డైలీ సీరియల్

పూలకుండీలు - 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఔను’’ అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చిన శాంతమ్మ వాళ్ళ వంక బెదురు బెదురుగా చూడసాగింది.
‘‘పదండి మీకు రూమ్ చూపిస్తాం’’ అంటూ లిఫ్ట్‌కి ఎడమ పక్కనున్న కారిడార్లో తూనీగల్లా చకచకా నడవసాగారు.
వాళ్ళ వెనుకనే వెంకటరెడ్డి పరుగందుకున్నాడు.
శాంతమ్మ వెంకటరెడ్డిని అనుసరించింది.
ఆ వరుసలో పనె్నండు గదులు దాటి పదమూడో నెంబర్ గది తాళాలు తీసిన సిస్టర్లిద్దరూ శాంతమ్మ వాళ్ళ వంక చూస్తూ ‘‘మళ్లీ మేమొచ్చి పిలిచే దాకా మీరీ రూమ్‌లో వుండండి. మీకు కావాల్సిన టీలు, టిఫిన్లు అన్నీ ఇక్కడికే వస్తాయి’’ అంటూ వెళ్లిపోయారు.
రూమ్‌లో అడుగుపెడుతూనే ఆ పాలరాయి గదిని, ఆ గదిలోని రోజ్‌వుడ్ మంచాన్నీ, ఆ మంచంమీది కుషన్ పరుపును, ఆ కుషన్ పరుపుమీది పాలనురగలాంటి తెల్లటి బాంబేడయింగ్ దుప్పటిని, ఆ దుప్పటిమీద రెక్సాన్ దిండ్లను, ఓ వైపు గోడకు అందమైన కఫ్‌బోర్డును, మరోవైపు గోడకు ప్లాస్మా టీవీని చూసిన శాంతమ్మ ‘వామ్మో ఇది ఆస్పత్రా? లేకుంటే సిన్మాయాక్టర్లుండే ఇంద్రభవనమా?’’ వేడి నీటి బుగ్గలో గుడ గుడమని మసలుతుంటే నీళ్ళ మాదిరిగా గుండె లోతుల్లో నుండి ఆశ్చర్యపు బుడగలు తెర్లుకొస్తుంటే మనసులోనే బుగ్గలు నొక్కుకుంటూ అనుకుంది.
వాళ్ళు వెళ్లిపోయిన వెంటనే రూమ్ తలుపు వేసి వచ్చి బెడ్‌మీద తీరిగ్గా కూర్చుని శాంతమ్మ వంక అదోలాచూస్తూ ‘‘ఆ అసలు నీకతేంటో ఇపుడు చెప్పు’’ అన్నాడు వెంకటరెడ్డి.
తలుపులు వేసుకోవడం అన్నది పట్టణవాసపు ప్రజల పద్ధతి అన్న విషయం ఎరుగని శాంతమ్మ అతని చర్యలకు ఒక్కసారిగా కుదేలైపోతూ ‘తలుపులెందుకేస్తున్నావ్?’ అంటూ వెళ్లి బార్లా తెరిచిపెట్టింది.
శాంతమ్మ ఆంతర్యంలో తన పట్ల ఏ సందేహం పట్టి కుదుపుతుందో అర్థం చేసుకున్న వెంకటరెడ్డి ‘‘ఓయ్ తల్లో! నువ్వనుకుంటున్నట్టు నేనలాంటివాణ్ణి కాను గాని ముందా తలుపులు వేసిరా! పల్లెటూర్లలో మాదిరిగా ఇక్కడ తలుపులు తీసి వుంచకూడదు’’ ముసిముసిగా నవ్వుతూ అన్నాడు.
ఏ ముసి ముసి నవ్వుల మాటున ఏ విషం మరుగుతుందో ఎవరికి తెలుసునన్న స్ర్తి సహజమైన ఎరుకతో తలుపులు వేయకుండా అలాగే నిలుచుండిపోయింది శాంతమ్మ.
‘‘అరే నీకు చెబితే అర్థం కాదా?’’ అంటూ మంచంమీద నుండి విసురుగా లేచి వెళ్లి తలుపులు వేశాడు వెంకటరెడ్డి.
ఇంతలో...
ఒక్కసారిగా వళ్ళు విరుచుకుని జంగుపిల్లి ఆవులించినట్టుగా అతని నడుముకున్న పౌచ్‌లో నుండి సెల్‌ఫోన్ పెద్దగా మొత్తుకుంది.
ఠక్కున ఫోన్ ఎత్తిన వెంకటరెడ్డి ‘హలో సార్ చెప్పండీ!’ అన్నాడు వినయంగా.
‘‘....’’ పక్కన వున్న శాంతమ్మకు సెల్‌లో నుండి గిజ్ గిజ్‌మంటూ ఏవో మాటలు అస్పష్టంగా వినిపించసాగాయి.
గొంతులో ఏదో తీవ్రమైన నిరాశ తొంగి చూస్తుంటే ‘‘సరే సార్! ఇపుడే బైలుదేరి వస్తున్నా, మీరక్కడే వుండండి’’ మెల్లగా అంటూ ఫోన్ కట్ చేశాడు వెంకటరెడ్డి.
రెప్ప వాల్చకుండా తన హావభావాలను గమనిస్తూ నిల్చున్న శాంతమ్మ వంక చూస్తూ ‘‘నేను అర్జంట్‌గా బైటికెళ్లి రావాలి గాని నువ్విక్కడే వుండు. కాస్సేపాగిన తరువాత ఈ హాస్పిటల్ వాళ్ళు నీకు తిందానికేదన్నా తెచ్చి పెడతారు. ఇంకా నీకేదన్నా కావాలంటే ఇదుగో ఈ బెల్లు నొక్కు, ఎవరో ఒకరు వస్తారు. ఈలోపుగా ఆ బాత్‌రూమ్‌లోకెళ్లి స్నానం చెయ్యి. సబ్బు గిబ్బు అన్నీ అక్కడే వుంటాయి’’ అంటూ గబగబా లిఫ్ట్ వైపు వెళ్లిపోయాడు వెంకటరెడ్డి.
అతను వెళ్ళడంతోనే చప్పున తలుపులు వేసుకున్న శాంతమ్మ ఒక్కసారిగా గుండెలమీద చేతులుంచుకుని ‘హమ్మయ్యా’ అంటూ శ్వాస తీసి బెడ్‌మీద అడ్డమొరిగింది.
అలా బెడ్డుమీద ఒరిగిన ఆమె మస్తిష్కం నిండా, తిరిగి ఇల్లు, పిల్లలు, అత్తామామలు, తల్లిదండ్రులు, ఎక్కడో దూరంగా వున్న భర్త అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకురావడంతో దుఃఖంతో పెదవులు అదరసాగాయి.
ఎంతసేపు తను అలా పడుకొని వుందో తనకే తెలియకుండా వున్న శాంతమ్మకు బయటనుండి ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన చప్పుడు విన్పించడంతో ఉలిక్కిపడుతూ వాస్తవంలోకొచ్చింది.
మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో ‘‘ఆ రెడ్డిగాని వచ్చాడేమో’’ అనుకుంటూ గబగబా లేచి వెళ్లి తలుపులు తీసింది శాంతమ్మ.
ఎదురుగా ఎవరో కుర్రాడు ఓ ప్లాస్టిక్ సంచి పట్టుకుని కన్పించాడు.
‘‘ఎవరు కావాలి?’’ అన్నట్టు అతని వంక చూసింది శాంతమ్మ.
‘‘అన్నం తెచ్చాను’’ అంటూ మీల్స్ పార్శిల్ని శాంతమ్మ చేతికందించిన ఆ కుర్రాడు ఇహ ఇంతటితో తన పని అయిపోయిందన్నట్టు ‘కీ’ ఇచ్చిన బొమ్మలా ‘బుర్రు’మంటూ తిరిగి వెళ్లిపోయాడు.
అన్నం పార్సిల్ని పక్కన పెట్టిన శాంతమ్మ ‘వంటిమీద నాలుగు చెంబుల నీళ్ళు పోసుకొనొచ్చి తిందాం’ అనుకుని తన సంచీలోనుండి చీర, రవిక తీసుకుని పక్కనే వున్న బాత్‌రూమ్‌లోకెళ్లి తలుపులు మూసుకుంది.
బాత్‌రూమ్ లోపలి గోడలన్నీ గోధుమ రంగు టైల్స్‌తో ధగధగ మెరిసిపోతున్నాయి. ఓ పక్క టవల్స్ వేసుకునే స్టీల్ హ్యంగర్ దాని పక్కనే వైట్‌స్టోన్‌తో ఏర్పాటుచేసిన సింక్, సింక్‌కి ఎడమ పక్క గోడకు నిలువెత్తు అద్దం, ఆ అద్దానికి కుడి పక్క గోడకు స్టీల్ ఫిట్టింగ్స్‌తో ఏర్పాటుచేసిన టాప్స్, సరిగ్గా వాటిపైన తెల్లటి గీజర్ ఏర్పాటుచేసి వున్నాయి.
ఆ బాత్‌రూమ్ అందాన్ని విచిత్రపడిపోతూ చూసిన శాంతమ్మ ‘‘ఈ బాత్‌రూమ్ అచ్చం సిన్మాల్లో, టీవీల్లో కన్పించే బాత్‌రూమ్ మాదిరిగానే వుంది అనుకుంటూ బక్కెట్‌లో నీళ్ళు పట్టుకుందామని తనకు ఎదురుగా వున్న నాలుగు పంపుల్లో ఓ పంపు తిప్పింది.
అంతే!
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు