంకటరెడ్డి.
ఇంతలో లిఫ్ట్ వచ్చి ఆగింది.
అందులోనుండి వీల్ స్ట్రెచర్ మీద తెల్లటి గుడ్డలు కప్పిన ఓ శవాన్ని బయటకు తీస్తూ కొంతమంది కన్పించారు.
ఆ శవాన్ని చూస్తూనే ‘‘ఆస్పత్రిలో అడుగుపెడుతుంటేనే శవం ఎదురైదేం ఖర్మరా దేవుడా!’’ తన్లో తను అనుకున్న శాంతమ్మ ఏదో ఆలోనల్లో పడిపోయింది.
‘‘ఏం ఆలోచిస్తూన్నావ్? లోపలికిరా!’’ అంటూ పిలిచాడు వెంకటరెడ్డి.
అతని పిలుపుతో ఆలోచనల్లోనుండి బైటికొచ్చిన శాంతమ్మ కొంచెం సిగ్గుపడుతూ లిఫ్ట్‌లోకి చూసింది.
అప్పటికే వెంకటరెడ్డితోపాటు మరో నలుగురైదుగురు మనుషులు లిఫ్ట్‌లోకొచ్చి నిల్చుని తనవంకే చూస్తుండడం గమనించిన శాంతమ్మ గబగబా లోపలికెళ్లి ఓ మూలగా ఒదిగి నిల్చుంది.
బటన్ నొక్కగానే ఆటోమెటిక్‌గా డోర్లు మూసుకోవడంతోపాటు ఆ వెంటనే లిఫ్ట్ పైకి కదులుతున్నట్టు అర్థమైన శాంతమ్మ ‘లిఫ్టంటే ఏందో సినిమాల్లో చూడడమే తప్ప ఇప్పటిదాకా సూసిందే లేదు’ అనుకుంది.
ఆ లిఫ్ట్ ఐదారుసార్లు ఆగడం అప్పటిదాకా తమతో వున్నవాళ్ళల్లో కొంతమంది బైటికి పోతుంటే కొత్తగా మరికొంతమంది లోపలికి రావడం చూస్తూ నిల్చున్న శాంతమ్మకు అంతా ఏదో వింతగా అన్పించసాగింది.
ఆఖరికి లిఫ్ట్‌లో తనూ వెంకటరెడ్డి ఇద్దరే మిగిలి వుండడంతో ‘మనం దిగేదెక్కడ?’’ ఏవేవో సందేహాలు మనసును కుదిపేస్తుంటే భయం భయంగా అతని వంక చూస్తూ అడిగింది శాంతమ్మ.
అతను నోరు తెరిచి ఏదో చెప్పబోతున్నంతలో లిఫ్ట్ ఆఖరి ఎనిమిదో అంతస్తులో ఆగడం, వెంటనే డోర్ తెరుచుకోవడం జరిగింది.
దాంతో ‘బయటకు నడువ్’ అంటూ తను ముందుగా లిఫ్ట్‌లోనుండి బయటకు నడిచాడు వెంకటరెడ్డి.
తెల్లటి డ్రెస్‌లో మెరిసిపోతున్న ఇద్దరు సిస్టర్స్ లిఫ్ట్‌లోపలికి వస్తుంటే వాళ్ళనుండి పక్కకు తప్పకుంటూ తను బైటికి నడిచింది శాంతమ్మ.
ఐదు నిమిషాల్లో ఒల్లు కదలకుండా అంతపైకి రావడం వింతగా అన్పించడంతో ఒక్క నిమిషంపాటు ఆ అనుభూతిని గుండెల్లో పదిలపర్చకుంటూ తల ఎత్తి దూరంగా పరికించి చూసింది శాంతమ్మ.
సముద్రం ఒడ్డున నిలబడి ముందుకు చూసినవాడికి చూసినంత మేర నీరే కన్పించినట్టు అక్కడ నిల్చున్న శాంతమ్మకు ఎటు చూసినా అంతు లేకుండా ఊరే కన్పిస్తుండడంతో ‘ఓరి దేవుడే ఇదేం వూరు! ఇదేం కత!’ అనుకుంటూ అబ్బురపాటుతో నాలుగు దిక్కులూ చూడసాగింది.
ఇంతలో...
ఇందాక లిఫ్ట్‌లోకి కిందకు వెళ్లిన సిస్టర్లిద్దరూ చేతుల్లో ఏవో పెద్ద పెద్ద కవర్లు పట్టుకొని మళ్లీ పైకొచ్చారు.
వాళ్ళను గమనించిన శాంతమ్మ తను నిలుచున్న చోటునుండి వాళ్ళవంకే చూడసాగింది.
ఆ సిస్టర్లిద్దరిలో కొంచెం సన్నగా వున్నావిడ శాంతమ్మ వంక చూస్తూ ‘‘వెంకటరెడ్డంటే ఎవరు?’’ అంటూ అదో రకమైన నాజూకు స్వరంతో అడిగింది.
ఆ పక్కనే వున్న వాటర్ కూలర్ దగ్గర మంచినీళ్ళు తాగుతున్న వెంకటరెడ్డి ఆ మాటలు వింటూనే తాగుతున్న గ్లాస్‌ను పక్కన పెట్టి ‘‘ఆ ఆ నేనే, నేనే’’ అంటూ గబగబా వాళ్ళ దగ్గరికి నడిచొచ్చాడు.
‘‘శాంతమ్మంటే మీరేనా?’’ ఈసారి కొంచెం బొద్దుగా వున్న రెండో సిస్టర్ శాంతమ్మ వంకే చూస్తూ అడిగింది.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు